నీతో ఉంటా!

ప్రతీదిక్కూ వెతికే నీకు సమూహాన్న ప్రత్యేకమై
ప్రేమతోపలుకరించి అపురూపంగా చూసుకుంటా!

మతిలేని నా మది నీ చుట్టూనే పరిభ్రమిస్తున్నా
అది నీకు తెలిసినా తెలియకున్నా నిన్నంటుంటా!

అలజడి అంబుధిలో మునిగున్న నీకు ఆధారమై
ఆశగా పట్టుకుంటే విదిలించక ఒడిసిపట్టుకుంటా!

అంధకార పయోధిలో చిక్కున్న నీకు కాంతిరేఖనై
కంటిపాపలకే తెలియనట్లు నీ కంట్లో కొలువుంటా!

చింతల సాగరంలో మునిగిన నీకు చిరుహాసంమై
నిట్టూర్పులంటినీ నెట్టివేసి నవ్వుగా నిలచిఉంటా!

నీ చేష్టలకు విసిగి వేసారిపోయి ఊపిరి ఆడకున్నా
ప్రాణవాయువై పదిలంగా నిన్ను చుట్టేసుకుంటా!

కలల కడలిలో తేలియాడియే నీకు స్వప్నపుంజమై
కలత నిదురలా కాక నిశ్చల నిదురనై నీలోఉంటా! 


అవిటి ఆలంబన

నిశ్చింతగా నిదుర పోలేని ఇద్దరమూ..
సమయాన్ని సవాలు చేసి కలువబోయి
విశ్రాంతి ఎరుగని హృదయాలను విడగొట్టి
రాసుకున్నదేమిటో పూసుకున్నదేమిటో!?

పశ్చాతాపపడని మన గుండెలు రెండూ..
మనస్పర్థలకు స్థానమీయక సర్దుకుపోయి
భారమైన భావాలను కనపడనీయక చుట్టి
ఎప్పటికీ విడిపోలేమన్న ధీమా ఏమిటో!?

నిర్దయకాలాన్ని నిలదీయలేని మనమూ..
తటస్థంగుండాలని సముదాయించుకోబోయి
ఒకేదారిన ఎదురెదురుగ అడుగువేసి ఢీకొట్టి
నిదురలేని కళ్ళకి కలలుచూపడం ఏమిటో!?

నేతనేసిన ఆశలు తీరవని తెలిసీ ఇద్దరూ..
బ్రతికి ఉన్నామన్న భ్రమను మభ్యపెట్టబోయి
నీరుగారిన నమ్మకము నాచుపడితే గిలక్కొట్టి
ఒంటరిని చేసి తోడు ఉన్నాననడం ఏమిటో!? 


మనకంపు మనకింపు..

కులం కంపులో పొర్లి అక్కడే దొర్లుతూ
రోడ్డుపై కాళ్ళు కడుక్కుని శుభ్రపడటం
ఇంట్లో తిని వీధిలో ఏరగటం ఏమో..
ఇంటిని ఉద్దరించక ఊరినేం ఉద్దరిస్తారో!

తిన్నాం పడుకున్నాం లేచాము అంటూ
ఎవరికివారే స్వార్థపు శ్వాసతో బ్రతకటం
వారి పెంట వారే వాసన చూడ్డమేమో..
మనకంపు ఎదుటివాళ్ళెలా భరించగలరో!

మతమలినం మనసుకు పులుముతూ
మతాన్ని మనువాడి నీతులు చెప్పటం
మన మలము మనం తినటం ఏమో..
తనది కడ్డుక్కోక వేరొకరిదేం కడుగుతారో!

దేవుడూ లేడు దెయ్యమూ లేదు అంటూ
గాలికి ఊడిపడ్డామని చెప్పుకు తిరగటం
నిడారంబర నాస్తికత్వానికి నిదర్శనమేమో..
పంచభూతాలను సృష్టించిన కర్త ఇంకెవరో!
 

మొహమాటమోహం..

మదిని గిలక్కొట్టి వెన్నవంటి భావాలని వెలికితీయి..

కవ్వమే విరిపోయెనని కధలు చెప్పి కల్లోల పరచకు!

నుదుటిన ముద్దిడి ముంగురుల ముసుగులో చిక్కి..
మధువులొలికే పెదాలని ముద్దాడ మత్తు ఎక్కెననకు!

మోహపుదాహాన్ని మొహమాట పడక వెళ్ళగక్కేయి..
నీలోనే దాచుకుని ఏమెరుగని నన్ను లోభిని అనకు!

నిలువెత్తు నీ రూపాన్ని నా గుండెల నిండుగ కుక్కి..
అంటరానితనాన్ని అంటగట్టి ఆమడదూరంలో ఉండకు!

విరబూసిన మల్లెపూరేకుల సువాసన్ని ఎగపీల్చేయి..
ప్రణయపరుపుపై మెత్తదిండుల దిగంబరత్వాన్ని కోరకు!

తనువంతా తడిమేటి వ్యామోహపు తలపులలో నక్కి..
వేడెక్కిన దేహానికి దాహమెక్కువైతే వేశ్యను అనుకోకు!

విరహం పక్కనెట్టి వాంఛల్ని విచ్చలవిడిగా తిరగనీయి..
పురుడు పోసుకునే ప్రేమకు పురిటినొప్పేలని అడుగకు! 

ఊపిరి కాలం..

మనసంతా నింపి మనసులో దాగున్న నన్ను పైకి చూపలేక
అనురాగాన్ని చూపించే అనువైన రోజేదని ఆత్రుతగా అడిగితే
చెంతనలేని మనిషి మనసులో దాగి ఏమిచేయాలో తెలియక
తికమకపడి తీవ్రంగా ఆలోచించి మనసున ఉన్నది చెప్పాను!

మనసు నిండుగా నన్ను నిలుపుకున్న నా మనసైన వాడా
అనురాగానికి ఆదీ అంతమూ అంటూ ఏమున్నది చెప్పు!?
ప్రత్యేకించి చూపాలనుకుంటే నా ఊపిరి ఉండగా వచ్చి చూసి
మరణించే ముందు నాతో ముచ్చటించమని అంటున్నాను!

మనసులో దాచుకున్న మమతను దించి వేసుకునే దారిలేక
అడిగితే ఇచ్చేది ప్రేమా? మరణించేదెప్పుడో చెప్పమని అడిగితే
ప్రశ్నకు జవాబు అడుక్కుని మరీ ప్రేమను పొందటం చేతకాక
తెలివైన నీ ప్రశ్నకు తెలివిలేక ఇలా సమాధానం ఇస్తున్నాను!

మనసువిప్పి చెప్పలేని మమతలు బియ్యంలోని రాళ్ళు కదా
ఏ ప్రాణం ఎప్పుడెలా పోతుందో ఎవరు చెప్పగలరు చెప్పు!?
అందుకే నిర్దిష్టంగా సమయాన్ని నిర్దేశించి వలపు కురిపించక
ప్రాణంపోయే వరకు ప్రతీరోజూ చెంత ఉండాలని కోరుతున్నాను!

వారిజ వైరి...

మోహపు దారాలు వేళ్ళ మధ్య చిక్కుకునె
ముడి విప్పలేక రోమాలు నిక్కబొడుచుకునె!

నా పిచ్చి ప్రేమ ఎందుకో నిన్ను ఎంచుకునె
చెప్పని మాటలెన్నో చెప్పినట్లు ఊహించుకునె!

నీవు పగలైతే నేను నువ్వెళ్ళితే వచ్చే రాత్రినె
ఇద్దరి ఆశలూ సాయంత్రం కలవాలని కలగనె!

చెప్పే ఊసులు అబద్ధాలైనా నామది నిజమనె
సత్యాన్ని చూద్దామంటే దూరంగా తానుండెనె!

కలువకు సూర్యుడు మిత్రుడైనా దూరముండెనె
వెర్రి వ్యామోహం పుట్టి కువలయము కృంగెనె!

నీటిలోలేని కమలం కమలాప్తుని రశ్మికి వాడెనె
పంకమంటని పద్మ వీచే గాలికి కొట్టుకుపోయెనె!
 

పరిమళ మత్తు

చూసేటి కనులకు చుట్టూ అన్నీ
సుగంధ పరిమళపు పుష్పాలే..
అవి విచ్చి వెదజల్లటానికి జరిగే
విస్ఫోటకాలు ఎవ్వరికీ కనబడవుగా!

పెరిగే మొక్కల కౌగిట్లో మొగ్గలన్నీ
పువ్వు విచ్చితే జరుగు సంబరాలే..
ఆ పూతేనెను జుర్రుకోవాలని చేసే
కపట కల్మష ప్రయత్నం ఎందరిదోగా!

పూల అమాయకపు అవయవాలన్నీ
అందంగా విచ్చుకుని వేసే చిందులే..
మోహమాయ ముళ్ళలో ఇరుక్కునే
పుప్పడిరెక్కలకు పరిమళం అంటదుగా!

వనమంతా ఝుమ్మనే తేనెటీగలన్నీ
కనబడని మర్మప్రాంతపు దృశ్యాలే..
నిర్జీవ లోకం చూడాలన్న యోచనే
తెలియని ఇంద్రజాలపు ప్రతిబింబంగా!


బ్రతికేయ్..

కొన్నేళ్ళ తరువాత అనుకోకుండా
నువ్వు నేను అకస్మాత్తుగా కలిస్తే
పరిచయం ఉన్నట్లు అనిపించినా..
పరిచయంలేదని పలకరించక వెళ్ళిపో!
కూడబలుక్కుని కన్నకలల నిండా
నువ్వు నేను కలిసి ఉన్నామనిపిస్తే
పీడకలని పడుకో నిద్ర రాకపోయినా..
పుస్తకాల్లో చరిత్ర చదివి జ్ఞానంపెంచుకో!

పేరూ ఊరూ గుర్తు చేసుకోకుండా
రంగురూపం పనిపాట్లు జ్ఞాపకమొస్తే
తెలిసీ తెలియనట్లు గుర్తుకొచ్చినా..
మనసుకు మతిమరుపొచ్చెను అనుకో!

కలిసి మాట్లాడిన ముచ్చట్ల నిండా
ఆడిన ఆటల్లో చేసినబాసలు అనిపిస్తే
అలిగిన అలకలు తీరక బాధించినా..
కంటనీరు రానీయక నవ్వుతూ బ్రతికిపో!

ఆనందాంతం..

ఏ రాత్రో ప్రయాణం చేస్తూ నిద్రలో నక్షత్రంలా రాలి
ఎటువంటి మరణ ఆక్రందన చేయకుండా పోవాలి!

నమ్ముకున్న నమ్మకాలు మదిలో నలిగినా నేను
పలుసార్లు పిప్పి కాక అంతమైనా హాయిగుండాలి!

ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిసొలసిన నాకు
మొదలు ముగిసి నిద్రలో అంతా అంతమై పోవాలి!

ఎవ్వరూ లేని రాలేని చోట పోయిన ప్రాణంతో నేను
ప్రశాంతంగా తప్పులని ఆత్మపరిశీలన చేసుకోవాలి!

దేహదాహ ప్రలోభ కాంక్షలకు ఎంతో లొంగిన నేను
మంతనాలు జరిపే మనిషికి కనబడకుండా పోవాలి!

ఎన్నో ఉషోదయాలు నిద్రపోయి వ్యర్థం చేసిన నాకు
స్వగతాలు స్మశానం చూస్తానన్న కోరికను తీర్చాలి!