గప్ చుప్..


చిన్నతనంలో లొడలొడా మాట్లాడేస్తుంటే
అమ్మ అనేది....చుప్....నోరుమూసుకోవే
ఆడపిల్లలిలా ఎక్కువ మాట్లాడకూడదని!

కొంచెం పెరిగిపెద్దయ్యాక మాట్లాడేస్తుంటే
అమ్మ మందలిస్తూ అనేది చాలింక ఆపవే
ఎదుగుతున్న పిల్లవు కుదురు ఉండాలని!

యవ్వనంలో నాక్కావల్సినవి అడిగేస్తుంటే
అమ్మ గట్టిగా కేకలు వేస్తూ సర్దుకునిపోవే
రేపు వేరొకరి ఇంటికి వెళ్ళాల్సినదానివని!

అత్తగారింట్లో అడుగిడి మాట్లాడబోతుంటే
అత్తగారు అనేది...ష్....నోరు మెదపకువే
ఇది నీ పుట్టినిల్లు కాదు మాట్లాడ్డానికని!

ఇల్లు చక్కబెట్టే ఇల్లాలిగా ఏమన్నా అంటే
భర్త మందలిస్తూ అనే చెప్పిందిక చాల్లేవే
లోకమంటే అసలు నీకు ఏం తెలుసునని!

ఉద్యోగం చేస్తూ వాస్తవాలు చెబుదామంటే
పనిచెయ్యాలనుకుంటే చెప్పింది చెయ్యమనే
అధికారి ముందు నోరు ఎత్తితే వ్యర్ధమని!

వయసు కాస్త పెరిగాక మాట్లాడదామంటే
పిల్లలు అంటున్నారు...గప్ చుప్ ఉండని
ఈ విషయాలతో నాకు అసలు పనేమిటని!

వృద్ధాప్యం వచ్చాక ఏదైనా చెప్పబోతుంటే
ష్....ష్.....ష్......ఇక చెప్పడం ఆపేయమని
మాట్లాడకు విశ్రాంతి అవసరమంటున్నారు!

ఈ నిశ్శబ్ద ఆత్మలోతుల్లో నుంచి అరవాలని
చెప్పాల్సినవి అన్నీ మనసు విప్పి చెప్పాలని
అంతలో......గప్ చుప్ ఆగంటూ అరుపొకటి
ఇంతకాలం మాట్లాడక ఇప్పుడేం మాటలని
ఆకాశం చేతులు చాచి వచ్చేయమని అంటే
చివరికి మౌనంగానే అంతం అయిపోయాను!

నేను నేనే...

నేనొక విచిత్ర విహంగాన్ని!
మబ్బులకు భయపడి వానంటే పడిచస్తా
గాల్లో ఎంత పైకెగిరినా నేలనొచ్చి తాకేస్తా
అవును నేనో చిత్రవిచిత్ర విహంగాన్ని...

నేనొక విశాల సాగరగర్భాన్ని!
సముద్రరాయైనా ఇసుకనై ఒడ్డుని కలుస్తా
ఇంద్రధనస్సులా ఏడు రంగులు మారుస్తా
అవును నేనో అలుపెరుగని సముద్రాన్ని...

నేనొక వింత నిగూఢతత్వాన్ని!
నన్ను విసిగించే విషయాన్ని నేను విసిగిస్తా
కోపంతో అలిగినా వాటిగురించి ఆలోచిస్తా
అవును నేనో వింత మనస్తత్వవేత్తన్ని...

నేనొక విలక్షణ విస్పోటకాన్ని!
మనసున ఏమున్నా ఉన్నదున్నట్లు చెప్పేస్తా
ప్రేమిస్తే ప్రాణం తియ్యను కానీ నాదిచ్చేస్తా
అవును నేనో ముక్కలైన విస్పోటకాన్ని...


రావే నిద్ర..

నా నిద్ర నాకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు
సరికదా నా కలలు నాకు ద్రోహం చేస్తుంటే
వాటిని ఇది స్పర్శించి నిద్రాభంగం గావించి
అన్యాయంగా ఆశల్ని అదఃపాతాళానికి అణచి
పైగా నిద్రలేని నన్ను నిందితురాలిని చేస్తుంది!

నా నిద్ర నాతో ఎన్నడూ సఖ్యతగా ఉండదు
కనుపాపలతో రేయంతా సంభోగించనేలనంటే
పగలేమో కునికిపాట్లతో గురకను రమించమని
ఆ కర్ణకఠోర శబ్ధఘోషే యుగళగీతమనుకోమని
వెకిలిగా వాగుతూ ఒంటిపై వీరంగం చేస్తుంది!

నా నిద్ర నాకు ఎప్పుడూ విశ్రాంతిని ఇవ్వదు
కలలు చెదిరిపోయి నిద్రను కోల్పోవడం అంటే
ముక్కలైన ఆలోచనలు ముత్యాలుగా రాలి పొర్లి
ఏరుకుని మరోమారు మాలకట్టలేని ఆశలే దొర్లి
ఆరోగ్యాన్ని వెక్కిరించి అబాసుపాలు చేస్తుంది!

నా నిద్ర నాతో లేదని నేనెన్నడూ బాధపడలేదు
కలలు ఎన్నో వచ్చినట్లే వచ్చి సగంలో పోతుంటే
అర్థంకాకనే ఆదీ అంతమూలేక అదృశ్యమైపోవగా
అంటీ ముట్టనట్లుగా స్పర్శతో సంసారమే చేయగా
ఈ కలతనిద్ర కాపురం ఎందుకని దొలిచేస్తుంది!

కాగితపు పువ్వు..

ఒకదానివెంట ఒకటి కోల్పోతూనే ఉన్నాయి
లోకాన్ని ఏం కోరితే ఏం ఇచ్చిందని కన్నీళ్లేగా
ఒకప్పుడు పూలవనం పరిమళాలతో విరిసింది
ఇప్పుడు ముళ్ళుకూడ దక్కుతాయన్న ఆశలేదు!

ప్రియమైన కాలానికెన్నో కోరికల రెక్కలున్నాయి
రేపటికై ఆలోచించే వ్యవధి మాత్రం కరువైందిగా
గుండ్రంగా తిరుగుతూ రంగులన్నీ విసర్జిస్తుంది
ఇక రూపం మారిపోతే సౌందర్యానికి స్థానంలేదు!

రేయంతా మిణుగురులు చిందులు వేస్తున్నాయి
తెల్లవారిపోయిందా ఈ ఆనందం కనుమరుగేగా
పనేమీలేక ఆలోచనలతో మనసు విసిగిపోయింది
మెల్లగా నిస్సత్తువ శరీరాన్ని కౌగిలించి వీడలేదు!

ఎగిరిపోవే ఊపిరీ దాహపు సుడిగుండాలున్నాయి
కాగితపు పూలవనములో విశ్రాంతి తీరు తీరికగా
అమాయక ఆకాంక్షేదో ఇసుకలో సేద్యం చేస్తుంది
చిక్కినట్లే చిక్కి అన్నీ కోల్పోయి దక్కింది ఏంలేదు! 

అస్థిరం..

నాలుగు గోడల నాణ్యమైన ఏసీ గదిలో
మనసు మెదడూ రెండూ మధిస్తే తెలిసె
కృంగి కృశిస్తుంది నేనూ నా ఆయువని
నిండుజాబిలి తారల నడుమ గగనంలో
నిదురరాని నా కళ్ళు నీరుకారిస్తే తెలిసె
రేయి జోకొట్టుకోవలసింది నాకు నేనేనని
వానా వాయువూ కలిసి చేసె తాకిళ్ళలో
తడిమట్టి సుగంధం నాసికని తాక తెలిసె
మనసెప్పుడూ వయసు ఎరుగని పసిదని
ఓదార్పు ఉపశమన ఉపమాన గానంలో
అంతర్లీన అడుగులు అలజడిచేయ తెలిసె
వలసబాట పయనించే మిణుగురులమని
భావవెల్లువలు ప్రవహించే అనంతములో
వణికిస్తున్న వర్తమానం తడిమితే తెలిసె
చివరికి ఒంటరిగా వచ్చి వెళ్ళిపోవడమని
కలవరపడిన కన్నీటి ఊట ఊరడింపులో
కరిగే కాలాన్ని ఆగిపొమ్మన్నప్పుడు తెలిసె
అనిశ్చల జీవితానికి స్థిరకవచం వ్యర్థమని

నీ దరికి..

నీదరికి చేరే దారి కనబడ్డంలేదు
అదేమంత కష్టం కూడా కాదు..
నాకు ప్రయత్నించాలనిపించలేదు!
 
సామాజిక బంధనాల బంధీ నీవు
వాటిని తెంచుకుని నీవు రాలేవు..
నిన్నలా ఇరికించటం నాకిష్టంలేదు!
 
నాపై ప్రేమను నీకళ్ళలో చూసాను
అదే నన్ను నీ దగ్గరకు చేర్చును..
అలాగని నినుచూడక నేనుండలేను!
 
క్షణం మాట్లాడు రోజని మురుస్తాను
నాలో నేనే ఏడ్చి నవ్వేస్తుంటాను..
ఏదారో దొరక్కపోదాని వేచుంటాను!
 
నేను నీ బలాన్ని బలహీనతనుకాను
నీ దరిలేకున్నా నీతోనే ఉంటాను..
ఇదేం అనురాగావేదనో చెప్పలేను!

నీ ఇష్టం..

సెప్పేటోడికేమో ఎట్లనో శరం లేకపాయె
ఇనేటినా ఇంగితం ఏమైపాయనో గదా!

చెప్పనీకేం అదిగిదని మస్తు చెప్తి వాయె
సెయ్యనీకి మాత్రం ఏం చేతకాలే గదా!

సలహా ఒక్కటి అడగ సౌవ్ ఇస్తి వాయె
సహాయమడగ సల్లగ జారికుంటివి గదా!

చెప్పింది ఇంటినేమో ఇజ్జత్ కరాబైపాయె
బ్రతుకిప్పుడు బానిసలా మారినాది గదా!

ఇన్నా ఇనకున్నా గిప్పుడు ఫరక్ లేదాయె
జరగాల్సినవి ఎప్పుడో జరిగిపాయె గదా!

బుద్ధి వచ్చింది చెబుతున్నా ఇనుకో రాయె
మనకు తోచిందే మనం సెయ్యాలె గదా!

ఎవర్ని అడుగు వారికి నచ్చిందే చెప్తారాయె
అందుకే అన్నీ విను నీకు తోచింది చేస్కో..
గిదైతె సెయ్యనీకి సింపుల్ మజావస్తది గదా!


సెలవు పెట్టనా!

జీవితానికి సెలవుపెడితే బాగుండునేమో
అంతా పద్దతిగా జరగాలి అనుకోవడం
అందరి బాగూ కోరడం కూడా పిచ్చేగా
ఇక్కడేదీ అనుకున్నట్లు జరగలేదు సరేలే
పోయాక స్వర్గాన్ని కోరుకోవడం ఆశేనా!
ఇప్పటి వరకూ భయంతో బ్రతికానేమో
ఇకపై నచ్చినట్లు ఉండాలి అనుకోవడం
సర్దుకోక అనుకున్నది చెయ్యటం వెర్రేగా
ఇలాగ ఇంత వరకూ బ్రతికింది చాలులే
సెలవు తీసుకుని శ్రమించక సుఖఃపడనా!
వీడ్కోలు వాక్యాలు చెప్పే ప్రయత్నమేమో
సెలవని చెప్పి పనిచేయాలి అనుకోవడం
ఏదో ఆలోచించడం కూడా చాదస్తమేగా
మొండిబంధాల్ని ధైర్యంగా ఉండమన్నాలే
అందుకే నవ్వుతూ సెలవు తీసుకునిపోనా!

ఆమె విలువ

నేను అనారోగ్యంపాలై మంచంపై మూలుగుతుంటే
మొదటిసారిగా నా విలువ ఏంటో నాకు తెలిసింది
ఇల్లు ఊడిస్తే రెండువేలు బట్టలుతగటానికి నాలుగు
టీ టిఫినీతోపాటు వంటకు పదివేలు చాలనిపించింది
ఉఫ్..ఇలా లెక్కవేస్తే చేసే ప్రతీపనికీ ఒక లెక్కుంది!
పాతికవేలు ఫస్ట్ తారీక్కు పనిచేసామెకి ఇచ్చుకుంటే
నిక్కినీలుగుతూ ఆమె చేస్తున్న పనిచూస్తేనే తెలిసింది
ఇంటినంటి ఇన్నేళ్ళు జీతంలేక పనిచేయటం తెగులు
ఇరవైఏళ్ళ జీతం ఎన్ని లక్షలౌవునో కదా అనిపించింది
ఉఫ్..హౌస్ వైఫ్ అనిపిలిచే నాకూ సంపాదన ఉంది!
సంపాదిస్తే తెలుస్తుందని ఇంట్లోవాళ్ళు పలుమార్లంటే
పనిమనిషి నెలజీతం కూడబెడుతుంది నేనని తెలిసింది
ఇది ఎవ్వరూ గమణించరు ఎందుకన్నదే నా దిగులు
ఇంటిని గృహంగా మార్చేది కూడా నేనే అనిపించింది
ఉఫ్..ఈ నా విలువ తెలుసుకోమని అరవాలనుంది!
టీ కాస్తూ పదిసార్లొచ్చి అదీఇది ఎక్కడని అడుగుతుంటే
కాలని దోశ ఊరగాయతో గతిలేక తింటుంటే తెలిసింది
ఏదోకటి అనాలన్న అధికారంతో అనడం మీకు తెలుసు
సంపాదన తప్ప ఇంకేం చేతకానితనం మీది అనిపించింది
ఉఫ్..నా విలువ తెలీదంటే నీలో ఇగో బాగా బలిసింది!