సాగుతున్న కాలం...

సాగిపోతున్న కాలాన్ని సాగనంపలేక
కౌగిలించుకుని ఆలోచిస్తే అర్ధమైంది
కనుక్కోవడం మరియు కోల్పోవడం
మర్చిపోవడం ఇంకా గుర్తుంచుకోడం
వదిలేయడం తిరిగిరావడం లాంటివి
అంతులేని నిరంతర ప్రక్రియలని...
జీవితం ప్రతొక్కరికీ ఇంకో అవకాశమిచ్చి
మరో ప్రారంభానికి నాంది పలుకునని!
నా అస్తిత్వపు వస్త్రాల్లో ఆనందం దుఃఖం
ఆశ మరియు నిరాశల దారాలు నిక్షిప్త
నమూనాల్లో పెనవేసుకోవడం చూసి నేను
ఏ పనైనా పరిపూర్ణతతో పూర్తి కాదనెంచి
నడచిన దారి తిరిగి చూసుకుంటే తెలిసె
ప్రతీనష్టం ఒక గుణపాఠాన్ని నేర్పగా...
స్వీకరించే ఓర్పు నేర్పులే పునరుద్ధరణని!
జీవితం చివర్లో ఒక బహుమతిచ్చింది
మరో అవకాశాన్ని కళ్ళముందు ఉంచి
పయనిస్తూ ప్రయాణాన్ని ఆపవద్దనంది
ఇక చేసేదేంలేక జీవితమిలా సాగిస్తున్నది!

చివరికి మిగిలేది..

నా స్థితిగతులు తెలుసుకునేం ప్రయోజనం
నీ ఆస్తిపాస్తులు అన్నీ వేరెవరికోగా సొంతం
నా మానసికస్థితి బాగోలేక నేను ఏమైతేనేం
నీవు ఉండాలి ఆయువారోగ్యాలతో కలకాలం
నన్ను బాధపెట్టిన నీకే సంతోషం అర్పితం..
నా రాక తెలిసి భద్రతకై నీవారిని పిలుచుకో
నీ అమాయకత్వాన్ని చూసి నువ్వే నవ్వుకో
నేనెప్పటికీ సింహాన్నే నువ్వు ఇది తెలుసుకో
నన్ను అడ్డుకోడానికి కుక్కల్ని పిలిచావెందుకో
నీ మూర్ఖత్వానికివే నా జోహార్లు అందుకో..
పునాదుల గురించి మాట్లాడుకుందామా నేడు
బలంగా కట్టిన భవనాలతో పనిలేదు ఇప్పుడు
ఇరుగుపొరుగు అనుకుంటూనే ఉంటారెప్పుడు
డబ్బుందని గర్వపడాల్సిన అవసరంలేదిప్పుడు
అన్నీ తెలిసేసరికి వింటావు చావుచప్పుడు..

ఇలా అనిపిస్తుంది..

టక్కున ప్రాణం పోతే..

బాగుండును అనిపిస్తుంది!
అభిమాన ఆపేక్షల కోసం
ఆరాట ఆతృతలు వద్దు..
ఇక చాలించాలనుంది!

జీవించింది చాలు ఎవ్వరూ
ఛీ ఛీ అనకముందేగానే..
అంతరించి పోవాలనుంది!

జీవితానికి ఒకర్థం ఉన్నప్పుడే..
ఆనందంగా వెళ్ళిపోవాలనుంది!
కొందరి హృదయాల్లో చోటు
కాసింత అభిమానం ఉందన్న..
తృప్తితో అంతమవ్వాలనుంది!

ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు
కలలుకంటున్న కనులను..
శాశ్వితంగా ముయ్యాలనుంది!

అనుకున్నవేవీ ఎలాగో జరుగలేదు..
ఊపిరైనా ఇష్టంగా వీడాలనుంది!

లేనిదున్నట్లు..

ఎలా ఉన్నావని అడిగినంత సులభమేం కాదు
బాగున్నానని లేనిది ఉన్నట్లు అబద్దం ఆడటం
ఏడుపు గొంతును నవ్వుగా మార్చి మాట్లాడ్డం
అన్నీ కోల్పోయి కూడా ఆశగా బ్రతికేయడం..
ఎందుకూ పనికిరాని వారితో ఉపయోగం లేదు
మాట్లాడితే సమస్యతో పాటు సమయం వ్యర్థం
వారు భారమూ అంతకు మించి అప్రయోజనం
అన్నీ తెలిసిన జ్ఞానులు చేసే పని వదిలేయడం..
ఎటువంటి మార్పు లేనివారికది కష్టమేం కాదు
ఒకమనిషి స్థానంలో మరోమనిషితో సాంగత్యం
బరువు బాధ్యతల నడుమ బిజీగా గడిపేయడం
అన్నీ సాగుతుంటే మనసు మారటం సహజం..
ఎలాంటి నష్టం జరుగలేదుగా అవగాహన లేదు
ఏడ్చి కావాలని అడుక్కోవడమన్నది అనధికారం
మరువలేని మనసుతో జీవించడమే ఒక నరకం
అన్నీ చెప్పుకుంటే చులకన అవ్వడం ఖాయం..
ఎదను ఎదతో చేర్చి చర్చించడం పోలికేం కాదు
గాయమైన గుండెకే గాట్లు చెయ్యడం అన్యాయం
లేని మమకారం కోరుకోడం రాచపుండంటి రోగం
సలహా సమర్ధింపుల సంధిసంపర్కం తాత్కాలం.. 

ఇద్దరమొకటి కాదు..

నాకేమో భావోద్వేగాలజడిపాళ్ళు ఎక్కువ
తనకేమో చలించని నిశ్చింతే మక్కువ..

నాదేమో సున్నితసరళలజ్జాపూరిత తత్వం
తనదేమో అన్నింటా ఒకే సమానత్వం..

నాకేమో విరహవైరాగ్యవలపొక అనుభూతి
తనకేమో అవన్నీ పనికిరాని పురోగతి..

నాదేమో కన్నీటితరంగకెరటాలవ్యధ హోరు
తనదేమో నిలకడ జీవిత కడలి జోరు..

నాకేమో చిత్తశుద్ధిక్రియాక్రమంటే భలేఇష్టం
తనకేమో ఒక్కటే పట్టుకోమంటే కష్టం..

నాదేమో గందరగోళగాభరాగమ్య పరిస్థితి
తనదేమో తెలివిగా నిలబడ్డ తటస్థస్థితి..

నాకేమో స్వార్ధపూరితప్రేమచేష్టలు కావాలి
తనకేమో అవి జీవితంలో భాగమవ్వాలి..

తప్పు నాదే..

ఎందరో అపరచితుల గురించి తెలుసుకుని
వారిని చదవడమే సరిపోయిందేమో అతడికి
నేను మాత్రం పరిచయమై కూడా పరాయినై
అతడి లోకంలో చిత్తుపుస్తకమై అమ్ముడయ్యా!
ఎందరినో అడిగి నాగురించెన్నో తెలుసుకుని
నా మనసుని చదివేసి నాకు దగ్గరైన అతడికి
నేను ఉసిగొల్పిన ఆలోచనలేవో అతడి ప్రేరణై
అతడు రాసిన గ్రంధంలో నేనో పంక్తినయ్యా!
ఎందరి మనోభావార్ధాలనో బాగా తెలుసుకుని
వారిమనసు మెప్పించడమే సరిపోయె అతడికి
నేను మాత్రం అంతరంగాలోచనల్లో పదిలమై
అతడి బాధ్యతల్లో బంధాలప్పుడు బరువయ్యా!
ఎవరితోనో నన్నునే పోల్చిచూసి తెలుసుకుని
నా మనోభావాలను చవమని చెప్పా అతడికి
నేను ఇలా అతిగా ప్రేమించేసానేమో చులకనై
అతడి దృష్టికి నేనిప్పుడు ఎంతో అలుసయ్యా! 

తొంగోకే తొమ్మిది..

తొమ్మిది ఒకట్ల తొమ్మిది
నీకే ఇచ్చేసాగా నా మది..
తొమ్మిది రెండ్ల పద్దెనిమిది
నీపై నాకున్న ప్రేమ గట్టిది..
తొమ్మిది మూళ్ళ ఇరవైఏడు
నువ్వే నాకు సరైన జోడు..
తొమ్మిది నాలుగుల ముప్పైఆరు
నువ్వు చూపించు నీ ప్రేమ జోరు..
తొమ్మిది ఐదుల నలభైఐదు
నీ మౌనం నాకు చాలా చేదు..
తొమ్మిది ఆరుల యాభై నాలుగు
నాకు కాకు దూరం ఇక ఆగు..
తొమ్మిది ఏడుల అరవైమూడు
నువ్వే కావాలి నా మొగుడు..
తొమ్మిది ఎనిమిదుల డెబ్బైరెండు
నువ్వు కలకాలం ఉండు తోడు..
తొమ్మిది తొమ్మిదుల ఎనభై ఒకటి
మనసావాచా అవుదాం ఇద్దరం ఒకటి..
తొమ్మిది పదుల తొంభై
నా చివరి శ్వాసకు చెప్పాలి నీవు బై..


జాగ్రత్త..

భావోద్వేగ మేధస్సులేని వ్యక్తులతో బంధమేల!
వారు మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు
అన్నీ కూడా వారి తరపు నుంచే ఆలోచిస్తారు
అలా వ్యక్తీకరించే వారితో తస్మాత్ జాగ్రత్త..

స్వీయ అవగాహనలేని వారితో సంబంధమేల!
వారి ప్రవర్తనతో మనం బాధపడ్డా గమనించరు
అన్నీ తామే చేస్తున్నామన్న భ్రమని కల్పిస్తారు
అలాంటి వారి వల్ల గాయపడకుండా జాగ్రత్త..

భావావేశాలను నియంత్రించుకోలేని వ్యక్తులేల!
వారి స్థితి గతుల పైనే మీరు ఆధారపడతారు
అన్నీ కూడా వారికి అనుగుణంగా జరిపిస్తారు
అలాంటి మానసికస్థితి వారితో కాస్త జాగ్రత్త..

తాదాత్మ్యం లేనివారిపై సానుకూలత మనకేల!
వారికి మన భావాలతో పనీలేదు పట్టించుకోరు
అన్నీ వారికనుగుణంగా మల్చుకుని బ్రతికేస్తారు
అదేదో సానుభూతి అనుకోకు జర జాగ్రత్త..

భావోద్వేగమేధస్సుని వారిలో మనం వెతకనేల
ముందుగా స్వీయావగాహన మనం చేసుకుని
భావోద్వేగాలను మనమే నియంత్రించుకుందాం
తాదాత్మ్యంతో మనల్ని మనం మలచుకుందాం!

కారుమబ్బు..

నా వద్ద ఉన్నవన్నీ ఇచ్చాగా
మనువు తనువు ఇంకా ఆత్మ
అలా చేయడం నాకచ్చిరాలేదు
అందుకే ఇప్పుడింకేం చేయను
రేయిలో వెలుగు వెతుక్కున్నా..
నాకు నలుపు అంటే ఇష్టంగా
నా నీడ నీ అత్మల నడుమ
రహస్యంగా ఏదో జరిగుంటుంది
అందుకే నిన్ను ప్రేమించాను
చీకటిని కైవసం చేసుకున్నా..
నా గురించి నీకిక చెప్పనుగా
నిన్ను కావాలని కోరడం భ్రమ
హామీలు బాసలు మూగబోయి
ప్రేమ ఏడారిలో ఒయాసిస్సైనా
రాత్రినే దారెటో చూపమన్నా..
నా ఈ చేష్టలన్నీ తప్పులేగా
నన్ను నేను కోల్పోవడం వ్యధ
తిరిగి ఎదగాలన్నదొక అభిలాష
దాని కోసం దారినే మార్చుకుని
నిశినే నిండుకాంతి కోరుతున్నా..

భావం అదృశ్యం..

భావాలు బాటసారై పయనించగా
కలల బూడిద కాళ్ళకు అంటింది
ఎంతో చెయ్యాలని ఏం చెయ్యలేక
చదివిన చదువేమో చంకనాకింది!
నాగరికత వాడి అస్త్రం సంధించగా
అనాగరికం నగ్నంగా నర్తించింది
అది చూసి జ్ఞానం నవ్వ ఏడ్వలేక
అక్షరం అజ్ఞానంతో అశ్చర్యపడింది!
నిస్వార్ధ నిజం నడుస్తూ నిలకడగా
అబద్దాన్ని ఆత్మహత్య చేసుకోమంది
ఆనందానుభూతులు కలిసుండలేక
విడివడి చెరొక చెంతన చేరుకుంది!
నీచానికి హద్దులు ఆంక్షలు లేవుగా
విప్పుకున్న రెక్కల్తో ఎగిరిపోయింది
దిక్కు తోచని దేహం దిగులు వీడక
కృంగికృశించి చివర్లో అదృశ్యమైంది!

సెక్స్ శీర్షిక

మగాడు మోసం చేయాలని చేస్తాడు

కానీ..ప్రతిఫలంగా మోసాన్ని కోరడు
వాడికి కావల్సిన శారీరక సుఖానికై
ప్రేమనే పంచరంగులను అద్దగలడు!!

ఆడది ఆప్యాయత కోరి మోసగిస్తుంది
తన ఆశల భర్తీ కోసం మోసపోతుంది
ఆమె ప్రేమతో కూడిన శృంగారానికై
బానిసలామారి సర్వం సమర్పిస్తుంది!!

మగాడు తడవతడవకూ మోసగిస్తాడు
ఆడది తలచుకుంటే తెలివిగా చేస్తుంది
ఒకరు సెక్స్ కోసం పోరాడి గెలుస్తారు
మరొకరు ఫీలింగ్స్ కొరకు పడిచస్తారు!!

ప్రేమించే మగాడు మగతనం చూపడు
ఆమె అనురాగం అడక్కుండా ఇస్తుంది
ఇచ్చిపుచ్చుకోడంలో ఇద్దరూ తీసిపోరు
అయినా కామం కళ్ళు మూసేస్తుంది!!

తలగడ మంత్రానికి లొంగని మగాడూ
గర్భం చేసినోడిని వదిలిన ఆడదీ లేదు
మగ-ఆడను శృంగారమేగా నిర్దేశిస్తుంది
తొడ-తొడ బంధం తొంభై ఏళ్ళుంటుంది!!

నాకు నేనే..

నాకేం నాలుగ్గోడల మధ్య నలగాలనిలేదు
స్వచ్ఛమైన అభిప్రాయలమర్చిన సొరుగునై
భావోద్రేకాలు అన్నింటినీ వ్యవస్థీకృతంచేసి
నా జీవితారణ్యానికి నేనే లాంతరునౌతా..
నాకెవరూ సహకరించలేదని కృంగిపోలేదు
గాఢాంధకారంలో నాకు నేనే తోడూనీడనై
సంతోషాలు పంచి దుఃఖాన్ని దిగమ్రింగేసి
నా సొంత మంటలలో నేనే వెలిగిపోతా..
నాకేదో అయ్యిందని పరామర్శ అక్కరలేదు
బాధించేవారి సహేతుక సాకులకి దూరమై
మాట్లాడలేని వారికి మాటలు అప్పగించేసి
నా ఆయుష్షురేఖకు నేనే భరోసా అవుతా..
నాలోని నిస్తేజం నాకలసట కలిగించలేదు
ఎందుకంటే నేను నా శరీరానికి బానిసనై
పరుగులు పెట్టించి నన్నునే పరిపాలించేసి
నా బ్రతుకుకి మంచి అర్థం నేనే చెబుతా..

ఇల్లాలు-ప్రియురాలి

తనకేమో కాలం కలిసొస్తుంది
అది క్రమబద్ధమైన సంబంధం
ఈమెదేమో అక్రమసంబంధం!

తను అధికార బద్దమనిపిస్తుంది
ఆమెది చెక్కు చెదిరిపోని స్థానం
ఈమెదేమో గడియకో నిగూఢం!

తన అవసరాలని లాక్కుంటుంది
ఆమెది అందరి ఆమోద యోగ్యం
ఈమెపైనేమో ఛీత్కార అభియోగం!

తనేమో అడిగి అలిగి సాధిస్తుంది
అది బాధ్యతగా చేయాల్సిన కార్యం
ఈమెదేమో ఎదురుచూసే తరుణం!

తన కడుపున వంశాంకురం ఉంది
అది భార్యగా అమెకున్న అదృష్టం
ఈమె కడుపు కొవ్వు కాలుజారడం!

తనకి అన్నింటా భాగస్వామ్యముంది
ఆమెది హక్కుతో కూడిన యవ్వారం
ఈమెదేమో ఇచ్చి పుచ్చుకునే బేరం!

తాను నలుగురిలో తలెత్తి నడుస్తుంది
ఆమెది గర్వంతో కూడిన నిర్భయం
ఈమె మనసున మూలెక్కడో పదిలం!

తను తిట్టినా కొట్టినా పక్కనుంటుంది
ఆమెతోటి చావుబ్రతుకుల సమ్మోహం
ఈమెతో ఉంటే అది రంకు బాగోతం!

ఇంటా బయటా ఇల్లాలు గెలుస్తుంది
అతడు కాదని అవునన్నా ఇది నిజం
ప్రియురాలు ఎప్పుడూ ఆమడ దూరం!

చిల్లు గాలిపటం

చీపురుపుల్ల త్రుంచి కాగితాన్ని దానిక్కట్టేసి
ప్లాస్టిక్ పతంగీతో పంతమేల గాలిపటమా
చంద్రుడ్ని తాకబోయి చెట్లలో చిక్కుకుంది
అది దాని గొంతెమ్మ కోరికని అనుకోవచ్చు
గాలిపటానికి దారమాధారమని ఎవరికెరుక?
హద్దుమీరిన ఆశయాల్ని ప్రేమతో పెనవేసి
పైకెగిరితే పడిపోతానని తెలిసీ గాలిపటము
ఎవరో పట్టుకుంటారన్న ధీమాతో ఎగసింది
రాలినగాలిపటం రంగులు నచ్చి ఉండొచ్చు
ఉరికొమ్మకు వ్రేలాడుతుందని ఎవరికెరుక?
ఆశల ఆధారాలన్నీ దారంగా ముడులువేసి
పైకెగిరిన మనసు చిల్లుపడిన గాలిపటంలా
క్రిందపడి ఇంకా రెపరెపలాడుతూనే ఉంది
ఎగరేసే వారికది కాలక్షేపం అయ్యుండొచ్చు
ప్రాణాన్ని ఫణంగా పెట్టిందని ఎవరికెరుక?

తెలియని ప్రశ్న..

అనుకోకుండా అప్పుడప్పుడూ
మనసూ మెదడూ ఆగిపోయి
గతంలోకి దూసుకెళుతుంది..

జీవితపు పేజీలను తిరగేస్తుంది
లాభనష్టాలను లెక్కబెడ్తుంది..

జీవనపయనమలా సాగుతుంది
ఎప్పుడాగునో తెలియకుంది..

జీవిత తత్వమూ మారిపోతుంది
కాలమూ రంగు మార్చేస్తుంది..

జీవితం కొందరికి కలిసొస్తుంది
మరికొందరిని మోసగిస్తుంది..

జీవితగమనాలోచన ప్రశ్నిస్తుంది
నా మౌనం సమాధానమిస్తుంది..

పాటతో ప్రణయం..

నేను సంగీతంతో సంపర్కం చేసినా
జ్ఞాపకాలు ఒంటరిగా మిగిలున్నాయి
వాటిని నేను ఆహ్వానించక పోయినా
ప్రతీపాటలో వచ్చి చేరుతానన్నాయి!

కన్నీళ్లు నాముఖాన్ని కౌగిలించుకున్నా
జలజలా ధారగా కారుతూ ఉన్నాయి
ఎన్నో జ్ఞాపకాల్ని దూరంగా నెట్టేయగా
పరుగున పలుమార్లొచ్చి వీడకున్నాయి!

నేను పాటతో పానుపుపై పవళించినా
జ్ఞాపకాలు రెచ్చిపోయి రమిస్తున్నాయి
వాటిని లెక్కచేయక దారి మళ్ళించినా
అప్పుడు నవ్వులు నన్ను నలిపేసాయి!

సరిగమలు నాతో సరసం ఆడుతున్నా
అహ్లాదం అందంతో చిందులేస్తున్నాయి
ఆలోచనలు లయతో శోభనం చేయగా
సంతోషాలే సంతానమై పుట్టుకొచ్చాయి!


నన్ను నీలో..

నేను లేని వేళ నన్ను తలుస్తూ నిద్రపో
ఆ నిద్రలో నిశ్శబ్దంగా నీ చొక్కా విప్పి
గుండెపై వ్రాసిన పిచ్చిరాతల్ని తలచుకో

నేను పోయానన్న బాధ నుండి కోలుకో
ఆ వంకన నా లాలనాపాలల్ని గుర్తించి
నిష్కల్మషమైన నా ప్రేమని నీలో నింపుకో

నేను లేకున్నా నా గుండెలయ నీదనుకో
ఆ లయకు కొత్తవసంతపు జల్లులు అద్ది
మన బంధానికి ఒక నిర్వచనం ఇచ్చుకో

నేను నీ ఎదను తడుముతున్నా చూసుకో
ఆ స్పర్శలోని అమృతం గొంతులో పోసి
నా భావాలను మసకబారనీయక దాచుకో

నేను నీకు దూరమై దగ్గరున్నాను అనుకో
ఆ అనుకోవడంతో పాటు ఆలోచలని నెట్టి
నవ్వుతూ మరో జీవనానికి ఊపిరిపోసుకో