గెలుపు తధ్యం..

మనసున్న మనిషిగా పుట్టేసి నిస్వార్ధంగా బ్రతికేయాలని
భాధ్యతల్ని పరిపూర్ణం చేయబోవ నెత్తినెట్టుకున్నా కొరివిని
నీతిగా ఉన్నానంటూ సాక్ష్యమే చెప్పమన్నా సూర్యకాంతిని
ఉసిగొల్పేటి ఊహల్ని ఉరితీసేసి గెంతులేస్తున్నా స్వేఛ్ఛని!
  
ఎన్నో ఏళ్ళుగా ఊహల సాంగత్యంతో మలినపడ్డ మనసుని
శుభ్రంచేయ కంకణంకట్టుకుని విసర్జిస్తూనే ఉన్నా జ్ఞాపకాలని
రోజువిడిచి రోజు కన్నీటిధారలతో తుడిచి పరేస్తున్నా ఆశలని
ఇంకా ఏమూలనో నక్కి ఉందిగా ఆశ నేను చేసింది ఒప్పని!

జరిగేది జరుగక మానదని తెలిసీ అరిచా న్యాయం కావాలని     
ఫలితం దక్కకున్నా ఆరినపెదాలతో గర్వంగా నవ్విన నిగర్విని
శూన్యం దద్దరిల్లేలా ప్రశ్నించా నేనుచేసిన తప్పేంటో చెప్పమని
కరిగే కరకు కాలానికేం తెలుసు అంతమొకటి తప్పకొస్తుందని! 

శ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి పెట్టా ఆఖరి పందెమని
గుండెలో గుబులుదాచి ముసుగుతో కప్పా ముఖంపై దిగులుని
చచ్చిన ఆశయాలు ఎండినాకులుగా రాలి అటూఇటూ కొట్టుకుని    
నాపై నాకున్న నమ్మకమే నిద్రలేచింది నేనే తప్పక గెలుస్తానని! 
   

క్లిక్ కొట్టి..పట్టు

                                            కెమెరావంటి కళ్ళతో కైవసం చేసుకోమంటే
పదునైనా పదాలతో పట్టిబంధించానంటావు

పెద్ద మనసుంది క్లోజప్ లో చూడరాదాంటే
ముఖాన్ని జూంలో చూసి మురుస్తుంటావు

భావాలకు ప్రతిరూపం ఇవ్వమని కోరుతుంటే
ఫోజ్ పెట్టు సూపర్ ఫోటో తీస్తానంటున్నావు

ఆలోచనావగాహన లేకుండా దగ్గర అవ్వకంటే
నవ్వితే వచ్చేటి ప్లాష్ చాలు వేరేం వద్దంటావు

ఇద్దరం కలిసున్నది ఒక్కపోటో కూడా లేదంటే
అన్నిట్లో తీస్తున్న నీవు చూస్తున్న నేనంటావు

ఎప్పటికుండే జ్ఞాపకమిది ఏకాగ్రతగా తియ్యంటే
ప్రింట్ వేయడంలో చూపిస్తాగా పనితనమంటావు

వ్యక్తపరచని వ్యక్తిత్వానికి దర్పణమేగా ఫోటోవంటే
మండే కవిత్వాన్ని చల్లబర్చడమే ఫోటోవంటావు!
     

నో శోభనం..దూరం దూరం!

నీకూ నాకు మధ్యన ఉండనీయి దూరం దూరం
నన్ను తాకాలంటే హ్యాండ్రబ్ రాసుకోవాలి ఇద్దరం!

ముద్దుపెట్టమని కన్నుగీటి పిలవకు దూరం దూరం
తియ్యని మాస్కుల్లేవుగా ముద్దులేం పెట్టుకుంటాం!

ప్రేమను ఒలకబోయ దరికి రాబోకు దూరం దూరం
ఒళ్ళంతా హైపో సొల్యూషన్ తో కడుక్కోవడం కష్టం!

సరసమాడమని సరదాకైనా అనకు దూరం దూరం
సరైన సానిటైజర్ లేదు సరిగంగస్నానాలేం ఆడతాం!

ఒళ్ళువేడెక్కెనని కౌగిలించుకుంటానకు దూరం దూరం
గ్లౌసులేసుకుని హత్తుకుంటే కిక్ ఏముంటదని వ్యర్థం!

దగ్గరగా కూర్చుని మాట్లాడదామనకు దూరం దూరం
మాటలేమోగాని మౌత్ వాష్ లకు సొమ్ము నాశనం! 

ప్రక్కప్రక్కనున్నా మనిద్దరి పక్కలూ దూరం దూరం
ఐసోలేషన్ లో ఎంత నిబ్బరంగా ఉంటే అంత పదిలం!

క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యే వరకూ దూరం దూరం 
క్యాప్ కప్పిఉన్న కొప్పులోని మల్లెలేం చేస్తాయి పాపం!

(కరోనా క్వారంటైన్ పీరియడ్ లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెళ్ళిచేసుకుంటే...వారు శోభనం గదిలో బహుశా ఇలా మాట్లాడుకుంటారేమోనని ఊహించి రాసింది. చదువుకుని సరదాగా నవ్వుకోండి లేదా జాలిపడండి వారిపై అంతే కానీ... సరసమంటూ ఎవరి దరీచేరకండి....దూరం దూరం :)   

నువ్వెక్కడున్నావ్!?

నువ్వు కాదు నేను వలచింది నాక్కావల్సింది నువ్వు కాదు నా వ్యసనమై నాలోన దాగింది పదే పదే పలుకరించి ఏం సాధించావనుకున్నది పలుమార్లు వచ్చి వెళ్ళి ఏముందని ఉద్ధరించింది అందుకే నన్నుండనీయి ఒంటరిగానే అంటున్నది! నువ్వు కాదు నాస్ఫూర్తి నాబలం నాక్కావలసింది నువ్వు కాదు అప్పటి నాలోని లోటు పూడ్చింది పద పద వెతుకుదాం నావాడు నీలో ఎక్కడుందీ పాత గాయాల్ని తడిమి తీసెయ్ నామది నిండింది అలా కోల్పోయిన కోరికల్లో నువ్వు కలిసిపోయింది! నువ్వు కాదు నాధైర్యసాహసం అదే నాక్కావలసింది నువ్వు కాదు నేను పోగొట్టుకున్న నన్ను నాకిచ్చేది పట్టి పట్టి పాతగాయాలకు కొత్త లేపనం రాసినట్లుంది పద్మాని పిలువ ప్రేమకు పర్యాయపదం అనిపిస్తుంది అదేనేమో నా చివరి మజిలీకి సొరంగం త్రవ్వుతుంది!

ఖబడ్దార్ కరోనా..


రానా వద్దాని అడక్కుండానే వచ్చిసచ్చిందిగా కరోనా..
కలవరమెందుకు దాన్ని తరిమికొట్టడం మనకు చేతకాకనా
అన్నీ శుభ్రంగా కడుక్కోవడం మనకు తెలియదనుకునా
వచ్చాక చావకొట్టే ప్రయత్నం గట్టిగానే చేద్దాం ఏదేమైనా!

ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చి మమ్మల్ని హడలుగొడతావేమే కరోనా..
ఎడమెడంగుంటూ కలవకుండా నిన్ను మట్టు పెట్టలేమనా
బయట తిరక్కుండా ఇంటిపట్టునుంటే నీకు లేదుగా టికానా
రెక్కాడితేగాని డొక్కాడని మాతో పెట్టుకోకే చుప్పనాద్దానా!

తుమ్ముదగ్గు జలుబు జ్వరంగా వచ్చి జలదరింప చేయకే కరోనా..
మాస్క్ ముసుగేసుకుంటే నీకు ఊపిరాడదంట అవునా
ఎప్పుడెలా అంటుకుంటావోనని చస్తూ బ్రతుకుతున్నాం ఏదైనా
మేమంతా తలచుకుంటే నిన్ను నాశనం చేయడం పెద్దపనా!

ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తాం కాచుకో కరోనా..
ధైర్యమే మా ఆయుధం తెలుసుకోవే కర్కోటకమైనదానా
ఇరవైఒకటి రోజులు ఇంట్లో ఉండి దీక్ష చేస్తున్నాం పారిపో సైతానా
 కోవిడ్-19 పుట్టగతుల్ని కాల్చిబూడిద చేయడానికి అందరూ రెడీనా!

నిద్ర దేహీ..

అడుక్కుంటున్నా..ఆరుగంటలు నిద్రను దానం చేస్తారా?
ఆశ్చర్యపోకండి..నిజంగానే నిద్రను దేహీఅని అడుగుతున్నా 
కుదిరితే ఆరుగంటలు లేదంటే కనీసం అరగంటైనా సరే..
అరగంటా గంటా అడుక్కుంటే కలిపి ఆరుగంటల పైనే కదా!    

అడగంది అమ్మైనా పెట్టదంటారని..అడుగుతున్నా ఇస్తారా?   
కళ్ళు ఎన్నిగంటలు మూసుకున్నా ఆలోచన్లని అణచుకున్నా
గతం వర్తమానంతో కలబడి భవిష్యత్తుతో బేరం కుదరక..  
శరీరం పక్కపై అటూఇటూ దొర్లి పొర్లినా నిద్రపట్టి చస్తే కదా! 

అప్పుడెప్పుడో హాయిగా నిద్రపోయా..మరోసారి నిద్రపోనిస్తారా?   
నిద్ర నావైపు కన్నెత్తి చూడకున్నా కౌగిలించుకోమని అంటున్నా  
మీ దగ్గర మిగిలిన చిన్నా చితకా నిద్రని కాస్త బిచ్చం వేస్తే..
మెదలక మదితలుపులు మూసి ఆదమరచి నిదురపోతా కదా! 

అందరూ నిద్ర ఆరోగ్యసూత్రమని చేప్పేవారే..అది ఇవ్వలేరా?
నిశిరాతిరితో రమించి అలసిపోయి వెన్నెల్లో వెల్లకిలా పడిఉన్నా   
రానని మారాం చేస్తున్న కునుకుని ఒప్పించి నాపైకి తోస్తే..
నా వ్యధలవేటుకు బలైన నిద్రతో సంభోగమే చేసి తరిస్తా కదా!

మీమాంసలో..

ఈ కాలమెంత కఠోరమైనదననా..
లేక మనం చేసిన నేరమనుకోనా!

నా హృదయంలో కాపురమననా.. 
లేక నా దగ్గరలేవు ఎందుకనుకోనా!

ప్రేమలో పస తగ్గెనని బాధపడనా..
లేక నావలపు లోపం ఉందనుకోనా!

మన కలయికకే అడ్డంకులేలననా..
లేక ఎదురీదని ప్రేమ ఎందుకనుకోనా! 

నేను తాకంది నామది తాకెనననా..
లేక ప్రేమించడం నీలక్ష్యం కాదనుకోనా!

                        ***

ఎద vs ఎముక..

బద్మాష్ లెక్కలేస్తివంటే బొక్కలు ఇరగదీస్తరోయ్
శరీరం సలపొద్దంటే నువ్వు సక్కగ ఉండాలోయ్బ
బధ్రంగుండు లేకుంటే బ్రతుకు బస్ స్టాండేనోయ్!
అస్తిపంజరంలో ఎముకలు 206 ఉంటాయిరోయ్
టిబియా ఫీమర్ ఫిబియాలంటే పెద్దబొక్కలేనోయ్
పాతిక ముక్కలు జేస్తినంటే లెక్కపెట్టుకోలేవోయ్!
కంటిసాకెట్ సిన్నదాన్ని చూసి చిందులేసేనురోయ్
కామంతోచూసి కన్నుకొడితివంటే కరుసైపోతావోయ్
కోకిక్స్ ఎముకలా కుదురుగుంటే నీకు మంచిదోయ్!
గుండెను దాచేటి పక్కటెముకలు జర జాగ్రత్తరోయ్
చిన్న ఇంకస్ ఎముక ఇరిస్తినంటే చెవిటోడివేనోయ్
చెత్త చిల్లరి వేషాలు నాకాడేసి బద్నాం కాకుండోయ్!
మెదడు ఎముక క్రానియం కాస్త కష్టతరమైనదేరోయ్
కంత్రీకతర్నాక్ పనులు చేస్తివంటే కుమ్మి పడేస్తానోయ్ 
నాతో పెట్టుకోమాకు చూర్ణం చూరా అయిపోతావోయ్!
మాండిబుల్ దవడెముక మాటలు జారనీయకురోయ్
వెన్నుపూసనై వెనకుంటా వేలుపట్టుకు నడిపించోయ్
మొండిగ వాదించమాక మనసుతో నన్ను గెలువోయ్! 

ధ్వంసం..

ఒక్కళ్ళమే బాగుపడితే ఒరిగేది ఏముందంటూ..
దేశాన్నుద్దరించే ఉత్తమ దారులెన్నో ధీటుగా చెప్పి
ఎడారాశల ఎండమావులతో దాహం తీర్చుకోమని   
ఊపిరి పీల్చలేని ఊహలతో ఓనమాలు దిద్దించకు!    

సాగర అలపై దీపంపెట్టి వెలుగు చూపుతానంటూ.. 
అంధకారాజ్ఞానానికి చరమగీతం ఆలాపిస్తానని చెప్పి
ఉదయించే సూర్యుడిలో ఉన్న వెలుగును చూసి  
మట్టిలో కలిసే నాకు మమతల మలినం పూయకు! 

సంప్రదాయాలూ విలువలని చంకలెగరేసుకుంటూ
ఆదర్శంగా జీవించి చూపిస్తానని అబద్దాలు చెప్పి 
నిజాలు నిర్మొహమాటంగా చెప్తానంటూ చిందులేసి
చరిత్ర చదివి చివరకు చావుకబుర్లు చల్లగా చెప్పకు! 

అన్నీ పాచిపోయిన పాతదుర్గంధపు ఆలోచనలంటూ..
విరబూసిన కొత్తపూల పరిమళాల పస తెలిసెనని చెప్పి
బజారంతా వెతికి మేధావికి ముసుగు దొరక్క మార్చేసి      
అదృష్టం మానభంగం కావించబడెనని సుడిని నిందించకు!