సాక్ష్యపు ఆనవాలు

జీవిత నాటకంలో కల్మషం లేక మనసారా నవ్వి నవ్వించి
అంతరంగానికి పరిమితులే గిరిగీయనప్పుడు తెలియలేదు 
చేసిన కర్మలతో నేను పోషిస్తున్నది ఒక కీచురాయి పాత్రని!

గుప్పెడు గుండెని కరిగించి సముద్రమంత ప్రేమను పంచి
ఆకాశమంత ఆనందాన్ని కోరుకుంటేనే కానీ తెలిసిరాలేదు
కరిగే గుండెకు ఇవ్వడమే తప్ప ఆశపడి అడగడం తప్పని!

అనురాగాన్ని అలల ఆటుపోటు చేసి ఎగిరెగిరి ఆరాటపడి 
మరింత ప్రేమనిచ్చి మొహం మొత్తిందంటే కానీ తెలీలేదు 
ఏదైనా సరే అడిగినంత మాత్రమిచ్చి లేదని బెట్టుచేయాలని!

కోల్పోయిన ఉనికిని శోధిస్తూ గుండె తడారిపోయేలా తపించి
అస్తిత్వం రూపాంతరించి ఆనవాలు పట్టనప్పుడైనా తెలియదు
పలికే మాయమాటల ఇరుకులో ఊపిరాడని ఉపేక్షిత గీతమని!

అనేకాలోచనల త్రొక్కిసలాటలో ఓరిమినే అత్తర్ల ఊపిరిగా పీల్చి 
అడకత్తెరలో పోకచెక్కనై నలుగుతున్నా కానీ తెలియడంలేదు
నా నీడ కూడా నాతో వెలుగులేనిదే వెంటరాదని నాది కాదని! 

16 comments:

  1. Excellent expressions.

    ReplyDelete

  2. వెల్కం బెకబెక ! ఇక పంకాల వెల్లువ‌ జిలేబి కందాలకు కొదవే వుండదు :)

    కుశలమాండి ?


    ఏనాడో నిను కూడినాను ప్రియుడా యేతంబుగా‌ సూవె నీ
    వే నాప్రాణము! స్నేహశీలిని సఖా వేవేల నీదాననై
    మానా లేక జిలేబి గా నిలిచితిన్ మందార్ప పద్మార్పితన్
    నానీడైనను కూడ రాదు వెలుగై నాపైన నీవాడకన్ !


    జిలేబి

    ReplyDelete
  3. నవ్వు స్వచ్చ మైన నగుబాటు పాలౌదు
    కపట మెంతొ కొంత కలిపి చూడు
    కీచు రాయి యైన కీరమై కనిపించి
    రాగ రంజిత మగు రాత్రి పగలు .

    ReplyDelete
  4. జీవించబోతే సాక్ష్యాలు ఆనవాళ్ళు అడిగేటి లోకం.

    ReplyDelete
  5. నీడ కూడా వెంటరాదు
    వెలుగులేనిదే...మరీ ఇంత ఆలస్యంగా తెలుసుకున్నారు
    Better late than never :)

    ReplyDelete
  6. కోరుకోవడం
    ఆశపడి అడగడం
    చివరికి భంగపడడం
    ఇదేనా జీవితం...
    ఎలాఉన్నారు??

    ReplyDelete
  7. Beautiful Narration Padmarpitagaru.

    ReplyDelete
  8. చాలా రోజులకి రాసారు
    చాలా బాగా రాసారు.

    ReplyDelete
  9. మీ కవితల్లో నిరాశావాద ఛాయలు ఎక్కువగా ఉంటాయి.

    ReplyDelete
  10. ఏమైనారు ఇన్నాళ్ళు?
    కవితను మించిన చిత్రం

    ReplyDelete
  11. As usual emotional touch

    ReplyDelete
  12. జీవిత నాటకం కడవరకూ తప్పని స్థితిగతులు

    ReplyDelete
  13. మాడం అంతా బాగేనా

    ReplyDelete
  14. mam no doubt poetry is good but something went wrong i think. get well soon and come out from your tense.

    ReplyDelete
  15. అందరికీ నమస్కారాలు

    ReplyDelete