వలపు గ్రంధం

ఎదను అల్లరిపెట్టి మురిపించే భావాలని
హృదయ కుంచెతో ముచ్చటగా చిత్రించి
వలపు గ్రంధాన్ని అలవోకగా లిఖించనా!

 కలల కాపురం కనురెప్పలపై నివాసమని

అంబరాన్నున్న మెరుపుతారని చూపించి
ఎదిగిన ప్రేమ శిఖరం పై జెండా పాతిరానా!

ఆపాలనుకున్నా ఆగని మది సవ్వడులని

గీతంగా వ్రాసి రాగాన్ని జతచేసి ఆలపించి
ప్రేమలోని రెండక్షరాలు మనమని చెప్పనా!

ఇరు ఊపిర్లకు సులువైన మార్గం కలయికని

 కలిసి కన్నీరిడి ఎదపై తలవాల్చి నిదురించి
వలపు సరిహద్దులే దాటామని నిర్ధారించనా!

నా మది


అంతర్ముఖ కల్లోలిత అంతరంగం అనుకోకు
ఆందోళనలతో కలవరపడిన అంతఃపురమది


అంతర్యమంతా ప్రేమ నిండిందని పొరబడకు
ఆరని వేదనలని నిద్రపుచ్చుతున్న గూడది


అరవిరసిన అందాల నందనవనం అనుకోకు
ఆర్ద్రతామిళిత ఆలోచనలతో ఆరి వెలిగిందది


అలరించే సరాగ సరిగమ రాగాలు వెతుకకు 
ఆవేదన్ని జాలువార్చే విషాదగీతాల నెలవది


అందమైన అక్షరాలతో అల్లినమాల అనుకోకు 
ఆవేశాలకు ఆనకట్టలువేసి అణచిన భావమది


అరమరికల అంతస్తులతో అమరిన మిద్దెనకు 
ఆప్యాయతతో అక్కున చేర్చుకునే పూరిల్లది!

ఆ అనుభూతులు

గుర్తుందో లేదో నీకు అలనాటి సంధ్యవేళ
నీరెండ కులుకుల్లో నీ మాటలు మెలిపెట్ట
విడిపోలేని మన శ్వాసలు చేసిన బాసలు
చురుక్కుమన్న నీ చూపుల చమత్కారంతో 
మనసాయె చెమక్కులు కావు నీ జిమిక్కులు!

గమనించావో లేదో ఆనాటి సద్దుమణిగినవేళ
అల్లుకున్న వలపుల్లో అయిన అధరాల గాట్లు 
నీవు చేసిన అల్లరికి కందిన తనువు వంపులు
వేడి తాళలేక విచ్చుకున్న కోరికల కవాటాలతో
సాగిన రాసలీలకి కుళ్ళుకున్న వెన్నెల సెగలు!

గిలిగింత జ్ఞాపకముందో లేదు నాటి పొద్దువేళ
జాగారం చేయించి జారుకోమాకని నడుం గిల్లి
దాహం తీరలేదని తడిమిన తిమిరపు లోయలు
లేవబోవ బాహువుల బంధిట్లో పరస్పర రాపిడ్లతో
సన్నగా మూల్గి సిగ్గుతో ఒదిగిన సరస సరాగాలు!

గడిచిన గతం మరలి వచ్చునో లేదో తెలియనివేళ
ఆ తీయని తలపులే తుమ్మెదలరోదనై జివ్వుమన
బంధించలేని అలసిన మనసు చేస్తున్న అలజడులు
స్మృతుల ప్రవాహాన్ని గతకాలపు కలల సాగరంతో 
సంధి చేయలేక నెమరేసుకునే మధురానుభూతులు!

ఎవ్వరు?

నేను నువ్వు అలిగి కలత పడితే
బ్రతిమిలాడి అలుక తీర్చేది ఎవ్వరు?
నేడు ఇరు హృదయాలు బీటబారితే
అతుకువేసి గాయం మార్పేది ఎవ్వరు?
నువ్వు నేను మౌనంగా ఉన్నామంటే
ముందుగా మౌనం వీడేది ఎవ్వరు?
చిన్ని విషయానికి పెద్దరాద్దాంతం చేస్తే
బంధాన్ని పీతముడేసి బిగించేది ఎవ్వరు?
నేనూ ఏడ్చి నువ్వూ కంటనీరు పేడితే
కన్నీరు తుడిచి బుజ్జగించేది ఎవ్వరు?
నువ్వు నేను ఇద్దరం రాజీకి రాకపోతే
మరి క్షమించి దయతో కట్టేసేది ఎవ్వరు?
నీలోను నాలోను అహం గెంతులువేస్తే
అహాన్ని అణచి అలసట తీర్చేది ఎవ్వరు?

ఎవ్వరికీ సదా సొంతమవని జీవనయాత్రలో
ఒంటరి గడియల్ని ఒడిసి పట్టేది ఎవ్వరు?
నువ్వు ముందో నేను ముందో కన్నుమూస్తే
మరలా రేపిలా పశ్చాత్తాపం పడేది ఎవ్వరు?