ఏమి నా భాగ్యం!

హృదయం కావ్యమై, వేదన కవితగాను గతాన్ని గజల్ గా వ్రాసి
పరాయి వాళ్ళనే శ్రోతలుగా చేసి వినిపించేలా కలిగెనే నా భాగ్యం!

కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టాను వచ్చి చూసి
పరామర్శించే నెపముతోనైనా పలుకరించి పోరాదా ఓ నా అదృష్టం!

నచ్చిన లోగిలినే అందంగా ఊహించుకుని ఎదశ్వాసనే ఊపిరి చేసి
అదృష్టాన్ని అంచనా వేయక ఆనందాన్ని పందెమేసి ఆడితి జూదం!

ఏరి కోరి అంగట్లో ఎడబాటు వ్యధలను లాభం కోసమని వేలం వేసి
లోకాన్ని జయించి నీ ముందు ఓడిపోయా ఎందుకని చెప్పు నేస్తం!

నా వలపు సాంద్రతను కొలవడం రాక నీలో ఉన్న నన్ను చంపేసి
నమ్మకాన్ని సజీవంగా ఉండమని చెప్పడం ఎంత వరకూ న్యాయం!

ప్రేమన్నది ఆటవస్తువు కాదు ఆడుకున్నంతసేపు ఆడుకుని విసిరేసి
క్రొత్తబొమ్మ కొనుక్కుని మురిపెంగా దానితో కొన్నాళ్ళు ఆడుకోవడం!

నాలాగే జీవితాంతం ప్రేమకోసమే అల్లాడి అప్పుడు దరిచేరి జతచేసి
పద్మను రమ్మని పిలిస్తే నేను పోయినా నా ప్రేమ నీపైనే ఇది సత్యం!

మనసా మాయమైపోదాం రా!

చెప్పడానికి ఏముంది వినేవారుంటే ఎన్నో చెబుతారు
పనికిరాని మాటలకి విలువలేదు కదాని వాగేస్తారు..   
విని వదిలివేయక పట్టించుకుంటే బ్రతుకలేవే మనసా!

ప్రతి ఉషోదయానికీ రేయితో సంబంధం అంటగడతారు
నువ్వెంత నీ ప్రాతివత్యమెంతని రోబోతో రంకుగడతారు  
మనుషులున్న లోకంతీరే ఇదని తెలుసుకోవే మనసా! 

మనల్ని మనమాడిపోసుకుంటే అవునని ఆసరా ఇస్తారు
కాదని వాదించి గెలవాలి అనుకోకు తప్పులెంచుతారు..
వీధి కుక్కలు మొరుగుతుంటాయి గుబులేలనే మనసా! 

నీతులు చెప్పే ప్రబుద్ధులెందరో గోతులు తవ్వుతుంటారు
అవసరానికి అందితే చేతులు లేదా కాళ్ళు పట్టుకుంటారు   
పరులు అనేమాటలకి నీకళ్ళు తడుపుకునేడవకే మనసా!

ఎంతటి మహానీయులైనా అందరినీ ఆనందింపజేయలేరు
ఎవరికి ఎవరూ చివరికి ఎవరూ నీవారు కారు, రారు..    
మనకు సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటైనా చెయ్యవే మనసా!

పిలచినా బిగువటోయ్..

ఏడనున్నావో ఎలాగున్నావో కానీ ఎదను మీటుతున్నావోయ్
నీలిమేఘాలు నీలిగి చుక్క రాల్చనన్నాయి నువ్వొచ్చిపోవోయ్    
కొప్పులోని మల్లెలు పక్కపై రాలి వాడిపోతున్నాయి రావోయ్
మౌనంగా మనసు పాడేటి రాగసాహిత్యం రంజుగుంటదిలేవోయ్!

చురకత్తి మీసాలోడా నీకోసం చుక్కలతోటంతా చుట్టొచ్చినానోయ్
అల్లిబిల్లి కౌగిట్లో అల్లుకుపోయి కొసరి అనురాగమే అందిస్తానోయ్
కన్నుకన్ను కలిపిచూసుకుంటే వెన్నెలరేడు వెక్కెక్కి ఏడ్చునోయ్
చీకట్లో సరసమాడక నీ నీడతోనే నీకు దాగుడుమూతలేలనోయ్!

ప్రణయంలో పట్టువిడుపుల పదునెంతో నీకు తెలియని కాదోయ్
వలపురేడా నీకై రసికరాజరికమే పరుపుగా పరచినాను కదోయ్
ఆకలేసున్నావు అందుకో ఇస్తాను నా కౌగిలెంతో తియ్యనిదోయ్
కంటికి కానరాక కవ్విస్తే వేచి ఉన్న విరహమెలా తీరుతుందోయ్!

మెరుపులా మెరిసిపోక మబ్బై కమ్ముకుని వానలా తడిపేసెయ్
వలపు వానలో తనువు తాకి తడారని అందాలని తడిమేసెయ్
సిగ్గుపడితే సొగసులే కరిగేనని సిగ్గువిడిచాను నన్ను చుట్టేసెయ్  
లోకాన్ని మరచి మైకంతో ఏకమైపోదాము దీపం ఆరిపివేసెయ్!