ఊపిరున్న శవం..

నా భావాలను వెళ్ళబుచ్చి ఎవరిని మెప్పించి
ఏం సాధించానో ఏమో తెలియకపోయినా...
ఉన్నదున్నట్లు చెప్పుకుంటే తిప్పలు తప్పించి
ఒరిగేది ఏమీ ఉండదని ఆలస్యంగా తెలుసుకున్నా!

నా నీడని వేరొక అందమైన రూపంలో రంగరించి
ఏం పొంది ఆనందించానో తెలియకపోయినా...
కలలన్నీ కరిగి ఆవిరైపోవగా కన్నీరంతా హరించి   
కాటికేగబోవ ఊపిరి ఉందంటే జీవచ్ఛవమై ఉన్నా!

నా ఆలోచనలకి అనుగుణంగా అందరినీ ఎంచి
ఏం లాభాన్ని పొందానో తెలియకపోయినా...
ఉన్న మనసుకి లేని పిచ్చిని కూడా ఎక్కించి
వెర్రిదాన్నని పచ్చబొట్టుతో పద్మ అనిపించుకున్నా! 

నా అంతరంగం ఎంతో నిర్మలమైందని భ్రమించి
ఏం ఆశల అందలమెక్కానో తెలియకపోయినా...
ఉన్న ఆత్మనిబ్బరాన్ని నలిపేసి నట్టేట్లో ముంచి
పరులను నమ్మి నన్ను నేను హత్య చేసుకున్నా! 

అపరిచితులం అవుదాం...

మన ఈ పరిచయమేదో మనకు అచ్చిరాలేదు 
పద ఇద్దరం అపరిచితులం అయిపోయి మరల 
మంచిముహూర్తం చూసుకుని పరిచయమౌదాం!

నీ నుండి నేను నా నుంచి నీవు ఏమీ ఆశించక
తప్పొప్పులు ఎంచక ఇద్దరి చూపులు కలబడేలా
ఒకరినొకరు ఆకర్షించే కిటుకులేవో కనుక్కుందాం!
   
ఎడబాటు ఎదకొట్టుకోవడం పలుకలేదని అలగడం
ప్రేమలో హెచ్చుతగ్గులని తగవులాడుకోని జతలా 
మదిగోడలపై నీ నా పేర్లు పచ్చబొట్టు రాయిద్దాం!

అహపు అడ్డుగోడ తొలగించి క్షమని పందిరిగా అల్లి
పాత వలపుని నరికి తిరిగి పరిచయం పెంచుకుని
బాధల్ని ప్రక్కనెట్టి బలమైన బంధాన్ని ముడివేద్దాం! 

గాయమవని కొత్తమనసులు రెండూ పొట్లం విప్పి
ఒకరంటే ఒకరికి ఇష్టం ఆసక్తి పెరిగి పోటీ పడేలా
నాటి తప్పటడుగుల్ని మార్చి సప్తపదిగా నడుద్దాం!


కృత్రిమం..

ఎంత దూరానున్నా ఎప్పుడూ ఎడబాటు అనిపించలేదు
ఎదురుగా నిలబడున్నా ఇంతకూ నువ్వెవరన్న ప్రశ్నే..
నా అన్న భావం పరాయిదై వలపు వగరుగా అనిపించి
నకిలీతనపు నవ్వులద్దుకుని నగ్నంగా నర్తిస్తున్న నైజం!

పలికినా పలక్కపోయినా మౌనంలో భాష కొరవడలేదు
ఇప్పుడు పదే పదే పిలిచి పలుకరించినా ఏదో దిగులే..
నా వాడు కాడన్న సంశయంతో ముద్దుగా పిలవాలన్నా
ఎందుకో వద్దని లేని గాంభీర్యాన్ని అద్దుకున్న ముఖం! 

తిన్నావాని అడిగితే చాలు కడుపునిండి ఆకలేవేయలేదు
వెళుతూ వెనుతిరిగి చూస్తే వస్తాడన్న నాటి ధీమాయే..
నాతో లేడంటూ నేటి కన్నీటికి కారణమై ఏం చెప్పాలన్నా       
మాట్లాడొచ్చానడిగి మాట్లాడబోయి పలికితే అంతా మౌనం!

బంధానికి బలమని నవ్వబోతే ఆ నవ్వులో జీవమేలేదు
అది చూసి అనురాగమే ముడులు విప్పుకుని ఎగిరె..
నాది నాదన్నది నన్నువీడి ఇంకెవరితోనో ముడివడిపోయి
ఎప్పటికైనా పరాయిదాన్ని నేనేనన్నది ముమ్మాటికీ నిజం!