ఓ పుష్పమా!!

పుష్పమా!! నీవింత సుకుమారమా!
తుమ్మెద వాలితేనే త్రుళ్ళిపడేంత భయమా!
గాలికి కూడా ఊగిసలాడే అంత బేల తనమా!!!

ఇలలోని రంగులన్నీ నీకే సొంతమమ్మా!
భగవంతునికి మాకు మధ్య వారధివమ్మా!
ప్రేమను తెలిపే ఒక సాధనం నీవమ్మ!!!

నీ సువాసనలన్నీ మేము దోచుకుంటాము!
జ్ఞాపకాల గుత్తులుగా నిన్ను దాచేసుకుంటాము!
నిన్ను చూసే నవ్వడం మేము నేర్చుకున్నాము!!!


నీవు మౌనంగానే ఊసులాడగలవేమో!
చలికి ముడుచుకుని చెమ్మగిల్లుతావేమో!
తెల్లవారితే మరల నీవెట్లు విరబూయగలవో ఏమో!!!

వినతి!!!!

నా ఊహలనే నీ బాసలుగా అనుకున్నానని, ఎదురు చూపులతో నీకై నిరీక్షిస్తూన్న నన్ను మౌనంగా ఉండనీకు.

నాకున్న తావు నీగుండెలోనేనని మనసుతో ఆడుకోవడం నాకు రాదని, తెలిసి ప్రేమలో నన్నోడిపోనీకు.

నీవు కాదన్న నాడు నేను లేనే లేనని నీతో జీవించాలనుకున్నానని, నా జీవితంతో ఆడుకోకు.

నేను కన్న కలలన్నీ నీ కళ్ళతోనేనని, కష్టసుఃఖాల్లో నీతోడు నీడై ఉంటానని మరచిపోకు.

నా మనసొక వాగై ఈ వెల్లువలో ఎటుపోతుందోనని, భీతిల్లిన నన్ను ఒంటరిని చేసిపోకు.

నా జీవనయానంలో చుక్కానివై దరిచేరి నన్ను ఒడి చేర్చుకుంటావనే నమ్మకాన్ని వమ్ముకానీకు!!!

కలువ(పద్మ) వ్రాసిన కవిత...

గుణింతముతో కలువ(పద్మ) వ్రాసిందొక కవితను..

కాస్తంత మీ సమయాన్ని వెచ్చించి చదవమంటాను..

కించిత్ దయ ఎదుటివారిపై చూపమంటాను..

కీర్తి ప్రతిష్ఠలకై ప్రాకులాడడం ఏలంటాను..

కుబేరుడేల కుచేలుడిలా ఉండమంటాను..

కూడబెట్టినవి ఏవీ మనవెంట రావని అంటాను..

కృత్రిమమైన ప్రేమాభిమానాలు వలదంటాను..

కౄరత్వాన్ని మించిన పాపమేదీ లేదంటాను..

కెంపులు, కాసులు మనకెందుకని అంటాను..

కేటుగాళ్ళతో సహవాసమే మనకి వద్దని అంటాను..

కైలాసగిరికి మార్గము మంచితనమేనంటాను..

కొద్దో గొప్పో మంచిపేరుంటే అదే చాలనుకుంటాను..

కోటి విద్యల కూడులో కొంతైనా పరులకి పెట్టాలంటాను..

కౌసల్య సుప్రజా రామలకి కొంత సమయం కేటాయించమంటాను..

కంటికి కునుకు పడ్డాక పరుపైనా కటికనేలైనా ఒకటేనంటాను..

కః తో ఏదైనా ఒక మంచి మాటని సెలవీయండని అంటాను.!!!!

ఆనంద ఊయల!

మనసు విప్పి మాట్లాడు!
నీలోని భావాలకి ఒక రూపం ఏర్పడుతుంది.
చిలిపి తగవులతో నాతో పోట్లాడు!
బుజ్జగించడానికి నాకొక వంక దొరుకుతుంది.

మనస్పూర్తిగా నన్ను ప్రేమించు!
ఆ ప్రేమే జీవితానికి ఒక ఆలంబనమౌతుంది.
అంతులేని అనురాగాన్ని చూపించు!
అనురాగమే నా ప్రేమకి ఒక ఆకారాన్నిస్తుంది.

నీ కంటిపాపలో నన్ను సింగారించుకో!
లోకమంతా రంగులమయమై కనిపిస్తుంది.

నీ పెదవులపై చిరునవ్వుగా నన్నుంచుకో!

జీవితమే ఆనంద ఊయలై ఊగుతుంది.....

విన్నపాలు!!!

భగవంతుడా!
అందమైన రూపాన్ని ప్రసాదించవేల?

నిర్మలత్వాన్ని మించిన నిగారింపు నీకేల!!!


ఆనంద ఢోలికలలో ఊగించవేల?

తృప్తిని మించి ఆనందము ఉన్నదందువా బాల!!!


అష్ట ఐశ్వర్యాలను ఒసగరాదటేల?

ఆశాసౌధాలకి అంతమే లేదేల!!!

ప్రేమానురాగాలను అందించరావేల?

ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోమని వేరే చెప్పాల!!!


ఇందరిలో నాకే ఇన్ని కష్టాలేల?

మెరిసేదంతా పుత్తడి కాదు తెలుసుకోవేల!!!


మనశ్శాంతిని కలుగచేయ రావేల?

రాగద్వేషాలలో నీవు బంధీవైనావేల!!!

ఎదుటి వారికొరకై నే ప్రార్ధన చేయనేల?

చేయూతనీయని చేతలులేని ప్రార్ధన చేయు పెదవులేల!!!

ఎవరికి చెప్పాలి?

మిత్రులే కదా అని పదిమందితో చర్చించకు.
నీ ప్రేమను గూర్చి నలుగురితో మాట్లాడకు..

వాళ్ళు నిన్ను హేళన చేస్తారేమో!!!


సూర్యచంద్రులకి నీ వేదనను వివరించకు
పరిష్కారం కొరకై వాళ్ళని ప్రాధేయపడకు..

విశ్వమంతా వారై విసిగి వేసారినారేమో!!!


చీకటికి నీ గోడుని వెళ్ళబుచ్చకు

అంధకారమేదో దారి చూపుతుందనుకోకు..
రేయికి తన వెలుగే తనకి కరువైందేమో!!!

సాగర కెరటాలని పలకరించకు

ఆలోచనా తరంగాలలో విహరించకు..

సుడిగుండాల్లో నిన్ను చుట్టేస్తాడేమో!!!


ఆకాశంవైపు ఆశగా చూడకు

ప్రేమలో సహాయ పడమని కోరకు..

చిరాకుతో నిన్ను ఉరిమి చూస్తాడేమో!!!


చెలియ కంటపడిన వేళ మౌనం వహించకు
మౌనంతో తనని వేధించకు..
నిజమైన ప్రేమైతే నీకే దక్కుతుందేమో!!!

కన్నీటి వేడుకోలు!!

మబ్బులా కమ్ముకుంటాయి...
ఏకధాటిగా కురుస్తాయి...
నదీ ప్రవాహంలా ప్రవహిస్తాయి...

తడిసిన మల్లెలౌతాయి...

జ్ఞాపకాలన్ని గుర్తుకొస్తాయి...
నీవు గుర్తుకొస్తే నా కళ్ళు ఇలా వర్షిస్తాయి!

కంటి నిండా కలలున్నాయి...

అవి ఎప్పటికి తీరుతాయి...
గొంతులోని మాటలు పెదవి దాటనంటున్నాయి...
చేతులు చిత్రాన్ని గీయాలని ప్రయత్నిస్తున్నాయి...

కుంచె ఉంది, రంగులూ ఉన్నాయి...

నీ చిత్రాన్ని గీయాలంటే కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...


నా గుండెను రాతి బండను చేయి...

పగిలి పోయిందనుకో ఆ రాయి...

నన్ను మట్టిలో కలిపి వేసేయి...

భగవంతుడా! నీవు నాకు ఈ ఒక్క సహాయము చేయి...

ప్రేమ పోరాటం...

ప్రేమని పొందాలని నా మనసు చేస్తుంది పోరాటం
నీ హృదయంలో స్థానానికై పడుతుందది ఆరాటం

కనులు గాయ పరుస్తున్నాయి కంటిచూపునే
పలు ప్రశ్నలతో నామనసు వేధిస్తోంది నన్నే

కనులు చీకట్లో కారుస్తున్నాయి కన్నీరు

వాటికి ఇంకా అలవాటు కాలేదు వెలుతురు

ఎంతో మంది మేధావులకే దక్కలేదు ప్రేమనేది

ప్రేమించి శిక్షను అనుభవిస్తుంది నా మనసనేది

ఒకరోజు నీవు పంపిస్తావు నీ ప్రేమ పుష్పాలని
చూస్తావప్పుడు నా హృదయానికైన గాయాలని

కన్నీళ్ళు కూడా నీ మనసుకి అమ్ముడు పోతాయి

మౌనంగానే మన హృదయాలు రెండూ రోధిస్తాయి


నిన్ను నేను తప్పక గెలుస్తాను వేచియుండు

నీ నుండే నిన్ను లాక్కుని పోతాను చూస్తుండు!

విన్నవించవా!!!

ఓ చందమామ.... నాపై వెన్నెలని కురిపించవా
మదిలోని వేదనని మరిపించి మురిపించవా
ఇరువురి నడుమ ఉన్న ఎడబాటుని దూరంచేయవా
సుందర స్వప్నాలలో మమ్ము విహరించ నీయవా!

నేనొక స్వప్నాన్ని నన్ను ప్రేమించమనకు
ప్రేమిస్తే ఇంక నన్ను మరువమని అనకు
గాలితెమ్మెరలు వచ్చిపోతుంటాయని చెప్పకు
కలువకు నీకు నడుమ ఉన్న ఎడబాటుని గుర్తుచేయకు!

పగలు రాత్రి కూడా కలిసే అవకాశముందని చెప్పు
కొమ్మ నుండి వేరైన రెమ్మ కూడా విరబూస్తుందని చెప్పు
వెన్నెలంటి మనస్సుందని నన్ను నీతో పోల్చి చెప్పు
నా పిచ్చి కాని...ఏం చెప్పాలో నీకు తెలియదా చెప్పు!!!