కిక్ కసి ..

కోక్ పెప్సీ సోడాతో కాక రా కొట్టాలన్నంత కసి..
గుండెని కోసీ మిక్సీలో బాగామెత్తగా రుబ్బి తీసి
ముద్దని గుప్పెట్లో పట్టుకుని క్రిందాపైకీ ఎగురవేసి
బంతితో ఆడినట్లు ఆటాడి విసుగుపుడితే విసిరేసి
ఏమైందని అమాయకంగా అడిగితే రగిలినట్లు కసి!
పద్మార్పిత బొమ్మలే సెక్సీ రాతల్లో కనబడని కసి..
ఫోటోలు చూసి భారంగా నిట్టూర్పు విడిచేసి అలసి
ఎవరికి వారే అదీఇదనీ ఇష్టమొచ్చినట్లు ఊహించేసి
రమ్మూ బీరు వైన్ కలిపి కొట్టినట్లు రచ్చరచ్చ చేసి
నన్ను చూస్తేనే కానీ తీరదనుకోవాలా మీలోని కసి!
కాక్ టైల్లా అన్నీ కలిపి ఫుల్గా కొడితే తీరునేమో కసి..
కల్లూసారాయే కాదు ఆల్కాహాల్ ఏదైనా మత్తని తెలిసి
ఎందుకో అనిపిస్తుంది అన్నీకలిపి త్రాగేసి తాకాలి రోదసి
నక్షత్రాలను బుట్టలోవేసి చంద్రుడితో చిందేయాలి కలిసి
ఇదీ గత కొన్ని రోజులుగా నాలో చెలరేగుతున్న కసి!
కల్లుకొచ్చి ముంత దాచినట్లు కాక అనిపించింది చెప్పేస్తి
మీకు ఏం రాయాలి అనిపిస్తే అదిరాసి తీర్చుకోండి కసి!

నీ బాకీ

కోరిక తీర్చినందుకు తిరుగు బహుమతి బాకీ
కొంతకాలం ఆగు తప్పకుండా ముట్టచెబుతాను
వాగ్దానం చేయలేదన్న వంకతో ఇవ్వననుకోకు
నీకు బహుమతి తిరిగివ్వకుండా ఊపిరి వీడను

కోరరాని కోరికలు కోరే నేనో పంజరంలో ఏకాకీ
కాలాన్ని నీతోటి గడపాలన్న ఆశతో బ్రతికేస్తాను
ప్రేమలోముంచి ఉక్కిరిబిక్కిరి చేసాను శపించకు
నీ ఋణం తీర్చుకోకుండా నేను ఎటూ పోలేను

కోర్కెలతో తడారిన పెదాల్లో ఏముంటుంది చలాకీ
కాలంతోపాటు నేను కలిసి కధలు అల్లుకుంటాను
పనికిరాని వేదాంతం వల్లించి విసిగించా తిట్టుకోకు
నీకు పరిమళమివ్వని పువ్వులేం బహూకరించను

కోరికోరుకున్న బహుమతి నీకందుకే అంత గిరాకీ
కాలానికి ఎదురీది నా తాహతుకుమించిందే ఇస్తాను
ఉబుసిపోక ఊరించేటి ఊకదంపుడు ఊసులనుకోకు
నీకే నిన్నిచ్చి(నీవే నాప్రాణం) బాకీ తీర్చుకుంటాను

నిష్ప్రయోజనం

కాంతిపుంజాలు విప్పారి వెలిగి ఏం ఉపయోగం
ఎగసిపడే ఆశలే నల్లనిమసై ముఖాన్ని అంటితే

వలపుని వాయిదాపై తీరుస్తానంటే ఏం న్యాయం
ముక్కలైన మనసు ప్రతిస్పందించలేక వాలిపోతే

విరిగిన గోడనానుకుని ఆసరాని ఏం సమంజసం
పరువపు పచ్చి ఇసుకతో కట్టిన గూళ్ళే కూలితే

భీతిల్లి బిక్కుమంటూ బ్రతుకీడ్చి ఏం ప్రయోజనం
జీవితమే తెలియక సగానికిపైగా కాలిబూడిదైపోతే

నిర్మానుష్య రేయి ప్రశాంతంగా ఉండి ఏం లాభం
కరిగి క్షీణించిన రేయిలో అకస్మాత్తుగా అంతమైతే..

గట్టికౌగిలి...

కావాలీ కావాలీ నాకొక కౌగిలింత కావాలీ
పట్టుకుంటే వీడిపోలేని కౌగిలింత కావాలి!

పరిచయాల పెనవేతలో చేతులు కలవాలీ
మనసులు నగ్నమై రాసలీలగాది సాగాలి!

అల్లాటపా కౌగిలింతలకి భిన్నంగా ఉండాలీ
వదిలేయ్ అంటుంటే మరింత దగ్గరవ్వాలి!

రెండు చేతుల నడుమ పూర్తిగా ఒదగాలీ
జిగురులా ఇద్దరం ఒకటై అతుక్కుపోవాలి!

బిగికౌగిట అతుక్కున్న బంక బంధమవ్వాలీ
అలసిన తనువులు కనులతో ఊసులాడాలి!

మాటలమాల మౌనంతో మూతితిప్పుకోవాలీ
గాలైనా చొరబడనంత గట్టిగా వాటేసుకోవాలి!

స్పర్శచే స్వేదమే సుమసౌరభాలు వెదజల్లాలీ
చిత్తడిచిత్తడైన ప్రేమ పురివిప్పి నాట్యమాడాలి!
మమతలమెలిలో మన్వంతరము కొనసాగాలీ
అలా నా ఊపిరి తన ఎదపై విడిచేసిపోవాలి!