కూర్పు

రక్తమాంసాలకి రంగుల హొయలద్ది

అనుబంధాలన్నీ జీవనాళాలుగా చేసి

చంచలమైన ఆపేక్షలని ఊపిరిగాపోసి

ముఖకవళికలకి నవరసాలంటూ నేర్పి

అస్తిపంజరాన్ని అందంగా అలంకరించి

ముద్దుగుమ్మగా చేసి మురియబోవ....

కలవని రక్తమే విరిగి రంగులే కరిగిపోయె

బంధం వద్దంటూ ప్రేగుబంధమే తెగిపోయె

ఆపేక్ష ఆస్తికాదని ఆత్మస్థైర్యం ఎగిరిపోయె

నవరసాలు ఏకమై పెదవులపై నవ్వైపోయె

అస్థిత్వమే అలంకారమై అస్థికలుగా మిగిలె!

ప్రేమా ఓ ప్రేమ!

నాకు ప్రేమ గురించి రాయడం రాలేదు
ఎందుకంటే! నా నరాల్లో ప్రేమన్నదేలేదు
ప్రేమను ఆలింగనం చేసుకున్న ప్రతిసారీ
అసంపూర్తిగా అంతరంగాన్నది కదిలించె!

నాకు ప్రేమపైన సరైన అవగాహనే రాలేదు
ఎందుకంటే! ప్రేమకి నిర్వచనమే తెలియదు
స్త్రీ పురుషుల ఆకర్షణయే ప్రేమన్న ప్రతిసారీ
కన్నప్రేగులెన్నో కళ్ళముందు కలుక్కుమనె!

నాకు ప్రేమ ఎక్కడా స్పష్టంగా కాన రాలేదు
ఎందుకంటే! ప్రేమపై స్వార్థకుబుసం ఊడలేదు
ప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!

నాకు అందని ప్రేమని అంధత్వమని అనలేదు
ఎందుకంటే! ప్రేమలో కన్నీరిడని కళ్ళే చూడలేదు
ప్రేమప్రక్రియకి పరిస్థితులేవని ప్రశ్నించిన ప్రతిసారీ
తడుముకుంటూ తలాఒక తాత్పర్యం జవాబై రాలె!

నాకు ప్రేమతో సత్సంబంధం ఎన్నడూ కూడలేదు
ఎందుకంటే! అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు
అందుకేనేమో ప్రేమపై రాయాలనుకున్న ప్రతిసారీ
వేదన వరదలో పదాలు ప్రవహిస్తూ పరిహసించసాగె!

స్వగతం

స్వగతాలనే తలచి స్వయంవరం వలదని
ఒంటరితనాన్నే వరించి కౌగిలిలో బంధిస్తే..
వేదనే నీకు సరైన జోడని సంబంధం కూర్చి
కన్నీరే తెగసంబరపడి ఏరులై పొంగిపొర్లింది!

స్వఛ్ఛతలేని హృదయం ఇంకేదో కావాలని
కోర్కెలతో కొత్తపరిమళాలనే కోరి ఎగిరిపోతే..
పాచిన పాతజ్ఞాపకాల దొంతర గుప్పున చేరి
ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరిని చేసింది!

స్వలాభమేదో ఆశించిన కొత్తపరిచయాన్ని
ప్రేమపుప్పొడి అద్దమని పురివిప్పి ఆడితే..
వాడినపువ్వుకి వాసన ఎక్కడిదని విసిరేసి
వికసించని మొగ్గవైపు విప్పార్చి చూసింది!

స్వయంకృతం తెలిసి స్వరమే సరిచేసుకుని
కోయిలవలే కూస్తూ మన్నించమని కోరితే...
నేలరాలబోయిన ఆకుని నీడకోరబోకని జారి
నీలినీడలపై కప్పుగామారి కన్నీటినే దాచింది!

చౌకధర

మనిషి జీవితం ఎంత సరసమైనదో చూసారా
ఎందుకీ గగ్గోల ధరలు మండిపోతున్నాయని
కొన్నికాసులకే కొనొచ్చు మంచిని మర్యాదని
ఎవరన్నారు మంచి లేకపోతే మనుగడే లేదని!

మనిషి ముందూ చౌకగానే అమ్ముడయ్యేవాడు
ఇప్పుడు దేవుడు కూడా అమ్ముడై పోతున్నాడు
మ్రొక్కుబడులకే మొగ్గుచూపి మోక్షమిస్తున్నాడు
ఎవరనేరు పాపపుణ్యాలని కొలిచే త్రాసే జీవితమని!

మనిషి మానవత్వపు చౌకధరల పట్టికని చూసారా
క్షీణిస్తున్న విలువలకి అధికధరంటూ అరుపులేలని
ప్రాణంపోయినాక తలచినా మరచినా ఏమి జరిగేనని
ఎందుకొచ్చిన ప్రాకులాట అమూల్యమైనది జీవితమని!

మనిషి రోజుకో మూల్యమని విలువ తగ్గుతున్నప్పుడు
మరెందుకని ధరలపై ఈ అనవసర ధర్నాల చెడుగుడు
దర్జాగా డాబుదర్పపు అక్కరకురాని మాటల అడుగుడు
ఎందుకీ దిగజారిన బ్రతుకు జీవనపోరాటమని అడగరేలని!