టాటా...బైబై!!

 నేను రాసేవి కవితలంటే కవితా హృదయం నన్ను గేలిచేస్తుంది
రాయకపోతే మీకు దూరమై నా ఒంటరితనం నన్ను వేధిస్తుంది

నా రాతల్లోనిది కవిత్వమే కాదు కల్పన కూడా అందులో లేదు
గుండె యొక్క స్వరానికి తర్జుమాయే కానీ పదాల అల్లిక కాదు

అప్పుడప్పుడు గుండెలయలే ఊసులై పదమాలికలై పెనవేసాయి
కొన్నిసార్లు కన్నీళ్ళే నా కవితలకి కారణమై ఉప్పొంగి పారాయి

శాంతి కరుణ శృంగార శౌర్య భయ రౌద్ర అద్భుత హాస్య భీభత్సం
ఈ నవరసాలు మేళవించిన జీవిత సత్యాలే నా రాతలకు కారణం

ప్రేమికుల అనురాగమే అలవోకాక్షరాలై అల్లుకున్న కవితలుకొన్ని
మధురసంగీత సప్తస్వరాలు అందించిన ఆనందపు వీచికలింకొన్ని

చావుబ్రతుకుల సారమెరుగని నాకు సాహిత్య సారాంశమేమెరుక
సాదాగాబ్రతికే నేను సంఘసంస్కరణ చేయ ఏపాటిదాననుగనుక

నే రాసే ఈ రాతలు నలుగురి నవ్వుకి కారణమైతే అదే ఆనందం
నా ఈ బ్లాగ్ రాతలు ఎవరినీ నొప్పించి ఉండవనేదే నా నమ్మకం!!
టాటా...బై...ఇంక చాలు ఈ 2012లో మిమ్మల్ని హింసించింది:-)
మరి మీరంతా రెడీనా!!.....2013 లో నా సుత్తిని భరించడానికి:-)

జ్ఞాపకాల నీడ

జ్ఞాపకాల కొమ్మను వీడిన
ఆకొకటి ధూళితో దరి చేర
చూసిన మది విలవిలలాడె..

పాతస్మృతులను ఆత్రుతతో
గాంచిన కనులు చెమ్మగిల్ల
మనసు సుడిగుండమాయె..

ఆనాటి తీపి గుర్తులను తలచి
ఆ అర్హత ఏదంటూ నిలువలేని
బాసలు తామరాకుపై నీరై జారె..

విడివడినా కనబడని బంధమేదో
హృదయాన్ని కోసే భాధగామారి
నలుగురిలో నన్ను ఒంటరిని చేసె..

అంతుచిక్కని ప్రశ్నలెన్నో వేధించగా
గుండెలోకిక్కిర్సిన గుర్తులే జవాబులై
నీడలా ఉంటూ నన్ను నడిపించసాగె..


వ్రాయాలని..

వ్రాయాలనుకున్నా అందరిని మెప్పించి
నన్ను నేనుగా ఎవరో ఏమిటో వివరించి
హృదయపుద్వారాలని తెరచి విడమరచి
గుండె లోతుల్ని, ప్రతి మూలని పరికించి
పలకని పదాలని వెతికి వాటికి జీవంపోసి
పాతగాయాల జ్ఞాపకాలకి కొత్తలేపనంపూసి
అంతర్గత లావాలవంటి భావాలని వెలికితీసి
ఒక సందేశాత్మక పోస్ట్ వీరలెవెల్ లో రాసి...
నాకు నేనే మురిసిపోవాలనుకున్నా చూసి...
అంతలో ఆగమని వెలుగురేకొకటి ఉదయించి
ఓనమాలు దిద్దు అర్పితా అంటూ ఉపదేశించి
అలవికాని వాటికై ఆలోచనలేలని మందలించి
పద్మవై  ప్రకృతిలో పరవశించి అన్నీ ఆస్వాధించి
ప్రేమామృతజ్వాలై ఎగసి మంచుమాయలో తడిసి
పెరిగిన పదాలపట్టుకొమ్మల్లోని పదపుష్పాలని కోసి
సహజ సరళ వాఖ్యాలకి కొత్త ఆలోచనలని జతచేసి
ఎడారి జీవికి దప్పిక తీర్చి హాయిగా ఆనందింపజేసి
ఆగ్రహాన్నైనా అనునయంతో అనురాగంగా మార్చేసి...
                                                                  వ్రాయమన, అణిచేసుకున్నా నా ఆవేశాలకి కళ్ళెంవేసి!

లేచిపోనా???

ముందో వెనుకో కాదు నాతో నడచి
భారమైన దూరంలో నాకు నీవుచేరువై
నా కనుల భాషలో కానని భావాలని
మదితెలిపే కధగా నీకు వినిపిస్తుంటే...
వణికేపెదవులు కొరికి తడిపేసుకుంటూ
చెప్పనా వద్దాన్న సంశయంలో నేను
మెరిసేపెదవులపై పుప్పొడద్దాలని నీవు,
నడుమ గాలిదూరి గిలిగింతపెడుతుంటే...
నువ్వే నా ప్రాణమైనావన్న ఎదసడులు
చెప్పకనే చెప్పిన ఊసులై నీ చెవినిచేరగా
అది విన్న నీవు పరవశాన్న ఉప్పెనై పొంగి
ఎల్లలెరుగని అనురాగానికి ఏ హద్దుల్లేవంటే...
ఒకవైపు అంగీకరించే మనసుకు రెక్కలువచ్చి
సుధూర స్వప్నసౌంద్యర్యలోకానికి ఎగురబోవ
ఆలోచించంటూ తీరని భాధ్యతలు వెనక్కులాగ
మేలిముసుగులో అపరిచితురాలినై నిలుచుంటే...
నా నిస్సహాయతని నీవు మోసగత్తెగా అభివర్ణించ
సంఘం బరితెగించిన బ్రతుకంటూ గుసగుసలాడగా

బంధించే ఈ
భాధ్యతలేలని తెంచుకుని లేచిపోనా???
కోరివస్తే కాదని కట్టుబాట్లచెరసాలలో బంధీనై మిగలనా?

ఈ దినాలు అవసరమా?

నిజం నిష్టూరమని అసత్యమాడాలంటే
అబద్ధాన్ని నిజమని నమ్మేలా ఏమార్చి
నిజమేదో నిరూపించబడనంతగా నమ్మించి
నిజంచెప్పినా అసత్యమనుకునేలా చెప్పాలి.

న్యాయంగా పయనం సాగించలేమనుకుంటే
అన్యాయాన్ని ఆశ్రయించి దాని పంచన చేరి
న్యాయాన్ని నడిబజారులో నగ్నంగా నిలబెట్టి
అన్యాయానికైనా న్యాయం చేసామనుకోవాలి.

నిజాయితీగా కాక అవినీతితో బ్రతకాలంటే
ఇతరులని దగా చేసి మన మనసుని చంపి
వారి అవసరాలని అవకాశంగా మలచుకుని
స్వార్థానికి నిజాయితీగా తలొగ్గి సాగిపోవాలి.

నాకై నేననుకుని బ్రతకడమే జీవితమనుకుంటే
ప్రతిక్షణమలా చస్తూ బ్రతకడమే ఆనందమనుకుని
బ్రతికే ఈ బ్రతుకులకి పనికిరాని సంబరాలు చేస్తూ
12.12.12 లాంటి ప్రత్యేకమైన దినాలు అవసరమా?

ఈ శిక్ష

చల్లని వెన్నెలరేయిలో నీవు గుర్తొస్తే
మనసులేచి చంద్రుడ్ని జోకొడుతూ
మన్మధుడ్ని తిడుతూ నిన్నుకోరింది!

మంచుకురిసేవేళలో నేను ముద్దైతే
రెపరెపలాడే నా కనురెప్పలు రేయిని
పగలుగా మార్చమని తూర్పునడిగింది!

సూర్యకిరణాలు సూటిగా నన్ను చూస్తుంటే
ఎర్రబడిన నా నయనాలు నిర్దోషిని నేనంటూ
నీపై అపవాదుని నాపై మోపి శిక్షించమంది!

కఠినంగా దండించలేని  జీవితం కరుణచూపితే
బింకానికి
పోయిన భావాన్నీ బెట్టు చూపుతూ
వెక్కిరించే విధితో ఈ ఎదురీత అవసరంలేదంది!

హృదయతృష్ణ

ప్రేమకావ్యం కాని సందేశాన్ని నీకు అందించాలని  
నీ తలపులతో నేను పోరాడి గాయాలతో గెలిచానని
తెలిపే పదాలకూర్పుకై వెతికా ఆశల నిఘంటువుని
వాటినే రాశులుగా పేర్చి ప్రయత్నించా రాయాలని!

తెలుసు నాకు సహనంతో నీవు వాటిని చదవవని
చేసిన బాసలు, చిలిపి చేష్టలు కొన్నేకదా అనుకుని
రాయబోయి చిట్టాల చాంతాడులో చిక్కుకున్నానని!

అలిగితే అది తీర్చ దరిలేని నిన్ను ఊహించుకుని
గడచిన స్మృతులలో కలిసున్నవి కొన్ని ఎంచుకుని
చేసాను ప్రయత్నం పలువిధాలా నీకు పంపాలని!

కానీ......నా నిదురలేని కళ్ళు నీపై నిందవేయాలని
ఊగిసలాడే మదిని రెచ్చగొట్టి నిన్ను కంటపడమని
లేకపోతే నా ఊపిరిలో కలిసిన నిన్ను వేరు చేస్తానని
తెలిపిన బెదిరింపుని బాధగా గొంతులో అణచి వేసుకుని
కన్నీటి కెరటాల్లో కడిగేయ ప్రయత్నించా నీ జ్ఞాపకాలని!


చివరికి వ్యధై రగిలి హృదిజ్వాలై రక్తాన్ని ఆవిరిగా మార్చి
అల్లంత దూరాన్న అందని ఆకాశమలే ఉన్న నిన్ను చేరి
మేఘమై వర్షించి తృష్ణను తీర్చి ఊపిరిపోయ రమ్మంది!!!