ఆ వెలుగులో నా బ్రతుకునిచూస్తూ గతించాలి అనుకున్నా!
జీవితంలోకి ఇంద్రధనస్సులా వచ్చి వెళ్ళిపోతావని తెలిసుంటే
కామకోరికలకే ప్రాధాన్యతనిచ్చి మనసునులిమి కప్పెట్టేదాన్ని!
ఎవరు ఎవర్ని చూసి ఎందుకు మోహించారోకదాని తెలిసిపోతే
వాటినే పలుమార్లు ప్రకటించి దూరమవ్వడానికి దారి ఇస్తున్నా!
నటించే బంధానికున్న బలం నిర్మలమైన ప్రేమకు లేదనంటే
అంతర్గత ఆలోచనల్ని ఇంత నగ్నంగా చెప్పుకోక పోయేదాన్ని!
వెదజల్లేటి సువాసనలు క్షీణించనంత వరకే కౌగిళ్ళని చెబితే
మూలుగుతున్న వాంఛలపై వస్త్రంవేసి కర్మకాండ చేసేదాన్ని!
చల్లని మేనుతో ఎడబాటు ఎదని వెచ్చని కన్నీరు తడిపేస్తుంటే
విశాలహృదయాన్ని వేశ్యనై ముక్కలు చేసి పంచిపెడుతున్నా!
పొరపాట్లు తప్పొప్పుల మధ్య తేడాలను చర్చించుకుంటూపోతే
జీవితకాలం సరిపోదని తెలుసుకుని మెల్లగా తప్పుకుంటున్నా!