తుదిధ్యాస..

తలపు తరంగాల్లో తడిసిన రెక్కలు
కూసింత సూర్యరశ్మిని కావాలనడగ
నీలి ఆకాశం కళ్ళనిండా నీరు నింపె
మొహమాటపు మనసు మాట్లాడలేక
తడిరెక్కలతో ఎగురలేక వణకి అలసె!

దిక్కుతోచని నిస్సహాయపు గాలులు
నిర్జనరహదారిపై సిగ్గునీడల్ని శపించగ
చేసిన పాపం ఏంటో చెప్పని ప్రశ్నించె
ఉదాసీనపు ఊపిరి శ్వాస పీల్చుకోలేక
పిరికిని ధైర్యపు కిటికీ నుండి తరిమేసె!

ఆవేశంతో మండి భగ్గుమన్న గుండెలు
మంచుపర్వతాల్లో సూర్యుడు అస్తమించగ
ఉప్పకన్నీటితో గాయాలు మరింతమండె
సుదీర్ఘ పయనం ఎవ్వరి సహకారంలేక
గాలి వీచిన వైపు ఎగిరిపోయి ముగిసె!

కాగితం

కాగితాలతో కాపురాలు నిలచి కూలే కాలంలో
కళ్యాణవైభోగమంటూ కంచిపట్టు చీరలు నగలని
ఖరీదైన కాగితాల్ని ఖర్చు చేయడం ఎందుకు?

కాగితాలే మనిషి చావు పుట్టుకల్ని నిర్ధారిస్తుంటే
పుట్టిన ప్రాణి బ్రతికి చావడానికి కాగితం కావలిస్తే
చచ్చిన మనిషి కనబడి మాత్రం చేసేది ఏంటి?

కాగితాలకూ దస్తావేదులకూ విలువ ఉన్నప్పుడు
మనిషికి మానవతా విలువల నీతులు భోదించి
భాంధవ్య బంధాల బంకను అంటించడం దేనికి?

కాగితాలపై రాసుకున్న రాతలే కావలసినవి చేస్తే
కార్యాచరణలను కట్టుబాట్లనూ బలవంతంగా కక్కి
అందులోనే పడిపొర్లితే దక్కేటి ఆస్తిపాస్తులు ఎన్ని?

కాగితాలకే అన్ని రంగాల్లోనూ ఆధిక్యత ఉన్నట్లైతే
భూమేకాదు బూడిద సైతం కాగితానికి గులామవ్వ
దర్జాగా వెట్టిచాకిరీ చేస్తున్న బ్రతుకులకి అర్థమేంటి?

అన్నీ నీవంటి..

నువ్వే నా ఆశ నిరాశ కూడా నీవల్లే కదా
నువ్వే నా ఆకలి అది తీర్చేది నువ్వే కదా
నువ్వే నా నిద్ర నీగుండే నాతలదిండు కదా
అయినా మంచం కంచం మాత్రం వేరు కదా

నువ్వే నాసుఖం దుఃఖం కూడా నీతోటే కదా
నువ్వే నా రాగంతాళంపల్లవి అయ్యావు కదా
నువ్వే ఊపిరని నిశ్వాసలో నిన్ను వీడ కదా
అయినా నువ్వు అక్కడా నేను ఇక్కడ కదా

నువ్వే నా కవనం అక్షరరూపమూ నీవే కదా
నువ్వే నా ఆదీ అంతమూ నీతో ఉంటా కదా
నువ్వే నా చైతన్య నాంది ప్రేమపునాదివి కదా
అయినా కంటికి ఎదురుగా ఉండవెందుకో కదా

నువ్వే నాఅస్త్రం అంతకు మించి అవసరం కదా
నువ్వే నా ఆలోచన ఆసరా కూడా నువ్వే కదా
నువ్వే భయభ్రాంతుల్ని తరిమే తాయత్తువి కదా
అయినా ఉండీ లేనట్టి దేవుడు దెయ్యానివి కదా

ఏముద్ధరించా..

వైద్యురాలినై సేవ చేయాలని తడి ఇసుకలో
చూపుడువేలుని ఆశల సిరాలో ముంచి రాసా
చదవడం కాదు చేయాల్సిన ప్రయత్నం చేసా
ఆ అదృష్టం అలలా వచ్చి కొట్టుకుపోయింది!

న్యాయవాదినై వాదించాలని మండు ఎండలో
చట్టాల గురించి చెట్టు నీడలోన చదివి అలసా
చెప్పులు అరిగేలా తిరిగి గట్టి ప్రయత్నం చేసా
ఆ ఆశ కూడా ఎండకు ఆవిరై చెమటకార్చింది! 

ఇంజనీరునై ఏ రంగాన్నైనా గెలవాలని వర్షంలో
చదివి తడిసి చిరిగిన పుస్తకాల్ని విసిరి పడేసా
పగబట్టిన పేజీల్ని బ్రతిమిలాడే ప్రయత్నం చేసా
ఆ జ్ఞానం అక్కరకురాని ఇంద్రధనస్సై పోయింది!

పైలట్ నై విమానం నడిపి ఎగరాలి ఆకాశంలో
ఆలోచన వచ్చిందే తడవుగా ధరకాస్తు చేసేసా
ఒడ్డూ పొడవు తెలివితో చివరి ప్రయత్నం చేసా
ఆ పనికీ పైసలకే ఫైలెట్ పాఠాలని తెలిసింది!

ఆఫీసర్ అయితే ఒకప్రత్యేక గుర్తింపు అందరిలో
అలాగని అహర్నిశా పుస్తకం చేతపట్టి చదివేసా
చదివింది చాలని పెళ్ళిచేస్తే అత్తారింట అడుగేసా
ఇంకేంటి కలలు కరిగినా జీవితమైతే సాగుతుంది!

మోజురోగం

తడవ తడవకూ తుమ్మినప్పుడంతా తలపుల్లోకొచ్చి
తనువు అంతా జ్ఞాపకాలతో తడిమి తడిమి తడిచేసి
తలవకుండా ఉండంటావు ఏందోయ్ నీ తస్సదియ్యా!

ఛీది ఛీదీ చిత్రంగా చీరకొంగు అంతా తడిసె చీమిడొచ్చి
జలుబుతో ముక్కూ చెంపలూ ఎర్రబడ్డ ముఖం చూసి
రొంపేదో పెద్దజబ్బని జారుకుంటివి కదారా నీ జిమ్మడా!

ఖళ్ళ్ ఖళ్ళుమంటూ దగ్గి గుండెని అరచేత పట్టుకొచ్చి
తుంపర్లకే తుస్సంటావని నోరు బట్టతో మూస్తి దగ్గేసి
దగ్గితేనే దరికి చేరనోడివి దాంపత్యం ఏమి చేస్తావయ్యా!

గబ గబా రెండుగుటకల నీళ్ళుతాగితే పొలమారె హఛ్చీ
నీవు గుర్తొచ్చి ఒళ్ళు వేడెక్క చన్నీట తడిస్తి మునకేసి
ముట్టిచూసి మునగక మూలుగుతావే ముదనష్టపోడా!

నీవు దరిలేక ఆకలిదప్పిక వేయక వేచి చూసి నిట్టూర్చి
పగలూ రాత్రీ కానరాక నిరీక్షిస్తున్నా కనులు కాయకాసి
వంక చెప్పి బద్మాష్ లెక్కలు వేయక బేగిరం రావయ్యా!