ఇదోమాయ..

నా ప్రపంచపు లోతులు నీకు అర్థంకావుగా
అర్థమైనా కూడా అర్థంకానట్లు ఉంటావేమో
నాలోకపు లోతులు అంతు చిక్కలేదనుకుంటే
హాయిగా నీలోకంలో నీవు ఉండవచ్చు కదా
ఇలా మర్మగర్భంగా ఆలోచించి బ్రతికేసెయ్!
నా ఆలోచనలేమో అసాధారణ అలౌకికంగా
అవన్నీ అనంతసాగర అభిమానపు అలలేమో
నాసామ్రాజ్యపు రాజూరాణీని నేనే అనుకుంటే
మసిపూసి మనసును మభ్యపెట్టుకున్నట్లే కదా
ఇలా జీవితాన్ని నెట్టుకురావాలిగా సాగించేయ్!
నా భావగంభీరత అనురాగవర్ణ మిశ్రమాలుగా
శృంగార దైహికస్థాయి దాటిన అవశేషాలేమో
నాకు నేను నీకు నీవుంటేనే నిశ్చలతనుకుంటే
అది ఒక అలుపెరుగని కవితాయోగస్థితి కదా
ఇలా అంతమైపోవాలుందేమో అలాగే కానీయ్!

అర్థనారీపురుష్

స్త్రీ మరియు పురుషుడు..
ఇద్దరూ పుట్టినప్పటి నుండి
సగం ఆడ సగం మగవాడే!

మగాళ్ళు ఏడవరంటూ...
కారే కన్నీటికి అడ్డుకట్టవేసి
వారి వ్యధని వెళ్ళగక్కనీయక
ఉన్న సున్నితం ముక్కలుచేసి
కఠినత్వమనే సున్నాన్ని పూసి
పురుషుల స్త్రీత్వాన్ని నలిపేసి..
మగతనమనే మాస్క్ తొడిగారు!

ఆడవాళ్ళిలా చేయరంటూ...
పరిమితులు సరిహద్దులుగీసి
వారి ప్రతిభను కనబడనీయక
ఉన్న మొరటుతనాన్ని మాడ్చేసి
కవ్వింపైనా నీళ్ళైనా కళ్ళవే అనేసి
స్త్రీలలో పురుషత్వాన్ని నలిపేసి..
ఆడతనమే అందమైంది అన్నారు!

ఒంటరి గేయం..

నువ్వు ఏ పున్నమి రేయినో వచ్చి కనబడి వెళ్ళిపోతావు
నలగని దుప్పటేమో ఊపిరాడనీయక కౌగిలించుకుంటుంది!
నువ్వు నడిచివెళ్ళే దారంతా జ్ఞాపకాలు విరజిమ్మిపోతావు
కలల్ని విడిచిరాని కళ్ళను కునుకేమో కసురుకుంటుంది!
నువ్వు గమ్యంచేరి చీకటికరిగి ఉదయమైందని చెబుతావు
కాలాన్ని శాసించలేని ఈ జీవితం అలా సాగిపోతుంటుంది!
నువ్వు సూర్యరశ్మిలో కాంతిపుంజాలను ప్రోగుచేస్తుంటావు
నిస్సహాయత నిశ్శబ్దంగా కోరికలకు కళ్ళెంవేసి బంధిస్తుంది!
నువ్వు జ్ఞానకిరీటపు నీడలో ఆలోచిస్తూ అంకురిస్తుంటావు
దిక్కులేని హృదయం దిక్కులుచూస్తూ దిగులుపడుతుంది!
నువ్వు నీవుగా బహుబ్రతుకుల్ని ఉద్దరించాలనుకుంటావు
ఆ బ్రతుకుల్లో ఇమడలేని అనురాగం ఒంటరిగా మిగిలింది!