ఛీర్స్ టు లైఫ్..

క్రిందికీ పైకీ తైతెక్కలాడే లైఫ్ గురించి చింతేల
ఎప్పుడు ఊగి ఊడేనో నీకెందుకు తెలియాలా
హృదయంపై భారమెందుకు ఎక్కువ వేయాలా
నిరాశని నిషాలో ముంచి రెండు పెగ్గులేయాల
ఆనందాన్ని నిమ్మసోడాలా కలిపి లాగించాలా!

పెగ్గుపై పెగ్గేసి అన్నీ మరచి చిందులేసెయ్యాల
రమ్మో బీరో విస్కీ లేకుంటే నాటుసారా తాగాల
నంజుకి చికెన్ జీడిపప్పు లేదా గుడాలు తినాల
కష్టాలన్నీ కాక్టేల్ మాదిరిగా కలిపికొట్టి లాగించాల
ఏదున్నా లేకున్నా ఉన్నదాంతో సర్దుకునుండాల!

నషాని నీతులు చెప్పి ఎక్కిన కిక్కును దించనేల
వీలైతే ఐస్ ముక్కలేసి మరో పెగ్ వేసుకోమనాల
ఎత్తిన సీసా ఖాళీచేసి గాలిలోతేలి ఖుషీతో ఊగాల
ఎప్పుడూ బుద్ధిసూక్తులు చెప్పక జల్సా చెయ్యాల
ఛీర్స్...చెప్పి మందుకొట్టి లైఫ్ నే మరచిపోవాలా!   

చంద్రుని పై...

ఛల్ ఛల్ చక్కనోడా నా మనసుకే నచ్చినోడా
నిన్ను నా చందమామ అని ముద్దుగా పిలిస్తే 
వ్యోమగాములపైనే వెర్రి వ్యామోహం అనుకోకు!

అంతరిక్షంతో అంతరాత్మను తులాభారమేసేటోడా
చంద్రుని ఉపరితల ఎత్తుపల్లాలు కొలవ వారెళితే
నా కొలతలు అడిగి ఇస్రోని ఇరకాటంలో పెట్టకు!

ప్రణయం కూడా ప్రయోగమనుకునే ప్రవరాఖ్యుడా
చల్లని చంద్రకంపాలు నీ వేడిని చల్లబరుస్తుంటే
ప్రయోజనాత్మకంగా ప్రయోగం సాగనీయి ఆపకు!   

సరససల్లాపాలకి సారధ్యం వహించిన వెర్రినావోడా
సాంకేతిక పరిజ్ఞానమే పెరిగి ఫలితం దక్కిందంటే
చంద్రునిపైనున్న అవాసాలు చెరిసగం కాదనకు!

అన్నింటా వినోదం విలాస వైవిధ్యాన్ని కోరేవాడా   
సవ్యముగా సాగి చంద్రయాన్-2 సక్సెస్ అయితే
నీ నా శోభనం చంద్రమండలంపైనే ఇప్పుడడగకు! 

తెలివైనోడు..

వలపు పేరిట నడుము వంపులు వత్తుతూ..
వినోదించి వజ్రాలవడ్డాణం చేయిస్తానంటివి నాడు
విశ్వమంతా చూసి విసుక్కుంటున్నావు నేడు!

మరులెన్నోగొల్పుతూ మునివేళ్ళు పిసికేస్తూ..
మాయమాటల్తో మాటీలు పెడతానంటివి నాడు
మదంతీరితే మాయతొలగె అంటున్నావు నేడు!

చిలిపి చేష్టలతో చిత్రంగా చెక్కిళ్ళు నొక్కుతూ..
చంకలు ఎగరేసి చంద్రహారం వేస్తానంటివి నాడు
చెప్పింది చేయలేనంటూ చతికిలబడ్డావు నేడు!

అందాన్ని తనివితీరా చూసి ఆహాని ఆరగిస్తూ..
అరవంకీలు రెండెరవేసి అక్కడ నొక్కితివి నాడు
ఆ అందాలే చూసి అలసితినంటున్నావు నేడు!

ముద్దొస్తున్నానంటూ ముద్దుపై ముద్దు పెడుతూ..
ముక్కెరే కాదు నత్తూ నా సొంతమేనంటివి నాడు
మోజు తీరినాక ముడుచుకు పడుకున్నావు నేడు!

ఏవంకన ఏఆభరణం అడుగుతానోనని ఆలోచిస్తూ..
అరవైకేజీల అసలు బంగారానికి తెలియలేదు నాడు
మతిలేనోడ్ని మన్నించు బంగారమంటున్నావు నేడు!

సర్దుబాటు..

ఎన్ని విధాల గాయమైందో కుంచెకు.. 
ప్రశాంతమైన తెల్లరంగూ నెత్తురోడుతుంది

కలం పాళీ కూడా అరిగి అలిసిందేమో..
పదాలు సగమై పరుషంగా మారుతున్నాయి

గాలి మాటలకు చెదిరిపోయిన బంధాలు..
అలలైన అప్యాయతకే మురిసి నర్తిస్తున్నాయ్

రంగు వెలసిన రక్తసంబంధాలు అవసరానికి..
అర్రులు చాచి అప్పుడప్పుడూ మిణుక్కన్నాయి

మనసు చచ్చిపోయిన క్షణాలు మాత్రం.. 
గుర్తుగా నిబ్బరాన్ని లేపి ధైర్యాన్ని రెచ్చగొట్టె

కాలానుగుణంగా మార్పుచేర్పులతో జీవితం.. 
తప్పని సరైన సర్దుబాట్లతో ముందుకు సాగుతుంది

అలసిన దేహం తనకంటూ ఆత్మీయతనడుగుతూ.. 
అది దొరకడమే మహాభాగ్యమని తనతో తానే మాట్లాడె!