లింకేంటో!

నీకు నాకూ మధ్య ఉన్న లింకు ఏమిటో
నీకేం తెలియదు నాకేమో అంతు చిక్కదు

మతంలేని మమతకి అడ్డంకులు ఎందుకు
అలవికాని ప్రేమకోరుతూ ఆరాటం ఆగదు

ప్రేమించి అనురాగం అడుక్కోడం ఏమిటో
నాలాంటి వెర్రిది నీకు వెతికినా దొరకదు

ప్రత్యేకత కోరుతూ పెనుగులాట ఎందుకో
నాది కాదని తెలిసీ అలమటించ కూడదు

అస్థిరంలో స్థిరత్వాన్ని కోరుకోడం ఏమిటో
నూలుపోగుతో ఏ బంధమూ ముడిపడదు

లేనిరాని హక్కు కోసం పోరాటం ఎందుకో
ఏదేమైనా నువ్వు కావాలన్న ఆశ చావదు

అర్పిత చెప్పే ఈ సూక్తులు ఎవరికై ఏమిటో
చెప్పింది చదవాలే కానీ చరిత్ర అడక్కూడదు

స్వీయ మదింపు..

తాగుబోతుతో పదినిముషాలు తర్కించి చూడు
ఒత్తిడిలేని ఒయాసిస్సు జీవితం అనుకుంటావు
భీమాఏజెంట్ తో భావాలు పంచుకుని చూడు
ఊపిరివీడి చచ్చిపోతేనే మంచిదని భావించేవు
రాజకీయ నాయకుడి పక్కన కూలబడి చూడు
నీవు చదివిన చదువులు పనికిరావని అంటావు
వ్యాపారస్తులతో లావాదేవీలు మాట్లాడి చూడు
సంపాదించినదంతా చాలా తక్కువని తలచేవు
కర్షకుడు కార్మికుడితో కాసేపు కబుర్లాడి చూడు
నీ శ్రమకు మించిన ఫలం దక్కెనని మురిసేవు
సాధువు సన్యాసి పూజారిని సంప్రదించి చూడు
ఉన్నది ఊడ్చి దానంచేసి తపస్సు చేయబూనేవు
సైనికుడితో సానుకూలంగా సంభాషించి చూడు
మీరు చేసే సేవ త్యాగాలన్నీ చిన్నవి అయిపోవు
పండిత శాస్త్రవేత్తల ప్రసంగాల్లో పాల్గొని చూడు
నీ అజ్ఞానాన్ని నీవే స్వయంగా కొలుచుకోగలవు
భార్యతో పిచ్చాపాటి పదినిముషాలు పలికిచూడు
భువిపై పనికిరాని వ్యక్తినని నీకు నువ్వనుకునేవు

ఎవరైనా!?

నాశనమవ్వడం అంటే నాకు భలే సరదా
అవ్వకుండా ఆపగలరా నన్ను ఎవరైనా!?
తన ప్రేమ నావలోన మునగడం నాకిష్టం
సమాధానపరచి పైకి తీయరా ఎవరైనా!?
చుక్కలు లెక్కించి చంద్రుడ్ని ఎంచుకున్నా
చెదిరిపోయే నన్ను సరిచేయరా ఎవరైనా!?
ఏవో తర్జనబర్జన చర్చలే జరిగి ఉంటాయి
విడివడే మనసుల్ని కలపగలరా ఎవరైనా!?
శీతాకాల సాయంత్రం పొగేదో కమ్మేసింది
మసగబారిన అద్దాన్ని తుడవరా ఎవరైనా!?
రేయంతా గాలి నన్ను గేలి చేస్తూనే ఉంది
కంటికి కునుకుని బదులీయరా ఎవరైనా!?
పద్మార్పిత పందెం ఖచ్చితంగా ఓడుతుంది
మూసిన కళ్ళని తెరిపించగలరా ఎవరైనా!?

తారతమ్యం..

ఎంత అలౌకికమైన ప్రేమనో ఇది కదా
భౌతిక కొలమాన స్థాయిలో కొలుస్తారు
నువ్వు అతడిలో స్నేహితుడిని వెతికావు
అతడేమో నిన్ను అతిగా ప్రేమించేసాడు
నువ్వేమో ఆత్మను అప్పగించేయబోతావు
అతడేమో నీ దేహము పై దాడి చేస్తాడు
నువ్వేమో పూర్తిగా సమర్పించుకుంటావు
అతడేమో నిన్ను ఆక్రమించేసుకుంటాడు
నువ్వేమో మనసున "రాధ"గా ఉన్నావు
అతడు నిన్ను "రుక్మిణి"లా హత్తుకోలేడు
నువ్వేమో శీలంపోయిన స్త్రీగా మిగిలావు
అతడేమో గౌరవప్రదమైన మగాడౌతాడు
నువ్వు రాధవు ఎన్నటికీ రుక్మిణి కాలేవు
యుగమేదైనా నువ్వు మాత్రం మహిళవు
అతడు పురుషుడు కృష్టుడిగానే ఉంటాడు

విదేశీ వ్యామోహం

నాదేశం నాకిష్టమని మనసులో అనుకుంటూనే
అమెరికా వెళ్ళి ఆడంబరంగా చిందులు వేస్తారు
మాతృభాష మాట్లడనోళ్ళు మృగాలని చెబుతూనే
ఆంగ్లం మాట్లాడ్డానికి అష్టకష్టాలు పడుతుంటారు!

పరాయిదేశం పాచిపోయిన పాయసం అంటూనే
పారిస్ వీధిల్లో పనిచేసి ప్రగల్భాలు పలుకుతారు
ప్రతీ పరాయి పనీ ప్యాషనని ఫాలో అవుతూనే
అక్కడే పుట్టిపెరిగినట్లు ఫోజులు కొడుతుంటారు!

సంప్రదాయ సంస్కృతులు వ్యర్థమని వద్దనుకునే
వియత్నాం వారివైనా విదేశమని వత్తాసుపలికేరు
ఏం చాదస్తమో ఏమోనంటూ ఇక్కడ వెక్కిరిస్తూనే
అక్కడకెళ్ళి ఏపండుగా వదలక జరుపుకుంటారు!

గుండెలనిండా మాతృభాషని ఊపిరిలా పీలుస్తూనే
దుబాయికైనా వెళ్ళిపోవాలని కలలు కనేస్తుంటారు
కాలేదనుకున్నప్పుడు ఆత్మవంచన చేసుకుంటూనే
వీలుచూసుకుని విదేశాలకు విమానంలో వెళతారు!

మనసులోన ఒకటనుకుని వేరొకటి మాట్లాడేస్తూనే
రష్యా నుండి రంగూన్ దాకా కూపీలు లాగుతారు
అవాంతర ఆటంకాలని అయ్యేదాకా చెప్పకుండానే
డాలర్ల కోసం భావోద్వేగాలని బొందలో పెట్టిపోతారు!