మనమధ్య..

నేనేమో చదవమని తెరచిన నిఘంటువుని
నువ్వేమో చదువురాని నిరక్ష్యరాసుడివి...
నీకూ నాకూ మధ్యన కనబడని ఖాళీస్థలం!
నేనేమో ప్రేమానుబంధాల ఊటలో ఊరితిని
నువ్వేమో బంధాలఊబిలో కూరుకుంటివి...
నీకూ నాకూ మధ్య నిస్సహాయతా నిశ్శబ్దం!
నేనేమో ఈవల ఒడ్డునున్న విరిగిన తెడ్డుని
నువ్వేమో ఆవల ఒడ్డున నావలో ఉంటివి...
నీకూ నాకూ మధ్యన ఒత్తిళ్ళు సుడిగుండం!
నేనేమో అనురాగ స్వార్థంగల అనైతిక బీటని
నువ్వేమో గ్లోబల్ తాపంతో రగిలే జ్వాలవి...
నీకూ నాకూ మధ్యనేమో నూలుపోగుబంధం!
నేనేమో తైలవర్ణం అద్దని తెల్లని కాన్వాసుని
నువ్వేమో వర్గవర్ణవిచక్షణ తెలిసిన జ్ఞానివి...
నీకూ నాకూ మధ్యలోన అల్పపీడన భీభత్సం!

ఎలా తెలుపను?

హృదయ కలంతో పూల రంగులు రంగరించి
రోజూ ఒకలేఖను వ్రాసి మది భావాలు తెలిపి
నన్ను వెంటాడుతున్న నీ విధానం తెలుపనా!
కలల నిండుగా నిన్నే నింపుకుని నిదురించి
కనులు తెరచి నీ జ్ఞాపకాలతో నేను మేల్కుని
ఆలోచన చిక్కుముడులు విప్పానని చెప్పనా!
మదికొలను తెరచి విప్పారిన కలువను పిలచి
నీ కలల గీతాంజలిని నేనని అన్నప్పుడు పలికే
శ్వాస సంగీతాన్ని గుండెసవ్వడుల వీణమీటనా!
అటుఇటు ఏదిక్కు పయనించినా నిన్ను తలచి
గుంపులో ఒంటరినౌతాను నిన్ను గుర్తుచేసుకుని
ఇలా ఎన్ని జన్మలు ఎత్తాలని నిన్ను అడగనా!
నాలుగుదిక్కులు వెళ్ళినా నీ రూపమే అగుపించి
దూరము అయినకొద్దీ మరింత దగ్గరౌతున్నావని
గుండెలో కొలువైఉన్న నీరూపం చీల్చి చూపనా!

నేనింతే..

అన్నీ అడ్డ దిడ్డంగా చేసేస్తుంటాను.....నేనింతే!
ఎందులో అయినా ప్రత్యేకతను కోరుకుంటాను

మగవారు మాత్రమే వెంటపడి సైట్ కొట్టనేలని
నేనేవారి వెంటపడి వేధించి ప్రేమించేస్తుంటాను

బహుమతులు వారు మాత్రం ఎందుకివ్వాలని
నాకేం తక్కువ నాకు తోచింది ఇచ్చేస్తుంటాను

మగవారు మాత్రమే పొగిడి పైకెత్తివేస్తే ఎలాగని
నేనూ వారిని పిచ్చ పిచ్చగా పొగిడేస్తుంటాను

వాడే నన్ను కూర్చోబెట్టుకుని తిప్పాల ఏంటని
నేనుకూడా వెనుక కూర్చోమని తిప్పేస్తుంటాను

వస్త్రధారణలో మగా-ఆడా తేడా ఏమున్నదిలేని
పైన చొక్కా క్రింద చీరా కట్టి చిందులేస్తుంటాను

అన్నీ చేయ గలుగుతున్నాను కానీ మగాడిని
మనిషినీ మానభంగం చేయలేక పోతున్నాను!


ఇద్దరమొకటే..


వలపుసెగ రగిలించు ఉప్పొంగుతాను
మతలబు చేయకు మర్మం ఎరుగను 

లిప్ స్టిక్ చెరిగిపోనియ్యి సంతోషిస్తాను
కంటికాటుక చెరగనీకు కలతపడతాను

బిగికౌగిట్లో బంధించు మురిసిపోతాను
ఊపిరాగనీయకు ఊహలున్న దానను

మది బహుకరించు రుణముంచుకోను
అంతకు మించిన అనురాగమందిస్తాను

నమ్మించి మోసంచేయకు నువ్వే నేను
అడిగి చూడు నవ్వుతూ ప్రాణమిస్తాను

వదిలి వెళ్ళిపోకు అన్నీ నీవనుకున్నాను
అలాగని అలుసుచేస్తే బాంబేసి లేపేస్తాను



కాలినబూడిద

కలలా కరిగి కాలిపోతున్న దీపపు కాంతిలో
ఎన్నిమార్లని వెలిగించుకోను ఆశాజ్యోతులను
అనుమతి ఇవ్వకుండానే వచ్చి వెళ్ళిన నీతో
ఎన్నని కుంటి సాకులు చెప్పి రప్పించుకోను!
ఏళ్ళ తరబడి కట్టిన గట్టి జ్ఞాపకాల గోడలలో
ఎంతని వెతకను నమ్మకపు ప్రేమసాంద్రతను
అనురాగంతో కట్టేయకుండా ఆపలేను ఆజ్ఞతో
కుమిలి కమిలిన పువ్వు ఏం పరిమళించును!
గుండెనున్నా గుండెపై సేదతీర ఎన్నిహద్దులో
కన్నపేగు కనుసైగ విరిచేసె వలపు వీణతీగను
మూడుముళ్ళు విడవు మిణుగురు మెరుపుతో
పెళ్ళి ముందు దిగదుడుపే ఏ ప్రణయమైనను!
వ్రాసుకున్న ప్రేమ లేఖలు తడిసేను చెమటలో
వేడెక్కిన శరీరకామం అస్థిరబంధాన్ని కాల్చేను
కాగితంపై తమకంలో చేసిన చెల్లని సంతకాలతో
ఒకరంటే ఒకరికున్న కాంక్ష కనుమరుగవ్వును!