"మొండిమనసు"


ఉషోదయకిరణాల చురకల్ని
నీ వాడితలపులుగా తలచి
అకారణంగా తడిపేసిన వానని
నీ కొంటె అల్లరిగా సరిపుచ్చి
మధ్యాహ్నం చెమట ఉక్కపోతని
నీ విరహ తాపంగా నెంచి
సంధ్యవేళ చిరుగాలి తెమ్మెరల్ని
నీ కరస్పర్శానుభూతిగా మెచ్చి
మాపటేల మబ్బుల్లోదాగిన జాబిలిని
నీవాడు దాగుడుమూతలుగా మార్చి
తారలన్ని మెరుస్తూ ముసిగా నవ్వ
నీవు నాకై దాచిన మల్లెలనిపించి
నడిరేయిలో కీచురాళ్ళ సవ్వడిని
నీ ఊసుల భాషగా ముచ్చటించి
కనుమూయ కలలో మాయమౌతావని
కనులు తెరచి నిదురలో నిను జపించి
ఒక రోజంతటిని ఒక యుగముగా గడప
తెలవారగనే మనసు మరల ప్రశ్నించె...
నువ్వే కావాలంటూ మనసు మారాం చేసె
నీవొక కరిగిన కలవని సర్దిచెప్ప బోతే...
విన్నట్టేవిని మాటవినకుందె "మొండిమనసు"

ఊపిరాడని సరసం...


రేయంత కునుకు రానీయవు
పగలేమో పలుకనైనా పలుకవు
ఇదేందిరా మావా అంటే.........????
సన్నగా నవ్వి సంధేలకొస్తానంటావు!

అలిగినా ఆరా తీయనైనా తీయవు
అందమంటే నాదేనని అబధ్ధమాడతావు
మాటలకేం తక్కువనంటే........????
నడుమువంపున గిల్లి చేతల్లో చూపుతావు!

మురిసే మోమును ఓరకంట చూస్తావు
ముద్దుగుమ్మనంటూ ముద్దాడబోతావు
చాలించు బావా సంబరమంటే.......????
తనివి తీరనీయంటూ చప్పున వాటేస్తావు!

అల్లుకున్న బంధంతో అందలమెక్కిస్తావు
సర్వం నీవేనన్న భ్రాంతిలో ముంచేస్తావు
ఈ బంధం ఎన్నాళ్ళని అంటే.......????
ఊపిరున్నంతవరకంటూ ఊపిరాడనీయవు!

ప్రేమపరవశం

ప్రణయకాంత పరవశాన్న ప్రియుడ్నిచేర..
సడిచేయకే సెలయేరా సిగ్గు మొగ్గౌతుంది
ఊగిసలాడకే మనసా మాటమూగబోతుంది
గూటికి చేరవే గువ్వా గుండెల్లో గుబులుగుంది!

ప్రియుడు ముంగురులు సవరిస్తూ ముద్దాడగ..
గుబురుల్లో గుట్టుని రట్టు చేయకే వాడినకొమ్మా
చల్లగాలివై గిలిగింతలిడవే వర్షించని ఓ మేఘమా
వెన్నెలని తోడిచ్చి సాయపడవే సంధ్యాకిరణమా!

ఇరువురు ఏకమై పరిసరాలని మరచి పులకించ..
పరిహసించకే ప్రకృతిమాతా నిన్ను ప్రేమించలేదని
చిలకా పలుకులింకాపి పవళించనీయవే నీ తోడుని
పర్వతాలని మించి గగనాన్ని తాకనీ లోతైన ప్రేమని!


చిత్రిస్తున్నా!!!


ఛీ! కొడుతూనే చిత్రంగా నీ చిత్రాన్నే గీస్తున్నా

వద్దని వారిస్తూనే నా వేళ్ళకి
త్తాసునిస్తున్నా

పిచ్చిగీతలలికేస్తూ నీ రూపానికి జీవంపోస్తున్నా

జ్ఞాపకాల మైమరపులో కలలకి రంగులద్దుతున్నా

తిడుతూ పోట్లాడే ప్రయత్నంలో నిన్ను ప్రేమిస్తున్నా

ముఖకవళికలని చిత్రించకనే ఆశగా ఎదురుచూస్తున్నా

దంఢించాలని నిన్ను నే బంధించి కౌగిలినే కోరుతున్నా...

ఈ సృష్టి చిత్రించిన చిత్రంలో నా ఉనికి ఇసుక రేణువైనా

నీ హృదయాన్ని విశ్వమంతగావేసి నన్ను నింపేస్తున్నా!!

కలిసేనా!!!

నీ చేయి నేను నా చేయి నువ్వు
చేతి గీతలు చూస్తూ నేను నువ్వు
నా రాతలో రాసిపెట్టి లేవు నువ్వు
నీరాతల్లో ఉన్నానేమో చూడనివ్వు
నా కలల సామ్రాజ్యాధినేతవి నువ్వు
దేహం నేను దానిలోని ప్రాణం నువ్వు.


                 *******

నిన్నెందుకు ప్రేమించానో తెలీదు
నీ తలపుల్లో నాకు నిదురే రాదు
నీనిదురలో నాతలపు కలైనాకాదు
దీని పర్యవసానం ఏమౌనో తెలీదు
మన మనసులకిదేమీ అర్థం కాదు
నువ్వు-నేను మనసు మాట వినదు!


                   ******* 

ఎడబాటు సెగ క్షణం తలిస్తే రగిలిన
దాన్నార్ప జీవితకాలం సరిపోవునా
గాయమవని మదికెందుకో ఈ వేదన
బహుశా దాని సగభాగం నీదగ్గరుందనా
నువ్వు నేను ఒకటైనా తరగని ఈ తపన
కలసిన మనసులు కలిసైనా కడదేరునా?

అడిగానని అనుకోవద్దు... చెప్పకుండా దాటేయొద్దు!

నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుధ్ధం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయంలాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుషునడిగా, ఆనందాశృవులకు ఆశిస్సు అడిగా
మది నొప్పించని మాటలు అడిగా, ఎద మెప్పించే యవ్వనం అడిగా....

పిడుగులు రాల్చని  మేఘం అడిగా, జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా, ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముథ్యాలడిగా, పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువును ఓదార్చే ఓర్పుని అడిగా, తలనే నిమిరే వేళ్ళను అడిగా
నెమలి ఆటకి పాదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా
గడిలో గుక్కెడు నీళ్ళే అడిగా, మదిలో జానెడు చోతే అడిగా
వద్దంతు లేని జాబిలిని అడిగా, నక్ష్రకాంతి నట్టింటడిగా
యుధం వధించు అస్త్రం అడిగా, అస్త్రం పలించు యోగం అడిగా
చీకటిని ఊడ్చే చీపుర్ని అడిగా, పూలకు నూరేళ్ళ ఆమని అడిగా 
మానవజాతికి ఒక నీతిని అడిగా, వేతలరాసి వేకువ అడిగా 
ఒకటే వర్ణం సబబని అడిగా, ఒకటే అనురాగం గుడిలో అడిగా
వారధి వంతున నెలవంకనడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా 
న్యాయం ధర్మం  ఇలలో అడిగా, ఎద రగిలించే కవితే అడిగా 
కన్నీలెరుగని  కవితే అడిగా, క్షామం నశించు కాలం అడిగా 
చుక్కలు దాటే స్వతంత్రమడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా 
తొలకరి మెరుపుల నిలకడని అడిగా, ఎండమావిలో ఏరుని అడిగా 
మూగ మాటకు చరణం అడిగా, మౌన భాషకు వ్యాకరణం అడిగా
శాంతిని పెంచే సంపదని అడిగా, వస్తే వెళ్ళని వసంతమడిగా
ఏడేడు జన్మలకు ఒక తోడడిగా, ఎన్నడు ఆగని చిరునవ్వు అడిగా
ముసిరే మంచులముత్యాలడిగా, ముసిముసి నవ్వుల ముగ్గులనడిగా
ఆశల మెరుపు జగమే అడిగా, అంధకారమా పొమ్మని అడిగా 
అందరి ఎదలో హరివిల్లడిగా, మరుగైపోని మమతను అడిగా 
కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవిరాజుని అడిగా
భమ్మెరపోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగే అడిగా
మోహన క్రిష్ణుడి మురళే అడిగా, మధుర మీనాక్షి  చిలకే అడిగా.
ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒడ్డెకించే గమ్యం అడిగా 
మల్లెలు పూచే వలపే అడిగా, పిడుగుని పట్టే ఉరుమే అడిగా
ద్రోహం అణిచే సత్తా అడిగా, చస్తే మిగిలే చరిత్రని అడిగా
విధిని జయించే ఓరిమినడిగా, ఓరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా
కాలం వేదం కాంతులనడిగా, చిన్నా చితక జగడాలడిగా
తియ్యగా ఉండే గాయం అడిగా, గాయానికి ఒక ధ్యేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా, ఒడిలో శిశువై చనుబాలే అడిగా
కంటికి రెప్ప తల్లిని అడిగా, ఐదో ఏట బడినే అడిగా
ఆరోవేలుగ పెన్నే అడిగా, ఖరీదు కట్టని చదువే అడిగా...

ఎన్నడడిగిన దొరకనిది, ఎంతనడిగిన దొరుకనిది, ఎవ్వరినడుగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాదంటూ
భగవత్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా

చదివి అలసిపోయారా???? పాటా విని సేదతీరుతూ......కాస్త ఆలోచించండి
అడిగినవాటిలో ఏమివ్వగలరో!!!!!!!!
http://www.dhingana.com/nityam-ekanta-kshaname-adiga-song-adhputham-telugu-oldies-2a62631
అక్షరమక్షరం....."అద్భుతం" ఈ పాటలో
 పాటని పదీకరించడంలో తప్పులు దొర్లితే మన్నించి స్పందిస్తారని ఆశిస్తూ.....
                                                                                                  ......మీ
                                                                                                  !పద్మార్పిత!

మారింది...

కాలమే మారింది...
నీవు కాదు నేను కాదు!
గాలితెమ్మెరే దిశను మార్చింది...
నీవు మారలేదు నేనూ మారలేదు!
మనదనుకున్న సమయం మారింది...
నీదైన నా ప్రేమలో లోపమన్నదేలేదు!
నీకున్న భావాలోచనాసరళి కుంటుపడింది...
మధురస్మృతులేవి ఇరువురం మరచిపోలేదు!
మసకెక్కిన హృదయ తాత్పర్యమే తారుమారైంది...
ఆనాడు ప్రేమలో రగిలిన జ్వాలలు ఇంకా ఆరలేదు!
నీ దృష్టి మరలి బంధీ అయిన మది పట్టుతప్పింది...
ఘనీభవించిన జ్ఞాపకాలు కరిగి కన్నీరుగా మారలేదు!
ప్రేమసామ్రాజ్యము వారసత్వముకాదంటూ కుప్పకూలింది...
గతాన్నితలుస్తూ మదికవాటాన్ని తెరచిచూడు ఏం మారలేదు!
ప్రేమించిన నువ్వు-నేను కాదు ప్రేమించలేని ఈ లోకమే మారింది.