అనుబంధాలు ఆప్యాయతలూ అన్నీ అంగట్లో అమ్ముడయ్యేవే ప్రేమాభిమానాలు కూడా అవసరానికి తగ్గట్లుగా మారిపోయేవే
అన్నీ ఏదోక బంధంలో బిగుసుకుని ఆపై సర్దుకునిపోతాయిలే!
పరిచయాలు ప్రమాణాలూ కూడా సంతలో లభించే సరుకులే
సాగినంతకాలం తియ్యని పళ్ళు లేకుంటే పుల్లని ద్రాక్షపళ్ళులే
అన్నీ ఎలాగో చివర్న అవకాశానుసారం రూపాంతరం చెందేవే!
చుట్టాలు వావివరుసలూ ఎవరికనుగుణంగా వారుపెట్టుకున్నవే
వీలున్నంతా వాడేసుకుని లాభనష్టాలకు అమ్ముడైపోతున్నవే
అన్నీ ఏదోక వంకతో డొంకదారిలో నడిచే వ్యాపారలావాదేవీలే!
ప్రేమలు పెళ్ళిల్లూ కూడా ఒకరకమైన లాభసాటి వ్యాపారమేలే
కతికితే అతికి లేదనుకుంటే మరొకరికి అమ్ముడయ్యే వస్తువులే
అన్నీ ఏదోవిధంగా నాసిరకానికి నగీషీలద్ది అమ్ముడైపోతున్నవే!
పుట్టుకలు చావడాలూ రెండూ తధ్యమేనని అందరికీ తెలిసిందే
అయినా కూడా అనిశ్చల నకిలీసంతలో సొమ్ము సంపాదించేవే
అన్నీ ఏదోక బ్రతుకు బజారులో బేరసారం చేసే చివరిమజిలీలే!