నీ రాకలో...

నువ్వు వస్తావని విని వెన్నెల విరగకాసింది
అరణ్య మయూరమై మనసు నర్తించసాగింది
మోముపై కోటికుసుమాలు తళ్ళుక్కుమనగా
నీలాకాశం మబ్బు చీరను నాపై విసిరేసింది!

కుడి కమలనేత్ర కాటుక కలవరంతో చెదిరింది
శంఖాకృతిలాంటి కోమల కంఠం మూగబారింది
అధరం వణికింది ఆకురాలిన అలికిడికి కూడా
పసిమిమేనిఛాయ ఎందుకో ఏమో ఎర్రబడింది!

విరహగానం విన్న చెవి యుగళగీతం కోరింది
దేహం పారిజాతసుమదళాల పాన్పు పేర్చింది
కురులు పిల్లగాలికే కడలి అలలాగ కదలాడగా
పాదాలు పలుమార్లు గుమ్మంగడపని తాకింది!

వస్తావని రాని ఆలోచనే వచనా కవిత్వమైంది
అక్షరాల హావభావం అలంకారమేలని అలిగింది
ఛందస్సు సంధిసమాస వ్యాకరణాలన్నీ కూడా
నన్ను తాక.....నా అమాయక జ్ఞానం నవ్వింది!

తోడుండవే..

మనసా ఎందుకలా పరుగెడుతున్నావే
వెయ్యి దారాలతో నిన్ను కట్టిపడేసినా
వంద మార్గాలగుండా పారిపోతున్నావే!

ఎన్నో కలలు కల్పించి ఆడుకోమన్నావే
నిద్రను నిటారుగా నిలబెట్టి నిద్రపుచ్చినా
మేల్కుని చెప్పకుండా పయనమైపోయావే!

అలిగిన పగటిని మాటలతో బుజ్జగించవే
సాయంత్రం నీకేమీ గుర్తు రాకపోయినా
రాత్రి కునుకైవచ్చి కలలో కాపురముండవే!

గడచిన కాలాన్ని బ్రతికిద్దాం మరలారావే
ఆరిన కన్నీళ్ళు అకారణంగా తడిబారినా
అవి తుడిచే వంకతో వెంటనే వచ్చేయవే!

మనసా వడిగా అడుగులేయడం ఆపేయవే
అలసిన ఆశలతో కదలలేక చతికిలబడినా
ఆసరాగా చెయ్యందించి నన్ను నడిపించవే!

తెల్లతోలు..

తాత్కాలిక తళుక్కులు ఎందుకులే అని

ఏంవాడక ఏబ్రాసిముఖం వేసుకున్నావా
ఎర్రిదానికి ఏంతెలీదని ఎగతాళి చేస్తారు

బాహ్యంకన్నా ఆత్మ అందం మిన్న అని
కబుర్లెన్ని చెప్పినా అందమంటే తెల్లఒళ్లేగా
పాలిపాచినా తెల్లపాల బొమ్మనే పొగిడేరు

తెల్లగుండి తైతెక్కలాడినా తెలివైనది అని
నడ్డిముక్కూ చీలికళ్ళేసుకుని చిరాకుపడినా
తింగరి వేషాలేసినా తెలివైనదిలే అంటారు

తేజస్సుతో పనేముంది తెల్లగా ఉంది అని
ఏం చేయకున్నా కంటిని కట్టిపడేయునుగా
ముడితే కందిపోవునని గారంగా చూస్తారు

తిమ్మిని భమ్మి చేసేటి లోకంతీరు ఇదే అని
ఒంటిరంగు వంద వంకర్లు కప్పెట్టును కదా
ఒప్పినా ఒప్పకున్నా తెల్లతోలునేగా మెచ్చేరు

గిల్టునగ...

వలపు పేరిట నడుము వంపులన్నీ ఒత్తుతూ

వజ్రాలవడ్డాణం చేయిస్తాను అంటివి ఆనాడు
విశ్వమంతా చూసి విసుక్కుంటున్నావు నేడు

అందాలు అన్నీ ఆహా ఓహో అని ఆరగిస్తూ
రెండు చేతులకూ అరవంకీలంటివి ఆనాడు
ఆ అందాలే ఏం చూడనని అలసినావు నేడు

చిలిపి చేష్టలతో చెక్కిళ్ళు రెండూ నొక్కుతూ
చంద్రహారం మెడలోన వేస్తానంటివి ఆనాడు
చెప్పింది చేయనంటూ చతికిల బడితివి నేడు

నిషా ఎక్కిస్తున్నానని నడిరేయంతా నలిపేస్తూ
మెడకు పచ్చలనెక్లెస్ పెడతానంటివి ఆనాడు
నిషా దిగినాక నీరసంగా కూలబడ్డావు నేడు

ముద్దమందారాన్నని ముద్దుపై ముద్దులెడుతూ
ముక్కుకు ముక్కెరా నత్తూ అంటివి ఆనాడు
మోజు తీరెనేమో ముఖం చాటేస్తున్నావు నేడు

వలచినంత కాలం నగలంటినీ ఆశచూపిస్తూ
మెరుపులేక నాణ్యత తగ్గినాదంటివి ఇప్పుడు
విలువలేని గిల్టునగ నీవు విసిరేస్తున్నా చూడు

అవునేమో..


ఏ బాధ అయినా చెప్పడం కన్నా
అనుభవిస్తేనే బాగా అర్థమౌతుంది
నా కష్టం నీకు రావాలని కాదు..
ఆ బాధ మనతో అలా చెప్పిస్తుంది!

ఓ నెగ్గిన వ్యక్తిని ప్రశంసించే కన్నా
ఓడిన వ్యక్తిని ఓదారిస్తే తెలుస్తుంది
గెలచినవారిని పొగడవద్దని కాదు..
ఓటమివ్యధ ఒంటరిలో రెట్టింపౌతుంది!

ఏ గాయంపై పూసిన మందు కన్నా
మరొకరి గాయం మనది మాపుతుంది
అలాగని మీరు గాయపడాలని కాదు..
గాయమే గాయానికి ఔషధమౌతుంది!

ఓ కడుపు నిండా తిన్న వ్యక్తి కన్నా
కాలే కడుపుకే ఆకలంటే తెలుస్తుంది
ఆకలితో అలమటించాలని కాదు..
ఆకలే అవసరానికి ఆశ్రయం ఇస్తుంది!

ఏ తీపి జ్ఞాపకమో గుర్తురావడం కన్నా
మరవాలన్న మరుపే గుర్తుకొస్తుంటుంది
తీపిస్మృతులు తలచుకోకూడని కాదు..
మరుపు గతంగుర్తుగా గమ్యంచూపుతుంది!

ఓ నిశ్చింత నిగూఢ నిర్మల మది కన్నా
నిరాశ్రయ నిడారంబర నిరాశే మద్దతిస్తుంది
నిరాశానిస్పృహతో నీరశించమని కాదు..
లోకజ్ఞానం నిర్లక్ష్యం నుండే ఉద్భవిస్తుంది!

ఎన్నెన్నో..

చలి చీకటి రాత్రిలో చిందులు వేస్తుంటే
మండుతున్న మనసుమంటలు ఆర్పలేక
బదులివ్వని బ్రతికున్న శవంలా చూస్తూ
భూమికి భారమైన శరీరాలు ఎన్నోగా..

సమయం సరదా సాఫీగా సాగుతుంటే
కరుగుతున్న కాలాన్ని ఎలాగో ఆపలేక
అల్లరిచిల్లరిగా అరచి తాగితిని తిరిగేస్తూ
బేకారు ఉనికిలేని జీవితాలు ఎన్నోగా..

అందంగా ప్రకృతి ప్రళయం సృష్టిస్తుంటే
ఏం జరిగిందో జరుగబోతుందో తెలియక
అన్నీ కోల్పోయి కూడా ఏదో ఆలోచిస్తూ
తిరుగాడుతున్న మృతదేహాలు ఎన్నోగా..

సుఖం సుడిగాలి ఊబిలోకి గుంజేస్తుంటే
నడవలేనన్న కాళ్ళతో నాట్యం చేయలేక
జీవిత సుడిగుండంలో మునగేసి లెగుస్తూ
స్మశానానికి సాగే బ్రతుకులు ఎన్నోగా.. 

నాతో నాకేంపని!

అంతా హైబ్రిడ్ హైక్లాస్ తిండే తింటున్నారుగా
పౌష్టికాహార బలంతో అవసరం మనకేముంది!

వేసుకున్న వస్త్రాలు చిన్నవై చిరిగి ఫ్యాషనవ్వగా
ఇంక సిగ్గుని సింగారించుకోవల్సింది ఏముంది!

కాగితం పూలూ ప్లాస్టిక్ పుష్పాలే అలంకారంగా
పరిమళ సువాసనలు కోరడంలో అర్థమేముంది!

ముఖం అంతా మేకప్ వేసుకుని మురుస్తారుగా
సుందర రూపలావణ్యం ఎక్కడ కనబడుతుంది!

ఉపదేశించవలసిన బోధకులే బ్రోకర్లై ఉన్నారుగా
ఇక విద్యాజ్ఞానం ఎక్కడ నుండి పుట్టుకొస్తుంది!

అన్ని ప్రోగ్రాంస్ కేబుల్ కనక్షన్లై వస్తున్నాయిగా
సంస్కారసభ్యతలు తెలిపే ఆస్కారం ఎక్కడుంది!

వ్యాపార లావాదేవీలు యమ జోరుగున్నాయిగా
ఆదరింపులూ ఆశీర్వాదములతో పనేముంటుంది!

అందరూ డబ్బు కూడబెట్టడంలో బిజీగున్నారుగా
ఇక దయకు దాక్షిణ్యాలకు తావేమి ఉంటుంది!

బంధాలూ బంధువుల మాటలన్నీ మొబైల్లోనేగా
కలిసి చెప్పి చర్చించుకోవటానికి 
ఇంకేంమిగిలింది!

నా లోకం..

జీవితం బహుమతిగా ఏమిచ్చినా స్వీకరించేస్తా
నా కోరికలు కలలని చెప్పడం మానివేస్తున్నా..

పట్టుకుని పరాయిలా పారిపోతే చేయి వదిలేస్తా
నా హృదయానికి దగ్గరైన వారినే చేరదీస్తున్నా..

అర్థం చేసుకోకుంటే నా బాధలకు ముసుగువేస్తా
నా గాయాల్ని దాచేసి ముందుకు అడుగేస్తున్నా..

అనవసర పరిమితులను మితం చేసుకుని జీవిస్తా
నా సొంత వాళ్ళైతే కలుస్తారుగా వేచిచూస్తున్నా..

అనుభవసారం తెలిసిన నాకునేను ఓదార్పునిస్తా
నా పలకరింపంటే పళ్ళికిలించడం కాదంటున్నా..

పెద్దవ్యక్తుల పరిచయంలో చిన్న
గా అవ్వక విడిచేస్తా
నా చిన్నిలోకానికి నేనే మహారాణినై ఏలుకోనున్నా..

నా కాలాలు..

ప్రోగు చేసుకుంటున్న అనేక జ్ఞాపకాలను
పదిల పరచుకునేందుకు మనసు సరిపోక
ప్రకృతిని కూసింత చోటివ్వమని అడగబోతే
చేదుజ్ఞాపకాలను మట్టుపెట్టి తీపివిమ్మంది!
చిట్టిగుండెలో చిందులేసేటి చేదుస్మృతులను
పొమ్మంటే గతాన్ని త్రవ్వుతూ నాపై అలక
పంచభూతాలని ఏదోలా మాయ చేయబోతే
తెలియని తపన ఏదో తన తోడు కోరింది!
పెనుగులాట వద్దని పేరుకున్న వ్యధలను
మూటగట్టి మంటల్లో వెయ్యటం నాకు రాక
గతం గుర్తురావద్దని మరపుతో చేయికలిపితే
మంచు కరిగి మంటలార్పి కసిగా నవ్వింది!
చీటికిమాటికి చప్పుడు చేస్తున్న బాసలను
చర్చ చేయక చటుక్కున చంపడం చేతకాక
భవిష్యత్తుని బాట అవ్వమని బ్రతిమిలాడితే
భూత వర్తమానం వేదనలను అప్పగిస్తుంది!

కరిగిన హారతి

నా తనువునూ మనసునూ నేను కోల్పోయేంతగా
నన్ను నువ్వు అల్లుకుపోయావని నీకు తెలియదుగా
ఒకవేళది నీకు తెలిసుంటే ఇలా చేసి ఉండవుగా..
ప్రతీశబ్ధం కూడా నీ రాకగా వచ్చిన సంకేతమేగా
అది విని ముంగురులు మోముకు ముసుగేసాయిగా
మూసుకున్న తలుపులు బార్లా తెరుచుకున్నాయిగా..
కాటుకద్ది కనులు కంగారులో బసగబారినాయిగా
అద్దుకోబోయిన కుంకుమ చెంపనుతాకి ఎరుపెక్కెగా
నీ దృష్టే తగులును అనుకుని నువ్వు రాలేదేమోగా..
నువ్వు వచ్చావు అనుకుంటే గాలొచ్చి చొరబడెగా
తలలో తురుముకుంటున్న పూలేమో తడబడ్డాయిగా
అరాటంలో అటు ఇటు తచ్చాడి కాలు బెణికెనుగా..
అయిన అలికిడులన్నీ నువ్వు వస్తావన్న ఆశలేగా
నీతో ఉండాలని నిన్ను చూడాలనుకున్న కోరికలేగా
నీ పెదవి పలుకులై కరిగిన కమల కర్పూరం నేనేగా..

మజాచేద్దాం..


మ్యాగీ అయినా మగాడి మూడ్ అయినా రెండు నిముషాలులే
పాస్తా అయినా పిజ్జా అయినా వేడిగా తింటేనే బాగుంటుందిలే

క్యాడ్ బరీ చాక్లెట్ అయినా కన్నెపిల్ల ముద్దైనా తియ్యగుంటదిలే
ప్రైయంస్ అయినా కోమలివేళ్ళైనా పట్టుకుంటే మెత్తగుంటాయిలే

ప్లంకేక్ అయినా పోటుగాడి పట్టైనా పసలేకుంటే పనిజరుగదులే
కర్రీపఫ్ అయినా మగమీసకట్టైనా కరకరమంటే కమ్మగుంటదిలే

బర్గర్ అయినా పిల్లదాని బుగ్గలైనా నొక్కబోతే మెత్తగుంటాయిలే
పేస్ట్రీస్ అయినా ఐస్ క్రీం అయినా కరగక ముందే తినెయ్యాలిలే

నూడిల్స్ అయినా నూడిటీ అన్నా నచ్చినోళ్ళే మెచ్చుకుంటారులే
టోస్టులు అయినా బన్నుముక్కలు తిన్నా బాడీ బలంగుండాలిలే

చిప్స్ అయినా బిస్కెట్లైనా చిన్నదాని చిలిపిచేష్టలకు సరితూగవులే
కుక్కీస్ అయినా కేక్స్ అయినా జతకూడితే ఆకిక్ మజాయేవేరులే

కూల్ డ్రింక్ అయినా సోడా చల్లగున్నా సోగ్గాడు వేడిగుండాలిలే
సాస్&కెచప్ అయినా సరసశృంగారమైనా సాప్ట్ ఐతేనే సంతృప్తిలే

జంగ్ ఫుడ్ అయినా జాలీ చెయ్యాలన్నా శరీరం సహకరించాలిలే
ఆడదానికైనా మగాడికైనా మంచి ఆరోగ్యపు అలవాట్లు అవసరంలే

కొత్త భ్యాష్యం

నిన్ను చూసి స్థంబించిన మ్రానులా నీపై వాలినప్పుడు
బరువనుకుని ప్రక్కకు జరుగకు అది నా అనురాగం!
పెగలని నా పెదాలు నీ పెదాల్ని లేతగా తాకినప్పుడు
గట్టిగా అరచి గోలచేయకు అదేగా వలపు చుంబనం!
నా చేతివేళ్ళు నీ తలను నిమురుతూ చెరిపేస్తున్నప్పుడు
వెర్రని చిరాకుపడకు అదేమో వ్యామోహానికి నిదర్శనం!
నా మోము నీ చేతుల రాపిడికి ఎర్రగా మారినప్పుడు
కనురెప్పల్ని వాల్చ బాధనా అనడక్కు అదే ఆలంబనం!
మనిద్దరి హస్తాలు హత్తుకుని నులుముకుంటున్నప్పుడు
అదేదో పెనుగులాటని వాపోకు అదో వినపడని గేయం!
వెచ్చని శ్వాస ధ్యాసలు రెండూ వివస్త్రలై ఏకమైనప్పుడు
ఉప్పగుంది స్వేదం అనకు అది అంతరోష్ణ ప్రేమద్రవం!
రెండు శరీరాలు పెనవేసుకుని లతలా అల్లుకున్నప్పుడు
ఒకరికొకరము బంధీలైనాం అనుకోకు అదొక బాంధవ్యం!


మారుతున్న లోకం

ఎన్నో భావాలు రంగులు మార్చి పారిపోతుంటే
పొందికతో పదిలపరచాలని ప్రయత్నం చేస్తున్నా
మనస్తత్వ పోకడల్ని అనుగుణంగా మార్చేస్తుంటే
అవగాహననే ఆహారాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
ఆశయాలను అలంకరించి అంగట్లో అమ్ముతుంటే
మనస్శాంతి కరువై నష్టవ్యాపారమని వాపోతున్నా
ఎండిపోయి బీడులా బలహీనమై బంధంక్షీణిస్తుంటే
ఆశామ్లధారతో అనురాగాన్ని తడిమి తడుపుతున్నా
రెక్కవిరిగిన పక్షినై కూడా ఎగరలేక ఎగరబోతుంటే
చీకటి వాస్తవాల నడుమ రేచీకటితో తచ్చాడుతున్నా
నా భావభంగిమలు లోకజ్ఞానంలేక చిందులేస్తుంటే
వాటిపై పొగడ్తల వర్షం కురవాలని ఆశపడుతున్నా
మారుతున్న లోకానికి తగినట్లుగా మారాలనుకుంటే
రాజీకి రాని మనసూ మెదడుల మధ్య నలుగుతున్నా

ఛీ పోరా..

వాగేవాడితో వాగ్వివాదం ఎందుకని
వాటేసుకుని వయ్యారాలు బోతిని...
తెగించినోడికి తెడ్డే లింగం అనుకుని
తెలివిగా తప్పించుకుని తలపడితిని
కసురుకునేటోడికి కవ్వింపు ఎందుకని
కనుసైగతో కసిరి కాపురం చేస్తిని...
నవ్వరానోడికి నిక్కులెక్కువ అనుకుని
నపుసంకుడికి రంభ దొరకెననుకుంటిని
అలిగినోడితో ఆటవిడుపు ఎందుకని
అదును కోసం అదేపనిగా చూస్తిని...
చిరాగ్గా ఉంటే చిద్విలాసం అనుకుని
చిర్రుబుర్రులాడితే చిలిపిగా నవ్వితిని
ముట్టుకుంటే మూలగటం ఎందుకని
ముద్దుకి మురిసి గుద్దుకి అరుపేలని...
తిడితే చచ్చి దీవిస్తే బ్రతకరు అనుకుని
తిట్టనంటూ "ఛీ పోరా" గాడిద అంటిని!

తలగడమంత్రం

తెల్లని సుతిమెత్తని మనసువంటి వెన్నపూసిన ఇడ్లీలను
పప్పులపొడితో తినమంటే పల్లీపచ్చడే పసందు అంటావు
దూది బంతుల్లా గుండ్రంగా నా బుగ్గల్లాంటి బొండాలను
బిడియంవీడి బోళాగా పెడితే ఎర్రకారంలో అద్దమంటావు
దొడ్డు బియ్యం రుబ్బి దోరగా ఒకవైపు కాల్చిన దోశలను
వేడిగా ప్లేటులో వడ్డిస్తే కొబ్బరిపచ్చడి ఏదని అడుగుతావు
గుళ్ళు మినప్పప్పుతో నా చక్రాల కళ్ళవంటి చిట్టిగారెలను
ఆడుతూపాడుతూ అందించగా చిల్లు చిన్నది అంటున్నావు
మైదాలేని గోధుమపిండి కలిపి పూర్తిగా పొంగిన పూరీలను
నవ్వుతో అందిస్తేనేమి నంజుకోడానికి కుర్మా కావాలంటావు
సొట్టచెంపల సొగసులద్ది ప్రేమతో వేసిన పెసరపునుగులను
పవిటమెలిపెట్టి ప్లేటులో పెట్టిస్తే చల్లదనానికి పెరుగేదన్నావు
ఆదరువుగా అలిగిన నీకు జీడిపప్పూ నెయ్యివేసిన ఉప్మాను
అందించబోవ ఉప్మా కన్నా ఉపవాసం నయమని అరిచావు
ఆకలి వేస్తే ఏమివ్వాలో తెలియని అమాయకురాలిని నేను
అన్నీ తెలిసిన అగంతకుడివి అసలుకే ఎసరు పెట్టేస్తున్నావు
అందించే అల్పాహారాలు అన్నింటికీ ఏదోక వంకపెట్టే నీవు
అర్ధరాత్రి దీపమార్పి దిండు మంత్రమేస్తే దిమ్మతిరిగిపోతావు

శుభరాత్రి..


అలోచిస్తూ నిద్రపోవాలని ప్రయత్నిస్తున్న నాతో..
ఎలా ఉన్నావూ అంటూ అడిగింది నా హృదయం
చెబితే తెలుసుకోవడంలో గొప్పతనం ఏముంటుంది
మనసుని ఏమార్చే కళ్ళలోకి చూసి కనుక్కోమన్నా!

అసహనంతో అటూఇటూ పొర్లిదొర్లుతున్న నాతో..
ఏం చేస్తున్నావూ అంటూ అడిగింది నా మెదడు
అనవసరమైన ఆలోచనలన్నీ దొలిస్తే ఏముంటుంది
పరిష్కారంలేని ప్రశ్నలేయకని విసుగ్గా కసురుకున్నా!

అనుకోకుండా వచ్చిపడ్డ సమస్య హాస్యమాడె నాతో..
మనిషన్నాక ఇవన్నీ తప్పవని నవ్వాయి పెదవులు
తడుముకుంటే తీరదు ఏదీ తీరిగ్గా యోచించమంది
కనులకు విశ్రాంతి ఇవ్వాలని కలవరం మానుకున్నా!

అకస్మాత్తుగా ఆవలింతలెన్నో వచ్చి అన్నాయి నాతో..
అర్పితా...అలోచిస్తే అసహనమే తప్ప సమస్యలేవీ
పరిష్కరించబడవు అసహనంతో ఎన్నో కోల్పోతావంది
అందుకే నిశ్చింతగా నిదుర పోవాలి అనుకుంటున్నా!

కరిగిపోతూ..

దినదినం నేను తరిగిపోయి కరిపోతున్నా
నీ ఊహకు కూడా అంతు చిక్కనివ్వనులే
నీకు ఆ అవసరం అవకాశం రానివ్వను!
క్షణక్షణం నిన్ను తలుస్తూ ఆవిరైపోతున్నా
నన్ను నే వెలిగించుకుంటూ బ్రతికున్నాలే
అయినా ఆ విషయం నీకు తెలీనివ్వను!
చకచకా నువ్వెళుతూ కప్పిన చీకట్లోఉన్నా
కొవ్వొత్తినై కాలిపోతూ వెలుగుని ఇస్తానులే
కరిగిన మైనం మరకైనా నీక్కనబడనీయను!
టపటపా ఆశల ఆకులు నేలరాలిపోతున్నా
మరో కలకు ఆశావాదమద్ది నిద్రలేపుతాలే
నీకు తెలియని నన్ను నేను మ్రింగేస్తాను!
రెపరెపా రెక్కలు కట్టుకుని ఎగిరెళ్ళిపోతున్నా
ఆకాశపు అంచుల్లో అద్దంలా అగుపిస్తావులే
అలా నిన్ను అంటీముట్టక అంతమైపోతాను!

గతితప్పకు

చిందులేసి చిలిపిగా చూడు పర్వాలేదు
పెనవేసుకోవాలనుకో అదేం తప్పుకాదు
పేట్రేగిపోతే...చీల్చి చెండాడేస్తా చూసుకో

కలలోన కలతగ కంగారుపడితే ఏంకాదు
కావలి కాసి కలవరపెడితే ప్రమాదంలేదు
కావరమెక్కితే...కోసి కారంపెడతా కాసుకో

వ్రాసిన పదాలను చడవడం గొప్పేంకాదు
వలవేసి మౌనాన్ని చదివితే నేరమూకాదు
వలచి మోసగిస్తే...వంచి వాతేస్తా మూసుకో

గాలివాటంగా గతితప్పి గల్లంతైతే గాబరాలేదు
గుంబనంగా చితిరగిలినా బూడిదకాక తప్పదు
గుడిసేటి పనిచేస్తే...గుంతలో పాతేస్తా మానుకో

ఆడదాన్ని అందమైన బొమ్మనుకో హానీకాదు
పెద్దాచిన్నాని చూడక పైనపడితివా ఇదంలేదు
నగ్నంగా నిలదీసి...కాల్చిపారేస్తా చచ్చి పో!!