ఏదీ ఏకంకాదు..

ఈ రంగులు మారే లోకంలో
ఏ రెండు రంగులు ఒకటికావు
ఒకదానికోసం మరొకటి మారదు.

అనునిత్యం సాగే సృష్టిలయలో
ఏ ఇరువురి రాతలు ఏకంకావు
ఒకరి గీతను ఇంకొకరు మార్చలేరు.

ఈ స్వార్ధపు అనిశ్చల జగతిలో
ఏ జతల భావాలు అతికిసాగవు
ఒకరి భావాలతో వేరొకరికి పనిలేదు.

అనురాగ ఆత్మీయతల లోగిలిలో
ఏ జంట మనసులు ఒకటికావు
ఒకరికి బదులుగా వేరొకరు చావరు.

ఈ అనంత జీవన పయనంలో
ఏ బాంధవ్యబంధాలు శాశ్వతంకావు
ఒంటరితనానికి ఎవరూ జతకూడలేదు.

అవసరమా ఇలా?


ఢాబూ దర్పాలనెలవే కాని పెళ్లంటే నేడు నాతిచరామికి అర్థం తెలీదు
మూడుముళ్ళ బంధమే కాని మూడ్నాళ్ళకది మురిపాల నెలవుకాదు

ముచ్చటైన కాపురమే అయినా కొన్నాళ్ళకా ముదితౌతుందతనికి చేదు
మెగామెకనైస్డ్ అయిన జీవనధ్వనిలో మగనికి మెట్టెలసవ్వడి వినపడదు

హైటెక్ ఉద్యోగాలంటూ పరుగుపందాలే కాని పరిణితి చెందిన పరవశమేలేదు
షాపింగ్ మాల్స్ తిరిగే మగువ నేడు మల్లెలతో మగనిమత్తెకించ నేర్వలేదు

పైసల కొరకై ప్రాకులాటే తప్ప కష్టసుఃఖాల్లో పాలుపంచుకోవడం అసలురాదు
కానుకలు ఇచిపుచ్చుకునే తులాభారమే కాని మనసుమమతల్లో కానరాదు

నువ్విస్తే నేనిస్తాననే పోటీపట్టింపుల పందెం వివాహబంధం అనిపించుకోదు
మనసులు కలవని ఇరువురి శరీరాల కలయికకు ఈబంధము అక్కర్లేదు!!!

ఎందువలనా!

తుమ్మెదవై మకరందం కావాలంటే కాదనగలనా

నాలోని అందాలన్నీ నీకోసమే అని తెలుపనా!

సీతాకోకచిలుకకి ఆ రంగులెక్కడివో నే చెప్పనా

పువ్వులపై వ్రాలి పుప్పొడిని రుచి చూడ్డంవలన!

అన్ని పూలకీ సువాసనబ్బలేదు ఎందువలనా

పూలన్నీ పూజకు పనికిరావది దైవసంకల్పన!

పుష్పాలకే ఇంత సుకుమారత్వం ఎందుకోచెప్పనా

పడతిలోని సొగసులని పూలతో పోల్చడంవలన!

ఈ తీయనైన మకరందమంతా నీదేనని అనతగునా

పరులకై ఉపయోగపడని జీవితం ఇంకెందువలనా!

సాగిపో....

మదిగాయంతో ముందుకు సాగిపో
ప్రతిగాయాన్ని మెట్టుగా మలచుకో
ఊహల రెక్కలతో దివిన విహరించు
నేలపై నిలబడి నిజాన్ని గ్రహించు...

ఎవరో వచ్చి ఏదో చేస్తారని మరచిపో
నిన్ను ప్రభావితం చేసినవారిని గుర్తుంచుకో
కాలమై సాగుతూ నిన్ను నీవు మరువకు
ప్రలోభాలకు ఎన్నడూ భానిసవుకాకు...

ఎదభారమైన వేళ ఒంటరిగా ఉండిపో

నలుగురిలో నవ్వుతూ దాన్ని మరచిపో
మందిరంలోని భగవంతుడ్ని పూజించు
మనిషిలోని మంచిని మందిరంగానెంచు...

చీకటి బాటలో వెలుగుగా నీవు మారిపో
నీ హృదయాన్ని ఆ వెలుగుతో నింపుకో
గడచినది ఏదైనా తలచి విలపించకు
జరగబోవుదాన్ని గూర్చి యోచించకు...

అడగనా? మాననా!

గుడిమెట్లు తుడవ నేను తగుదునా?
గుడిలోని కుంకుమ నే తాకలేనా!

పూలమాలలు నేను అల్లవలెనా?
ఆ మాల తలన నే తురుముకోతగనా!

రంగవల్లులు ఎన్నైనా నే రంగరించనా?
రంగులలోకాన్ని ఊహించడం తప్పౌనా!

శింగార సామాగ్రి నే సమకూర్చగలనా?
శింగారించుకున్న నేను సిగ్గులేనిదాననా!

ముత్తైదువులతో చేరి ముచ్చటించగలనా?
మురిపాలకు మాత్రం దూరమై మసలవలెనా!

విధవరాలంటూ గడియకోసారి గుర్తుచేయవలెనా?
విధిచేత బలైనవారినే పలుమార్లు బలీయతగునా?

చిరుకవితాజల్లు!!!

ఓ నేస్తమా....
వేసవితాపాన్ని చిరునవ్వుతో జయించి
వడగాల్పుల్లో వలపుమాటలతో పలుకరించి
చెమటతో శరీరం మండినా శాంతం వహించి
కరెంటుకోతను గడియలైనా క్షణాలుగా భరించి
వీటి నడుమ విధులను సక్రమముగా నిర్వర్తించి
ఎన్నో నిదురలేని రాత్రుల్ని ఎర్రబడిన కళ్ళలో దాచి
మండేసూర్యుని మనసుకునచ్చిన కవితలుగా మలచి
మదినిండా మల్లెల పరిమళాలని మెండుగా గుప్పించిన
నీకై....అర్పిస్తున్నా ఒక చిరుకవితాజల్లు!!!!!



ఓ మేఘమా....

తొలకరి జల్లుతో తడిపేయి నా నేస్తాన్ని
చిరునవ్వుకి దూరం కానీయకు అతడ్ని
వాన పాటలుగా మార్చేయి ఆ మాటల్ని
మధురమైన గడియలై మిగలనీ కాలాన్ని
చల్లని గాలులతో ఆరనీ తడిసిన శరీరాన్ని
విధినిర్వహణలో కలిగించకు అంతరాయాన్ని
సేదతీరనీ నిదురలేక అలసిన కనురెప్పల్ని
ఆలకించి అలరించ రావే నా ఈ విన్నపాన్ని
ఇంక కురిపించు వలపుల ముత్యాల జల్లుల్ని!!!!!



కాని...సమయం లేదు!

ఆనందించడానికి కావలసినవన్నీ ఉన్నాయి
కాని...ఆశ్వాదించడానికే సమయం లేదు!
అహ్లాదాన్ని కోరిన నయనాలు అలసినాయి
కాని...ఆదమరచి నిదురించ సమయం లేదు!
అమ్మఒడిన నిదురించిన జ్ఞాపకాలు గుర్తున్నాయి
కాని...ఆమెను పలుకరించ సమయం లేదు!
అనుబంధాలపై భాధ్యతలు అజమాయిషీచేస్తున్నాయి
కాని...వరుసలేంటో తెలుసుకునే సమయం లేదు!
అనురాగపు నీలినీడలు మదిని కలవరపెడుతున్నాయి
కాని...ఏడ్చి హృదయ భారముదింప సమయం లేదు!
ఆశలు ఆశయాలు ఆపేక్షల కత్తిపోట్లకి చచ్చిపోయాయి
కాని...కనీసం వాటిని సమాధిచేసే సమయం లేదు!
అవయవాలన్నీ ధనార్జనకై పరుగెడుతున్నాయి
కాని...అలసటేమిటో తెలుకునే సమయం లేదు!
ఆత్మీయతలకు నా-నీ స్వార్ధాలే అడ్డంకులైనాయి
కానీ...కారణమదని ఆలోచించ సమయం లేదు!
అన్నీ సొంతం కావాలని భావాలు చెలరేగుతున్నాయి
కాని...పరుల చింతకై యోచించే సమయం లేదు!
ఆలోచనలేని అందరి జీవనశైల్లు యంత్రాలుగా మారిపోతున్నాయి
ఇలాసాగితే...పచ్చని జీవితాలు బీడుబారడానికి సమయమక్కర్లేదు!