తెలుసు

నాలోని అలజడి నా అంతరాత్మకు తెలుసు 
లోకానికి ఏం తెలుసని లేనిపోనివి అనుకుంటారు..
అవకాశం ఇస్తే మరో నాలుగుమాటలు చేర్చి ముచ్చటిస్తారు!

నా అంతరాత్మ అంతమవక ఆపిన ఆయువుకేం తెలుసు 
చిక్కుపడ్డ చేతిగీతలను సరిచేయాలని అనుకుంటాయి..
కుదిరితే అక్షరాలు కూర్చి నుదుటిరాత మార్చాలనుకుంటాయి!

నా భావాలను కనబడనీయని నవ్వుకు తెలుసు 
అసంపూర్ణంగా ముక్కలైన ఆశయాల అసలు కధలు..
వాటిని కప్పిపుచ్చడానికి అంతరాత్మ వేస్తున్న విచిత్ర వేషాలు!

నాకే తెలుసన్న నిజం నా అంతరాత్మకూ తెలుసు 
ఆవేశంతో అస్తిత్వాన్ని ఆర్పేయాలని చేసే ప్రయత్నంలో..
ఎద ఎన్నిసార్లు మరణించి మరోప్రయత్నంగా ప్రాణంపోసుకుందో!

నాకు తెలియని గుట్టు నాలో అంతర్మధనానికి తెలుసు  
రెండక్షరాల ప్రేమకోసం ఉక్కిరిబిక్కిరి అవుతుందని మనసు.. 
"స్త్రీ" ఉనికి కోసం ప్రాకులాడే ఒంటరి అక్షరమని ఎందరికి తెలుసు!

ఆమె ఆడె!

అల్లరివయసేమో వలపువలలో చిక్కి ఊగగా
అణగారిన కోర్కెలు ఎదలో చిందులు వేయ
అడుగువేయలేని అనుభవాలు ఊహల్లో సాగి 
అనుభూతులు భావచెరసాలలో బంధించబడె!

ఆడలేని మయూరిని అందలం పై ఎక్కించగా
ఆగలేని ఆమె నడుమును అటుఇటూ ఊప
అందమైన ఆ కులుకులకు పలుకులు లేవన
ఆటాడలేని మది సైతం ఆటకు అలవాటుపడె!

అలై పొంగు భంగిమను పొగడపూలతో పొగడగా
ఆదిమంత్రం వేసినట్లు పరిమళాలకు పరవశించి 
అధరసుధలను కెంపులవోలె మెరిపించి మురిసి
అణువణువు పులకరించెనని రాని అబద్ధమాడె!

అందెల అరిపాదాలు సలిపి రాయబారమంపగా
ఆశలే ఆకృతి దాల్చి వగలు సెగలుగా బుసకొట్ట
ఆ మేని వంపులే విరహము పెంచి కవ్వించెనన
ఆవేశమే ఏడ్వలేక నవ్వులద్దుకుని నాట్యమాడె!