అక్కరకురాని...

దాహంతో ఉన్నప్పుడు నీళ్ళివ్వకుండా
తరువాత అమృతాన్ని పంచనేల!!

కష్ట సమయంలో చేయూతనీయకుండా
వారిని ఓదార్చడానికి కన్నీరు కార్చనేల!!

ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టకుండా
పుణ్యం కొరకై దానధర్మాలు చేయనేల!!

మనస్సులో స్వచ్ఛత లేకుండా
తీర్థయాత్రల పవిత్ర స్నానాలేల!!

తల్లితండ్రుల్ని బ్రతికున్నప్పుడు చూడకుండా
చనిపోయాక పిండప్రధానాలు పెట్టనేల!!

మనిషై పుట్టాక దయాధాక్షిణ్యాలు లేకుండా
మానవ జన్మమే ఎత్తనేల???????






ఓ ప్రియతమా.....

ప్రియతమా...
ఓ ప్రియతమా!

కన్నీటితో ఎన్నాళ్ళని దాహాన్ని తీర్చుకోను!

స్వప్నాలని ఎన్నాళ్ళని తోడు రమ్మనను!

చుక్కాని లేని నావలా నేనున్నాను!

నీ కోసం
ఎన్నాళ్ళని ఇలా ఎదురు చూడను?

ప్రియతమా...
ఓ ప్రియతమా
.
నీ జీవితాన్ని నాకూ కాస్త
పంచు!
నా కోసం కాస్త సమయాన్ని వెచ్చించు!

మనోధైర్యాన్నిచ్చి ముందుకి నడిపించు!
నాకూ నీవు తోడున్నావని నిరూపించు.
..

ప్రేమ/దోమ

సంధ్యవేళ బాల్కనీలో కూర్చొని వారం రోజులుగా
మా ఇంటివైపే చూస్తున్న అబ్బాయిని చూసి అనుకున్నా...

నాకూ పుట్టింది ప్రేమ రోగమని

నాకంటూ ఒక తోడుండాలని

అతనితో బైక్ పై ఊరంతా తిరగాలని

నా నీడకు అతని నీడ తోడు కావాలని

నన్ను మెచ్చి నాకు నచ్చినవాడు రావాలని

నా పలకరింపుతో అతని ఒళ్ళు పులకరించాలని

నేను నవ్వితే అతని బుగ్గన సొట్ట పడాలని

నేను ఏడిస్తే అతని ముఖం కంది పోవాలని

దోమకాటుతో తెలిసింది ఊహలు ఎంత అందమైనవి కదాని

సంధ్యకలల నుండి దోమలు నన్ను మేలుకొల్పుతున్నాయని

నాలుగు రోజులు నాలో నేను లేనని

నాకు వచ్చింది మలేరియా జ్వరమని

నాకు పుట్టింది ప్రేమ కాదని

కుట్టింది
ఎనాఫిలస్ (Anopheles) దోమని...

నీతో..........

లోకాన్ని మేలుకొలిపే సూర్యకిరణాలకన్న
నీ స్పర్శయే నాకు సూర్యోదయమనుకున్న

చంద్రకాంతులు వెదజల్లే చల్లదనాలకన్న
నీ ప్రేమాభిమానాలే కావాలని కోరుకుంటున్న

పంచభక్ష పరమాన్నాలకన్న
నీ చేతి గోరుముద్దలే మిన్న

ఏ మేడలు మిద్దెలు వద్దనుకున్న
నీతో సహజీవనం చేయాలనుకుంటున్న

అందుకే అన్నీ కాదనుకుని నీతో వస్తున్న
అందమైన జీవితాన్ని కలగంటున్న......

ఆమె...

ఆమె మేని ఛాయ కన్న ఆమె మస్సెంతో తెలుపు
ఆమె
కురులు నలుపే కాని కట్టిన వస్రం తెలుపు

ఆమెపై
కురుస్తున్న వెన్నెల కూడా తెలుపు

ఆమె అందాన్ని చూసి ఈర్ష్య పడుతున్న తారలన్నీ తెలుపు......
ఆమెలో
దాగిన నిర్మలమైన ప్రేమ మాధుర్యమింకా తెలుపు......

ఆమెపై
వ్యాఖ్య రూపంలో నీ /మీ అభిప్రాయం తెలుపు......

ప్రాప్తం......


నాకు పరిచయం చేసావు నీకు కాబోయే జోడీని...

ఆశ చావలేదు నాలో నీవు కాకపోతావా నా తోడని...
ఎదురు చూసాను అనక పోతావా నన్నే నీ నీడని...
అన్నావప్పుడు నేనే నీకొక మంచి స్నేహితురాలినని...
నాలో నేనే నవ్వుకున్నాను ఎంత అందమైన అబద్దమని...
అనుకున్నారంతా ఎంత మంచి బంధమో కదా మనదని...

నా కన్నీరు చూసి నీవనుకున్నావవి ఆనందబాష్పాలని...
నాకు తెలిసిందప్పుడు నా మనసెన్నటికీ నీకర్ధం కాదని...
మీరిద్దరూ వెళుతుంటే అనుకున్నాను నాకింతే ప్రాప్తని........



ఎందుకు...?


చలిలో
మంచు వానజల్లెందుకు!

మండుటెండలో మరిగే నీళ్ళెందుకు!
వసంతమే లేనప్పుడు కోయిల పాటెందుకు!
చూపే లేనప్పుడు దీపకాంతుల జ్యోతులెందుకు!
మనసుకి అయిన గాయానికి మందెందుకు!

నీవు లేని నేనెందుకు........ఎందుకు.......?

కలసికట్టుగా......


జీవితంలో ఎందుకిన్ని ఆశలో!
ఒకరిపై ఒకరికి ఎందుకని రాగద్వేషాలో!
లోకంలో ప్రేమే కరువైందనాలో!
స్వార్థమే ప్రేమని జయించిందనాలో!

ఏడ్చే వాళ్ళని చూసి నవ్వుతుంది లోకం!
పోయిన వాళ్ళని చూసి ఏడుస్తాం మనం!
బ్రతికున్నన్నాళ్ళు ఒకరిపై ఒకరు సాధించాలనుకుంటారు విజయం!
చచ్చాక ఏమి మిగిలిందనో మనల్ని కాలుస్తారు జనం!

అందుకే నాది అన్న మాటను మరచి మనది అన్న బాటలో పయనిద్దాం....
అందులోని ఆనందాన్ని అందరం చవిచూద్దాం....

నీ ప్రేమకై......

సముద్రపు ఒడ్డున నీ జ్ఙాపకాల ఇసుకమేడనొకటి కట్టాను..
ఆ ఇంటి ముందు ఆశల పూతోటనొకటి నాటాను..
అలలు వాటిని తాకకుండా, అరచేతులు అడ్డుపెట్టి ఆపుతున్నాను..
మేడలో నిన్ను నా కౌగిలిలో బంధించాలనుకున్నాను..
తోటలో విరబూసిన పూలతో నిన్ను పూజించాలనుకున్నాను..
నన్ను చూసినవారు గేలిచేసి నవ్వుతున్నారని తెలుసుకున్నాను..
అయినా నిలకడలేని నీ ప్రేమకై ఎదురుచూస్తున్నాను..