ఛలో యుద్ధం చేద్దాం..

అంతరంగాలను ఆలయంగా మార్చేద్దాం
ధ్వేషంతో కట్టబడ్డ గోడల్ని తొలగించేద్దాం!

శత్రువు పేరుని పలుమార్లు తలచి రాసి
మనసున దాగిన పగను చెరిపివేసేద్దాం!

రాత్రి రహస్యంగా ప్రతిగుమ్మం గొళ్ళెం వేసి
ఒకరికొకరం కాపలా ఉన్నామని చాటేద్దాం!

భయపడుతూ హోటల్ లో బసచేసే వారిని
ఇంటికి రమ్మని ఆహ్వానించి ఆతిధ్యమిద్దాం!

ధ్వేషించుకుని ధూషించుకున్నది చాలాపి
ఆనందం అందరికీ అందుబాట్లో ఉంచేద్దాం!

అందరిదీ ఒక్కబాటేనన్న భరోసాను ఇచ్చి
నమ్మకంగా దాన్ని నడిపే తివాచీ పరుద్దాం!

అప్పుడు ఆకాశంలో ఆగలేనన్న చంద్రుడ్ని
భువిపైనే మకామంటూ రప్పించి మెప్పిద్దాం!  

మోసం..

పరాయి వారిపై పిర్యాదు ఏం చేసేది
మన అనుకున్నవారే మనల్ని మోసగిస్తే
తెలిసిన ముఖమే ముఖాన్ని చాటేస్తే..

ఈ బేలకంటి కలల్ని ఎవరికి చూపేది
కళ్ళు తెరచి చూడగా కలలే మాయచేస్తే
పరిచయాలే పరాయివైపోయి పయనిస్తే..

వెలసిన నమ్మకానికి ఏరంగు పూసేది
రంగరించిన రంగులన్నీ ఆహ్లాదాన్ని విరిస్తే
మనసున దాగిన మనసుని ముక్కలుచేస్తే..

క్షణానికి ఒక మార్పుని ఎలా నమ్మేది
అనిశ్చల ఆత్రుతని నిలకడ బంధం అనేస్తే
నీతిని నిలబెట్టి నిలువుదోపిడీ చేసి ప్రశ్నిస్తే..

పాటించని ప్రవచనాలు ఎవరికి చెప్పేది
పాపం పుణ్యమని వచ్చిన వారిని గెంటేస్తే
మోసం చేత మరల మోసపోయి విచారిస్తే..      

నాలో నాతో..

శూన్యం కళ్ళలో నాట్యమాడుతుంటే
మనసు తనువు రెండూ నలుగుతుంటే
మానస కాల్పనిక ఊహా నేస్తమా..
ఒంటరి జీవితానికప్పుడు నీవే ఆసరాకా!


స్వచ్ఛంద పరమార్థమే తెలుసుకోక
స్వార్థాన్ని అవసానపట్టి సాధన చేయక 
సతమతం అవుతుంటే మేల్కొల్పి..
నా భుజస్కంధాలకు ఊతమే నీవుకా!


సత్కార్య సంకల్పమే చేయ నెంచితే 
నా మనోవికాస విశ్వాసమే సడలిపోతే
నన్నంటి ఉండి లోకంపోకడ తెలిపి..
కనులవెలుగై నడిపించి నాలో ఏకంకా! 

ప్రణయ ప్రకృతి

మేఘాలతో మెరుపులే ఊసులాడెనేమో 
చినుకులే ధారగా కురిసి చిందులేసెనే..

వలపు వాయిద్యాలై రాగాలు ఆలపించగా 

పులకరింతలే పురివిప్పి నాట్యమాడెనే..

మచ్చటించిన మాటలతో ఎదకొలనే తడవ

ఎత్తు నుండి పల్లానికి పరవశం పారెనే..  

మురిసే నీటిముత్యాలే మోముకి సొగసులద్ద

అలలై ఎగసే ఆనందం పెదవులపై తేలెనే..

ప్రసరించే కిరణపు కాంతిలో కళ్ళు మెరవ 

మైమరచి తనువే ఇంద్రధనస్సుగా వంగెనే..

ప్రకృతల్లిన పచ్చని పందిట్లో ప్రేమకు పెళ్ళవగా

నేల మట్టివాసనలతో కమ్మని విందు చేసెనే..

ఊరటించిన కొమ్మరెమ్మలు కోటిదీవెనలు ఇచ్చి

పువ్వులనే అక్షింతలుగా చల్లుతూ దీవించెనే..