బజారీతో..

పిల్లాడకుని పరువాలను పరుపులా పరచిన పాపం
నేడు పశ్చాతాపంతో పైటను సరిచేసుకో లేకుంది..   
పైబడ్డ ప్రాయం పొంగులు జారి వలపు వెలకోరుకుంది 
పడుపువృత్తేమో పైసలతో పని ప్రణయపైత్యం వద్దంది! 

ఆతృతతో కూడిన ఆరాటంలో అవయవాలన్నీ చూస్తే 
చిన్నవాడి గిల్టు ప్రేమ మెరుపులకు మురిసిపోతుంది..   
తల్లి చనుపాలు త్రాగి ఋణం తీర్చుకున్నవాడని నమ్మ   
వేశ్య రొమ్ములు చీకి రమించి రుణపడనంటే గొల్లుమంది! 

విటుడై వచ్చి పోవడానికి విడిది ఏర్పాటు చేయమంటే  
మల్లెల మత్తులో జగత్తు మరచి మనువు కోరుకుంది..
వేరొకరి పతి అయినా మనస్ఫూర్తిగా మనసు ఇచ్చింది    
వెన్నెల పిలువ వెర్రిది వెలయాలినన్న మాటే మరచింది!  

పదినిముషాల పక్క సుఃఖానికి తాను పుండుగా మారి 
డబ్బులిచ్చి సంస్కరించేటి రసికరాజుల్ని నమ్ముకుంది..  
కుతి తీరి అంగంవాల కళ్ళుతెరచి ఒళ్ళుతెలిసి మేల్కుని    
భోగంస్త్రీ పనిమాని మంచిని వలచి మాత్రం చేసేదేముంది! 

నీ రూపం..

                                                                   కనురెప్పలమాటున దాగిన కలలు కొల్లగొడుతున్నా
కనుపాపలే కుంచెలవ్వ కన్నీరు రంగులుగా మార
సున్నిత భావాలు క్యాన్వాసు గోడకు వ్రేలాడుతుంటే     
హృదయంలో అందమైన నీరూపం చిత్రించబడుతుంది!

చిరుగాలికి అక్షరాలతో ఊసులెన్నో నివేదించుకున్నా

వెలుగు సిరాతో తెల్లకాగితంపై ఆశల ధరకాస్తు పంప 
ఇరుస్పర్శలు పలుకక తడుముకుని ముచ్చటిస్తుంటే
ఆగాగని నీగుండె నిబ్బరంతో నిర్దయగా నిందిస్తుంది!
                                
కంటికి దూరంకావద్దని కలంతో కాలాన్ని వేడుకున్నా
కప్పుంచిన మదిలోని మాటలను బయటపడనీయక 
దూరంగున్నా దగ్గర ఉన్నావన్న భ్రాంతిలో నేనుంటే
నీ మౌనం మనిద్దరి మధ్యా ఉన్నది దూరమంటుంది!

ధీనంగా చెంపలపై జారుతున్న కన్నీటిని అర్ధించుకున్నా

మొద్దుబారిన నీ మదిని తడిపి నన్ను గుర్తుచేయమని
రూపుదిద్దుకున్న నీ చిత్రాన్ని సంపూర్ణం చేయబోతుంటే
వేదన వర్షంలా కురిస్తే అర్పించిన ప్రేమ ఎలా నిలుస్తుంది!

చేసిన నేరం!


నేను కన్న కలల్ని నాకు కాకుండా దూరం చేసిన
అంతర్యామీ! నువ్వు ఏమి కలగంటున్నావో ఏమో
నీకు నేను పరాయిని ఎప్పుడయ్యానో తెలియలేదు
ఆత్మ వేరైనాకా నేనెలా జీవించాలో తెలియకుందిగా!

నేను వెళుతున్న మార్గం నన్నెక్కడుంటావని అడుగ 
అంధకారమా! నువ్వే వెలుగుబాటలో ఉన్నావో ఏమో
గమ్యంలేని నేను దారి ఏం చూపాలో తెలియడంలేదు
ఇప్పుడైనా మదిక్కడా సవ్వడి అక్కడని తెలిసిందిగా!

ఇసుకలో రాసినట్లు నానుదుటిరాత ప్రతిచోటా చెరిగిన
అదృష్టమా! నువ్వే నుదురు వెతుకుతున్నావో ఏమో
కనీసం నాపై నేనెందుకు అలిగానో నాకు తెలుపలేదు     
శ్వాస పీలుస్తున్నా బ్రతికిలేను ఎందుకో తెలియదుగా!

అనుకున్నవేవీ జరుగవని కన్నీరు నన్నంతమవ్వమన 
ఆత్మవిశ్వాసమా! నువ్వు ఎక్కడికి పారిపోయావో ఏమో
నమ్మకం ఇంకా కళ్ళుతెరిచి నిద్రిస్తుందో తెలియడంలేదు 
నా తప్పేంటో ప్రాణం శిక్షగా ఎందుకిచ్చావో తెలుపవుగా!   

కలగలిసి..

                                                                      నేను నిద్రను అయితే నీవొక కలవి
రెండూ కలగలిపితేనే కమ్మని రేయి..
ఈ నివేదన నిజం కావాలనుకుంటాను!

నేను భువిని కాను నీవు కాకు దివివి
రెండూ ఎప్పటికీ ఏకము కానేకావు..
అలాంటి అపూర్వ ఊహాలోకం వద్దంటాను!   

నేను నీరైతే నీవు తీపి పానీయానివి
రెండూ కలిపి సేవిస్తేనే దాహం తీరేను..
ఇలా కలిసి కరిగిపోవాలని కోరుకుంటాను!

నేను భాషని నీవు అందమైన భావానివి
రెండూ కలిసి ఏర్పడేనొక ప్రేమకావ్యం..
రసరమ్య మధురకావ్యం అవుదామంటాను!

నేను ఆలోచనలైతే నువ్వు ఆచరణవి
రెండూ ఏకమై అంచెలంచెలుగా ఎదిగి..
వేర్లు నీవై వృక్షం నేనై నీడనివ్వాలంటాను!
  

మనిద్దరం..


నాకు తోడుగా నువ్వుండు...జీవించడం నేర్పుతాను
గమ్యాన్ని నువ్వు చేరుకో...దారి నేను చూపిస్తాను
సంతోషంగా ఉండు...కావలసినవి నేను కూరుస్తాను
ప్రశ్నలు విశ్లేషిస్తూ ఉండు...జవాబులు విపులీకరిస్తాను
మాటపెగలని మనస్పర్ధలపై నీళ్ళు చల్లేద్దాం రా ఇద్దరం..
      
కష్టం నేననుకోకు...నీ నుండి నేను ఏమీ కాంక్షించను
నా ధైర్యాన్ని నీవు శంకించకు...దానికర్థమే నేనౌతాను 
స్నేహితుడిగా నువ్వుండు...దాన్ని నే నిలుపుకుంటాను
సంకోచాలు చెరిపేస్తుండు...ఆనందరాశులు కుమ్మరిస్తాను
ఎటూ కాని మన విడివిడి కధల్ని కలిపేద్దాం రా ఇద్దరం..

నన్నంటి నాతో ఉండు...లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వను 
మనమధ్య మాటలేలనకు...మనసు మొత్తం పరుస్తాను
బంధమే లేదనకు...బ్రతుకు బావిలో నీతో మునుగుతాను
నీతో కలిసుండే ప్రయత్నం...నేను కాటికేగే వరకు చేస్తాను  
ఆపై నువ్వూనేను తూర్పూ పడమరకీ పయనిద్దాం ఇద్దరం..