అనుకున్నా!!!

మనమధ్యన ఉన్నది స్నేహంకాదని
అది ప్రేమానుబంధంగా మారిందని
నా మనసు మాట వినకున్నదని
చెప్పాలనుకున్నా చెప్పలేకున్నా!
నీకు అర్థంకాదని తెలుసుకున్నా!

కనులు కనులతో కలిపిచూడమని
నా హృదయంలో పదిలంగా ఉండమని
నీ ప్రేమలో నన్ను బంధించమని
విన్నవించాలి అని అనుకున్నా!
చెవిటివాని చెవిలో రాగమేలనుకున్నా!

రేయింబగలు నీధ్యాస నాకేలని
నీ తలపులలో నేనున్నానా అని
నీఅడుగులో అడుగవనా అని
ఎన్నో అడగాలి అనుకున్నా!
ఆడిగి అలుసవనేల అనుకున్నా!

"మినరల్ వాటర్"

కార్తీకమాస వనభోజనాలంటూ అతిరథమహారధులంతా బ్రహ్మాండంగా రుచికరమైన వంటలతో అధరగొట్టేస్తుంటే నేను మాత్రం చదివి ఆహా! ఓహో! అంటే ఏం బాగుంటుంది చెప్పండి???
ఇలా అనడం సులువే కాని ఏంచేయాలో తెలియడం లేదు!!!!
పోనీ ఏమైనా వండేదామా అంటే అది చేయడమే ఒక సాహాసం అనుకుంటే .....జ్యోతిగారు చాన్స్ ఇస్తేగా, షడ్రుచులతో వడ్డించాక ఇంకేం మిగిలిందని???? దానికి తోడు యజమానిచేతితో చేసిన టమాటాపచ్చడి అడిష్నల్ అట్రాక్షన్.... ఫోటోనే యమరంజుగా ఉందికదా! దాన్ని ఇన్స్ఫిరేషన్ గా తీసుకుని పచ్చడిని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటే.... మాలాకుమార్ గారు కంది పచ్చడితోనే అందరి కడుపులూ నింపేసారు, జయగారు ముందుగానే డబ్బాలు డబ్బాలు మోసుకొచ్చి ముందుంచారు, మధురవాణీగారు మాఇంటబ్బాయి వంట అంటూ మరో వెరైటీలో కోడిగుడ్డు పొరటో అట్టో అనిచెప్పి ముందుంచారు. వీటితో పాటు అరిసెలు, లడ్డూలు, బూందీ, కారప్పూస..ఇంకా ఇలాంటివి ఎన్నో...జ్ఞాన ప్రసూన గారి పూర్ణాలు, స్వప్నగారి పాలక్ పన్నీర్, హు...ఇంక నేస్తంగారు సరే సరి....ఉలవచారుతో ఒక ఊపు ఊపేసారు. మంచుగారు మార్చికూర్చి పేరేదైనా పాయసమో పరమాన్నమో కాని స్వీట్ విత్ డ్రై ఫ్రూట్స్ తో పసందుగా అందించారు. కృస్ణప్రియగారు టల్లోస్... అనే పేరుతో పెరుగు వంటకాన్ని డ్డించారు. నెమలికన్ను మురళీగారు నేనేం తీసిపోనంటూ నూడిల్స్ ఇన్ న్యూ స్టైల్ అన్నమాట:).
జేబిగారు తక్కువ తిన్నారా ఏంటి పెసరట్టు+అల్లంపచ్చడితో పాటు కాఫీని కూడా పొద్దున్నే వేడివేడిగా అందించారు. శ్రీలలితగారు ఉసిరి, అనాస ప్రిపరేషన్స్ తో, లతగారు మేతీ చమన్, బ్రెడ్ బాసుందితో, హనుమంతరావుగారు వెరైటీ వంకాయకూరతో రెడీ. రాధిక(నాని)గారు ఆకాకరకాయ కూరతో వచ్చారు. వేణు శ్రీకాంత్ గారు దోసలతో పాటు వెండి పళ్ళాలని...చెంచాలని కూడా అందించారు:) ఇలా ఎన్నెన్నో రకాల రకరకాల వంటలతో వచ్చి వడ్డించిన బ్లాగ్ విస్తరిలో నా వంటకి చోటెలాగో లేదని అయినా ఏదో ఒకటి చేయాలని థింకింగ్....... థింకింగ్......??????

ఐడియా వచ్చిందిగా:):):).....
అన్నీ ఆరగించాక బుక్తాయసంగా ఉందికదండి!!!.....ఇంకెందుకు ఆలస్యం అందుకోండి....
మినరల్ వాటర్ బై మీ... ఓన్లీ సప్లైంగ్ నాట్ ప్రిపేర్డ్:):) (మిగిలింది అదేగా ... ఆలస్యం అయితే అదికూడా ఎవరైనా తెచ్చేస్తారేమో.....)
"అందమైన మట్టి కుండలో
స్వచ్చమైన త్రాగునీరు
అభిమానంతో కలగలిపి
అందిస్తున్నాను... పద్మార్పిత!"
(సరదాకే కాని ఎవరినీ సతాయించాలని కాదని మనవి....
మన్నించండి "మినరల్ వాటర్" ని ఎవరి మనసునైనా నొప్పిస్తే!)

తెలిసిందిలే....

కరిగిన కలలతో కనులు చెమ్మగిల్లాయి
ఆశల ఎడారిలో ఆశ్రువులు రాల్చాయి

జీవించడానికి కావలసినవన్నీ వున్నాయి
మనసుభారమై అవి దూరమౌతున్నాయి

ఆశలసౌధాలు ఆనందాన్ని ఏమిస్తాయి
ఆనందానికి కలలు కైవసం కానన్నాయి

ఒక్కరికై మరొకరి మనుగడ ఆగకున్నాయి
నలుగురిలో నన్నునన్నే వెతుక్కోమన్నాయి

కల్మషంలేని హృదయాలు హాయిగా నవ్వుతాయి
మంచి మాటలు మనిషిలో తప్పక మార్పునిస్తాయి

నాది నాది అన్న పదాలతో పెదవులు దూరమైనాయి
మనం మనది అన్న మాటలతో అధరాలు ఒకటైనాయి

చివరికి మిగిలింది!!

నిన్ను చూడకనే నీ చిత్రాన్ని వేయగలను
నిన్ను కలవకనే నీ మదిని చదవగలను
నీ భాధని నా కంటనీరుగా కురిపించగలను
నిన్ను మరువమని నామదికి ఎలా చెప్పను!

అద్దం నన్ను అదే పనిగా అడిగెను
నా పాత రూపం తనకి కావాలి అనెను
పగిలిన మనసుని అయితే అతికించాను
అతుకుని కనపడనీయకుండా ఎలా దాచను!

నిన్ను మరువని మదిని నేనేమి చేయను
ప్రతి కదలికలో నీవే అయితే నేనేమైపోతాను
కునుకు రాని కంట నేను కలలు ఎలా కనను
కలనైనా నిన్నుగానక నేను ఎలా జీవించను!

భారమైన హృదయాన్ని భాధగా నేచూడలేను
భాధకి బానిసనై నన్నునే ఎలా బంధించుకోను
భాధకి కూడా ప్రేమే మందని నాకు తెలుసును
ఎందుకంటే! ప్రేమిస్తే చివరికి భాధే మిగిలేను!

గమనిక:- భగ్న ప్రేమికులకి మాత్రమే.......

విజయీభవ!

బ్లాగ్మిత్రులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు!

మార్పు...

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
నేను అడుగులు చిన్నిగా వేసినప్పుడు
లోకం బహుపెద్దగా కనపడిందప్పుడు
బడికి వెళ్ళేదారిలో మిఠాయిల బండి
ఇప్పుడక్కడ వెలసింది ఒక పెద్ద మండి

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
సంధ్యవేళ ఆటపాటలతో గడచిన బాల్యం
పగలు రాత్రులతో అంతమౌతున్న దినం
ఇంటికి రాగానే చేరేదాన్ని అమ్మఒడి
వారానికి ఒక్కసారైందిప్పుడా ఒరవడి

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
సావాసంలో పెల్లుబికేది స్నేహమాధుర్యం
ఇప్పుడది 'హాయ్''బాయ్'లకే అంకితం
యాంత్రికంగా మారిన మానవ జీవితాలు
పండుగనాడు అందుకుంటున్నాము సందేశాలు

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
రేపటి కొరకై ఎవరికీ చింతలేదు
ప్రస్తుతం మన అందుబాటులో లేదు
ఆశలు, ఆశయాలు జీవితంలో భాగమైపోగా...
వాటిని కప్పిపుచ్చి బ్రతికేస్తున్నాము ఎంతో హుందాగా!

ఎందుకిలా...???

మట్టితో చేయబడ్డ మనం నీటమునిగి తేలుతున్నాం...

చావే చివరి మజిలీ అని తెలిసికూడా పయనిస్తున్నాం...

కట్టెలపై కాలే శరీరాన్ని సింగారించి మరీ మురుస్తున్నాం...

వెంటరాదని తెలిసికూడా ధనార్జనకై రేయింబగలు శ్రమిస్తున్నాం...

చెడుకి దరిచేరిన మనం మంచిని మంచువలే కరిగిస్తున్నాం...

నలుగురిలో రానినవ్వుని పెదవులపై రంగరించుకుని రాణిస్తున్నాం...

కృత్రిమత్వంతో కరుణను సైతం కఠినంగా కాళ్ళరాచేస్తున్నాం...

ప్రతిరోజు పడిలేస్తూ ఎందుకిలా చచ్చి బ్రతికేస్తున్నాం...?????

ఒక కల...

ఒక కల...అధ్భుతమైన చిత్రాన్ని గీయాలని
ఆ చిత్రంలో జీవకళ ఉట్టిపడాలని!!!

ఒక కల...మంచి కవిత వ్రాయాలని
నా భావాలన్నీ అందులో పొందుపరచాలని!!!

ఒక కల...మధురమైన గేయం రచించాలని
ఆ పాటతో అందరూ పరవశించిపోవాలని!!!

ఒక కల...ఎంతో ఉన్నతంగా జీవించాలని
నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని!!!

ఒక కల... అజ్ఞాతంగా అంతమైపోవాలని
అంతమై అందరిలో జీవించాలని!!!

వినాయకుడికి దండాలు!

అమ్మచేతితో మలచబడ్డ అద్వితీయుడు

పదునాలుగు భువనాలకు పరమాప్తుడు

మనందరి మ్రొక్కులలో ముందుంటాడు

విఘ్నాలను తొలగించే వినాయకుడు

కొలచిన ప్రతిమదిలో కొలువుండేవాడు

కలిమిని బలిమిని కలిగించువాడు

శక్తిని యుక్తిగా చూపే స్కందాగ్రజుడు

యఙ్జాలపతిగా నిలచే యశస్కందరుడు

సర్వజనులను రక్షించే సర్వరాయుడు

స్వీట్స్ ప్రపోసల్కి హాట్ ఆన్సర్!

ఓయ్...కుర్రాడా!
నువ్వే నా ఆవడా
నీ దొంగ లుక్స్...
వేడి వేడి ఆలుచిప్స్!
నీ హెయిర్ స్టైల్...
విడివడిన మాగీనూడిల్!
నీ రెండు నయనాలు...
గుర్తొస్తున్నాయి చిట్టిచెకోడీలు!
నీ మీసకట్టు...
మాడిన పెసరట్టు!
మొటిమలతో నీ చెంపలు...
తలపిస్తున్నాయి శెనగపప్పుచెక్కలు!
నీలో ఏముందో నాకు తెలియకుంది...
అయినా నువ్వే నాకిష్టమైన కారప్బూంది!
నీపై ఆలోచనలు సన్నకారప్పూస...
నీ మనసు మాత్రం వెన్నపూస!
నచ్చింది నాపై నీకున్న ఆశ...
అది కమ్మని మసాలాదోశ!
సై అంటున్నాను నీ స్వీట్స్ ప్రపోసల్ కోయ్...
తిందాం చిన్ని ఉల్లి సమోసాలు పదవోయ్!:)

స్వీట్స్ ప్రపోసల్

ఓ...అమ్మాయి!!!
నీవే నా పీచుమిఠాయి
ఓరకంట చూడమాకే ఓ పిల్లా
నాకు గుర్తుకొస్తుంది రసగుల్లా
నీ అధరాలపై దరహాసం
నాకది సేమ్యా పాయసం
నీవు నడుస్తుంటే భలే మజా
తలపిస్తుందది తాపేశ్వరం కాజా
నీ జడలోని గులాబీ
నాకు అక్కర్లెద్దు జిలేబీ
నీ బుగ్గలపై పడే సొట్లు
నా మదిలో మెదిలే బొబ్బట్లు
నీ చీరమాటున దాగిన బొడ్డు
గుర్తుచేస్తుందది తొక్కుడులడ్డు
నీ నల్లని కురుల సిరులు
రాసులై కనిపిస్తున్న పూతరేకులు
అమ్మో! నీ అందాన్ని కొల్వ
సరిపోదు నూరుకిలోల హల్వ
నాకు నీవే సరి అయిన సిరి
నీవుంటే నాజీవితం రవ్వకేసరి
కాదని అనకే ఓ! డింగ్రీ
నేనౌతా తీపిలేని జాంగ్రీ
సరే అని ఒప్పుకోవే నా చెలీ
అందరికీ పంచుదాం చక్కెరపొంగలి!!!

అభ్యర్ధన:-అమితంగా స్వీట్స్ ని ఇష్టపడే ఓ అబ్బాయి తన ప్రేయసికి చేసిన స్వీట్స్ ప్రపోసల్......స్వీట్ స్వీట్ గా చదివి ఆనందించండి, ఆరగించకండేం:):)

కవితలాంటి జీవితం...

కవితలాంటి జీవితంలో....

కొన్ని భావాలు మరికొన్ని ఆశయాలు
కొన్ని కోరికలు మరికొన్ని కల్పితాలు
కొన్ని సత్యాలు మరికొన్ని ఆశలు...

హృదయమే దాని శీర్షిక
భావమే దానికి వాటిక
ఎన్నెన్నో స్వప్నాల డోలిక...

గాలితెమ్మెరలవంటి మాటలు
అలలై ఎగసిపడే భావనలు
సుగంధాలవ్వాలని తాపత్రయాలు...

అర్థం తెలియని పదాలతో తికమక
అందరినీ మెప్పించాలనే కోరిక
తీరుతుందో లేదో వేచి చూడాలిక...

ప్రేమ-పెళ్ళి


ప్రేమ పెళ్ళికి సూర్యోదయం అయితే ప్రేమకి సూర్యాస్తమం లాంటిది పెళ్ళి!

బయటివాళ్ళు లోనికి, లోపలివాళ్ళు బయటపడాలి అనుకునే పంజరం పెళ్ళి!

ప్రేమకి మనలో చోటిస్తే, మనకి ఎదుటివారి మనసులో చోటిస్తుంది ప్రేమ!

మనందరి స్వభావాలకి ఉండవలసిన అందమైన అవసరం ప్రేమ!

హక్కులని సగానికి తగ్గించి భాధ్యతలని రెండింతలు పెంచేదే పెళ్ళి!

స్త్రీల సంతోషాన్ని, పురుషులు స్వేఛ్ఛని హరింపచేసేదే పెళ్ళి!

నిత్యయవ్వనంగా కనపడే ప్రతి హృదయంలో నిండి ఉండేది ప్రేమ!

చక్కని వాఖ్ఛ్యాతుర్యంతో శ్రధ్ధగా అలవరచుకునే విద్య ప్రేమ!

వాద ప్రతివాదనలతో సాగే సుధీర్ఘ సంభాషణలఝరి పెళ్ళి!

వద్దువద్దంటూనే వందలాది మంది చిక్కుకునే ఊబి లాంటిది పెళ్ళి!

(ఏంటి పద్మార్పితా....ఈ లెక్చర్ అని నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి ఈ మాటర్ లో, ఇదంతా పోయిన సంవత్సరం పెళ్ళై ఆషాడం ఎండింగ్ లో నా బ్రదర్ కి కలిగిన జ్ఞానోదయనికి నేనిచ్చిన అక్షరరూపం ఈ ప్రేమ-పెళ్ళి!)
Just for fun:):)

ఇలాగైతే ఎలా?

చెలికాని మది చెరకు కన్నా తియ్యనంటే
చీల్చితినడం కన్నా చేదే నయమన్నది!

చెలీ నీకు నేను గొడుగునౌతానంటే
జడివాన జల్లులో తడవడం ఇష్టమన్నది!

అతని మనసున బంధీవై ఉండమంటే
విశాల ప్రపంచంలో విహంగాన్ని నేనన్నది!

ఆమె వేసిన అడుగుని పెదవి తాకిమట్టంటుకుంటే
ముద్దాడబోయిన పెదవులను మట్టివాసనన్నది!

రంగుల కుంచెతో జీవితాన్ని రంగరిస్తానంటే
తెలుపు తప్ప తనకి వేరేది తెలుపవద్దన్నది!

రాగరంజమై తనలో లీనమై పోదామనుకుంటే
కర్ణభేరికి అన్నీ కన్నాలే వున్నాయన్నది!

ప్రతిదానికి ఇలా ఏదో ఒక వంక పెడుతుంటే
అతనిలోని ప్రేమ ఆమెకు ఎలా తెలిసేది!

ప్రేమా! దూరం దూరం...

నా హృదయ వీణను మీట ప్రయత్నిస్తే
నాలో ఊహలకు ఊసులు నేర్పితే
మనసుకి కళ్ళెం వేస్తాను
ప్రేమకి నే దూరం అంటాను.

నాలోని కోరికలు ఎగసి పడితే
అవి తీరం చేరని కెరటాలని తెలిస్తే
వేదనైనా పర్వాలేదు భరిస్తాను
నా మనసుని నేనే వసపరచుకుంటాను.

నా మనసు నా మాట వినను అంటే
మౌనంగా అది రేయింబగలు రోధిస్తే
గాయమైన మనసుతో దూరమౌతాను
పగిలిన మనసుని పదే పదే అతికిస్తాను.

నాలో సహనం నన్ను ప్రశ్నిస్తే
కన్నీటి జలపాతం బీటలుగా మారితే
మనసుని రాయి చేసుకుంటాను
జీవితమా! నీతో నాకు పనిలేదంటాను.

పేదవాని ప్రార్థన!

జీవితమా....మా ఇంట అడుగిడుమా
మా స్థితిగతులను కాస్త కనుమా
తెలుపనా మాఇంటి చిరునామా
నాలుగు వైపులా గోడలే లేవుసుమా!

జీవితమా....లేదు నీకు తలుపు తట్టవలసిన అవసరం
గుబులుతో గుమ్మం పలుకుతుంది మీకు స్వాగతం
పైకప్పుకి తెలుసు ఎండావానల తులాభారం
కటికనేల పైనే నిన్ను కూర్చుండబెట్టే పేదలం!

జీవితమా....మా ఇంట అడుగిడుమా
మా ఇంటి మారుపేరు ప్రేమా
నీ నీడలో మమ్ము తలదాచుకోనీయుమా
కాస్త చేయూతనిచ్చి మమ్ము కాపాడుమా!

జీవితమా....మా అభిమానమే నీకు ఆతిధ్యం
బోర్లించిన బొచ్చెలని చూసి నీవు చేయకు పరిహాసం
మా ఇంట ఏమున్నది నీకు తెలియని రహస్యం
నీ ఆదరణతో విరియాలి మా పెదవులపై దరహాసం!

జీవితమా.... మా ఇంట అడుగిడుమా
ఆకలి తీర్చి మా ప్రాణాలని నిలుపుమా
ఆగలేక అర్థిస్తున్న మా గోడు కాస్త వినుమా
మా ఇంట ఆనందాలని కురుపించుమా..ఓ జీవితమా
!

బ్లాగర్స్ పై నా భావాలు...

చాలా రోజుల నుండి నా మదిని దొలిచేస్తున్న విషయం ఇది...ఇలా అని వ్రాస్తే ఏమనుకుంటారో ఎంతమంది ఎన్ని విధాలుగా తిట్టుకుంటారో లేక మెచ్చుకుంటారో, వ్రాయనా వద్దా అని ఆలోచించి ఆగలేక ధైర్యం చేసి వ్రాస్తున్నా... తిట్టినా, మొట్టినా అందరూ నావాళ్ళే కదా అన్న ధీమాయే ఈ టపాకి శ్రీకారం...

ఇక అసలు విషయానికి వస్తే...
ఎవరిదైనా ఒకరి బ్లాగ్ ని తలచుకోగానే నాకు గుర్తుకు వచ్చే చిత్రవిచిత్ర ఆలోచనలివి....వీటికి మీరు లాజిక్కులు, మాజిక్కులు, తర్కణలు, వాదనలు ఏమనుకుని అడిగినా నా దగ్గర సమాధానం లేదండోయ్...చదివి హాయిగా నవ్వుకుంటే నేనూ మీతో జతకలిపేస్తాను, తిట్టుకుంటే ఏంచేస్తాను చెప్పండి మీతో పాటే నేను కూడా, ఇంక మీరు సై అంటారా! నేను సైసై అంటాను...

క్రమబద్దీకరణ కాస్త కష్టమండీ అందుకే గుర్తుకి వచ్చిన వారిని వచ్చినట్లుగా వ్రాస్తాను మన్నించండి, ఇంక మరచిపోయిన వారు మన్నించి తలా నాలుగు తిట్టండి...అదే మహా ప్రసాదం...

విసిగించక విషయం చెప్పమంటరా!!!

కొత్తపాళీ:-నన్నయ్యగారు కొత్తపాళీతో సిరాలేకుండా నిఘంటువుని పుంఖానుపుంఖలుగా వ్రాస్తున్నట్లు...

సాహితీయానం:-బొల్లోజుబాబాగారి నవ్వుతున్న ముఖంతోపాటు రవీంధ్రనాధ్ టాగూర్ గారు గుర్తుకు వస్తారు.

పర్ణశాల:-కత్తిమహేష్ గారు ఖబర్ధార్ తప్పురాస్తే కత్తితో ఖండిస్తా అన్నట్లు...

పరిమళం
:-ఎవరు ఏమి వ్రాసినా తను మాత్రం అందులోని పరిమళాన్ని మాత్రమే ఆస్వాధిస్తున్నట్లు...


ఆలోచనాతరంగాలు
:-అమ్మో! ఇలాంటి మేధవులకి మనం దూరంగా వుండాలన్నట్లు...


జాజిపూలు
:-పిల్లికళ్ళతో అమాయకంగా కనిపిస్తూ అన్ని విషయాలూ మనకి చెబుతూనే ఏ విషయాన్ని పూర్తిగా చెప్పకుండా ఉవ్విళ్ళూరించే సింగపూర్ చిన్నది గుర్తుకు వస్తారు.


రవిగారు
:-నేను వ్రాసే పోస్ట్ ను తప్పక వేరొక కోణంలో ఆలోచించే మొదటి వ్యక్తి...


ఆత్రేయ
:-శివుడు గళం మింగితే, కవితలన్నీ ఈయనగారి కంఠం మింగేసిందేమో అనిపిస్తూ...వెంటనే ఈయన వెనుక కళాస్పూర్తిగారి కుంచె గుర్తుకు వస్తుంది...


లీలామోహనం
:-చేత వెన్నముద్ద చెంగల్వ పూదండా...అనే పద్యం గుర్తుకొస్తుంది...


మధురవాణి
:-మధురమైన గొంతే కాదు, మంచి మనసున్న అందమైన అమ్మాయి గుర్తుకొస్తుంది...


కలల బాటసారి కవితాపధం
:-నా ఒర్కుట్ లో మొదట స్క్రాప్ పెట్టిన మిత్రుడుగా...


డా.ఆచార్య ఫణీంద్ర
:-నిండుకుండ తొణకదనిపిస్తుంది...


జీడిపప్పు:- కాస్త మిరియాలపొడి చిమ్ముకుని తింటే ఆహా! ఏమి రుచి...

నెమలికన్ను
:- మురళీపించుడు ఆలపించని రాగమున్నదా అనిపిస్తుంది.


శ్రుతి
:- నా చిన్నినాటి స్నేహితురాలి నవ్వు గుర్తొస్తుంది...


మరువం ఉష
:-నీవు రాస్తున్నవన్నీ నేను చూస్తున్నాను...జాగ్రత్త! అని హెచ్చరిస్తూ ధైర్యాన్ని ఇస్తున్నట్లు...


హిమబిందువులు
:- ఇప్పటికి కూడా ఇంకా పేరు(చిన్ని కాకుండా) తెలుసుకో లేకపోయానే ఏమై ఉంటుందబ్బా అని...

ఏకాంతవేళ ఉప్పొంగేభావాలు:-మధుమతి హిందీ చిత్రంలో దిలీప్ కుమార్ గుర్తొస్తారు...

స్వేచ్ఛకోసం
:-నేటి సమాజంలోని పేదపిల్లలు వారి జీవితాలు గుర్తుకొస్తాయి...


అర్జునుడి బాణాలు:-చూపులతో కూడా బాణాలు వేయవచ్చని...

పానీపూరీ123
:- అలా ఫోటో పెట్టి ఊరించకపోతే తలో పది తినమనొచ్చుకదా...


స్మృతుల సవ్వడి
:- నా కవిత వాళ్ళ శ్రీవారికి వినిపించి కానీ భోజనం పెట్టరేమో పాపం అంత అభిమానమా అనిపిస్తుంది...


నా స్వగతం
:- కార్తిక్...కార్తిక్...కార్తిక్...ఎవరు ఎవరు ఎవరు???


బాపూజీయం:- శివరామ కృష్ణగారి పుత్రుడు(శిరాకిపుత్ర)...

గీతాచార్య
:-పువ్వు పుట్టగానే పరిమలిస్తుందంటే ఇదేనేమో...


హృదయస్పందనల చిరుసవ్వడి
:-చిలిపి వ్యాఖ్యలతో అల్లరిపెట్టే పక్కింటి కుర్రోడు(ఒకప్పుడు)...పులిహోర తిన్నప్పుడు గుర్తుకువస్తారు(ఇప్పుడు)...


మనసులో కురిసిన వెన్నెల
:-తొలకరి జల్లుతో తడిసిన నేల నుండి వచ్చే మట్టివాసన...


వాలు కొబ్బరిచెట్టు
:- ఒక మంచి పిక్నిక్ స్పాట్ గుర్తుకువస్తుంది...


భాస్కర్ రామరాజు
:- వంటల జోలికి పోకూడదు నలభీములున్నారిచ్చట...


మనస్వి:-జయ "ఒక మంచి అమ్మాయి" కాప్షన్ గుర్తుకువస్తుంది...

కమ్మటికలలు:-అందమైన చిలకలజంట...

శివచెరువు:-క్లోజప్ ప్రొఫైల్...

సుత్తి నా సొత్తు
:-చదవకపోతే సుత్తితో ఒక్కటేస్తా...


అశ్వినిశ్రీ
:- పక్షుల కూనీరాగాలు గుర్తుకొస్తాయి...


ఏటిగట్టు:- ఏటిగట్టున కూర్చుంటే...ఏరు గలగలమంటుంటే అనే మధురమైన పాట గుర్తొస్తుంది.

శిశిర:- తన ప్రొఫిల్ లోని బొమ్మని దొగిలించి వేసిన నా కుంచె గుర్తుకొస్తుంది...

సత్య
:-రెక్కలుంటే ఎంతబాగుంటుందో కదా అనిపిస్తుంది...


సవ్వడి
:- సడిచేయకేగాలి సడిచేయబోకే అనే పాట గుర్తొస్తుంది...


Tears of Yohanth:-అబ్బాయిలు కూడా ఏడుస్తారన్నమాట...

రాకి
:-కవితలా కమెంట్స్ పెట్టే ఒపిక ఎంతమందికుంటుందో అనిపిస్తుంది...


తృష్ణ
:-జగ్జీత్ సింగ్ గజల్స్ గుర్తుకువస్తాయి...


బ్లాగు బేవార్సు
:- బేవార్సు అంటూనే బిజీగా ఉండే వ్యక్తి...


సిరి సిరిమువ్వ
:- స్వచ్ఛమైన నవ్వు గుర్తొస్తుంది...


బృందావనంలో
:- విశ్వమంతా ప్రేమమయం అనిపిస్తుంది...

ఆకాశ వీధిలో:-అల్లరిచేసే క్రియేటీవ్ కుర్రోడు...

అక్షర మోహనం:-ఒకో అక్షరంలో ఒకో భావన...

పిల్లనగ్రోవి
:- రాధికా....కృష్ణా...


జ్యోతి
:-ఈరోజు ఏం క్రొత్త వంట రుచి చూపిస్తారో! ఏం క్రొత్త టాపిక్స్ గురించి చెబుతారో...


ప్రవల్లిక:- స్నేహితురాలు గుర్తుకొస్తుంది...

కిరణ్
:-కుదురుగా కూర్చుని కుంచెతో బొమ్మలుగీస్తున్న అమ్మాయి గుర్తొస్తుంది...


దీపావళి
:-చీకటి వెలుగుల రంగేళీ...


భావన
:-భావాంతరంగాల్లోని భావనలెన్నో...


స్నిగ్ధ కౌముది
:- ప్రణీత స్వాతికి ఈ పేరు ఎలాతట్టిందో...


నాతో నేను నాగురించి
:-వేణుగానం వినసొంపైనది కదా...


ధరణీ ఆర్ట్స్
:-ఫోటోలతో జిమిక్స్ చేస్తూ ఆనందించే వ్యక్తి...


దీప్తిధార:-నయాగరా వాటర్ ఫాల్స్ గుర్తొస్తాయి...

శ్రీలలిత
:-శ్రీలలితా.....శివజ్యోతి....అని పాడుకోవాలనిపిస్తుంది...


నాలోని మరో నేను
:-ఆలోచన అంటే అంత తీవ్రంగా అలోచించాలన్నమాట...


నా భావనలు
:-శ్రీనిక మంచిపేరు మంచి భావాలు...


బుడుగు
:-పేరు చూసి మోసపోకండి...పిట్టకొంచెం కూత ఘనం...


ఇదండీ...బ్లాగ్ బ్లాగ్ పై నా భావాలు...ఇంకా బోలెడంత మంది వున్నారు వారి గురించి ఇంకో పోస్ట్ లో...ఎందుకంటే అందరి తిట్లు, అక్షింతలు ఒకేసారి భరించడం కష్టం కదండి:):):)


గమనిక:- ఇది ఎవరి మనసుని నొప్పించాలని చేసిన ప్రయత్నం మాత్రం కాదండి...

ప్రేరణ!!

కనురెప్పలు విశ్రాంతికోసం ఆవలిస్తున్నవేళ
ఒంటరిగా ఉండమని జ్ఞాపకాలు శాసిస్తున్నవేళ!

నీ పలకరింపు నా హృదయవీణను మీటింది
మూగపోయిన నా మనసును తట్టిలేపింది!!

నీ స్పర్శ అంతరించిన ఆత్మీయతను వెలికితీసింది
తెలియని అనుభూతి నన్ను అలలా తాకింది!!

నీ చేయూత నాలో ఆశలను రేపింది
కలలాంటి జీవితాన్ని వాస్తవానికి దరిచేసింది!!

నీ తోడు నాకున్నది అన్న భావనే ఎంతోబాగుంది
నా కవితలకి అదే ప్రేరణగా నిలచింది!!

అలా మొదలైంది నా కవితాఝరి ఆవేళ
ఇలా సాగిపోతుంటే నా చెంతనలేవు నీవు ఈవేళ!

గులాబీలమై మనం...


అందమైన గులాబీ మొక్కనొకటి నాటాను
ప్రతిరోజూ నీరుపోసి దాన్ని పెంచాను
పెరుగుతున్న మొక్కని చూసి మురిసాను
మొగ్గ తొడిగినవేళ మదిన ఇట్లు యోచించాను!

అందమైన గులాబీమొగ్గ చుట్టూ ముళ్ళేల
పువ్వు కొరకై ముళ్ళని పోషించనేల??
తలచినదే తడవు నీరుపోయక వదిలేసానల
గులాబీ వికసించకనే నేలవాడుతూ అందిలా!

అందరిలో మంచిని నాతో పోల్చి చూడండి
ప్రేమనే నీరుపోసి మొక్కని పెరగనీయండి
మొక్క మొక్కకూ మొగ్గలు తొడగనీయండి
తప్పులనేవి ముళ్ళై పట్టుకుని వుంటాయండి
ముళ్ళని చూసి మొగ్గలని వాడనీయకండి
అందమైన గులాబీల కొరకై ఎదురుచూడండి
ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి
గులాబీల తోటలో పూలని విరగబూయించండి
అందరి ముఖాల్లో ఆనందాన్ని వికసించనీయండి!

గెలుపు నాదే!

జీవితంలో ముందుకి సాగాలన్న యత్నం
ప్రతిసారీ వెనుకబడిపోయె నా ప్రయత్నం
ఒక్క అడుగు వేయబోయింది నా పాదం
నాలుగడుగులు ముందుకి సాగె జీవనం!

జీవితందే ప్రతిసారీ అవుతుంది విజయం
నాకు దక్కింది ఎల్లప్పుడూ పరాజయం
ఓడిపోయిన నేను చేసాను దరహాసం
అదిచూసి జీవితానికి కలిగెను ఆశ్చర్యం!

జీవితంతో కొన్నేళ్ళిలా సాగింది నా పయనం
ఒకనాడు నన్ను ఇలా అడిగింది జీవితం
ఓటములను చూసిన నీకు రాదేల ధుఃఖం
మది నిట్టూర్పు విడిచింది ఆ క్షణం!

జీవితానికి ఇచ్చాను నేను సమాధానం
ఓరోజు తనకన్నా ముందన్నాను నా గమనం
మృత్యువు వెంట నేనెదిగిపోతాను ఆ దినం
నాకోసం జీవితమా....నీవు చేస్తావు నిరీక్షణం!

జీవితాన్ని చూసి నేను చేస్తాను విజయహాసం
గడచిన కాలాన్ని తలచి సాగిస్తాను ప్రయాణం
మరణించి సాధించాను జీవితంపై విజయం
గెలుపు ఓటముల్లో నవ్వలేకపోయింది జీవితం!

సప్తహృదయ రాగాలు...

ఈ హృదయ రాగాలు, నావి కావు వేరొకరి భావాలు...
కలల బాటసారి కవితాపధం నుండి జాలువారిన పలుకులు...
నా హృదయపధంలో చెరగని ముద్రవేసిన సరాగాలు ...
మీ సహృదయాలను మెప్పిస్తాయేమో చూడాలి ఈ కవితలు!

గతకాలపు జ్ఞాపకాలు
విత్తులే కదా అని ఓ మూలకి విసిరేసా
ఊడలతో సహా పెరిగి
మనసంతా అల్లుకుపోయాయి!

నేనీ జీవితంలో ఒంటరిని
నేను నీ సమక్షంలో సమస్తాన్ని
నేనీ పయనంలో అలసిన ప్రాణాన్ని
నేను నీ తోడులో అలుపెరుగని పయనాన్ని!

మౌనం నీదైనప్పుడు,
నిశబ్దాన్ని మించిన శబ్దం లేదు.
పయనం నాదైనప్పుడు,
నిలకడని మించిన పరుగూ లేదు!

జరిగేదేది జరగక మానదు
జరిగిన దానితో జీవితం ఆగదు
సమాధాన పడకపోతే దారినిండా ముళ్ళే
చిన్ని సూత్రం తెలిస్తే సెలయేటి ఉరవళ్ళే!

నిన్న నీకు ఆద్యంతాన్ని
నేడు ఒట్టి ఏకాంతాన్ని
నిన్నటి పరిచయానికి అపరిచితుడ్ని
నేటి ఏకాంతానికి చిరకాల మిత్రుడ్ని!

రోజూ చూపులు కలిసినా..
గాలితో ఊసులు పంపినా..
చినుకులతో తనువంతా ముద్దాడినా..
కలిసేదుందా నింగీ నేలా యేనాటికైనా??

పువ్వు నవ్వెందుకు చెరపడమని కొమ్మనుండీ తుంచలేదు
చూసీ ఎందుకు తెంచి ముద్దాడలేదని రాలాక తగువాడింది.
చెలికి చింతెలనని నే చితినెంచుకుంటే.........
మరో గూటికి చేరి, తన గొంతుకోసానని తెగడుతోంది!

పెళ్ళి/చావు

పల్లకీలో కూర్చున్నావు నీవు
పాడెపై పడుకోపెట్టారు నన్ను
పూలతో నిన్ను అలంకరించారు
పూలని నాపై పరిచారు.....

అలంకరించుకున్నానీవు
అలంకరించారు నన్ను
నలుగురిలో కూర్చోబెట్టారు
నలుగురు మోసుకెళ్ళారు....

గమ్యంవైపు పయనం నీవు
తుది మజిలీకి చేర్చారు నన్ను
ఆనందంతో కేరింతలు అందరు
రోదనలతో ఇక్కడ కొందరు....

పురోహితుని మంత్రాలు వింటూ నీవు
కాటికాపరి కాలుస్తున్నాడు నన్ను
నిన్ను అక్షింతలతో ఆశీర్వదించారు
నన్ను ఆశ్రువులతో సాగనంపారు....

బంధాలకు బానిసవు నీవు
బంధవిముక్తున్ని చేసారు నన్ను
జీవితం వైపుకి నీది పయనం
నాతోనే అంతం జీవితం....

నేడు/రేపు

దినచర్య నుండి నిన్నటిని తొలగించాను
నిన్న నేర్చుకున్న ఙ్జానంతో నేటిని ఆహ్వానించాను
నేడు రేపు రాదని, ఈనాడే నాదని నాకు తెలుసును!

దినచర్యను నేను చిరునవ్వుతో ప్రారంభిస్తాను
నిన్న లభించని అవకాశాన్ని నేడు నేను వదులుకోను
నేడు దక్కిన సమయాన్ని మైలురాయిగా మలచుకుంటాను!

దినమంతా ఆశావాదిగానే పని కొనసాగిస్తాను
నిన్నలా కాకుండా నేడు విజయానికై ప్రయత్నిస్తాను
నేడు చేజారిన కార్యాన్ని రేపు ఎలాగైనా సాధిస్తాను!!!

నన్ను నేను!!

నన్ను వదిలి వెళుతూ అన్నావు నవ్వమని
నవ్వేసాను నేను నీ ఆనందం కోసమని!

నీకు ఎరుక నాకు దక్కనిది నాది కాదని
నీవు వదిలిన నేను నీకు మాత్రమే సొంతమని!

నాకు తెలుసు నీకు నాపై ఎంతో నమ్మకముందని
నీకు తెలియని నిజం నా అదృష్టం నన్ను కాదన్నదని!

నాది అనుకున్న చావుని కోరాను తనతో తీసుకెళ్ళమని
నాతో రాకంది చావు...ఛీ! ఛీ! నీవు నాకు వలదని!

నన్ను నేనే ప్రశ్నించు కున్నాను ఈ జీవితం నాకు ఎందుకని?
జీవితమంది... మలచి చూడు అవుతుందది ఆదర్శదాయకమని!

నవ్వుతున్నా!

ప్రేమలో తేలియాడాలన్న కోరిక
తీరింది చివరికి ఇలాగిక.....

హృదయం హృదయాన్ని చేరాలని
మనసులోని భావాలని చెప్పాలని

వ్యక్తపరచడానికి మాటలెన్ని ఉన్నా
మూగమనసు తెలుపలేకున్నన్నా

నరుడి కంటికి నల్లరాయి పగిలి
ప్రేమకి నలుగురి దృష్టి తగిలి....

కన్నీటితో తీర్చుకుంది అది ఋణం
శిక్షగా పెదవులపై విరిసింది నవ్వీక్షణం!

రంగుల గులాబీలు!

ఎరుపురంగు గులాబీ ప్రేమకు చిహ్నం....
ముదురుఎరుపురంగు హృదయాన్నదాగిన అనురాగానికి ప్రతీకం!

తెలుపురంగు గులాబీల ప్రేమ కలిగించు ఆనందం....
పాలమీగడ తెలుపురంగు స్వచ్ఛమైన మనసుకు తాత్కారణం!

లేతగులాబీరంగు సున్నితమైన హృదయం....
ముదురుగులాబీ రంగు వెళ్ళబుస్తుంది కృతజ్ఞతా భావం!

పసుపురంగు గులాబీ స్నేహం ప్రేమగా మారుతున్న తరుణం....
పసుపుఎరుపు కలసిన గులాబీల గుత్తులు పలకరింపుల కవచం!

ఏ గులాబీ అయినా తెలుపుతుంది మనలోని భావం....
అది అర్థం చేసుకోవడంలోనే ఉంది మన సహృదయం!

బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
అందమైన ఆట బొమ్మలు
కోమలమైన కొయ్య బొమ్మలు
మర్మమెరుగని మట్టి బొమ్మలు
ఆడుకోవడానికి అనువైన బొమ్మలు
మనిషి చేసిన ఈ ఆట బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
జీవితపు రంగులద్దిన బొమ్మలు
మమతలమన్నుతో అతికిన బొమ్మలు
కారుణ్యమేకాని కఠినత్వమెరుగని బొమ్మలు
మంచికి మారుపేరుగా నిలచిన బొమ్మలు
ఇవి అలనాడు దేవుడు చేసిన బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
ప్రేమ ఫైబర్ గా మారిన సైబర్ బొమ్మలు
అనుబంధాలకి అతీతమైనవి ఈ బొమ్మలు
గిరిగీసుకుని బ్రతుకుతున్న గిల్టు బొమ్మలు
స్వార్థమనే మూసలో తయారైన బొమ్మలు
క్రొత్తరంగులద్దుకున్న ఆధునికపు మరబొమ్మలు!

ఎలాచెప్పను?

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
వేటగాడివి నీవని నామనసుకి ఎలాతెలుపను?

నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?

నీ రూపమే కనపడుతుంది చందమామలోను చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?

కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?

నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
నిన్ను మరణించమని ఏలాచెప్పను?

వృధ్ధాప్యం!

ముళ్ళబాటలో పయనిస్తున్న నాకేం తెలుసు పూల సుకుమారత్వం
నన్ను నేనే మరచిన నాకేం తెలుసు ఎదుటివారిని గుర్తుపట్టడం
పలుచటి గంజికై ప్రాకులాడే నేను ఆశించలేను పాలపాయసం
పరుల చెంత చేరిన నాకెక్కడివి పట్టుపరుపుల సోయగం
వృధ్ధాప్యంలో ఎందుకులే ఈ జీవిత సారం
నీకై ఎదురు చూస్తున్నాను...ఓ మరణం!

ఆచరించడానికి ఆరు!

మీ దయాదాక్షిణ్యాలు మిమ్మల్ని శక్తిహీనుల్ని చేస్తాయేమో
అయినా చలించక దయ చూపండి.

మీ సహాయసహకారాలు నిరుపయోగమై ఎవరూ గుర్తించరేమో
అయినా నిరాశపడక సహాయపడండి.
మీ నిజాయితీని ఎవరూ హర్షించక మిమ్మల్ని గేలిచేస్తారేమో
అయినా నీతినియమాలతో జీవించండి.
మీ భక్తిశ్రద్దలు ఎదుటివారికి చాదస్తంగా అనిపిస్తాయేమో
అయినా మీ నమ్మకం మీదనుకోండి.
మీ విజయపధంలో అవరోధాలెన్నో ఏమో
అయినా వెనుతిరుగక ముందుకి సాగిపొండి.
మీ మంచితనాన్ని ఎదుటివారు గుర్తించరేమో
అయినా మంచిని మరువకండి.

ఆ నలుగురు!!!!

ఒక రాజుగారికి నలుగురు భార్యలు....
నాలగవభార్య
అంటే ఎంతో ముద్దు అందుకే ఆవిడని వస్త్రవైఢూర్యాలతో మురిపించేవాడు.
మూడవ భార్యని
కూడా మురిపంగానే చూసుకునేవాడు, ఆవిడని ఒంటిస్తంభం మేడలోవుంచి ఎప్పుడూ ఒక కన్నేసి వుంచేవాడు ఆవిడ తనని వదిలి సామంతరాజులతో వెళ్ళిపోతుందేమోనని భయం.
రెండవభార్య
అంటే అమితమైన అభిమానం, ఆవిడ రాజుగారికి అన్నివిధాల సహాయం చేసే శాంతమూర్తి మరియు సలహాదారిణిగా వ్యవహరించేది.
మొదటి భార్య
గురించి చెప్పాలంటే, ఆవిడ పట్టపురాణి. రాజుగారికి చేదోడువాదోడుగా ఉంటూ, ఆయన ఆలనాపాలనా చూసుకునేది. కాని రాజుగారు ఆవిడని పట్టించుకునేవారుకాదు, అది కనపడకుండా గాంభీర్యం అనే ముసుగువేసుకుని ఆవిడతో గడిపేవారు.
ఇలా జరుగుతుండగా కొన్నాళ్ళకి.....

రాజుగారికి అనారోగ్య కారణంగా ఆయనలో మృత్యుభయం చోటు చేసుకుంది.

నాలగవభార్యని
పిలచి నిన్ను నేను అమితంగా ప్రేమించాను నాతో పాటు మృత్యువులో తోడుంటావా అని అడిగితే లేదు అని ఆవిడ చెప్పిన సమాధానం రాజుగారి గుండెలో బాకులాదిగింది.
మూడవభార్యాని
తోడు రమ్మంటే...నేను రాలేను నా జీవితం ఎంతో మధురమైనది మీరు మరణించిన పిదప నేను వేరొకరిని వివాహమాడుతానన్న మాటలకి రాజుగారు కృంగిపోయారు.
రెండవభార్యతో
నీవైనా నా వెంట వస్తావా, నాకు ఇన్నాళ్ళు అన్నింటిలో సహాయ, సలహాలనిచ్చావుగా చరమాంకంలో కలసి పయనించమని వేడుకున్నాడు. దానికి ఆవిడ మీతో కలసి రాలేను కాని కడవరకు మిమ్మల్ని సాగనంపుతానంది.
"నేను వస్తాను మహారాజా మీవెంట మీరు ఎటువెళితే అటు"... అంటూ మొదటిభార్య గొంతు నిస్తేజంగా కృంగిపోతున్న మహారాజవారికి వినిపించింది. అప్పుడు చూసారు నీరసంతో క్షీణించిన మహారాణిగారి వంక, మనసుని నులిపెట్టే భాధతో అనుకున్నారు అయ్యో! నేను ఇంతకాలం ఈవిడనా నిర్లక్ష్యం చేసింది, తనని శ్రద్దగా చూసుకోలేక పోయానని అప్పుడు పశ్చాతాప పడ్డారు.

మనజీవితంలో ఆ నలుగురు.....
నాల్గవభార్య మన శరీరం:- మన శరీరాన్ని యవ్వనంలో ఎంతో మోహించి, శ్రద్దవహించి, ఎంతో సమయాన్ని వెచ్చించినా సమయానికి అది మనతో సహకరించదు.
మూడవభార్య మన అధికారం ఆడంబరం:-
మనల్ని మృత్యువులో వీడి వేరొకరికి సొంతమౌతాయి.
రెండవభార్య సంసారం సంతానం:-
ఎంతమనకి సహాయంచేసి సహకరించి సలహాలిచ్చినా వారు సాగనంపటానికే కాని సాంతం మనతోరారు. మొదటిభార్య మన ఆత్మ:- ఆడంబరాలకి, ఐశ్వర్యార్జనకు, పేరు ప్రతిష్ఠలకై మనం ఆత్మని ఎంత అశ్రద్ద చేసినా కడవరకు తోడుంటుంది.