వలపువాద్యము...

రాగం తాళంలేని హృదయగానంలో ఎన్నో సవ్వడులు
ఊసుల్లో మరువలేని మరెన్నో మధుర ఝంకారాలు
మూగబోయిన మనసులో జ్ఞాపకాల సితార్ వాదం..
మురిసిన మదిలో వినిపిస్తుంది వలపుల వీణానాదం..
ఇరుగుండెల సంభాషణలో సన్నని సారంగి తరంగాలు
ప్రేమించినజంటల గుసగుసలు జలతరంగపు కీర్తనలు
వలపులు విడితే వచ్చేది వయోలిన్ పై విరహగేయం..
విషాదమైన ప్రేమ మ్రోగించును శృతిలేని మృదంగం..
పిలుపు విని పరవశమొందే పిల్లనగ్రోవుల వేణుగానాలు
గుండెలు గొంతుకలిపి ఆలాపించెను గిటార్ పై గేయాలు
తలపులలో తనువుమరచిన వినపడదే తంబూర శబ్ధం..
మది హాయిలో ఆలపించును హార్మోనీ పై యుగళగీతం..
సరస సయ్యాటల్లో వినపడని తీయని సన్నాయి గీతాలు
కలసిన హృదయాంతరంగంలో కమ్మని కళ్యాణి రాగాలు..

దీన్నేమంటారో!

ఎవరో ఎందుకిలా నా కవితాస్పూర్తికి రంగులద్దుతున్నారు

ప్రేమ అనే రెండక్షరాలని చెవిలో ఊది ఉసిగొల్పుతున్నారు

కవయిత్రినని పొగుడుతూ రమ్యంగా రాయమంటున్నారు

దాగుడుమూతలాడుతూ విరహమేంటో తెలియజేస్తున్నారు

ప్రతిపదంలోని అనుభూతి తానై రాతలకి జీవంపోస్తున్నారు

భావాలకి ప్రేరణై  నేను ఏం వ్రాసినా నా ముందుంటున్నారు

ఇలా నాతోనే నాలోనే ఉన్నది ఎవరనడిగితే నవ్వేస్తున్నారు

ప్రేమేమో అని అడిగితే నా మనసుని ప్రశ్నించుకోమంటారు

కాదని మదినిమభ్యపెట్టి కనులుమూస్తే కలలోకొస్తున్నారు

ఈ అలౌకికానందానికి పేరెందుకే పద్మా! పిచ్చిదానివంటారు

ఆలోచిస్తున్నా!

నిర్ణయాలలో తప్పెక్కడో సమయందొరికితే ఆలోచించాలని
రహదారిలో ముళ్ళని చూసుకుని జాగ్రత్తగా అడుగేయాలని
వాస్తుమార్చి మసలినట్లు మన వాస్తవాలని మార్చలేమని
హస్తరేఖల్ని చీల్చి అదృష్టాన్ని నుదుట తిరిగి రాయలేనని
తెలివైనదాన్ని అనుకుంటూనే అన్నీ చేసి ఆలోచిస్తున్నా!!!

నాకిష్టమైనట్లు జాతకాన్ని తిరగరాయమని జగడమాడాలని
గమ్యం చేరడానికి మార్గం మార్చి మలుపులెన్నో తిరగాలని
శ్రమపడకుండా సమస్యలన్నీ సాఫీగా పరిష్కారమైపోవాలని
సమయానికంటే ముందే నచ్చినఫలం చేతికంది రుచించాలని
సులభంగా సాధించబోయి బోనులోపడి బోరుబోరుమంటున్నా!!

జగమెరిగినసత్యాలని సాహసంతో ఎదిరించక అనుసరించాలని
అనుకున్నామని ఆశయాలేవీ అంత సులభంగా చేతికందవని
భావాల సాగరంలో మునగడమెలాగైనా తేలడం బహుకష్టమని
ఈ అనంత జీవనపయనంలో పడిలేస్తూ ఇంకెన్ని గాయాలోనని
సరిదిద్దుకునే సంకల్పంతో తప్పులెవరు చేయరు అనుకుంటున్నా!

నా చిత్రం!

నా చిత్రాన్ని గీయాలని నేను చేసాను విశ్వప్రయత్నం!
కుంచెకు రంగంటనని మొరాయించింది ఇదేమి విచిత్రం!

కాన్వాసు ముడుచుకుని అద్దినరంగు జారుతూ అంది
నా కళ్ళు చూపే కారుణ్యాన్ని చిత్రంలో నే చూపలేనంది
నుదిటిరాతల్ని ముడతలుగా పిచ్చిపిచ్చిగా గీసేస్తానంది
మంచి మానవత్వపు పరిమళాలని బొమ్మకి అద్దలేనంది
పెదవులని గీయబోతే నవ్వగలవవి కన్నీరు కార్చలేవంది
ముఖ కవళికలన్నీ ఒకేసారి చూపడం నా తరమేకాదంది
వంపులన్నీ సొంపుగా దిద్దబొతే చిత్రాంగివాంటూ నవ్వింది
సహాయం అడగనా చేతినంటే మదితోటిదే దాని చెలిమంది
భావాలకు రూపం గీయలేక అలిగిన నాతో నా మనసంది
స్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది
భావుకతకు అక్షరరూపమే అసలైన ఆకారం తెలుకోమంది

అయినా కళ్ళకి కాన్వాసు కరముకి కుంచె అంటే భలేఇష్టం!
ఏదో ఒకటి చిత్రించకుండా ఊపిరిపీల్చడం నాకు బహుకష్టం!

విరహగీతం

నేడు నా మది మధుమాసపు విరహాన్ని ఆలపిస్తుంది
కలువలు విరిసినవేళ అలోచనలతో మనసు అలసింది
దూరాన్న వసంతపవన రెపరెపలకి గుండెలయతప్పింది
కోయిల కూడా మధురమైన గానమేదీ ఆలాపించకుంది
సీతాకోకచిలుక రెక్కలు విరహాగ్నితో వేడెక్కి ఎగరలేనంది
తుమ్మెదనిచూసి అరవిరియాల్సిన మొగ్గ ముడుచుకుంది
నిట్టూర్పు శ్వాసలో మదిమువ్వలసవ్వడి మారుమ్రోగింది
తలపుల తలుపుతెరుచుకుని మదిని ఊపిరాడనీయకుంది
ఫల్గుణంలో కురిసిన జల్లు కోర్కెల విరహాగ్నిని ఆర్పలేనంది
చేసినబాసలు ఎండాకులై నేలరాలి కొత్త చిగురులకై వేచింది
మది వసంతమాసపు మధుర కలయికకై ఎదురుచూస్తుంది