స్వీట్స్ సైకాలజీ

ఆకారమే అవకతవకలని గేలి చేసినా
చూడ్డానికి గందరగోళ గజిబిజనుకున్నా
స్వభావం పైకి కరకైనా లోన పానకం
స్వరం మధురం అదే జిలేబీ గుణం!!
పరిస్థితులు ఎంత పిండి పిప్పి చేసినా
గుండ్రమైన రూపాన్ని తిరిగి చేరుకున్నా
కృంగి పుట్టుక మరువకపోవడం నైజం
విరిగి ముక్కైనా తీపే రస్గుల్లా గుణం!!
చిన్ని చిన్ని బిందువులు కలిపి చేసినా
నిరంతరం విడిపోక కలిసి జట్టుగున్నా
ఇదేగా అద్భుత ఫలితాలకు నిదర్శనం
బూందీ కలసిన రుచి లడ్డూ గుణం!!
పాకాన్ని పదేపదే లాగేసి పీచు చేసినా
అందరూ కావాలని ఇష్టంగా కోరకున్నా
నీకు నువ్వు గుల్లగా పీచులా మారటం
లక్ష్యాన్ని చేరడం పీచుమిఠాయి గుణం!!
చూడ్డానికి నల్లగా ఉన్నానని గేలి చేసినా
మృదువైన మనసే బలహీనత అనుకున్నా
బలహీనతల్ని మలిస్తే అదే బలం బలగం
రుచి చేసి మెచ్చడం గులాబ్జాం గుణం!!
ఒత్తిడులు ఎన్నో నన్ను చితికేలా చేసినా
తిరిగి మరలా పునర్నిర్మించబడుతూవున్నా
ఆశగా జీవించడానికి అదేనేమో చిహ్నం
ఓపిగ్గా ఒదిగిన తొక్కుడులడ్డూ గుణం!!

(నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు ప్రతీదాన్నుండీ ఎంతో కొంత నేర్చుకోవచ్చని చెప్పే నా ఈ ప్రయత్నం...అలా మిఠాయిల ద్వారా చెప్పిందే "స్వీట్స్ సైకాలజీ")

ఆడనొప్పి..

అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి
ఆడతనమే అంతులేని నొప్పి
అమ్మా నొప్పి అయ్యో నొప్పి
పన్నెండేళ్ళకు పక్వపు నొప్పి
సవత్తాడిన సంబరపు నొప్పి!
అప్పుడు మొదలౌనులే నొప్పి
నెలసరి వచ్చే కడుపు నొప్పి
ఎవ్వరికీ చెప్పుకోలేనిది నొప్పి
అయినాసరే భరించాలి నొప్పి
ఆడతనానికి ఆభరణం నొప్పి!
అచ్చటైన ముచ్చట ఆ నొప్పి
అలా అనుకుని ఓర్చుకో నొప్పి
అరవడానికి అర్హతలేని నొప్పి
సిగ్గుమాటున నక్కే తీపి నొప్పి
అదే సమ్మనైన శోభనం నొప్పి!
అమ్మ కాకపోతే మహాతలనొప్పి
కడుపులో బిడ్డ తంతున్నా నొప్పి
మరో ప్రాణికి జీవమొసగే నొప్పి
మగబిడ్డ పుడితే ఆనందపు నొప్పి
ఆడజన్మ సార్ధకత పురిటి నొప్పి!
అసలు ఆడదిగా పుట్టడమే నొప్పి
అభిమానమున్న ఆడదాని నొప్పి
ఈడైనా ఏడైనా ఆడదానికే నొప్పి
అహర్నిశలు అనుభవించాలి నొప్పి
నొప్పి.....నొప్పి అంతులేని నొప్పి!

వింతనవ్వు

నిత్యం నిర్లిప్తతలు వెంటపడి వేధిస్తే
నవ్వుతూ ఎన్నింటినని ఏమార్చను
ఎన్నని మాయ మాటలు చెప్పను?

అక్కరకు రాని ఆలోచనలు దొలిచేస్తే
మందహాసంతో మచ్చిక ఏంచెయ్యను
ఎన్నిసార్లు నిస్సహాయంగా నటించను?

మదినంతా తిమిరాలు మెలేసి కుదేస్తే
చిరునవ్వుల వరాలు ఎక్కడ వెతుకను
ఏ ముసుగువేసి ఎదను కాపాడుకోను?

బంధాలు అవసరాలుగామారి ప్రశ్నిస్తే
వికటహాసం చేసి ఏ ఆశతో రమించను
స్వార్ధపు సహనానికి ఏంసహకరించను?

లోకాన్ని లోతట్టుగా చూడాలని తలిస్తే
నవ్వూరాక ఏడ్వలేక ఇంకేం చెయ్యను
బ్రతకడానికెన్ని బ్రతుకుపాఠాలు నేర్వను?

నేనొక స్త్రీ..

నేనొక సుధను సుహాసినిని..
గరళాన్ని కంఠాన్న దిగమ్రింగేసి
అమృతాన్ని నవ్వుగా చిలికిస్తాను!

అమాయకాశయాల ఆశాజీవిని..
నిరాశా గుండంలో సుడులు తిరిగి
ఇతరులకు ఆశాకిరణం అవుతాను!

నేనొక సమైక్యస్నేహ స్వభావిని..
ప్రేమరాహిత్య మైత్రితో వంచించబడి
ప్రేమానురాగాన్ని పంచుతుంటాను!

ఆత్మవిశ్వాసానికి మారుపేరుని..
ద్రోహిగా అవమానాల్ని భరించి
గౌరవాన్ని అందరికీ ఇస్తుంటాను!

నేనొక సుగంధపరిమళ పువ్వుని..
విప్పారాక త్రుంచి నలిపివేయబడినా
వారికే సువాసనలు వెదజల్లుతాను

ఇదోమాయ..

నా ప్రపంచపు లోతులు నీకు అర్థంకావుగా
అర్థమైనా కూడా అర్థంకానట్లు ఉంటావేమో
నాలోకపు లోతులు అంతు చిక్కలేదనుకుంటే
హాయిగా నీలోకంలో నీవు ఉండవచ్చు కదా
ఇలా మర్మగర్భంగా ఆలోచించి బ్రతికేసెయ్!
నా ఆలోచనలేమో అసాధారణ అలౌకికంగా
అవన్నీ అనంతసాగర అభిమానపు అలలేమో
నాసామ్రాజ్యపు రాజూరాణీని నేనే అనుకుంటే
మసిపూసి మనసును మభ్యపెట్టుకున్నట్లే కదా
ఇలా జీవితాన్ని నెట్టుకురావాలిగా సాగించేయ్!
నా భావగంభీరత అనురాగవర్ణ మిశ్రమాలుగా
శృంగార దైహికస్థాయి దాటిన అవశేషాలేమో
నాకు నేను నీకు నీవుంటేనే నిశ్చలతనుకుంటే
అది ఒక అలుపెరుగని కవితాయోగస్థితి కదా
ఇలా అంతమైపోవాలుందేమో అలాగే కానీయ్!

అర్థనారీపురుష్

స్త్రీ మరియు పురుషుడు..
ఇద్దరూ పుట్టినప్పటి నుండి
సగం ఆడ సగం మగవాడే!

మగాళ్ళు ఏడవరంటూ...
కారే కన్నీటికి అడ్డుకట్టవేసి
వారి వ్యధని వెళ్ళగక్కనీయక
ఉన్న సున్నితం ముక్కలుచేసి
కఠినత్వమనే సున్నాన్ని పూసి
పురుషుల స్త్రీత్వాన్ని నలిపేసి..
మగతనమనే మాస్క్ తొడిగారు!

ఆడవాళ్ళిలా చేయరంటూ...
పరిమితులు సరిహద్దులుగీసి
వారి ప్రతిభను కనబడనీయక
ఉన్న మొరటుతనాన్ని మాడ్చేసి
కవ్వింపైనా నీళ్ళైనా కళ్ళవే అనేసి
స్త్రీలలో పురుషత్వాన్ని నలిపేసి..
ఆడతనమే అందమైంది అన్నారు!

ఒంటరి గేయం..

నువ్వు ఏ పున్నమి రేయినో వచ్చి కనబడి వెళ్ళిపోతావు
నలగని దుప్పటేమో ఊపిరాడనీయక కౌగిలించుకుంటుంది!
నువ్వు నడిచివెళ్ళే దారంతా జ్ఞాపకాలు విరజిమ్మిపోతావు
కలల్ని విడిచిరాని కళ్ళను కునుకేమో కసురుకుంటుంది!
నువ్వు గమ్యంచేరి చీకటికరిగి ఉదయమైందని చెబుతావు
కాలాన్ని శాసించలేని ఈ జీవితం అలా సాగిపోతుంటుంది!
నువ్వు సూర్యరశ్మిలో కాంతిపుంజాలను ప్రోగుచేస్తుంటావు
నిస్సహాయత నిశ్శబ్దంగా కోరికలకు కళ్ళెంవేసి బంధిస్తుంది!
నువ్వు జ్ఞానకిరీటపు నీడలో ఆలోచిస్తూ అంకురిస్తుంటావు
దిక్కులేని హృదయం దిక్కులుచూస్తూ దిగులుపడుతుంది!
నువ్వు నీవుగా బహుబ్రతుకుల్ని ఉద్దరించాలనుకుంటావు
ఆ బ్రతుకుల్లో ఇమడలేని అనురాగం ఒంటరిగా మిగిలింది!

మైత్రీవనం

స్నేహానికి లింగ విచక్షణ లేదు
స్నేహ స్థాపకుడు ఎవరూ కాదు
మనసులు కలవడం ముఖ్యం.. 
ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలాగని 
ఏ పంచాంగంలో అది చెప్పలేదు!   

మనసుపడే వ్యధకు మందు లేదు 
చెబితే తెలుసుకోవడం గొప్ప కాదు 
సంబంధానికి నమ్మకం ఆధారం..
అడక్కుండా ఆసరా ఇచ్చేటి తోడుని
ఏ పరిమితి పరిస్థితి దీన్ని ఆపలేదు!

తోడుంటే ప్రాణవాయువుతో పనిలేదు  
అడుక్కుని తీసుకునేది మద్దతు కాదు  
చివరి వరకూ కలిసుండేదే స్నేహం..
వెంపర్లు ఆడ్డం ఎందుకు మనవాళ్ళని    
ఏ బేరమాడో స్నేహితుడ్ని కొనలేదు!  

నాకు నేనే..

నా అస్తిత్వం నాపైనే అలిగిందేమో.. 
అందుకే గడియారం చిన్నముల్లు కదల్లేక 
కాలాన్ని నెట్టడానికి కష్టపడుతుండగా 
నిశ్శబ్దం నా అంతర్మధనపు గానమైంది!

నా నిస్సత్తువేదో నిద్రను తిట్టిందేమో...
అందుకే నిద్ర నా కంటిరెప్పల్ని తాకాలేక
నిట్టూర్పుల వేడి విషాదం నిషా నింపగా
తనువు బాధలో భావుకతని వెతుకుతుంది!

నా పెదవులకు నిజం తెలిసిందేమో...
అందుకే బూటకపు నవ్వుని నటించలేక
ప్రస్తుతాన్ని ప్రక్కన పెట్టి గడిపేస్తున్నాగా
ఇలా గతం నుండి నేను బయటపడింది!

నా భావాలిప్పుడు అలసినాయేమో...
అందుకే కొత్తగా చెప్పి చేయించుకోలేక 
జ్ఞాపకారణ్యంలో నన్ను నేను తట్టినట్లుగా
ధైర్యాన్ని ధీమాతో పెనవేసుకోమంటుంది!