తగునా!!!

ఏటిగట్టున కూర్చుని
ఏరులో నీడను చూసి
ఎదసవ్వడి ఎగసెనని
చూపులతో గాలమేసి
వాల్జడ నయగారమన్నా
వలపు విరబూసేయునా!

రేయిజామున కలగని
రేచీకటిలో మాటువేసి
సందెపొద్దు అందాలని
వెనకమాటున వాటేసి
వంపులని నింధించినా
వగల వయ్యారమాగునా!

బాహువుల్లో బంధీనని
బాహటంగా పలకననేసి
చోద్యమేదో చూపుతానని
చిత్ర విన్యాసమేదో చేసేసి
నేలచూసిన బిడియమౌనా
పైటకప్పిన పరువమాగునా!

చేజారిన


పసితనానికీ పరిపక్వానికీ నడుమ ప్రేమబీజమేసి
అంకురించని అనురాగానికి పరిపూర్ణత్వం జోడించి
వికసించని పువ్వులోని పుప్పొడంతా మాయంచేసి
ఫలం అందించలేదంటూ నిందలుమోపడం ఎందుకో!

అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి
కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి
బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో!

పతనమైన పరిచయంలో నుండి పుట్టిన భావాన్ని
గొంతు నులిమేసి రాగం రంజింపజేసిందంటే నమ్మి
కాలిన కాలితో వెర్రిగెంతులేస్తూ చేసిన తాండవాన్ని
మెచ్చి చప్పట్లు కొట్టారంటూ తెగసంబరం ఎందుకో!

అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి
చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి
మెండైన మైత్రినందీయలేని అల్పాయుష్షుపై బాసచేసి
దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో!

కలల శోభనం

నా ఊహల్లో అలరించి మురిపించే నీవు..
ముఖమని ప్రతిబింబాన్ని ముద్దాడినావు!

ప్రేమించానని నిజాలనీడవై దరిచేరి నీవు..
వివస్త్రను చేసి  తనువంతా తడిమేసినావు!

తలపుతడికి వణికితే బిడియపడకని నీవు..
గిరిగీసుకున్న గీతను దాహంతో చెరిపేసినావు!

బిత్తరతనపు బేలచూపేలని ఒడిసిపట్టి నీవు..
ఒంటరికి జతకడతానని ఊపిరిలో కలిసినావు!

పసుపుతాడుగా ప్రేమనంతా పెనవేసి నీవు..
పెళ్ళిసాక్ష్యం వలదని పట్టులేని ముళ్ళేసినావు!

ప్రణయపునాదిపై పరిణయ అత్తర్లేచల్లి నీవు..
పగటివేళ మల్లెపందిరి నీడన మంచమేసినావు!

పరిమళంలేని మమతల మత్తుమాటలతో నీవు..
కలకౌగిట కర్పూరంలా కరిగించి శోభనమన్నావు!

భావం మారిన...

ప్రాకుతూ సాగితే ప్రౌఢ పాపాయి అగునా
చిలిపి భావాలు రాసిన చిత్రాంగి అగునా?

తాటిచెట్టు నీడలో ముంతమజ్జిగని కల్లు అని
సేదతీర్చుకున్న, తాగుబ్రోతని తట్టిలేపవలెనా?

కుంచెరంగుల చిత్ర శృంగారమొలికించిన జాణ
జవరాలై బరితెగించెనని పళ్ళు ఇకిలించవలెనా?

భావాలు మారెనని భాష మార్చినంత మాత్రాన్న
వైఖరే మారిపోయెనని నిందవేసి నిలదీయవలెనా?

నవరసాలువ్రాయ కలం మార్చిన, కల్తీసిరా అంటూ
పాళీపీకి పీకనొక్కి పొగడ్తని సానుభూతి చూపవలెనా?


నేనువ్రాసే భావాల్లో నానీడ చూసి నన్ను చూస్తున్నారనే
సంశయం నాలో కలగడం సమంజశమేనా లేక భ్రాంతేనా?

దొంగ ప్రియుడు

కావాలి....కావాలి నాకు ఒక ప్రియుడు కావాలి
వాడు ఎవరికీ చిక్కని దొంగోడై నాలోనే ఉండాలి
నా మనసే దోచి నాకు మాత్రమే బంధీ కావాలి

ఇవ్వాలి....ఇవ్వాలి నగానట్రా దోచి నాకే ఇవ్వాలి
దొరలా లెక్కడక్క దొంగసొమ్మంతా నాదే అనాలి
అడిగిందే తడువుగా అందలం ఎక్కించి నవ్వాలి

పోవాలి....పోవాలి నాకు అసాంతం లొంగి పోవాలి
గళ్ళలుంగీ గుబురుమీసాలతో నన్నే మెప్పించాలి
ధన దర్పం కాక పొగరుబోతు వగరేంటో చూపాలి

అవ్వాలి....అవ్వాలి అన్నీ అతడికి నేనే అవ్వాలి
ఆర్భాటమేం లేకుండా హంగులన్నీ అమర్చాలి
ఈర్ష్యపడే పూర్వజన్మఫలం వాడు నాకు అవ్వాలి


 
ఉండాలి...ఉండాలి దొంగై దోచిచ్చే దొరలా ఉండాలి
నాకళ్ళుకాక అందరి కళ్ళుగప్పి నన్నెత్తుకెళ్ళాలి
అనుకున్నది సాధించాలనే సత్తా వాడిలో ఉండాలి

అనుబంధాల అంగడి

అదేమి వింతనో ఏమో అక్కడో అంగడే వెలసింది
అందులో అనుబంధాలన్నీ అమ్ముడై పోయాయి

అమ్మ ఆశయం తీర్చలేని అమ్మాయి నిలబడింది
అందలం ఎక్కినాక అవసరం లేదంటూ అబ్బాయి
వారి విలువల్ని వారే వింతగా నిర్ణయించుకున్నారు
కుంటి సాకులేవో చెప్పి బజారులో అమ్ముడయ్యారు!
నాన్న న్యాయనిర్ణేతని కాదంటూ ఊగుతూ నిలబడి,
మంచి బేరమొకటి చూసుకుని తనరేటు ఇదన్నాడు
అక్క హైరానా పడి, అన్న అవసరమంటూ బజారులో
తలా ఒకవైపు తాహతుకి తగ్గట్టుగా అమ్ముడయ్యారు!
తమ్ముడు తన వంతు కోసం ఎదురుచూస్తూ నిలబడితే
చెల్లి తను తక్కువేం కాదంటూ చిత్రంగా తూకం వేసింది
ఒకగూటివే అమ్ముడైపోతే మరోగూటివి మాకేమన్నాయి
అమ్మ మాత్రం అంగడి అరుగుపై కూర్చుని ఆలోచిస్తుంది
లాభనష్టాల బేరీజువలో ఎవరు ఎంతకు అమ్ముడయ్యారని!

పెద్దమనిషయ్యా..

ఏంటో ఉండుండి నాలో అనుకోని ఈ మార్పు!?
అమాయకత్వం నుండి అంధకారంలోకి వచ్చి
అన్నీ స్పష్టంగా చూసేసి అర్థం చేసుకున్నట్లు
రాబంధులన్నీ రామచిలకలై రా రామ్మన్నట్లు
కుళ్ళుపై పన్నీటి కళ్ళాపి చల్లి శుభ్రపరిచినట్లు..

ఎందుకో నాలో సుడిగుండాల ప్రశ్నల కూర్పు!?
జవాబులు తెలిసినా చెప్పకూడదంటూ నొక్కేసి
గుంబనంగా బ్రతకాలని పాఠాలు వల్లిస్తున్నట్లు
అసభ్యత అర్థం కాకపోతే అంతా సభ్యతన్నట్లు
నలుపైతే మచ్చ కనపడదని ఇష్టం అనేసినట్లు..

ఎక్కడిదో నాలో నాకే తెలియని ఇంతటి నేర్పు!?
తీరని సమయంలో తీరిగ్గా ఆలోచిస్తే తెలిసింది
ఇన్నాళ్ళకి జ్ఞానం పెరిగి పెద్దమనిషి అయినట్లు
లేని దర్పం నాకబ్బి కొత్తఛాయ ఏదో పెరిగినట్లు
వెసులుబాటుకై వెలగాలని ఎవరో ఉసిగొల్పినట్లు..