నీకు నువ్వు.

కొన్నిరోజులు కఠినంగా గడిపేస్తూ
దుర్లభంగా సాగవల్సి ఉంటుంది..

ఏకాంతంగా మనసు మాట వినేస్తూ
మనోనిబ్బరాన్ని పెంచాల్సి వస్తుంది..

బాధకి ముసుగేసి దుఃఖాన్ని దాస్తూ
నవ్వుతూ పోరాడవల్సి ఉంటుంది..

వచ్చే కష్టాల్ని రానిచ్చి దిగమ్రింగేస్తూ
నీపోరాట ప్రతిభని మెచ్చాల్సి వస్తుంది..
చేస్తున్న ఒంటరిపోరాటం జబ్బచరుస్తూ
నీ ఆత్మస్థైర్యానికి నీవే గర్వించాల్సింది..

నీకోసం నువ్వూ నీకై నీవుగా జీవిస్తూ
ఏదేమైనా చివరిదాకా బ్రతకవల్సిఉంది..

జీవితబొంత

జీవితంలో జనం అతుకులబొంతలా కలుస్తారు
కొందరు కోరుకున్న దానికంటే పెద్ద ముక్కగా
కొందరేమో చిన్న ముక్కలుగా జతకూడతారు!

జీవనబొంతలో వివిధ గుడ్డపేలికలై సాగుతారు
కొన్నిపేలికలు చికాకు పెట్టే చతురస్రాకారంగా
మరికొన్నేమో ముతకదారపు పేలికలైమిగిలేరు!

జీవించడానికి రంగుబట్టలెన్నో అతుకుతుంటారు
కొంతమందిని పనికిరాక మనం వదిలివేస్తాంగా
కొంతమందేమో బట్టముక్కలై కుట్టేయబడతారు!

జీవనానికి ప్రతీ గుడ్డముక్క అవసరమనితెలిపేరు
కొద్దిపాటి గుడ్డలు నాలుగుమూలల అతికినట్లేగా
కొద్దిపాటి జనమేమో చిరిగిపోయి విడిపోతారు!

జీవించేబొంత చాలాచిన్నదని తెలుసుకున్నవారు
కొంతకాలం ఉండిపోవారి నుండి ఏం కోరరుగా
కోరివచ్చిన వారి మనసున చిరకాలం ఉంటారు!

ఆమె ఏమిటో..

ఎప్పుడూ నవ్వుతూ కనబడుతుందని
ఎంతో శక్తిమంతురాలు అనుకుంటారు
కానీ ఆమెకే తెలుసు ఆమె ఏమిటో..
కంటినిండా కలలతో అందంగుందని
ఎంతో తెలుసుకోవాలని ఆరాటపడతారు
కానీ అమెకే తెలుసు వారు ఏమిటో..
ప్రేమ పంచి నిస్వార్ధంగా ప్రేమిస్తుందని
ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తారు
కానీ ఆమెకే తెలుసు మర్మం ఏమిటో..
చేసే నిశ్శబ్దపోరాటం మూసి కప్పెట్టిందని
ఎంతో ధైర్యం చలాకీపిల్ల అనేస్తుంటారు
కానీ ఆమెకే తెలుసు ఆయుద్ధం ఏమిటో.. వివరించలేని దుఃఖం బెంగ కనబడట్లేదని
ఎంతో లోతైన వ్యక్తిత్వం కలది అంటారు
కానీ ఆమెకే తెలుసు ఆందోళ ఏమిటో..
అంచనాలేసి తనపై తానే ఆధారపడిందని
ఎంతో తెలివైనామెని మరచిపోలేమంటారు
కానీ ఆమెకే తెలుసు సంకల్పం ఏమిటో..
ఇతరుల లోపాలు వివరాలు పట్టించుకోదని
ఎంతో పొగరుబోతని నిరుత్సాహపరుస్తారు
కానీ ఆమెకే తెలుసు ఆత్మబలం ఏమిటో..