రంగురుచివాసన లేకున్నా బ్రతకడానికవసరమని
ప్రాణవాయువులా నాతో ఉన్నంత కాలము ఉండి
దాని సంకేతంలా శూన్యంలో "O"చుట్టి వెళ్ళిపోకు!
నైట్రోజన్ మొక్కలకి అవసరమైనదీ మూలకమని
కృత్రిమ గర్భోత్పత్తిలో ద్రవ నత్రజని పాత్ర ఉందని
స్పృహ తిరిగితెప్పించే అమోనియాకు నేస్తంవంటిది
నవ్వించే గ్యాస్ వోలే నమ్మించి నట్టేటిలోముంచకు!
కార్బన్ డై ఆక్సైడ్ వృక్షాలు వదిలేసిన వాయువని
నీట్లో కలిస్తే సోడా,పదార్ధం పులిస్తే పైకొచ్చే గ్యాసని
మండుతున్న మంటలు ఆర్పడానికి ఉపయోగపడి
మనసున మంటరేపి గాలికంటే బరువై దిగజారిపోకు!
హైడ్రోజన్ గాలిలోన మండి ఉదకఊటను ఇస్తుందని
గాలికంటే అత్యంత తేలికైన వాయువుపేరు ఉదజని
అధిక దహనోష్ణతని కలిగిన పారిశ్రామిక ఇంధనమది
అన్నీ నీవని ఆశగా ఉంటే అంతరిక్షంలోకి ఎగిరిపోకు!