ఒక హాయైన భరోసా!

నీమైనపు మాటలు నన్ను కరిగించునన్న తపనలో
నన్ను కలవరపెడుతున్న ప్రశ్నలన్నింటినీ ఆవిరిచేస్తూ
నవ్వే నీమోము ఓడిన నన్ను గెలిపిస్తుందనుకుంటాను..



నీవు నా తోడునీడ అనుకోవడమనే భ్రమ భ్రాంతిలో
అందులో నేను ఎప్పుడూ మునిగి త్రేలుతూ ఆలోచిస్తూ
బయటపడనూ లేను ఒంటరిగా ఒదిగి ఉండనూలేను..



నీదంతా నాదే నీలోన ఉన్నదంతా నేనేనన్న ఊహల్లో
నన్ను నేను ఓదార్చుకునే నెపంతో నిన్ను తలుస్తూ
నా పై నేనే అలిగి ఆక్రోషంలో నిన్ను తిట్టుకుంటుంటాను..

అమ్మకానికో ఓటు



నాకు నోటు ఇస్తేనే ఓటు వేస్తాను... 
అనే జనారణ్యంలో బ్రతుకుతున్న నేను 
నా ఓటుని కూడా అమ్మకానికి పెట్టాను 
చిట్టా విప్పండి చేసిన ఉత్తమ పనులను
తన్నుకుపొండి కారుచౌకగా నా ఓటును
చదువూ జ్ఞానం ఉన్న ఓటు నాదంటాను!  


ఐదేళ్ళకి ఒకమారు వేలంపాట వేస్తాను...
ఎవరి సత్తా ఎంతో నేనప్పుడే పసిగడతాను   
కొనేవారి దిమాక్ బలుపు ఎంతో చూస్తాను  
గెలిస్తే చేస్తామనేవారికి వేలం ఎందుకంటాను
దేశాన్ని ఉద్దరించేవాళ్ళు చేసి తీరతారంటాను
అవినీతిని నాదైన రీతిన ఇలా ఆడుకుంటాను!

   
ఉత్తమ ప్రభుత్వం కోసం ఓటు వేస్తాను...
నాఓటు నాఇష్టం ఎంతకైనా అమ్ముకుంటాను
విలువలేని వ్యర్థానికి అడిగే హక్కు లేదంటాను 
నోటుతో కొనుక్కునేవారుంటే ఓటు వజ్రమంటాను 
రేటు పలికిన నాడు మహరాణిలా దర్జాగుంటాను
అలాగని అల్లాటపాగాళ్ళకు నా ఓటు అమ్ముకోను!  

ఎవ్వరు నువ్వు!?

నా చిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో చుడ్డానికి
నువ్వు ఎవరని నన్ను నిలదీసి ప్రశ్నించడానికి!?

నా జీవితం నాది నాఇష్టమొచ్చినట్లు జీవించడానికి
నువ్వు ముందు నిన్ను ప్రశ్నించుకో నన్ననడానికి
నోరెలా వచ్చింది పిల్లాడు వంశోద్ధారకుడు అనడానికి
అమ్మాయి పరాయి సొత్తని వేరు చేసి మాట్లాడ్డానికి!

నా తనువు ఎలా కప్పాలో తెలుసు రక్షించుకోడానికి
నువ్వు నిర్దేశించి నిర్ధారించకు నిన్ను కప్పుకోవడానికి
తప్పు నేను చేస్తే సంసిద్దురాలినినే సరిదిద్దుకోవడానికి
మధ్యలో నువ్వెవరో అర్థం అవ్వకుంది నన్నడగడానికి!

నా రేపటి వృద్ధికి ప్రేరణ కాదు చెప్పుకొని ఊరేగడానికి
నువ్వు సుత్తపూసవి ఏం కాదు నన్ను సరిచేయడానికి   
గడిచిన కాలాన్ని తిరిగివ్వలేవు లోట్లు పూడ్చుకోడానికి
పోసుకోలు చెత్త మాటలు ఎందుకు కాలం గడపడానికి!

నా ఆలోచనలతో సరితూగవు నీ భావాలు చెప్పడానికి
నువ్వు తెలివైన వాడినని విర్రవీగకు జవాబులివ్వడానికి
సృష్టికర్తవా మగ ఆడవాళ్ళలో వ్యత్యాసం ఎత్తిచూపడానికి 
కన్నవాళ్ళు అసలే కారు మంచిచెడ్డలు ఏవో చూడ్డానికి!

(ఏ పనీ లేక ఆ అమ్మాయి అలా ఈమె ఇలా అంటూ చెప్పుకు తిరిగే ఆటలో అరటిపండులకు అంకితం)