వస్తావని..

సాగరతరగల పరువం గలగల పొంగి పొర్లిపోతుంటే
చూసి ఈలలు వేయాలన్న కోరిక సహజమే కదా

బిడియంగా బెంబేలు చూపులతో నది నడుస్తుంటే
జలధిని కవ్వించుకోవాలి అనుకోడం తప్పుకాదుగా

సరుగుడు తోపులల్లో హోరుగాలి జగడమాడుతుంటే
తారలు నర్తించే మందాకినిలా కనబడుతుంది కదా

తెల్లని హిమపాతము గిరులపై పైటై పెనవేసుకుంటే
వర్ణకాంతులు వలపురంగరించి వెదజల్లక తప్పదుగా

ఆమని అల్లరి అడుగుల అలికిడికి తోట నర్తిస్తుంటే
పూలగంధ పరిమళ హాసము ఎంత రమ్యమో కదా

నింగిలోని జాబిల్లిరేడు విల్లులా ఒళ్ళు విరుచుకుంటే
పద్మ భానుడికై ఎదురుచూస్తూ అలసి నిదురించెగా!

ఇదేనా జీవితం..

హా....చెప్పు చెప్పూ ఉన్నవీ లేనివీ చెప్పి పొగుడు
లేదంటే ఆ పెట్టే పచ్చడి మెతుకులూ పెళ్ళాం పెట్టదు
దీన్నే సర్దుకుపోయి చక్కగా చేస్తున్న సంసారం అనుకో
లేదంటే రాతిరేళ మంచమెక్కవూ నీ మగ ఆకలి తీరదు!
ఆహా ఓహో అను...నీ అంత మగాడు లేడని పొగుడు
లేదంటే సొమ్ములు సరుకులు తీసుకొచ్చి నీకు ఇవ్వడు
దొర్లుతున్న సమయంతోపాటుగా సమాంతరమని సాగిపో
లేదంటే పతివ్రత ప్రాతివత్యానికి పగుళ్ళు కాపురంసాగదు!
హేయ్ ఓయ్...అని ఉన్నాలేకున్నా పెళ్ళాన్ని ప్రేమించు
లేదంటే మొగుడు కట్టిన తాళికి విలువ పరువు ఉండదు
దాన్ని పవిత్రమైన వివాహబంధమంటూ నమ్మించి నవ్వుకో
లేదంటే జరుగుబాటు అవ్వదు నీ సంతతి వృద్ధి చెందదు!
అమ్మో అయ్యో...మొగుడు తెస్తే తిను తేకుంటే అలుగు
లేదంటే కట్టుకున్నోడి కంచం తీయకు కట్ డ్రాయర్ ఉతక్కు
దిమ్మతిరిగి దేహీ అనేలా నీ కొంగున కట్టి నీవెంట తిప్పుకో
లేదంటే కష్టపడాలి ఎలాగో ఆలికి ఆత్మగౌరవంతో పనిలేదు!
ఇలా అలా ఎలాగోలా...దర్జాగా దాంపత్యజీవనం సాగించు
లేదంటే కట్టినోడినీ కట్టించుకున్నామెనీ సంఘం గౌరవించదు
జీవితమంటే పెళ్ళీ కాపురం పిల్లల్ని పుట్టించడమే తెలుసుకో
లేదంటే లోకం ఒప్పదు మనిషి జన్మకు సార్ధకత ఉండదు!

మగస్త్రీ కణం

స్త్రీ సర్వజగత్తు కానీ ఆమె పరిధిల్లో బిగించబడింది
వాటిని ఉల్లంఘించి లోకం దాటి బయటికి రాలేదు
విరాటపురుషుడి మాటకొస్తే విశ్వవ్యాప్తంగా ఉంటాడు
ప్రపంచం లోపలా బయటా కూడా పరిభ్రమిస్తున్నాడు
స్త్రీ ప్రేమ పురుషుడి ప్రేమకన్నా లోతైన నిగూఢమైంది
ప్రేమలో ఓడిపోవడం సాధించడం అనైతికం నొప్పేకాదు
ఆశనిరాశ సందేహ కథ కల కల్పనలు నిండిన గూడు
జ్ఞాపకాలను కన్నీటితో కడి నిబ్బరంగా నిలబడే మోడు
స్త్రీ తాను ప్రేమికురాలిగా పయనం మొదలిడి సాగిస్తుంది
ఆమెకు ఇంకేం తెలీదు తెలుసుకునే ప్రయత్నం చేయదు
విస్తృతమైన ఆ ప్రేమ అతనికెప్పటికీ తెలీదు తెలుసుకోడు
ఎందుకంటే పురుషుడు నాకేంటనే వలయంలోనే ఉంటాడు
స్త్రీ ప్రేమకు నిదర్శనంగా లోకం రాధ ప్రేమను గుర్తించింది
కృష్ణుడు అసలు ఎవర్నెంత ప్రేమించాడని తెలుసుకోలేదు
రాధ ప్రేమ పరిధిలో కేవలం కృష్ణుడు మాత్రమే ఉన్నాడు
రాధ ప్రేమపరిధి కృష్ణుడు అతడు అనంతమంతా నిండాడు
స్త్రీ ప్రేమ వ్యక్తిగతం పరిమితం తనకంటూ ఉన్న లోకమది
పురుషుడి ప్రేమ విస్తారం విశాలం అర్థంకాదు అంతంలేదు
సాధారణ దృష్టికది కనబడదనేమో జ్ఞాననేత్రం వెతకుతాడు
వ్యక్తపరచడానికి ఉన్న భాషలు చాలక కొత్తభాష కోరతాడు
స్త్రీ ప్రేమ చాలా చిన్నది ప్రతీ ఒక్కరికది అర్థం అవుతుంది
ఆమె ప్రేమలో అతడు పరిపూర్ణుడైనా ఎదగడము చేతకాదు
తన ప్రేమ విస్తృత విస్తార ప్రాపంచిక విశ్వవ్యాప్తమైనప్పుడు
అసలైన మగాడినంటూ తన మగ కణాన్ని విస్తరింపజేస్తాడు

మారుతున్నాయి..


మనిషి బ్రతికుండగా స్వార్థం పెరిగి మమకారాలు కళేబరాలౌతున్నాయి
మనుషుల అస్థిత్వం అబద్ధమై అనుబంధాలు అస్థిపంజరాలౌతున్నాయి
మనుగడకు నాగరికత తోడై రెడీమేడ్ రిలేషన్స్ రాజ్యమేలుతున్నాయి..
మనిషి జీవనశైలి ఆదిమానవుల కాలంనాటికి పరుగులెత్తి పోతున్నాయి!
ఇంట్లోకి బయటగాలి చొరబడకుండా మూసి ఏసీ యంత్రభూతాలున్నాయి
పెరట్లో పెరగాల్సిన మొక్కలు కుండీల్లో చేరి తడారకుండా తడుస్తున్నాయి
అంగట్లో ఆహారానికి బదులుగా ఆర్టిఫిషల్ అనురాగాలమ్ముడౌతున్నాయి..
ముంగిట్లో తచ్చాడాల్సిన చుట్టరికాలు మెస్సేజ్ రూపంలో మెరుస్తున్నాయి!
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకునేమాటలే కరువైనాయి
అందరూ అంటే తాను మాత్రమే అనే స్థాయికి ఆలోచన్లు దిగజారిపోయాయి
అందరూ ఎవరికి వారే గిరిగీసుకుని బ్రతికేలా పధకాలు నిర్మితమైనాయి..
అందరి ఆలోచనా ధోరణిప్పుడు నేను నాదన్నట్లు రూపాంతరం చెందినాయి!

నన్ను నేను నిలబెట్టుకోవాలి!

నాలో ఏదో తెలియని బాధ ఆందోళన
అంతా గందరగోళ అయోమయంగుంది
ఏదో చెయ్యాలని కానీ ఏమీచెయ్యలేను
నేను నా అభిరుచులెన్నో కోల్పోయాను
వ్రాయాలనుకున్నవి వ్రాయలేకున్నాను!

నేను ఏదైనా చెయ్యాలి మళ్ళీ రాయాలి
అనేకానేక అద్భుత భావాల్ని పొంగించాలి
నా కన్నీటికి ఆరోగ్యవంతమైన చికిత్సచేసి
ఎవరూ మాట్లాడలేదని అలిగి కూర్చోకుండా
నన్నునే పరామర్శించుకుని కోలుకోవాలి!

నా అస్తిత్వాన్ని గట్టిపరచుకునేలా అడుగేసి
నిర్వేదము నిస్సహాయత నైరాశ్యం వదిలేసి
మూలాలు నిలబెట్టుకునే నిప్పురవ్వనవ్వాలి
ఒకరి ఎడబాటులో దహించుకుపోక చల్లబడి
కాలంచేసిన గాయంతో సుధీర్ఘంగా నడవాలి! 



తుదిపులకరింపు!

తలపుల కౌగిలింతల్లో శ్వాసల మేళవింపు
పెదవుల కలయికలో ముద్దుల పలకరింపు
మౌనపు ఊసులతో మనసునిండా వలపు!
శృంగార పదభంగిమల్లో తనువు మైమరపు
అనురాగ రాసక్రీడలలో నలిగిన రసరమ్యకైపు
ప్రణయ పరిమళముతో శరీరమంతా సలుపు!
తడిసిన తెల్లచీరలో కనబడె నడుము వంపు
అరవిరిసిన అందాలను చూస్తు తినేసే చూపు
పరవశంతో పొంగిపొర్లె యవ్వనపు గుబాళింపు!
రాచుకున్న రాసలీలల్లో కనీకనబడని మెరుపు
వాత్సాయనకామ కసరత్తులే మరో ఆటవిడుపు
నడుంవంపులో చేసే సాక్షిసంతకమే ముగింపు!

ఏమి చెప్పను!?

ఎడబాటెప్పుడూ వేదనే మిగిల్చిందని అక్కసుతో
వద్దనుకుని వదిలేసి ఒంటరితనాన్ని ప్రశ్నించా..
అది మాత్రం ఏమి మేలుచేసిందని చెప్పుకోను!?

నాపై ఏ పిర్యాదూ లేదని చెప్పు మనస్ఫూర్తిగా
ఎప్పుడైనా నవ్వుతూ నా అవసరం నీకుందను
నా వేదన ఎలా చూపాలో కాస్త వివరించి చెప్పు
నమ్మకుంటే సరే ఇంకిన కన్నీటిని సాక్ష్యమడుగు
హృదిన ఉన్నది నీవని ఎలా నిరూపించేది చెప్పు
మనసున నిన్ను నింపితే ఇంత శిక్షనా చెప్పు!?

నాకు ఈ ఒక్క విషయము చెప్పు నిర్భయంగా
నా శ్వాసలన్నింటా నీవే నీలో నేను ఉన్నానను
నా ప్రతి కథ కదలికా నీవేగా నీరాత నేనని చెప్పు
ఎప్పుడూ నేనే అడగాలా నన్నూ నీవు ఏమైనాడుగు
నమ్మని నేన్నమ్మేలా నన్నేదైనా చేసి చూడని చెప్పు
మనసు ఇవ్వడమే అంత నేరమా నిజం చెప్పు!?

తెగింపు

మనిద్దరి మనసులు విరిగినాక ఇంకేమిగిలింది ఒకముక్క సూర్యరశ్మి లోలోపల తేమగ ఉంది దారప్పోగు ముడి విప్పబోతే చిక్కుపడుతుంది గోడపై రాసిన మన పేరులని వర్షం కడిగేసింది తప్పుడు వాగ్దానాలు చేసుకుని లాభమేముంది ముక్కలైన కలలతో కలిసి ప్రయోజనమేముంది మెదడు ఇలా ఆలోచిస్తున్నా మది ఒప్పకుంది! హేయ్ గుండెను గుండెతో మళ్ళీ అతకాలనుంది కోల్పోయిన నన్ను తిరిగి పొందాలని ఆశగుంది నిన్ను పొంది నన్నునేను నిలద్రొక్కుకోవాలనుంది ఏమేమి అనుకున్నాము ఎందుకు ఇలా జరిగింది కొజ్జారేయి ధీవించగా సమాధి మనకు పానుపైంది అలా నిదురించైనా నీతో కలిసి పయనించాలనుంది 
మనసు చెప్పినట్లు విని చావుని ఎదిరించాలనుంది! 

రారా నా రోబో..

అనుకున్నవి అనుకున్నట్లు నెరవేర్చుకోలేని మనిషి
తన కోర్కెలను తాను తీర్చుకునే సత్తా దమ్మూలేక
కొత్తపుంతల టెక్నాలజీతో సృష్టిని ప్రతిసృష్టి చేసుకుని
ఏం సాధించాలి అనుకుంటున్నాడో అర్థంకాక చస్తున్నా!
రక్తమాంస భావఉద్వేగ అనుభూతులున్న ప్రత్యేకజీవి
తన భౌతికత్వాన్ని నిర్థారించుకునే కొలమానాలులేక
సాంకేతిక పరిజ్ఞానంతో మనసునే మరగా మలచుకుని
ఏ దిశకు మన ప్రగతి పయనమోనని ఆలోచిస్తున్నా!
అనైతిక అవాస్తవాల్ని అవసరానికి మార్చుకునే మనిషి
స్వేచ్ఛగా ప్రకృతివిరుద్ధ ధోరణిలో పరుగిడుతూ నిలువక
అసూయాద్వేషాల్లేని రోబోలతో రమించి క్లోనింగ్ పిల్లలని
కని పెంచుతుంటే ఇంకెక్కడి రక్తసంబంధాలు అనుకున్నా!
కంప్యూటర్స్ కాపురంలో కల్పించబడ్డ కృత్రిమ మేధాజీవి
మానవసంస్కృతినే కాదు మనసుల్నీ మార్చేస్తే ఉండలేక
కల్తీకామ కార్యకలాపాల్లో కణాలు చిక్కుపడి ఊపిరాగెనని
తెలిసీ రబ్బరుబొమ్మనై రోబోర్ట్ తో రొమాన్సుకు రెడీగున్నా!

ఏమైనా అనుకో!

నన్ను పిచ్చిపట్టిన వెర్రిదాన్నే అనుకో
లేదా బ్రతకడం చేతకాని తింగరి అనుకో
కానీ నీ ప్రేమకోసమని మాత్రం తెలుసుకో!

నేను మళ్ళీ అవే పాత ఆశలు అనుకో
లేక నీతో కలిసుండే కలగంటున్నా అనుకో
కానీ నా ఆశయంలో నిర్మలత్వం తెలుసుకో!

నీకు నేను సరైన జోడీనీ కాదనే అనుకో
లేని నాలోని అందం నీకు దక్కదనే అనుకో
కానీ ఈ నిష్కల్మష ప్రేమ నీకేనని తెలుసుకో!


 

అర్పితావేదం!

మున్ముందు ఏం విడిచి ఉద్దరిస్తారో కానీ

ధ్వేషించడంలోనే పవిత్రత కనబడుతుంది!

ప్రేమించుకుని జనం వస్త్రాలు విప్పుతారనీ
గమనించి బాగా యోచిస్తే అర్థమౌతుంది!

ఎంతటి గాఢతతో కూడింది అయినా కానీ
ప్రేమైనా పెళ్ళైనా కామాన్నేగా కోరుతుంది!

అవునని ఒప్పుకోలేని ఈ పచ్చి నిజాలనీ
వ్రాసామా బుద్ధిలేదాని లోకం నింధిస్తుంది!

కావలసినవి ఏవైనా కోరితే దొరకవు కానీ
వద్దన్నది అడక్కుండా వచ్చి వాలుతుంది!