అతడే నేను...

అతనన్నాడు:-
నాకు అర్థం కాదని
గాజువంటిది తన మనసని
రాతిగుండెలాంటిది లోకమని...

నేనన్నాను:-
ఆ మనసు నాదని
దాన్ని అతనికెపుడో ఇచ్చేసానని
రాయిగా మనసుని మారనీయకని...

అతనన్నాడు:-
నాకు లోకాన్ని చుపుతానని
ఆనందానికి నిర్వచనం తనేనని
పరుల మాటలు పట్టించుకోవద్దని...

నేనన్నాను:-
నీ కళ్ళలో నాలోకం ఉందని
అతని నవ్వే నా ఆనందమని
పరాయిగా నన్ను చూడకని...

అతనన్నాడు:-
నాకు తోడై ఉంటానని
కంట నీరు రానీయనని
జీవితాంతం నాతోనేనని...

నేనన్నాను:-
నా నీడై నడచిరమ్మని
కలతలకు తావీయనని
నా జీవితమే అతడని...

కవిత రాయలేను....

ఓ చేతిలో కలంతో కాగితంపై గీస్తూ
మరోచేతి గోళ్ళను మునిపంటితో కొరికేస్తూ
కలువల్లాంటి కళ్ళకి శూన్యాన్ని చూపిస్తూ
మెదడుకు మేతను తినిపిస్తూ.....

హృదయాన్ని తికమక పెట్టేస్తూ
మీ పెదవులపై నవ్వుని విరబూయిస్తూ
మంచి కవితనొకటి రాయాలని యోచిస్తూ
నడిరేయంతా మేల్కొన్నాను ఆలోచిస్తూ....

నాలుగక్షరాలని అటువిటు రాస్తూ
మురిసిపోయాను పైన క్రింద చదివేస్తూ
నా పిచ్చి రాతలనుండి మిమ్మల్ని రక్షిస్తూ
సమయం మేల్కొల్పింది నన్ను వెక్కిరిస్తూ....