సాగేపయనం

అలుగకే అక్షరమా!...... నేనేం రాయలేకపోతున్నానని
ఆవేశాన్ని అణచి అందమైన పదాలని దొంగిలించానని
వ్యధకి ముసుగేసి నవ్వుని పెదవులపై పులుముకుని
జీవన్నాటకంలో నన్నునేనే మోసగించుకుంటున్నానని!

అలుసుగా చూడకే ఓ! భావమా...... నువ్వు నేను కానని
నగ్నసత్యాలకి బూటకపు వస్త్రాలని కుట్టి తొడిగిన దర్జీనని
కాల్చనికుండకి మసిపూసి మోసగించిన కుమ్మరిని నేనని
ఆదర్శవంతమైన మాటలే కాని చేతల్లో చూపించడంలేదని!

అసువులుబాయకే ఓ నా అంతరంగమా!.... అవిటితనమని
అజ్ఞానపు ఇసుకరేణువుల బొమ్మని చెక్కుతున్న శిల్పినని
ఆశాంధినై గిల్టునగలకు మెరుపులు అద్దుతున్న కంసాలినని
అవసరాలనే పెట్టుబడిచేసుకున్న అసలుసిసలు వ్యాపారినని! 

అబాసుపాలుగాకే నా కవిత్వమా!....అలరించలేకపోయానని
సమాజానికి నీతిసూక్తులు చెప్పి ఎవరిని రంజింపజేయాలని  
అన్ని కోణాల్లో ఆలోచించాను నన్ను నేనే సరిచేసుకోవాలని
ప్రేమని పంచుతూ చిరునవ్వుతో సాగదీస్తున్నా జీవితనౌకని!

అమ్మకానికో నవ్వు

అందరూ నవ్వుతుంటే లోకం ఎందుకు చింతిస్తుంది?
కొందరు గాయపడి నవ్వితే, నిరీక్షణలో నవ్వేది కొందరు
కలలసౌధాలలో ఖుషీగుంటే, నిజం జీర్ణించుకోక కొందరు
కొందరు కష్టాల్లో నవ్వెతికితే, మత్తులో నవ్వేది కొందరు
ప్రకృతి అందాల్లో ఆనందంగుంటే, విధికి బలై ఇంకొందరు
కొందరు మౌనంగా కళ్ళతో నవ్వితే, పైకి నవ్వేదింకొందరు
ఇన్నివిధాలుగా నవ్వుతున్నా తృప్తిలేదు ఎందుకని?
పలకరింపుగా నవ్వి పనులు చేయించుకునేది కొందరు
పనిలేనిదే పళ్ళికిలిస్తే పిచ్చివాడనుకునేది మరికొందరు
ఎదుటివారిని చూసి ఓర్వక ఏడవలేక నవ్వేది కొందరు
సుఖఃధుఃఖాలను ఒకటేనని తలచి నవ్వేది అతికొందరు
ధీనమైన పేదనవ్వుని సొమ్ము చేసుకునేవారు కొందరు
భావాలకి అద్దమైన నవ్వు, నిజాల్ని కప్పే ముసుగైనది
మంచో చెడో కానీ నవ్వు నేడొక వ్యాపార సాధనమైనది!

సమ్మర్ రొమాన్స్

నాజూకు శరీరం వేడెక్కిపోతుంది
కరెంటుకోతతో ఫ్యాను తిరగనంది
గొంతెండి నాలుక తడారిపోయింది
ఒంటికంటిన వస్త్రం నిలవనంటుంది
ఏ.సి లేక చల్లగాలి చెమటగ మారింది
తలకి నీళ్ళోసినా తాపం చల్లారకుంది

ఒంటరిగా శృంగారం నర్తించ చూస్తుంది
దరిచేరిన ప్రియుడ్ని పొమ్మని కసిరింది
 
ఎగసిపడే హృదయం స్పందించలేనంది
రేయైనా కునుకీయంటు కాళ్ళట్టుకుంది
ఆరుబయట పడకంటే యవ్వనం వద్దంది
ఈ వేడి చల్లారే మార్గం ఏదైనా చూపమంది
చిగురాకు గాలికై అంతస్తులవైపు చూసింది
ఎండాకాలం పళ్ళికిలిస్తూ బిగ్గరగా వచ్చానంది
వేసవిలో ప్రతి ఒక్కరికీ ఇదే మాయరోగమంది
సెన్సార్ కట్ అంటూ ఏవేవో ఊహించకండి.....
సమ్మర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రమేనండిది:-)

నా ప్రియుడు

నేనే తన ప్రాణమంట నేనంటే పడిచస్తాడు
నలుగురిలో అలుసు చేయకన్నా వినడు
నన్ను ప్రేమించానంటూ నా వెంటపడతాడు
నన్ను వీడమన్నా పోని జగమొండివాడు


గాయమైన నా మనసుకి లేపనం రాస్తాడు
పిల్లగాలులు అల్లరిచేస్తే మందలించే తోడువాడు
నా కళ్ళలో తనువులో శ్వాసలో కౌగిలిలో వాడు
పాటై ఓమారు కవితై మరోమారు నను తాకినాడు


కోపంలో పరుషమాటలాడనీయని మౌనమౌతాడు
అలవికానిచోట అధిక్యత ఏలంటూ అణచివేస్తాడు 
స్నేహితుడిలా పోట్లాడి శత్రువన్నా దూరంకాడు
పగలు దూరమైనా రేయంతా నన్నంటి ఉంటాడు


ఇంతలా నన్ను అల్లుకుని నాకే సొంతమైనోడు!!!!
ఏవరో కాదు "ఒంటరితనం" వాడే నా ప్రియుడు:-)