కొత్త సంవత్సరానికి స్వాగతం

బ్లాగర్స్ అందరిచే...
కొంత స్నేహాన్ని
కాస్త అభిమానాన్ని
కొందరి మన్ననలని
అయినా పొందాలని ఆశిస్తూ
కోటి ఆశలతో
కొన్ని ఆశయాలతో
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ...........

మీ అందరికీ 2009 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఓ......ప్రేమ

ఆకాశమంత ఉన్నతమైనది
సముద్రమంత లోతైనది
ఏమీ కాదు ప్రేమ....


ప్రకృతి అంత చిత్రమైనది
సృష్టి అంత విచిత్రమైనది
కూడా కాదు ప్రేమ....



జీవితం
కన్నా గొప్పదేమీకాదు
అలాగని నీవు లేకుండా జీవించనూ లేము
ఓ................ప్రేమ


అందుకే ప్రతి ఒక్కరిలో ద్వేషాన్ని తగ్గించి
నీవు ఉన్నత శిఖరాలకి ఎదిగిపో
ఓ..............ప్రేమ

నిదుర......

ప్రేమ ఇంత చిత్రమైనదని నాకు తెలియలేదు!
జగమంత నిదురపోతున్న నా కంటికి కునుకులేదు!

పదే పదే నా కంటికెదురుగా వచ్చి కనుమరుగవకు!
నా ఊహల సౌధాలని కూలిపోనీయకు!

ప్రియా... నన్ను కాసేపు నిదురపోనీయి!
స్వప్నాలలో మన మనసులు పెనవేసుకోనీయి!

కలలోనైన మనము కలసివుందాము!
మన ఎడబాటుని ఇలాగైనా కాసేపు మరచిపొదాము!

నీ తలపులు గాలితెమ్మరలై నను తాకుతుంటే!
నా మనస్సు ముంగురులై కదలి ఆడుతుంటే!

కనురెప్పలు మూతపడవాయె!
నా కంటికి కునుకు రాదాయె!

నిస్వార్ధమైన ప్రేమ......

సంధ్యవేళ మల్లెపూలు మాలకడుతూ........
పువ్వా పువ్వా నువ్వెందుకని రోజూ మాకోసం పూస్తుంటావు!
వికసించి పదిమందికి కనువిందు చేస్తుంటావు!
నీవు అందరికీ సువాసనలని పంచుతుంటావు!
నీకోసమంటూ నీవేముంచుకుంటావు!
అందరిని అలరించి నీవు వాడిపోతుంటావు!

నవ్వుతూ ....పువ్వు నాతో అంది.......
పిచ్చిదానా! ఇచ్చి పుచ్చుకోవడం అనేది వ్యాపార లక్షణం.
ఇచ్చి ఏమీ ఆశించకపోవడం నిస్వార్ధ ప్రేమ గుణం.
నువ్వు కూడా ఆలోచించు ఒక్క క్షణం.
కావాలంటావు అటువంటి ప్రేమ ప్రతిక్షణం.
అని అంటూ గుప్పున సువాసనలని వెదజల్లింది.....

వక్రించిన విధి....

బ్లొగర్స్ అందరికి విన్నపం..... ఇది నేను మొదటిసారిగా వ్రాస్తున్న కధ, ఎంతో కుదించి వ్రాయాలి అన్న ప్రయత్నంలో ఎక్కడైనా భావాలని వ్యక్త పరచడంలో లోపాలు జరిగితే సరిచేస్తారని ఆశిస్తున్నాను ....

శిరి ఫోన్ లోని మాటలు విని చప్పునలేచి నిముషాల మీద తయారై హాస్పిటల్ రిసెప్షన్ లో ఫైల్ తీసుకుని కిడ్నీదాత వివరాలు చదవసాగింది....
ఎవరైనా దొరికారా...? అంటూ ఎవరో అడిగిన దానికి లేదంటూ జవాబు ఇచ్చింది రిసెప్షనిస్ట్.
ఎలాగైనా ప్రయత్నించండి .....అతని గొంతులో నిరుత్సాహం....
ప్రయత్నిస్తున్నామండి... అయినా మీరు ఆరునెలలకే ఇలాగంటే పాపం మేడంకి మూడేళ్ళ తరువాత ఇప్పుడు దొరికారండీ దాతలు... అన్న మాటలతో తల తిప్పి చూసిన శిరి నిర్థాంతపోయింది.
నిజమా!...శ్రీ...నా శ్రీకాంత్...ఇక్కడా!.....మూడేళ్ళ పైనే అయింది చూసి. ఎటువంటి మార్పు లేదు ముఖంలొ ఏదో నిరుత్సాహం తప్ప...
ఒక్క ఉదుటన వెళ్ళి అతన్ని గట్టిగా కౌగలించుకుని నేనే నీ శిరీషని.... నీ శిరిని అని చెప్పాలి అన్న ఆలోచనలకి కళ్ళెం పడింది, అతని ప్రక్కన ఉన్న ముద్దులొలికే చిన్నారి అతని చేయిపట్టి నాన్న...నాన్న, అన్న మాటలతో.
గతంలోకి వెళితే......
అవి ఉద్యోగంలో చేరిన కొత్తలో కంపెనీ వాళ్ళ సెమినార్ లో చూసింది శిరి అతన్ని...ఆరడుగులు, చురుకైన కళ్ళు, పెదాలమీద చిరునవ్వుతో చలాకీగా అన్నిపనులు చూస్తూ చేయిస్తున్నాడు. చూసినవెంటనే ఆకట్టుకునే నవ్వు శిరిని కూడా అతని వివరాలు కనుక్కునేలా చేసింది. వివరాలు తెలుసుకుంది కానీ పరిచయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూనే ఆరు వారాలు గడిచాయి. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన.....తనకిష్టమైన నవల వెన్నెలలో ఆడపిల్ల కధానాయికలా కవ్వించి, కొన్నాళ్ళు ఏడిపించి వెరైటీగా కలవాలని....ఎక్కడో ఏదో అపశృతి , అయినా అనుకున్నదే తడవు సెల్ ఫోన్ తీసి స్నేహ భావనతో కూడిన sms చేసింది, రెండు....నాలుగు.....ఎనిమిది.... పదహారు smsలు జవాబు రాలేదు. కాని రోజూ వివిధ నంబర్ల నుండి కాల్స్ వచ్చేవి , శిరి మాట్లాడేది కాదు. చివరికి ఆరవరోజు వచ్చింది message, ఎవరు మీరు, మీ sms లు మీగురించి ఆలోచించేలా చేసాయి అంటూ .
అలా మొదలైన పరిచయం ఆరు నెల్లలో ఒకరిని ఒకరు చూడకుండానే రోజూ గంటల తరబడి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని కల్పించింది. రోజూ రాత్రులు గంటల తరబడి మాట్లాడేవాడు ,బ్రతిమాలి, బుజ్జగించి, లాలించి వివరాలు చెప్పమనేవాడు. అలా అడిగినప్పుడు కలసినప్పుడు చెపుతానని చిలిపిగా శిరి అతన్ని ఏడిపించేది. మూడు రోజుల్లో కలుస్తామనగా తెలిసింది పిడుగులాంటి వార్త శిరికి అప్పుడప్పుడు తీవ్రంగా వచ్చే నొప్పికి కారణం తన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, తనకి నప్పే కిడ్నీదాతలు కూడా అరుదుగా వుంటారని. విషయం శ్రీకాంత్ కి చెప్పాలవద్దా... చెబితే ప్రేమ , అభిమానం అంతా సానుభూతిగా మారితే శిరి దాన్ని భరించలేదు, అందుకే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. అతనితో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించిన శిరి, వాటిని కలలకే పరిమితం చేసుకుని అతని కంటికి కనబడక, కంఠానికి దూరమై మూడేళ్ళు ఎలాగడిపిందో ఆమె గుండెల్లోకి జారి ఇంకిపోయిన కన్నీటిచారల్ని గుండెలోతుల్లోకి వెళ్ళిచూస్తే తెలుస్తుంది.
వాస్తవంలోకి...
రిసెప్షన్ లో అడిగితే తెలిసింది శ్రీకాంత్ భార్యకి కూడా తనకి సరిపడే కిడ్నీ దాతయే అవసరమని. శిరికి ఎప్పుడో విన్న సినిమా పాట గుర్తుకు వచ్చింది, "విధి చేయు వింతలన్ని మతిలేని చేష్టలేనని.... విరహాన్న వేగి కూడా విలపించే కధలు ఎన్నో".....శిరి కిడ్నీదాతతో తనకి కిడ్నీ అవసరం లేదని కిడ్నీని శ్రీకాంత్ వాళ్ళ భార్యకి అమర్చే ఏర్పాట్లు చేయమని రిసెప్షన్ లో చెప్పి, లోపల డాక్టర్ గారితో మాట్లాడి బయటికి వెళ్ళుతుంటే....".ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్ అన్న"మాటలు విని ఆగిపోయింది. శిరికి తెలుసు చెప్పండి అంటే కూడా శ్రీ తనని గుర్తుపడతాడని మౌనంగా నిలుచుంది. అతనే ...మీరు చేసిన మేలు జన్మలో మరచిపోనంటూ వాళ్ళ పాపతో రెండు చేతులు జోడింప చేసి..." శిరి బంగారం ఆంటికి థాంక్స్ చెప్పమ్మా అన్నాడు. అదే... అదే పిలుపు మూడు సంవత్సరాల తరువాత విన్నది...పదే పదే తనని బుజ్జగించి లాలించిన పిలుపు...ఇంక ఆగవు కన్నీళ్ళు తనలో అని తెలుసు, అవి బయటికి వస్తే వాటిని అతడు ఆపేస్తాడనీ తెలుసు. అందుకే మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది శిరి.

ఓటమిలో గెలుపు....

ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
దోషిగా నిన్ను నేన్నెన్నటికీ నిలబెట్టను...

ఊహల ఊయలలో నేనూగుతుంటాను...
ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను...

నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...

మరు జన్మలోనైనా నీవు నాకు దక్కాలనుకుంటాను...
ఆ ఆశతోనే నేను అంతరించి పోతాను...

నీలో మార్పు.....

కంటికి కనపడకుండా పోయావు..
ప్రతి క్షణం నాకు ఎందుకు గుర్తుకొస్తున్నావు..
నా మనసుని నులిమి స్వప్నాల్లోకి ఎందుకొస్తున్నావు...

నీ స్వప్నాలనుండి నన్ను బయట పడనీయి..
నన్ను మనోవేదన అనుభవించనీయి..
నా శ్వాస ఆగిపోనీయి, ఈ లోకం నుండి దూరమైపోనీయి...

చేసిన బాసలన్ని బూటకాలని తెలుసుకోలేక పోయాను..
నిన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించాను..
నువ్వే పరాయి అయినప్పుడు వేరెవరితో పనిలేదనుకున్నాను..
పశ్చాతాపంతో ఒకరోజు నీవు తప్పుతెలుసుకుని నాదరి చేరేలోగా,
ఏదూరతీరలకో నే చేరుకుంటాను...

ప్రేమ/స్నేహం.......

ప్రేమనేది అందరికీ దొరకదు, అది కొందరినే వరిస్తుంది...
ప్రేమ ఎన్నో కష్టాలను కొని తెస్తుంది...
ప్రేమలో మనసు కాలుతూ మనిషిని కాలుస్తుంది....
అందుకే అందరూ స్నేహభావంతో మెలగమంటుంది...
స్నేహానికి ఎటువంటి అడ్డంకులు లేవంటుంది...
స్నేహం ఎదుటివారి ఆనందాన్ని కోరుతుంది...
స్నేహం ప్రాణం తీయదు ప్రాణమే ఇస్తానంటుంది...
ఇద్దరం కలసి జీవించన్నప్పుడు.......
నాపై శ్రధ్ధ చూపకు నేను దానికి అలవాటు పడిపోతాను.
నా నుండి ఏమీ ఆశించకు నేను వాటిని నెరవేర్చలేను.
నాపై నమ్మకాన్నుంచకు నేను దాన్ని నిలబెట్టుకోలేను.
నా హృదయాన్ని హత్తుకొనేలా ప్రవర్తించకు నీ నుండి విడలేకపోతాను.
నాలో ఆరాధనా భావాన్ని కలిగించకు దాన్నుండి బయటపడలేను.
నా జీవితంలో భాగమైపోకు నీవు లేకుండా నేను జీవించలేను.
మార్పు...
నిన్ను చూడకుండా వుండాలనుకున్నాను....
నీవుండగలవని తెలుసుకున్నాను...
నీలాగే నేను ఉండాలని ప్రయత్నిస్తున్నాను...
నేను మారకపోతే నిన్నే నాలా మారిపొమ్మంటాను...

నీ తలపు...
నీవు నా చెంత లేవు, నా పెదవులపై నవ్వు లేదు...

కంటికిపై కునుకు లేక కలలోకి కుడా రావడం లేదు...
వెక్కిళ్ళు కూడా రావడం లేదు, బహుశ నీవు నన్ను తలవడం లేదు...
అయినా నిన్ను నేను మరువ లేదు, అది నాకు చేత కాదు...
ఇదండీ సంగతి.....

నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను,
అప్పుడప్పుడు భాధని కనబడనీయకుండా అతిగా నవ్వేస్తుంటాను.
ఇలాగే కాలాన్ని వెళ్ళబుస్తుంటాను.

తోటలో పూల కోసం వెళ్ళిన ప్రతీసారీ నాకు పసిడిమొగ్గలే దొరికాయి..
నడచిన ప్రతి దారిలో ముళ్ళే ఎదురైనాయి..
పసిడి మొగ్గలతోనే నా బాటని పూలబాటగా మలచుకున్నాను..
అందులోనే ఆనందాన్ని వెతుక్కొని జీవిస్తున్నాను..

అత్యాశకు పోకూడదని తెలుసుకున్నాను,
అందుకే ఇతరులు సంతోషంగా వుంటే చూసి ఆనందిస్తుంటాను.
ఇలాగే కాలాన్ని వెళ్ళబుస్తుంటాను.
మృతి చింత...
మనిషిని మనుషులు మోసుకెళ్తున్నారు...
తెల్లని వస్త్రంలో అతని ఆశలని కట్టకట్టి తీసుకెళ్తున్నారు...
ప్రాణాలతో వున్నప్పుడు ఏమి సాధించాడో తెలుసుకోలేకున్నారు...
భువిలో దొరకని శాంతి చితిలో దొరకదని తెలిసి కూడా రోధిస్తున్నారు...
బ్రతికి ఉన్నప్పుడు మంచిపనులు చేయాలని ఎంత మంది ఆలోచిస్తున్నారు...
కుర్రకారు కాస్త ఆలోచించండి......

మొన్నీమద్య తమ్ముడి పెళ్ళి గురించి ఇంట్లో చర్చిస్తుంటే వాడు చూసిన ప్రతీ అమ్మాయిని కాదంటుంటే నాకు కోపం వచ్చి తడుముకోకుండా నా మనసు నుండి వెలువడిన ఆశు కవితండి.........

"కావాలని నిన్ను కోరివచ్చిన కన్యను కాదని అంటే
నీవు కావాలని అనుకున్నప్పుడు కన్యలే కారు
కాంతలు కూడా కంటికి కనపడకుండా కనుమరుగౌతారు ఖబర్దార్"

ఇది చదివి మీరు తిట్టినా, మొట్టినా, కామెంట్ పెట్టినా......... సమ్మతమేనండి.

( అప్రస్తుతమే కానీ ప్రస్తుతిస్తున్నాను.....తమ్ముడికి ఈ నెల 10వ తేదీన నిశ్శితార్ధమండి )
మాట....
ఒక మాటుంది పదే పదే మనసుని కలవర పెడుతుంది
మనసులో దాగను అంటుంది....

అది విని నీవు నాపై అలిగితే తట్టుకునే శక్తి నా మనసుకి వుంది....
కాని నీ మనసు కలవరపడి కలత చెందితే,
శాశ్వితంగా కనులు మూసుకుని వుంటానంటుంది...
ప్రేమకి ఉనికి..........
సువాసనలని అనుభవించ వలసిన అవసరం లేదు, ఆస్వాదిస్తే చాలు.
ప్రేమను మాటల ద్వారా తెలియపరచ వలసిన పనిలేదు,
రెండు మనసులు ఒకటైనప్పుడు, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే చాలు.

నాకంటూ ఏ ప్రత్యేకతలు లేవు అయినా అందరూ నన్ను గుర్తిస్తారు...
ఎందుకో తెలియదు కాని నేను ప్రేమించిన వారు తప్ప నా ప్రేమను అందరు గుర్తించారు....
నివేదన......
ప్రతి తలపులో నీవున్నావన్న భావన..
వాటి వలన దూరమౌతుంది నా మనోవేదన..
మన మనసులు ఒకటవ్వాలని భగవంతునికి నివేదన..
కలకాలం కలసి ఉండడానికి కావాలి అందరి దీవెన..
ఎడబాటు.....
దూరం అవుదామనుకున్న ప్రతిసారి దగ్గిరౌతున్నాను.*
మరచిపోవాలనే ఆలోచనలతో మరింత తలుస్తున్నాను.*
నీవు లేక నేను లేనని తెలుసుకున్నాను..*
మనసులో దాచుకోలేక కన్నీటి ధారనౌతున్నాను..*
ఎన్నో భావాలని నీతో పంచుకోవాలని***
కలలాంటి నా జీవితాన్ని కంటికెదురుగా నీతో గడపాలని***
కరిగిపోని కలగా కలసి జీవించాలని***
ఏదో ఆశ*****
ఓ! నేస్తమా....
భాష కన్నా గొప్పది భావం....
భావం కన్నా గొప్పది అభిమానం....
ఆభిమానం కన్న గొప్పది ఆశ....
ఆశ కన్న గొప్పది ఆనందం....
ఆనందంగా ఉండాలి నీవు కలకాలం

ప్రేమ కోసం ప్రాకులాడే వారు కొందరు...
ప్రేమే లోకం అనుకునే వారు మరికొందరు....
ప్రేమనే పొందని వారి భాధను గుర్తించిన వారు ఎందరు.....
అయినా ప్రేమనే పొందాలని ఆశ పడతారు అందరు....
వలపుల తలపులు

మనసు ఎప్పుడు వీడ లేదు నీ తలపు.....
కలలో కూడా రాలేదు నీవు మరపు....
ఐనా ఒంటరినే అంటుంది మనసు....
నీ మనసులో చోటులేదని బహుశ దానికి తెలుసు....

నా ప్రేమని తెలపడం ఎలా అని ఆలోచించాను....
నా మనసు తెరచి నీ పాదాల చెంత ఉంచాను....
తలవంచని నీవు దాన్ని చూడ లేదని తెలుసుకున్నాను....
చేసేది ఏమీ లేక మౌనంగా రోధించాను....

నా...చిరు భావాలు...

అలై తాకిన నీ స్నేహం
కలై కరిగెనెందుకో?
కంటికి కనబడని నీవు
కలత నిదురలొ కలవై వస్తావెందుకో?

మనసులోని మాట

నా మనసులొ వున్నది నీవు.....
నా ప్రతి తలపులో వున్నది నీవు...
నా ఉచ్వాస నిచ్వాస నీవు....
నా ఆది నీవు నా అంతం నీవు...


బ్రతుకు నిరాశ నిస్ప్రుహలతొ వున్న వేళ, ఆశల అలవై తాకావు...
నా ఈ జీవన పయనం లొ చుక్కానివై వెలుగు చూపావు...
జీవించడం నాకు నేర్పి, ఏ దూర తీరాలకో వెళ్లి పోయావు నీవు!

ఆలోచనలు.........

ప్రతిక్షణం నీ తలపు ఏల?
నీ పై నాకు ఇంత ప్రేమ ఏల?
నా నీడలో నీ ప్రతిబింబం ఏల?
సూర్యుడు కరిగి మంచు ఐన వేల,
నీ మనసు మాత్రం కరుగదు ఏల?


కాలం పరుగు పెదుతోంది నాలొ నీ పై ఆలొచనల లాగా....
నలుగురితో కలసి నవ్వుతున్నాను కన్నీరు కనిపించ కుండా వుందేలాగా..
ఆందరూ వున్నారు నాతో నీవే లేవుఎలాగా !

ఆవేదన........

మనసు భాధల్ని తట్టుకునే అలవాటు చేసుకుంది.
కన్నీటిని దాచుకుని నవ్వడం నేర్చుకుంది.
ఇన్నీ తెలిసిన నా మనసు ప్రేమలోని ఎడబాటుని ఏల కాదంటోంది...!

మనసులో ఏదో ఆరాటం.........
ఆలోచనలతో మది కలవరం.......
ఎందుకో నిన్ను చూడాలి అనే తపన......
రోజు రోజుకి పెరుగుతోంది నాలోన.....
ఇదేనా ప్రేమలోని మధుర భావన....!

నువ్వు నా హ్రుదయాన్ని తాకినంతగా నేను నిన్ను తాకలేక పోయాను.
నీతో స్నేహం చేద్దాం అనుకున్నాను నీవే నా ఊపిరై పోయావు.

కలలు.........

నిదురపో నేస్తమా కలలో కనిపిస్తాను అన్నావు...
కలలోనే కలుస్తాను అంటే అదే నా భాగ్యం అనుకుంటాను...
జీవితాంతం కనులు మూసుకుని ఉంటాను ......

వచ్చావు కలలోకి....
కనబడమన్నావు నీ కంటికి......
కలవడానికి కాదు కలవరం......
కలిసాక కనుమరుగైతేనే కష్టం.

కలయిక....

కలవడం ఒకటే కాదు ప్రేమకి పునాది***
మాటలతో కూడా కట్ట వచ్చు రెండు మనసుల మధ్య వారధి***
మనసులే కలవని నాడు ఆ ప్రేమ ఔతుంది సమాధి***

లాలింపు....


నీవు మేలుకొన్న వేళ నేను సుప్రభాతమౌతాను***
నీవు నిదురపోతున్న వేళ నేను జోలపాటనౌతాను***
నీవు దూరమైన వేళ నేను సమాధినౌతాను***

గాజు బొమ్మ....

నా జీవితం ఒక గాజుబొమ్మ వంటిది***
చూసి ఆనందించడానికే కాని ఆడుకోడానికి పనికిరానిది***
పొరపాటున పగిలితే కాలితో తోసివేయకు గుచ్చుకుంటే రక్తం రూపంలో రోధిస్తుంది***

మౌనం....

కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అది నమ్మను అని అంటావు ఇది నాకు తెలుసు....
అందుకునే వేసుకున్నాను మౌనం అనే ముసుగు.