తెలియని ప్రశ్న..

అనుకోకుండా అప్పుడప్పుడూ
మనసూ మెదడూ ఆగిపోయి
గతంలోకి దూసుకెళుతుంది..

జీవితపు పేజీలను తిరగేస్తుంది
లాభనష్టాలను లెక్కబెడ్తుంది..

జీవనపయనమలా సాగుతుంది
ఎప్పుడాగునో తెలియకుంది..

జీవిత తత్వమూ మారిపోతుంది
కాలమూ రంగు మార్చేస్తుంది..

జీవితం కొందరికి కలిసొస్తుంది
మరికొందరిని మోసగిస్తుంది..

జీవితగమనాలోచన ప్రశ్నిస్తుంది
నా మౌనం సమాధానమిస్తుంది..

పాటతో ప్రణయం..

నేను సంగీతంతో సంపర్కం చేసినా
జ్ఞాపకాలు ఒంటరిగా మిగిలున్నాయి
వాటిని నేను ఆహ్వానించక పోయినా
ప్రతీపాటలో వచ్చి చేరుతానన్నాయి!

కన్నీళ్లు నాముఖాన్ని కౌగిలించుకున్నా
జలజలా ధారగా కారుతూ ఉన్నాయి
ఎన్నో జ్ఞాపకాల్ని దూరంగా నెట్టేయగా
పరుగున పలుమార్లొచ్చి వీడకున్నాయి!

నేను పాటతో పానుపుపై పవళించినా
జ్ఞాపకాలు రెచ్చిపోయి రమిస్తున్నాయి
వాటిని లెక్కచేయక దారి మళ్ళించినా
అప్పుడు నవ్వులు నన్ను నలిపేసాయి!

సరిగమలు నాతో సరసం ఆడుతున్నా
అహ్లాదం అందంతో చిందులేస్తున్నాయి
ఆలోచనలు లయతో శోభనం చేయగా
సంతోషాలే సంతానమై పుట్టుకొచ్చాయి!


నన్ను నీలో..

నేను లేని వేళ నన్ను తలుస్తూ నిద్రపో
ఆ నిద్రలో నిశ్శబ్దంగా నీ చొక్కా విప్పి
గుండెపై వ్రాసిన పిచ్చిరాతల్ని తలచుకో

నేను పోయానన్న బాధ నుండి కోలుకో
ఆ వంకన నా లాలనాపాలల్ని గుర్తించి
నిష్కల్మషమైన నా ప్రేమని నీలో నింపుకో

నేను లేకున్నా నా గుండెలయ నీదనుకో
ఆ లయకు కొత్తవసంతపు జల్లులు అద్ది
మన బంధానికి ఒక నిర్వచనం ఇచ్చుకో

నేను నీ ఎదను తడుముతున్నా చూసుకో
ఆ స్పర్శలోని అమృతం గొంతులో పోసి
నా భావాలను మసకబారనీయక దాచుకో

నేను నీకు దూరమై దగ్గరున్నాను అనుకో
ఆ అనుకోవడంతో పాటు ఆలోచలని నెట్టి
నవ్వుతూ మరో జీవనానికి ఊపిరిపోసుకో