నాకు నీవు...

వద్దనుకునే జీవితం
కావాలనికోరే వ్యసనం
చేయాలనుకునే నేరం!

అంతుచిక్కని ప్రశ్నవి
అందమైన జవాబువి
అర్థం కాని బంధానివి!

తలపుల తనువుకి అల్లికవై
వాస్తవంలో కంటికి దూరమై
పొమ్మంటే మరింతగా దగ్గరై!

ఆనందపు ఆటుపోట్ల అలగా
తట్టుకోలేని వేదనకి రూపంగా
కాదు-అవును మధ్య మదిగా!

లోలోనే జరిగే సంగ్రామం నీవు
ద్వి ప్రవర్తనల సంఘర్షణ నీవు
నా పరావర్తనం విశ్లేషణం నీవు!

"న" పై నా ప్రయోగం

                                             మరుగొలుపుతూ మగువ ఓరకంట చూసి"న"
మతితప్పిన మగాడు లొట్టలు వేయ తగు"నా"
ఆలోచించక ఇంతి అంతింతని ఆడిపోసుకు"ని"
పట్టుతప్పిన తమని తాము కప్పిపుచ్చుకు"నీ"
వలపనుకుని పలకరించెదరు ఆమె నవ్వు"ను"
భాషలోని భావాలను చూపెడతారు చేతల్లో"నూ"
కాదని కన్నెర్రజేస్తే ధూషించి తూలనాడుతారు(నృ)
వయ్యారిని ఒకరివెనుకొకరు చూస్తారు ఓకంట"నె"
ఒంటరిగుంటే ప్రగల్భాలు పలికేరు రాసులుగా"నే"
వేషాలకి లొంగకపోతే వేలెత్తబడును వెలయా"లై"
వాలుచూపుకే లొంగి మీసమెందుకు మెలివేసు"నొ"
ఇలాపడితే పురుష పుర్రెలోని పౌరుషం ఏమను"నో"
బుర్రలేదంటే ఒప్పుకోని బుద్దిమంతుడు బగరా"లౌ"తూ
మాకేంటి బలశాలులం అనుకుంటారెందరో మగజ"నం"
గుజ్జులేని పుర్రెని ఆమె తింటుందని వేస్తారు అభాం"ఢః"

 (ఇది "న" గుణింతం చివర్లో రావాలని చేసిన చిరుప్రయత్నంగా భావించి లై, లౌ లను నై నౌ గా అనుకోవలసిందిగా మనవి, వినమ్రతతో.....పద్మార్పిత)

అభియోగమేల?

తెలుపలేదని నాపై ఇంతటి అభియోగమా!
నా కోటి కంటి ఊసులు నీకు అర్థంకాలేదని
నీమనసుకి ముసుగేసి నాపై వేసిన నిందని
చెరిపేయాలని గొంతువిప్పితే కోకిలగానమని
మనసువిప్పి మాట్లాడితే యుగళగీతమని...

నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
గాయమైతేనే తీయని గేయంగా మారతానని
తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని
నిజమనక, విరిసిన జ్ఞాపకాల వింజామరలని
విడదీసి ఆరనీయలేదు సమీర కెరటానినని...

క్షణం కూడా నిను వీడని నాపై ఇంత అలుసా!
ఒంటరి హృదయఘోషకి రోజుకోవంక కోసమని
నట్టేట్లో ముంచాలా పయనించే వలపుల నావని
ఒక్క ఈసడింపు కనుసైగచాలు ఊపిరాగడానికి
ప్రేమతృష్ణతో ఏటిగట్టున కట్టనా నా సమాధిని...

అప్పగింతలు


నే పొందని ప్రేమను త్యాగమంటు వంచించాను
ఈ వేదన అనుభవించిన నన్ను మోసగత్తన్నా
నన్ను నేను కోల్పోయి క్షమించుకుందామన్నా
ఇదంతా అతడికి తెలుపలేని నిస్సహాయురాలను
నీవతడి జీవితంలోకి అడుగిడి ఆనందాన్నిపంచు
నాప్రేమ మాధుర్యమేతప్ప తీపెరుగడు గమనించు
వానజల్లులో ఒంటరిగా తడవనీయక చేయందించు
మంచుకురిసేవేళ మౌనంగుంటే వేడికౌగిట బంధించు
చీటికి మాటికి చిరాకు పడినా చిరునవ్వుతో ఛేధించు
కోపంతో అరిస్తే మౌనందాల్చి పెద్దమనసుతో క్షమించు
నన్నుతలచి నిన్ను మరిస్తే నుదుటముద్దిడి లాలించు
పసిపిల్లాడి మనస్తత్వం కరిగిపోయేలా కరుణ చూపించు
నన్నుమరిచి నిన్ను ప్రేమించేలా మురిపించిమరపించు
జంటకూడిన తరుణంలో నాప్రేమని కూడా జతచేసందించు

( ప్రేమ ఫలించని పడతి తన ప్రియుడ్ని వేరొకరికి అప్పగిస్తూ చేసిన అప్పగింతలు)

హృదయ వీలునామా!

ఆ రోజు తప్పక వస్తుంది........
తీరనికోరికల భారంతో పయనమౌతాను
మదిలోనే మసైన కలలతో మిగలలేను
ఏడ్చేడ్చి నీరెండిన కళ్ళతో నిర్జీవినౌతాను!

ఇలా తప్పక జరుగుతుంది........
ఎవరికంటా పడకుండా ఒంటరిగా రోధిస్తావు
అనుకోకుండా నన్ను చేర పయనమౌతావు
సమాధిపై మట్టిని నీ కన్నీళ్ళతో గట్టిపరిచేవు!

ఇది భ్రమగా అనిపిస్తుంది.........
రవిని చంద్రుడు పొందినంత రేయి పగలౌనా
ప్రాణంపోయాక ప్రేమచూపిన ప్రయోజనమౌనా
మన్నించమంటే విధిరాతను ఎవరైనా మార్చేనా!

ఇదేదో బాగున్నట్లుగా ఉంది........
ఒంటరిగా పయనమయ్యే నీవు జంటగా జీవించు
అనిశ్చల జీవితంలో అనంతమైన ప్రేమను పంచు
బ్రతికుండి విశాల హృదయ వీలునామా లిఖించు!

దాగనీ...

రా...ఎదలోయల్లో దాగనీ మన ప్రేమని
నలుగురి కంట పడనీకు అనురాగాన్ని
నరుడి దృష్టికి పగులును నల్లరాయైనా
ప్రేమకి నిర్వచనమననీ చూసినాఎవరైనా!

రా...చిక్కుముడులు పడనీ మనసులని
అల్లుకోనీ ఎవరు విడదీయలేని బంధాన్ని
కంటనీరు చూడాలనుకోకు కారణమేదైనా
తరగనీయకు ప్రేమ సాంధ్రతను ఏదేమైనా!

రా...నేసేద్దాం కలకాని రంగుల జీవితవలని
చేజిక్కనీ నాది నీదైన వలపు సామ్రాజ్యాన్ని
ఏలాలి దాన్ని ఒడిదుడుకులెన్ని ఎదురైనా
ఎదలు ఒకటై విరబూయాలి ఎన్నిజన్మలైనా!

రా...చాటించిప్పుడది అసలైన పరిపూర్ణప్రేమని
నలుగురు మెచ్చి ఆశీర్వధించనీ ఆ జీవితాన్ని

నవరసాల నేను...


నవరసాలుపంచ నేను నటినికాను
అభినయానికి అర్థం ఏం అడగను!!
అలంకారాన్నేకాని అంతరంగినికాను
అర్ధించి అనురాగాన్ని ఏం ఆశించను!

తిలకించి తరించే గాజుబొమ్మను నేను
శృంగారమే ఎరుగని నేనేం అలరించను!
శాంతి అలల కోమలినేకాని కడలినికాను
కోపిష్టినంటూ క్రోధాన్ని ఎవరిపై చూపను!
బిడియమేకాని భీతిల్లని వీరనారిని నేను
భీభత్సం సృష్టించి ఎవరిని భాధపెడతాను!
పరుషపదాలను ఎన్నడూ నే పలుకలేను
కలువబాలనైన నేను కరుణ చూపెడతాను!
అద్భుతమనే మెప్పుకై ఆశించే స్వార్ధిని నేను
హాస్యపు హరివిల్లునై విరబూసే పద్మార్పితను!

ముగ్గురు మిత్రుల కధ...

అనగనగా ముగ్గురు మిత్రులు
జ్ఞానం, ధనం, నమ్మకం వాళ్ళు
ముగ్గురూ భలేమంచి మిత్రులు
ఒకరికై ఒకరు ప్రాణమిచ్చేవాళ్ళు..

కాలం కలిసిరాక విడిపోతూ వారు
ప్రశ్నించుకున్నారు ఒకరితో ఒకరు
కలయికెప్పుడంటూ కార్చి కన్నీరు
విడలేమంటూ పెనవేసుకున్నారు..

జ్ఞానం విద్య, గుళ్ళలో నివాసమంది
మేడలు మిద్దెలు నావని ధనమంది
నమ్మకం కిమ్మనకుండా కూర్చుంది
జవాబుగా కిలకిలా నవ్వి ఇలాగంది..

జ్ఞానం, ధనం కోరితే దొరుకుతారు..
నమ్మకం పోతే మరల తిరిగిరానంది!

నమ్మకాన్ని పెంచే స్నేహం చేసేద్దాం
రోజూ "ఫ్రెండ్ షిప్ డే" చెప్పుకుందాం!!