కనువిప్పు

వానకు తడిసిన గోడలు కూలిపోయినట్లుగా
మమకారమున్న మనసుపొరలు మాసిపోతే
నిర్లిప్తభావాలు నిస్సంకోచంలో సగం చిట్లిపోయి
గోడ పై అందంగా పేర్చబడ్డ గాజుముక్కలయ్యే!

గెలవాలన్న ప్రయత్నం యుద్ధం చేసినా కూడా
వందమార్లు ఓడి నూటొకటవసారైనా గెలవలేక
వానవెలిసాక కరెంటుతీగకు వేలాడే నీటిచుక్కలై
చేతకాని ఆశలన్నీ ఆత్మహత్యకు తయారయ్యే!

ఇంధ్రధనస్సే విల్లై వంగి ధైర్యమే దూసుకురాగా
నిబ్బర నిక్షేపాలు ఉరుములై వెచ్చని ఊపిరైతే
నీడ కంపించి నిజాలెన్నింటినో కక్కి నిలకడనిస్తే
చూరట్టుకు వ్రేలాడుతున్న సూక్తులే జారిపొయ్యే!

పదాలు వెచ్చని పందిర్లు కాగా నిశ్శబ్దం నవ్వగా
ఓర్చుకోలేనన్న బాధని ఉప్పెనైనా ఊరడించలేక
ముసురు పట్టిన భావాలు బురదలో కొట్టుకుంటూ
విరిగిన చెట్టుకొమ్మపై నిలచి శోధనకి సిధ్ధమయ్యే!

నిఘంటువు

వ్రాయాలని కదం త్రొక్కితే పదం నేనౌతా
పదాలతో పాదమై నీ ప్రక్కనే నేనుంటా!

వేదనలే వ్రాయబోతే సాహిత్యం నేనౌతా
కధలు అల్లబోతే కాల్పనికల్లో నేనుంటా!

క్షణం తలిస్తే విఛ్ఛిన్నమై క్షణికం నేనౌతా
క్షణికంలో కావ్యమై నీ కలంలో నేనుంటా!

ప్రేమాక్షరాలే వల్లించు ప్రతీవర్ణనా నేనౌతా
వశీకరించిన గజల్ అయి నీ ముందుంటా!

కొన్నిగంటలు నాతో గడిపితే నేను నీవౌతా
తెలుగు నిఘంటువునై నీలోనే నేనుంటా!!

పసందైన మావ


పొలసచేప పట్టుకురా పులుసు చేసిపెడతానంటే
పుష్కరాలతోపాటు పొలసచేపా పారిపోయిందని
ఎర్రనీటి గోదారల్లె ఎగిరెగిరి పడితే ఎలారా మావ!?

నాటుకోడినే కోసి నీటుగా ఇగురు పెట్టనా అంటే
కండలేని కోడితింటే వేడిచేస్తాదని కాదుకూడదని
పందెంకోడిలా పైపైకి వస్తున్నావు ఏందిరా మావ!?

పొటేలు మాంసాన్నే మసాలాపెట్టి వండేదా అంటే
కొవ్వుపెంచే మటన్ అంటేనే మొహం మొత్తిందని
మురిపంగా చెప్పక మొరటుగా గిల్లినావు మావ!?

రొయ్యలు అయినా తేరాదా వేపుడైనా చేస్తానంటే
వెన్నుపూసలు వంగిపోయినవి తింటే వాతమని
వద్దు వద్దంటూ రోషంగా అరుస్తున్నావేల మావ!? 

పీతలైనా తెచ్చి చింతకాయలేవేసి వండనా అంటే
పీతలేం ఒద్దు ఒలుసుకుని తినడమే పెద్ద పనని
పప్పుకూడే చాలు అంటావు పసందైన నా మావ!?

విజయవిస్తరి

ప్రతీబాటా మంచిదని ఎంచి పయనించబోవ
నాకంటూ ధ్యేయంలేని దిశ, గాలి ఎటు వీస్తే
అటు దిశమార్చి అవాంతరాలని అడ్డుకోలేక
వేగప్రవాహ ఆటుపోట్లలో కొట్టుకునిపోతున్నా!

కళ్ళుకనే స్వప్నాలని అనుక్షణం మార్చేస్తూ
కలలకు రెక్కలుకట్టి వీధిలో విహరించమంటే
దారితెలియక తిరుగుతున్నాయి దిక్కుతోచక
అయినా మరేదో కోరి రూపకల్పనలే చేస్తున్నా!

మనసు కాలినా ఆశల మిణుగురులపై జాలితో
మరిగెడి మైనంలో వత్తి లేకపోయినా వెలిగిస్తూ
స్పష్టత లేని మంత్రాలనే ఉఛ్ఛరించా ఆశచావక
నిర్దిష్టత కోసమని నన్ను నేనే వశీకరించుకున్నా!

ఇప్పుడు బలవంతంగా ఆనందాల గొంతునులిమి
ఎంచుకున్నా రహదారిని నానీడకి నన్నే జతచేసి
ఇకపై నా ధృఢసంకల్పాలకు నా శ్రమే దిక్సూచిక
గమ్యమే స్వాగతం అంటే విజయ విస్తరి వేస్తున్నా!

తెల్లారిన తెలివి


నా అవగాహనే ఏదో అంతంత మాత్రం
మనఃస్థితినిబట్టి అదీ మారుతుంటుంది
ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పకుండా
జవాబు దొరికినప్పుడు ప్రశ్నిస్తుంటుంది!



నిన్ను నీవు నిజాయితీగా ప్రశ్నించుకో
సమాధానం నీలోనే దాగుంటుంది అంది
మనఃసాక్షికి జవాబు చెప్పడం కష్టమని
ఎవరికి వారే శోధించి సాధించాలంటుంది!



చెప్పమంటూ ఒత్తిడిచేసి ప్రశ్నిస్తే మాత్రం
మూతిముడిచి అలిగి దూరమైపోతుంది
బ్రతిమిలాడి బుజ్జగించితే చెబుతానంటూ
తానుచెప్పే సత్యాలు నేనొల్లను అంటుంది!



తెలియని ప్రక్రియని ధ్యానంతో సాధించుకో
తెలిసిన తరువాత సరిదిద్దుకోమని చెప్పింది
అంతర్గత సంఘర్షణల పై పట్టు విడువబోకని
పరిష్కరించలేని సమస్య సమస్యే కాదనంది!

హల్లుల హరికధ

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
అంటూ అచ్చులని అప్పుడెప్పుడో దిద్దిన నేను...
హల్లుల్ని హరికధలా చెప్పబోతే గొల్లుమన్నాయి ఇలా....

'క'న్నీళ్ళకి కరిగేది కాదు కాలం...
'ఖా'ళీగా కూర్చుంటే సాగదు పయనం!
'గ'డిచినకాలం తిరిగి రమ్మన్నా రాదు..
'ఘా'తుకాలను చూస్తూ సహించరాదు
'జ్ఞా'నం ఇతరులకు పంచితే తరిగిపోదు!
'చం'చల నిర్ణయాలు తామరాకుపై నీటిబొట్లు..
'ఛ'ఛ ఛీఛీ అనే ఛీత్కారానికి అవి తొలిమెట్లు!
'జ'గన్నాటక చదరంగంలో కీలుబొమ్మలం..
'ఝం'కారనాదం ఊదితే తలాడించే పాములం
'ఞ్' అనే అక్షరాన్ని పట్టుకుని ఏమి ఊగగలం!
'ట'క్కరోక్తులతో కొద్దికాలం హాయిగా జీవించినా..
'ఠ' అక్షరంలోని చుక్కలాంటి జీవికి విలువుండునా!
'డ'బ్బులు ఎన్నో సంపాదించి మిద్దె పై మిద్దెలే కట్టి..
'ఢ'మరుక మేళతాళాలతో మృత్యువును మనం తట్టి
'ణ'ముందు ప్రా చేర్చి ప్రాణం పోయలేం వజ్రాల్లో చుట్టి!
త ధ ద ధ న గూర్చి గొప్పగా చెబుదాం అనుకుంటే..
'ప'ద్మార్పితా పలికింది చాలు ఆపమని గోలచేస్తుంటే
'ఫ'లితం లేని పలుకులేల ఆచరించని అక్షరాలు ఏలని
బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ పై అలిగాను :-)

(మూడేళ్ళ క్రితం "అచ్చుల" పై రాసిన పోస్ట్ కి కంటిన్యుటీ కోసం చేసిన ఈ "హల్లుల" పై ప్రయోగాన్ని చదివి అక్షింతలు/తిట్లు వేస్తే సంతోషిస్తాను- మీ పద్మార్పిత)

నేనున్నాను..

రేపన్నది నేను లేకుండానే మొదలై...
సూర్యోదయాన్ని నేను చూడలేకపోతే,
కన్నీటినే తుడుచుకుని సాగిపో నేస్తమా
సూర్యచంద్రులే నీ నేస్తాలనుకో మిత్రమా!
నీవు నన్ను ఎంతగా చూడాలనుకుంటావో
నేను నిన్ను అంతగా చూడాలనుకుంటాను
తలచుకున్నదే తడవు వెక్కిళ్ళుగా వస్తాను!
వాగ్దానం అయితే చేయబోను రేపు నీదేనని...
నేడు మాత్రం నీ ఆత్మవిశ్వాసమై తోడుంటాను,
నమ్మకానికి ఆదరిన నీవుంటే ఈ దరిన నేనుండి
నా అసంపూర్తి విజయాల్ని నీలో చూసుకుంటాను
కాబట్టి తలుచుకో చాలు నీ గుండెల్లో నేనుంటాను!

మరలిరావద్దు


మరచిన జ్ఞాపకాల్లారా మరలిరాకండి
ప్రశాంతగా ఉండమని, వెంటపడకండి!
రాలిన తారలనే ఒడిదాల్చి కూర్చున్నా
కలలనే తోడుగా ఉండమని కోరుకున్నా
వ్యధచెంది ఉన్నా వెర్రిదాన్ని చేయకండి!



కన్నీట తడిచిన వస్త్రాలువిప్పి దోచకండి
కోరికల గాట్లుపెట్టి, గాయాలు చేయకండి!
ఆశల గాలమేదో వేసి ఎదురు చూస్తున్నా
ఆసరాగా ఆత్మస్థైర్యానే అప్పడుగుతున్నా
పరామర్శని పలుకరించి పళ్ళికిలించకండి!



నవ్వులపాలు చేసి చోద్యమేదో చూడకండి
కుదిరితే, కొత్తవెలుగు వైపు దారి చూపండి!
పడిలేచే ప్రయత్నాన్ని నే పదేపదే చేస్తున్నా
నమ్మకాన్నే పెట్టుబడి పెట్టి బేరమాడుతున్నా
అందుకే మరచిన జ్ఞాపకాల్లారా మరలిరాకండి!

వద్దంటూనే...


నీవు ఆ దారిన వెళుతుంటే ఈ దరిన...
అసంకల్పితంగా నా తనువే పులకించెనే!

నా చూపులే గుచ్చునని తాళం వేసినా
నీ కదలికలతోనే చూపుల తాళం ఊడెనే!

సంధ్యవేళ గడిచి రేయి మిగిలిపోయినా
నిర్మలమది లోగుట్టునే దోషని నిలదీసెనే!

బుడగవంటి ఆవేశం నిన్ను చూడననినా
నీ ధ్యాస పరిమళ తాకిడికే అది పగిలెనే!

కోడికూయగానే ఎర్రబడిన కళ్ళు విచ్చినా
వెలుగుతున్న జ్ఞాపకం కనులని మూసెనే!