ఇలా జరిగితే

అర్థరాత్రి అయ్యిందని తెలియజెప్పే కారుచీకట్లో
నక్షత్రాల వెలుతురులో ఎన్నెన్నోసార్లు నిద్రలేచి
నుదుట పట్టిన చెమట తుడుచుకుని గుటవేసి
కంటిపాపను కసురుకుని కునుకు వేయమంటే
నిద్ర అత్యవసర సమావేశమై సమీకరించింది!!

అలా ఎప్పుడో వచ్చి వదిలి వెళ్ళిన జ్ఞాపకాలే
నిర్వీక్షణంగా మారి కూడా ఎంతగానో వేధించి
సమాధానం దొరకని సందేహాలుగా ఆరాలుతీసి
అవి ఆనవాళ్ళైనా మిగలని సంతోష శకలాలంటే
నమ్మి నిండుగ నవ్వడం దౌర్భాగ్యమౌతుంది!!

అంతర్లీన సతతహరితారణ్యానికి నిప్పెట్టినప్పుడే
మనసుతోపాటు ఒళ్ళూ చిచ్చుతో కాలిమండినా
విరుచుకుపడక మ్రానులా నిలబడి చిగురువేసి
మంటల ముందు వెర్రి తాండవమాడి నర్తిస్తుంటే
కాలమే కళ్ళుతిరిగి బైర్లుకమ్మి మూర్చపోయింది!! 


ఏదోక ముల్లు..

నేను గడియారంలో సెకండుల ముల్లును అవుతాను
గంటముల్లై నువ్వు తిరుగు సమయానుసారం కలుద్దాం
గోడగడియార జంటముల్లులై కౌగిలించుకుని విడిపోతూ
బ్యాటరీ అయ్యేంతవరకూ కాలంలా కదిలి కాపురంచేద్దాం!
నీవు ఒక్కడుగు వేస్తే అరవై అడుగులు నేవేసి వస్తాను
వెనకెనుకపడి వ్యామోహపు వెంపర్లాటలో హద్దుదాటేద్దాం
అలా అన్నింటినీ ఆస్వాదిస్తూ ఒకరినొకరు ముద్దాడుతూ
ప్రేమ పలకరింపులతో పరుపూ పానుపులమై పవళిద్దాం!
నువ్వు పెద్దముల్లు సెకన్లముల్లున్నా లేకున్నా ఒకటేను
అందుకే నిముషాల గంటలముల్లుల మధ్య ముడివేద్దాం
అప్పుడప్పుడూ కలిసే బంధమేలని నన్ను నిమురుతూ
ఆప్యాయంగా హత్తుకోగానే రెండు ఎదలకు పెళ్ళి చేద్దాం!
నాతో నువ్వుంటే చిన్నాపెద్ద ముల్లేదైనా సర్దుకుంటాను
క్షణక్షణం సాగుతూ కాలాన్ని నిముషాలుగా మార్చేద్దాం
కలిసినప్పుడు అలసి కలసిరాని కాలానికి ఎదురీదుతూ
విలువదేముంది ఉన్నంత కాలం ఒకరిలో ఒకరై జీవిద్దాం!

ఛల్..ఛల్..చలించు!

పద...పదాలను పంచేద్రియాలుగా మార్చి
పరిపూర్ణమైన అద్భుత ప్రేమకావ్యం రాద్దాం!

విను...విశ్వరహస్యాలకి విజ్ఞానం జోడించి
వినసొంపైన వేదాలను విలాసంగా అందిద్దాం!

చెప్పు...చెడుఛాయలు చిరునామాని కాల్చి
చేతులు కలిపి చెంగుచెంగని గెంతులు వేద్దాం!

కను...కనులతో కాంచిన వాస్తవాలు లిఖించి
కలలని సిరాగాచేసి చరిత్రను తిరిగి రాసేద్దాం!

లెగు...లేచి సత్యానికి పహారై సహారా ఇచ్చి
లెస్సపలుకుల గ్రంధానికి నిర్వచనంగా నిలుద్దాం!

రారా...రారమ్మని పిలవగానే ఎదురుగ నిలచి
రాసే రాతలే కాదు చేతలూ నిజమని నిరూపిద్దాం!

కొత్తఊపిరి

కొన్ని పగలు ఏదో ఒక వ్యాపకంతో గడిపి
మెదడును మొద్దుబార్చి కాలాన్ని సాగదీసి
అలసిన శరీరాన్ని అప్పుడైనా సేద తీర్చక
ఎన్నో రాత్రులను చిరాగ్గా తరిమేస్తుంటాను!
కొన్ని ఆలోచనలకు భావాలతో సంధి కూర్చి
మనసును మౌనంగా ఉండమని మాయచేసి
అలిగి అసహ్యించుకున్న నాతోనేను మాట్లాడక
ఎన్నో జవాబులేని ప్రశ్నలకు మూలమౌతాను!
కొన్ని కోరికలకు జరుగుబాటుతో జతకమ్మని
సర్దుబాట్లతో ఆశలకి ముడికట్టి సంభోగింపజేసి
అసలు గర్భమే దాల్చని ఆశయాన్ని కదపక
ఎన్నో అసత్య బాసలతో నీడని సంస్కరిస్తాను!
కొన్ని రహస్య భిన్న రాచకార్యాలతో రంకుచేర్చి
గుట్టుగున్న గుండెకు మసిపూసి మాయ చేసి
అంతరంగాన్ని అడ్డంగానరికి ప్రతిబింబం చూడక
ఎన్నో ఉదయాలకు ఊహలద్ది ఊపిరి పోస్తాను!

చెప్పాలని ఉంది


మనము ఎవ్వరమో ఏమో
ఎక్కడ నుండొచ్చి కలిసామో
అనుకోని వింత మార్గములో
మనిద్దరికీ ఇలా రాసి ఉంది!

ఎన్నెన్నో కొత్త ఆలోచనలు
ఆశలకు ఎన్నో అవరోధాలు
నిర్ణయాల తాటిపై నడవలేక
హృదయం మౌనంగా ఉంది!

నువ్వు నేను ఎవ్వరో ఏమో
ఎందుకని మనం కలిసామో
పొందలేని వాటిపై మోజెందుకో
దక్కదనేమో ఆరాటంగా ఉంది!

ఏవేవో కలలబుడగల బాసలు
ఎద లోయలో అలజడి సెగలు
అభిమత అభినయం చేయలేక
మనసు మొత్తం భారంగా ఉంది!

లైంగిక దాస్యం

ఎంత కుళ్ళు దాగి ఉందో లోలోపల..
ప్రాణం పోయేలా ఉంది ఈదుర్గంధానికి
ఉక్కిరిబిక్కిరై అల్లాడుతుంది ఈ ఊపిరి
అక్కడ నుండి పారిపోవాలని ప్రయాస!

ఒళ్ళంతా పొగరు ఉంది పొగచూరులా..
గుప్పిట్లో పెట్టుకోవాలేమో ఊపిరితిత్తుల్ని
గింజుకుని బయటపడినా కళ్ళు మంటే
ఆకలిమంటలే ఇక్కడ ఉఛ్వాస నిస్వాస!

పైత్యం ఒళ్ళంతా కప్పె పచ్చటిపైరులా..
మీద వాలి గట్టిగా కొరికిన గాట్లెన్నో కదా
ఎందరు పట్టుకు పిసికిన సలపరాలో ఇవి
అయినా బ్రతక్క తప్పని ఆశ అడియాస!

ఒలికిన చమురుమడ్డిలో తేలేటి చేపలా..
అంతర్ఘోష ధ్వనితో దడపుట్టి వణికే నిశ్శబ్దం
బాధ తాళలేక కీచుగోళ్ళరక్కుల గగుర్పాటు
భరించలేక ఫెఢేలని ప్రేలక చావుపెట్టే నస!

దేవదాసి జోగిని మాతంగి బసివి దేవుడమ్మ..
పేరేదైనా దేవుడి పెళ్ళాం దెయ్యాలతో కాపురం
ఊరుమ్మడి వస్తువై నిత్యం సుమంగళి శవమై
ఆడమాలమాదిగ పుట్టుకొద్దని చేసుకునే బాస!

తిండి-త్రాగుడు


ధనియాలు దాల్చినచెక్క గసాలు మిరియాలు దంచి కొట్టినా దండుకోరా
బాస్మతీ బియ్యంతో మనసుపెట్టి మటన్ బిరియానీ చేసినాను తినిపోరా
జీలకర్ర షాజీరా జీడిపప్పు లవంగా యాలకులు రోట్లో వేసి రుబ్బినారా
లేత మేకపిల్ల మాంసంలో నెయ్యి గోధుమనూకేసి హలీం చేసినా రారా!

అల్లం వెల్లుల్లి ముద్ద మేక మెదడుకు పట్టించి వేపి డబ్బాలో దాస్తినిరా
పొటేలుకాళ్ళు బాగాకాల్చి సెనగపప్పు సొరకాయేసి కాళ్ళపాయా చేస్తిరా
జాజికాయ జాపత్రి వాము సోంపు సరిపడా వేసి నల్లజీరా పొడికొట్టినారా
మెంతులు ఆవాలు కర్వేపాకు ఇంగువాలతో పోపేసి రసం చేసినా రారా!

గడ్డపెరుగు ఉల్లిముక్కలు పచ్చిమిర్చీ కొత్తిమీరేసి పెరుగుపచ్చడి జేస్తిరా
అవరగడానికి తమలపాకులో కాసూ వక్క సున్నమేసి కిళ్ళీ కట్టానురా
నువ్వొస్తివని వయ్యారంగా వడ్డించి లొట్టలేసుకుని తింటావనుకుంటినిరా
మందులేనిదే మటన్ ఎందుకూ మసాలా ముక్కెందుకు అంటివి కదరా!

అప్పుడనిపించె..ఆకలేసినోడికి అన్నం కారమేసి పెట్టినా కమ్మగుంటదని
తాగుబోతు మనిషికి మందు లేకుంటే మాంసం ముద్ద గొంతు దిగదని..
అందుకే అంటున్నా తాళికట్టినోడివైనా కాసులున్నా నువ్వు నాకొద్దు పోరా
వ్యసనాల బానిసవి నీవు మారి మంచిగా బ్రతికే మార్గం ఎంచుకుని రారా!

 

అదీ ఇదని అనకు..


నాదనుకున్నది ఏదీ నాది కాదని దూరం అవకు 
రారమ్మని పిలవలేదని అలిగి మాట్లాడ్డం మానకు!

కంట నీరు రాలేదని మనసులో బాధ లేదనుకోకు
 ఏడవడం అలవాటుకాక నవ్వితే ఆనందం అనుకోకు!

 మది వ్యధతో తడిసి కళ్ళలో నీరుబక దుఃఖమనకు
 ఊరడింపు ఉపన్యాసం రాదని మౌనంగా తప్పుకోకు! 

కలనైనా కమ్మని ఊసులు చెబుతావనుకున్న నాకు
 జ్ఞాపకాలతో కలవరం రేపి కునుకు లేకుండా చేయకు!

 హృదయాన్ని త్రుంచి వేసి భావోధ్వేగాలతో ఆడుకోకు
  నాకు దక్కకున్నా పర్లేదు  నీవు నన్ను కాదనకు!  

అంతర్విశ్లేషణ

ప్రతీ మనసు శరీరము గాయపడుతూనే ఉంది ఇక్కడ
హృదయంలో విచారం కళ్ళల్లో దిగులూ కనబడుతోంది
ఇదేనా ప్రపంచపు పటం...అనారోగ్య సంకేత చిహ్నం?

ప్రతీ మనిషీ ఒక ఆడుకునే బొమ్మలాంటివాడు ఇక్కడ
గుండెల్లో గుబులు ముఖంలో చావుకళా తాండవిస్తోంది
ఇదేనా అందమైన లోకం...అందరూ కలగన్న సౌధం?

ప్రతీ ఒక్కర్లో వేరొకర్ని మోసగించాలనే ఆలోచన ఇక్కడ
మానవునికి శత్రువు సమాజానికి స్వర్గంలా అనిపిస్తోంది
ఇదేనా వింత విశ్వం...మన అనంత విశాల జీవనం?    

ప్రతీ ప్రాణం బ్రతకడంకన్నా మరణమే సులభం ఇక్కడ
మనిషికి విలువలేదు మనస్సాక్షి గోతిలో కప్పెట్టబడింది 
ఇదేనా మనముంటున్న స్థలం...మన మహాప్రస్థానం?

ప్రతీ ఒక్కరూ ఈ లోకాన్ని కాల్చేయాలి ఎక్కడిది అక్కడ  
లేకుంటే ఈ జీవితాలు ఎందుకు అవసరమా అనిపిస్తుంది
ఎవరిని వారు ప్రశ్నించుకుని వారిపై వారే ఉమ్ముకోవాలి!