తీర్పు..

ఆడుకునే వయసులో తిండిపోతుని నేను..
తన్నులూ వాటితోపాటు చీవాట్లు కూడాను
ఇవి సరిపోవని ఈసడింపులు జత కలిపాను
ఆకలితో సరితూగలేక అవన్నీ చతికిలబడెను!
ఎదుగుతున్న కొద్దీ మోసగించబడ్డా నేను..
చురుగ్గా పనిచేసి వేరేపని నెత్తినేసుకున్నాను
మనం చేసిందేదీ ఊరికేపోదు అనుకున్నాను
అవసరానికేదీ అక్కరకురాదని తెలుసుకున్నాను!
అలా కాలంతోపాటుగా సాగిపోయా నేను..
మంచీచెడు వ్యత్యాసాలు వెలివేయబోయాను
ప్రేమను పంచి ఇప్పుడు అడుక్కుంటున్నాను
ఇవ్వాలి ఆశించరాదని సూక్తులు వింటున్నాను!
ఆకలిచచ్చి ఏం తినాలని అనిపించక నేను..
కడుపువీపు కలిసి అతుక్కున్నట్లున్నా కూడాను
ఒడ్డున ఒంటరినై విషాదాన్ని నీటిలో కలిపాను
జీవితం ఇచ్చే తీర్పు కోసమై వేచి ఉంటాను!

నీ జత

నీవుంటే పరిసరాలన్నీ పచ్చిక బయళ్ళు
సంధ్యవేళ సంతోషం రేయేమో పరవళ్ళు

గాలే గెంతులేసి వేణుగానమై వినిపించు
మాటలే మంగళ వాయిద్యాలు మ్రోగించు

లోలోన తనువే పులకరించి నాట్యమాడెను
నెమలి పరవశమై కన్నీటితో సరసమాడేను

కనుల నిండా కలలేమో కిలకిలా నవ్వేసె
వసంతకాలమే పువ్వులన్నీ జల్లుగా కురిసె

చింతలన్నీ చెట్టుపైకి ఎక్కి తైతెక్కలాడాయి
ఊహలన్నీ ఉత్సాహాన్నిస్తూ ఊయలూగాయి

నీవుంటే మొత్తానికి జీవితం నందనవనం
లేకుంటే అధోగతీ అంతులేని అంధకారం!

నేటిపాఠం

నాకు పరిచయమైన ప్రతీఒక్కరూ జ్ఞానులే
అయినా వారెందుకో ఎప్పటికీ అర్థంకారు

నాకు తెలిసినవారు అందరూ ఆశాపరులే
ఏదో ఒక కోరికతో కొట్టుమిట్టాడుతున్నారు

నాకు ఎవర్ని చూసినా అన్నీ అనుమానాలే
ఏది మంచో ఏది చెడో తెలియక కంగారు

నాకు ఎవరెన్ని చెప్పినా బోలెడు సందేహాలే
జీవితం గురించి ఎవ్వరూ సరిగ్గా చెప్పలేరు

నాకు రోజూ బ్రతుకునేర్పే పాఠాలు ఎన్నోలే
ఊపిరన ఉదయాస్తమాలతో అల్లిన నవ్వారు

నాకు చిట్టచివరిగా బోధపడింది ఒక్కటేలే
పోయినోళ్ళంతా ఒకప్పుడు బ్రతికుండేవారు

సుడిగుండం..

పుస్తక పేజీల మధ్యన నలిగిన జ్ఞాపకపుష్పం
మన బంధంలా వాడి వాసన కోల్పోతుంటే
ఎంత వలచానో అంతకన్నా ఎక్కువ వగచా!
ప్రేమ ఎవరికీ పూర్తిగా దొరకని అసంపూర్ణం
ప్రతీక్షణం నీవులేని ఒంటరితనం వేధిస్తుంటే
మరణాన్ని అక్కున చేర్చుకోమని చేయిచాచా!
జీవితం జ్ఞాపకాల చుట్టూ తిరిగే సుడిగుండం
ఇద్దరూ కూడా ఇష్టం లేకుండా వేరైపోతుంటే
మనసుకు సర్ది చెప్పలేక మౌనంగా రోధించా!
ఎప్పుడూ గుర్తొచ్చే నిన్ను మరువడం గండం
బ్రతకడం రాక చావలేక జీవచ్ఛవంలా నేనుంటే
ఏడుపు మర్చిపోడానికి భారీమూల్యం చెల్లించా!
స్వచ్ఛమైన నా చిరునవ్వుని కాల్చిచేసా భస్మం
కన్నీటి జ్ఞాపకాల కడలిలో మునిగి తేలుతుంటే
చివరిదాకా రాజీపడి జీవించాలని నిర్ణయించా!

కరిగిపోతూ..

అప్పటి అదే అంతులేని ఆత్మవిశ్వాసము
ఇప్పుడు ఆలోచనలేని ఆవేశంతో కప్పబడి
అనుభవంలో అనుకోని ఇక్కట్లకి గురాయె!
అదంతా తొందరపాటని తెలియని ధైర్యము
ఇప్పుడు కాలంతో కరిగి జీవితం చిల్లుపడి
వేకువ వేకువకూ నడుమ ఆశ అడ్డమాయె!
అనుకోని బాధ్యతావసరాల మధ్య యుద్ధము
ఇప్పుడు నిలకడకై గెలుపు ఓటముల రాపిడి
ఉన్నచోట ఊతంలేక ఉనికి మాయమైపాయె!
అవసరాలు తీర్చే సౌకర్యాల పరుగుపందెము
ఇప్పుడు అహంపై స్వాభిమానం చేసే గారడి
చావు బ్రతుకుల నడుమ పెద్ద పోరాటమాయె!
అవన్నీ ఆనుభూతి లేకుండా సాగే కాలము
ఇప్పుడు పొంతనలేని ఆలోచనలతో అలజడి
ఆయువు నిశ్శబ్దంగా జారి కరిగిపోతుందాయె!

తన కోణం..

వివాహితలు కూడా ప్రేమలో పడతారు
మెడలో మంగళసూత్రం కాలిమెట్టెలతో
కొన్ని భావాలు నచ్చేసి వారికి లోబడి
చెప్పకూడదని తెలిసి అన్నీ చెప్పేస్తారు!
అలాగని తను బరితెగించిందనుకునేరు
చెడ్డదని మచ్చవేస్తారు కల్పిత కధలతో
మీకేం తెలుసని తనలోని భావాలజడి
ఆమెలా మీరు ఎందుకు ఆలోచించరు!
స్రీలు శారీరకంగా పెళ్ళి చేసుకుంటారు
లోన కుమిలేరు మానసిక కన్యత్వంతో
వారి మనసుని తాకలేదే ప్రేమ ఒరవడి
తనని అర్థంచేసుకున్న వారిని వదలరు!
మెచ్చిన వారెదుట తెరచిన పుస్తకంవీరు
నమ్మినవారి ముందు నిలచు నిర్లజ్జతో
మోసగిస్తే చూపిస్తారు నగ్ననటనాగారడి
సొంత బ్రతుకుతో సర్వత్యాగం చేస్తారు!

స్వయంకృతం

నేను ఎవరి వల్లనో నాశనం కాలేదు
నేను చేసుకున్న కర్మఫలమేగా ఇది
మరి ఇంకెందుకు ఒకరిపై నిందలు
నేనల్లుకున్న వలలో నేనేగా చిక్కింది!
నా కలల కలతల్నెవరో సృష్టించలేదు
నాకు నేనేనల్లుకున్న ఊహలేగా ఇవి
మరి ఎవరిపైనో ఎందుకు నిష్టూరాలు
నా స్వయంకృతం నన్నేగా ముంచేది!
నా ప్రత్యేకతను నాకెవరూ చెప్పలేదు
నన్ను పొగడాలన్న దురాశయేగా ఇది
మరి నాకేల స్వయంజనిత గాయాలు
నా అస్థిరానందం ఇలా అనర్ఘమైంది!
నేను మహాగొప్ప జ్ఞానురాలినేం కాదు
నా అనుభవాల సారాంశముగా ఇది
మరి ఎవరో చెప్పలేదనేల అభాండాలు
నేనే సమస్య నేనే సమాధానం చెప్పేది!

ఏకం కాదు..

ప్రతి చిరునవ్వు నిజం నవ్వు కాదు
ద్వేషం ప్రేమా అంత సులభం కాదు
నవ్వే ప్రతీ నవ్వూ ఆనందము కాదు
సుఖఃదుఃఖాల కన్నీళ్ళకు తేడా లేదు!
పదాలు ఒకటే కానీ అర్థం ఒకటికాదు
గుండె విరిగితే బాధచెప్పేది భాష కాదు
ఏ కలా పలుమార్లొస్తే అది నిజం కాదు
బ్రతుకు సాగుతుంది కానీ జీవం లేదు!
ముఖాలు ఒకటైనా మనసు ఒకటి కాదు
మన పరాయి గుర్తించడం సాధ్యం కాదు
జ్ఞాపకాల జాతరలో మనిషి ఒంటరి కాదు
అపజయాలు ఎన్నైనా ఆశకి చావు లేదు!
మదిసమాహారం ఎన్నడూ ఒంటరి కాదు
చెప్పలేని భావాలు ఎప్పుడూ ఒకటి కాదు
అస్తిత్వాన్ని కొలవడం ఎవ్వరివలనా కాదు
ఏరకం కన్నీరైనా ఇప్పుడు విలువ లేదు!

గిరిగీసి..

ప్రేమలో షరతులేవీ లేవనుకుంటూనే
నిన్ను షరతులపై ప్రేమించి ఉంటాను
అందుకే కళ్ళలోన నక్షత్రంలా మెరిసి
వెలిగే కొవ్వొత్తిలా కరిగిపొమ్మన్నావు!
ఇప్పుడు నువ్వో జ్ఞానసాగర కెరటంలే
నిన్ను కోరే జలపుష్పాల్లో నేనుండలేను
అందుకే నువ్వు పిలిచినా రాను అలసి
నాలోని నీవేమో దీన్ని సమర్ధిస్తున్నావు!
విచ్ఛిన్నమైన హృదయానికిది ఎరుకలే
నిన్ను ఎవరూ ఇలా వదిలేసి ఉండరు
అందుకే నీకు ఇష్టమున్నప్పుడు కలిసి
మరో కొత్త వ్యాపకాన్ని వెతుక్కున్నావు!
నా అవసరం నీకెప్పుడూ రాకూడదులే
నిన్ను నీ ప్రతిబింబం భయపెట్టదిపుడు
అందుకే నువ్వు నన్ను నలుగుర్లో చూసి
లోకం నీవన్న భ్రమలో బ్రతకమన్నావు!