మదితలుపులు

అక్షరాలని ఆస్త్రాలుగా చేసి సంధించానే కానీ
మది తలపులకు ఊపిరిపోసి ఉసిగొల్పలేదు
ఆశలురేపినవి మంటలమాటల జ్వాలలే కానీ
నలిగిన మదిని నిర్ధాక్షణ్యంగా నింధించనేలేదు

అనంతమానస చదరంగపు పావునైయ్యా కానీ
కుఎత్తులతో ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
ఆవేశాన్ని అణచి పదాలకి పదునుపెట్టానే కానీ
సూటిపోటి మాటలతో ఎదలని గాయపరచలేదు

అలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
కసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు

అరమరికలులేని స్నేహాన్ని ఆలంబనగా కోరాకానీ
మకరందం చుట్టూ ఈగలని ముసిరిపోనీయలేదు
ఆలాపనంటూ ఎదలయను మౌనశృతిచేసానే కానీ
తెలియని రాగం ఆలపించాలని తాపత్రయ పడలేదు

ఎందుకో!

ముత్యాల పందిట్లో మూడుముళ్ళేస్తనని..
మూతి ముడుచుకున్నాడెందుకో నామావ!
పుష్యరాగమల్లే పచ్చని పరువాలు నావని..
పస్తులంటూ పలకకున్నాడెందుకో నామావ!
మాణిక్యం వంటి మరులు ఉన్న మణినని..
మురిపించి మారిపోయాడెందుకో నామావ!
గోమేధికంలా గోముగాచేరి కలిసుందామని..
గోప్యమేదో చెప్పనంటాడు ఎందుకో నామావ!
వైఢూర్యమై వెలిగిపోతూ వగలుపోమాకని..
చిత్రచేష్టలతో వింతగున్నాడెందుకో నామావ!
కెంపు రంగు చీరకట్టి కైపు ఎక్కించమాకని..
కిమ్మనక కూర్చున్నాడు ఎందుకో నామావ!
పచ్చల హారమెందుకే ఎదలోనే ఉన్నానని..
పలికి పెదవి విప్పకున్నాడెందుకో నామావ!
వజ్రం వంటి విలువైన వల్లమాలిన ప్రేమని..
వల్లమాకు అంటున్నాడు ఎందుకో నామావ!
నీలం వంటి కన్నీటిచుక్క నాకంట చూడని..
నట్టేట్లో నన్ను ముంచినాడెందుకో నామావ!

రాతమార్చేది నవరత్నాల మహిమకాదని..
రాయినైనా సరే కరిగించేది ప్రేమతత్వమేనని
ఎప్పుడు ఏవిధంగా తెలుసుకుంటాడో నామావ!

నన్ను నేను

నాకు గులాబీలంటే ఇష్టం ఉండదు
"ప్రేమ" వ్యధకు ప్రతీక అందుకేనేమో
మల్లెలపైన కూడా మమకారం లేదు
"మత్తు" నుండి మరలేనన్న భీతేమో
కలువలు అంటే మాత్రం కడు ప్రియం
నాకు ప్రతిరూపం అవి అందుకేనేమో!

నాకు పిల్లగాలితెమ్మెరలు అంటే కోపం
"తాపం" రేపి తపన కలిగిస్తాయనేమో
లేలేత తొలిపొద్దు కిరణాలంటే భయం
"కలల" కైపుని కసిరి లేపుతాయనేమో
తామరను తాకే వెన్నెలంటే అమితిష్టం
తనువు వికసించి పులకరిస్తుందనేమో!

నాకు నేనే తెలిసినా తెలియని ఉత్ప్రేరణ
"తప్పు" చేసి సమర్ధించుకునే తలంపేమో
ప్రతిచేష్టలో నన్నునే చేసుకుంటా విశ్లేషణ
"ఒప్పు" కాదని అంటే భరించే శక్తి లేదేమో
పద్మంటే అపారమైన ప్రేమ ఆత్మవిశ్వాసం
నే ప్రేమించుకోనిదే ఎవ్వరినీ ప్రేమించనేమో!

ఏమడగను?

దేవుడా..! నిన్నేమడగను? ఇంకేం కోరను?
ధనరాసులు అడిగి దారిద్ర్యం తీర్చమననా
పుట్టుకతోరాని సిరిని స్థిరాస్తులు అనుకోనా
అంతంలేని ఆశల నిధినిక్షేపాలు ఏంకోరను
కుబేరునికేలేని ఖాతలో చందా ఏమడగను!

దేవుడా....! నిన్నేమడగను? ఇంకేం కోరను?
పుట్టుక్కుమనే పట్టుపోగుల బంధం కోరుకోనా
గాజు పెంకులయ్యే అనురాగానికై ప్రాకులాడనా
సంబంధాల భాంధవ్యంతో బంధాలు ఏమడగను
సంభాళించునేవారు ఎందరు ఉన్నారని కోరను!

దేవుడా....! నిన్నేమడగను? ఇంకేం కోరను?
జీవించడానికి గాలి, కూడు, గుడ్డా అడగనా!!
పర్యావరణలో గాలి కలుషితమైందని మాననా
ఆకలితీరినా రుచులడిగే కూడు, ఖద్దరుగుడ్డను
నేతలేచుట్టుకుని నగ్నంగా ఉంటే ఎవర్నడగను!

దేవుడా! అందమైన కలలు నిజం చేయమంటాను
కలలరెక్కలతో నింగికెగిరి, కోరికల కొమ్మపైన వాలి
కొన్నికల
కి రంగులద్ది, సాహసకిరణాల సెగ చూపి
ప్రయత్నిస్తూ విహంగినై విజయ విహారం చేస్తాను
నన్నునడిపి నిలిపింది ఆశల ఆశయమే అంటాను!

మమతల మసాల


కస్తూరి కర్పూర పరిమళాలు ఏమివ్వను
పరిచయ పుప్పొడి సంపూర్తిగా అంటనిదే
సుగంధ లేపనాలు పూసి సేద ఏంతీర్చను
వలపు నిట్టూర్పుసెగలు గాయం చేయనిదే

లవంగా యాలకుల తైలం ఏం మర్ధించను
గతించిన ఆవిరికాని జ్ఞాపకాలు దాగుండగా
గసగసాల గుసగుసలు నాకు నేనేంచెప్పను
తలపుమసాల నషాళం తలకి ఎక్కలేదుగా

దాల్చినచెక్క ఘాటుకి ధీటైనగీటు ఏంగీయను
కంటికి కుంకుమపువ్వంటి కోమలి కానరానిదే
మిరియమై మురిసి ధనియమై దాసోహమని
జీలకర్ర వాంలా చిన్నిజీవితమంటే నేనేం కోరను

మెంతి ఆవాలతో చలువ చందనం ఏం అద్దను
చిలిపిచేష్టలతో చెంత చేరకనే చేదని ఛీదరించగా
ఇంపు ఇంగువాని సొంపుసొగసుతో పోల్చలేను
జాజికాయలో జాబిల్లిని నువ్వు చూపించమనగా

అనాసపువ్వంటి అందాలు ఏం అందించలేను
ఆపేక్షానురాగ సాంద్రతా లోపంతో సరసమాడితే
కొరివికారమైనా కొసరి కమ్మగా వడ్డించేయగలను
మమతల మసాలాతో మనసంతా నేనని దరిచేరితే

తుంటరి తలపు....

నీ తలపే భలే తుంటరి
నన్ను చేస్తుందది ఒంటరి
గిలిగింతలతో అదిచేసే అల్లరి
చలికాలం వద్దన్నా వినని పోకిరి

వేసవిలో వసంత సమీరాల ఝరి
వానాకాలం తడిపేసి చేస్తావు కిరికిరి
కాలమేదైనా నన్ను వీడవెందుకో మరి!!

ఎందుకిలాగని అడిగితే....మురిపంగా కసిరి

మరింతగా చేరువైపోతావు వద్దంటున్నా కొసరి
తలపులతో తనివితీరదుగా అంటాను విసిగివేసారి
నీ మత్తుమాటల్లో అన్నీ మరిచేను ఇదేం వింతవైఖరి
అందుకేనా తరచి తర్కించి తలుస్తాను నిన్ను మరీమరి
ఏదేమైనా బాగుంటుంది ఇరుమనసులు ఒకటై నడిచేదారి!

కాలం కరిగి

 భ్రాంతి ఏమో గాయమేం కనబడ్డంలేదు
మనసుముక్క విరిగి మరోచోటుందంటే

కాలం గాయానికేం మందేమేయగలదు
పరామర్శ అని మరో గాయమౌతుంటే

కన్నీరు తుడిచి తలవాల్చే భుజంలేదు
దుఃఖం మరో ఉప్పెనకు సిధ్ధమౌతుంటే

అరచేతిపై వేసిన గోరింట తడి ఆరనేలేదు
మందారమై పండెనని మంచిదనేస్తుంటే

హస్తరేఖలరిగి రాసినపేరు కనపడలేదు
జాతకం జతకూడెనంటూ జతకట్టేస్తుంటే

మానసచదరంగంలో పావులు కదల్లేదు
ఎత్తుపైఎత్తులతో ప్రేమ ఓడిపోయిందంటే

గడచిన కాలంలో కమ్మనికలేదీ కనలేదు
పర్యవసానం ఇదని కాలం కరిగిపోతుంటే