సాక్ష్యపు ఆనవాలు

జీవిత నాటకంలో కల్మషం లేక మనసారా నవ్వి నవ్వించి
అంతరంగానికి పరిమితులే గిరిగీయనప్పుడు తెలియలేదు 
చేసిన కర్మలతో నేను పోషిస్తున్నది ఒక కీచురాయి పాత్రని!

గుప్పెడు గుండెని కరిగించి సముద్రమంత ప్రేమను పంచి
ఆకాశమంత ఆనందాన్ని కోరుకుంటేనే కానీ తెలిసిరాలేదు
కరిగే గుండెకు ఇవ్వడమే తప్ప ఆశపడి అడగడం తప్పని!

అనురాగాన్ని అలల ఆటుపోటు చేసి ఎగిరెగిరి ఆరాటపడి 
మరింత ప్రేమనిచ్చి మొహం మొత్తిందంటే కానీ తెలీలేదు 
ఏదైనా సరే అడిగినంత మాత్రమిచ్చి లేదని బెట్టుచేయాలని!

కోల్పోయిన ఉనికిని శోధిస్తూ గుండె తడారిపోయేలా తపించి
అస్తిత్వం రూపాంతరించి ఆనవాలు పట్టనప్పుడైనా తెలియదు
పలికే మాయమాటల ఇరుకులో ఊపిరాడని ఉపేక్షిత గీతమని!

అనేకాలోచనల త్రొక్కిసలాటలో ఓరిమినే అత్తర్ల ఊపిరిగా పీల్చి 
అడకత్తెరలో పోకచెక్కనై నలుగుతున్నా కానీ తెలియడంలేదు
నా నీడ కూడా నాతో వెలుగులేనిదే వెంటరాదని నాది కాదని!