భాధ్యతల్ని పరిపూర్ణం చేయబోవ నెత్తినెట్టుకున్నా కొరివిని
నీతిగా ఉన్నానంటూ సాక్ష్యమే చెప్పమన్నా సూర్యకాంతిని
ఉసిగొల్పేటి ఊహల్ని ఉరితీసేసి గెంతులేస్తున్నా స్వేఛ్ఛని!
ఎన్నో ఏళ్ళుగా ఊహల సాంగత్యంతో మలినపడ్డ మనసుని
శుభ్రంచేయ కంకణంకట్టుకుని విసర్జిస్తూనే ఉన్నా జ్ఞాపకాలని
రోజువిడిచి రోజు కన్నీటిధారలతో తుడిచి పరేస్తున్నా ఆశలని
ఇంకా ఏమూలనో నక్కి ఉందిగా ఆశ నేను చేసింది ఒప్పని!
జరిగేది జరుగక మానదని తెలిసీ అరిచా న్యాయం కావాలని
ఫలితం దక్కకున్నా ఆరినపెదాలతో గర్వంగా నవ్విన నిగర్విని
శూన్యం దద్దరిల్లేలా ప్రశ్నించా నేనుచేసిన తప్పేంటో చెప్పమని
కరిగే కరకు కాలానికేం తెలుసు అంతమొకటి తప్పకొస్తుందని!
శ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి పెట్టా ఆఖరి పందెమని
గుండెలో గుబులుదాచి ముసుగుతో కప్పా ముఖంపై దిగులుని
చచ్చిన ఆశయాలు ఎండినాకులుగా రాలి అటూఇటూ కొట్టుకుని
నాపై నాకున్న నమ్మకమే నిద్రలేచింది నేనే తప్పక గెలుస్తానని!