నీ ఊహల్లో...

నీలాగే నేనున్నాను, వేరే తలపులతో నీకేం దూరంకాను...
ఊసుపోక నీవు తలిస్తే, నీ ఊహల్లో వేరే ఊసెత్తకున్నాను!

నీ ఎడబాటులో కన్నీటిని ఆశ్రయం కోరాను
గతినేనని నవ్విన కన్నీటికేం బదులీయను!

నీ శ్వాసలో, తనువులోని అణువణువులో నేనే ఉన్నాను...
అయినా నుదుటిరాతలో లేని నీకై అత్యాశ పడుతున్నాను!

రేయంతా నీతో ఊసుల్లెన్నో నేను చెప్పాను
ఈ ఊహలతోనే నేను తన్మయం చెందాను!

వేయి భాధాకెరటాల తాకిడికైనా నేను ముక్కలుకాను...
నీకు దూరమైనానన్న నిజాన్ని అబధ్ధంగా ఎలామార్చను!

నాలో ఉన్న నిన్ను బయట వెతుకుతున్నాను
అలసిన నేను నీ ఊహల్లో సేదతీరుతున్నాను!

నా లోకమే నీవైనా మనసుని పంజరంలో బంధించాను...
కోరికల గుర్రాలకే రెక్కలు వస్తే నేను కళ్ళెంవేసి ఆపలేను!

మాయరోగమేదో!

డాక్టర్. సృష్టి, MDలైఫ్ స్పెషలిస్ట్ దగ్గరకి నలతగుందని వెళితే నిదానంగా విన్నారు.
కొన్ని చెకప్స్ అని, అన్ని పరీక్షలూ చేసి  "మాయరోగమేదో" రావచ్చునని అన్నారు.
జ్వరం వచ్చిందని థర్మామీటర్ తో టెంపరేచర్ చూసి టెన్షన్ పాళ్ళు 40 డిగ్రీలన్నారు.
రక్తపీడనం/బి.పి  పరీక్షించి 120/80 అని కారుణ్యం/దయ చూపడం పెంచమన్నారు.
మధుమేహమని షుగర్ టెస్ట్ చేసి 100mg/dl అని, క్రోధానికి కాస్త కళ్ళెం వేయమన్నారు.   
గుండెచూసి కార్డియోగ్రాంచేసి ఒంటరితనానికి ప్రేమనే పలు బైపాస్ సర్జరీలు అవసరమన్నారు.
ఎక్సెరేని ఎగ్జామిన్ చేసి నలుగురితో కలిసి ఉండు, శతృత్వంతో కలబడి కాలు ఫ్రాక్చర్ అన్నారు.
కంటిపరీక్షని రెండు చుక్కలేసి ఫండస్ టెస్ట్ చేసి దూరాలోచన లేదని లాంగ్ సైట్ ఉందని తేల్చారు.
సరిగ్గా వినపడ్డంలేదంటే ఇ.ఎన్.టి పరీక్షలు జరిపి చెప్పుడు మాటల కాలుష్యంతో చెవుడొచ్చిందన్నారు.

ఈ చెకప్ చాలు, ఫీజ్ ఎంతంటే? ఫ్రీ చెకప్ ఇది అంటూ కొన్ని రత్నాల గుళికలని ఉచితసలహాగా ఇచ్చారు.
1. ప్రతి ఉదయం ఒక గ్లాస్ కృతజ్ఞతాభావాన్ని  త్రాగమన్నారు.
2. ప్రశాంతతని పనికివెళ్ళేటప్పుడు ఒకస్పూన్ సేవించమన్నారు.
3. ప్రతిగంటకొక ఓర్పు మాత్ర, కప్పు నమ్రతను పుచ్చుకోమన్నారు.
4. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక డోసు ప్రేమను తీసుకుని వెళ్ళమన్నారు.
5. నిదురించే ముందు రెండు మాత్రల వివేకాన్ని మ్రింగమని చెప్పారు.


చివరిగా........ఏదో అయిందంటూ విచారంతో నిరాశతో నీలో ఉన్నవాటిని నిర్జీవం కానీయకు. 
ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. మానవునిగా పుట్టినందుకు హాయిగా నవ్వేస్తూ పరిపూర్ణంగా జీవించమన్నారు.:-) :-) :-)

ఇలా జరిగుంటే!!!

నీవని నావని విడివడని క్షణాలు కొన్నైనాఉంటే
భాషరాని మౌనం మనసువిప్పి మాట్లాడుతుంటే
రేయి పగటిని రానీక ద్వారపాలికై కాపుకాస్తుంటే
చిలిపితగువుతో నేనలిగి మూతి ముడుచుకుంటే
నా కాలి బొటనవేలిని ముద్దాడి నీవు లాలిస్తుంటే
చాలించమని సుతారంగా మిమ్మల్ని నెడుతుంటే
జోక్యమేలని గాలికూడా మన నుండి జారుకుంటే
మరింకేదో కావాలంటూ మరింత మారాం చేస్తుంటే
పెదవులమధ్య మెరిసేముత్యాలు రెచ్చగొడుతుంటే
కోరికలు ఎన్నో అలజడిచేస్తూ అదుపుతప్పుతుంటే
తప్పైనా కాదని సమర్ధింపునే ఆసరాగాచేసుకుంటే
తనువుల మధ్య జరిగే యుద్ధంలో గెలుపెవరిదంటే
నీవు గెలిచి నేనోడినా నేనోడి నీవు గెలిచినా ఒకటే!!!

లేనితనమా!

కోతినుండి పుట్టి ఆ చేష్టలొద్దన్నాడు
నక్కజిత్తులతో నటించడం నేర్చాడు
ఏనుగు అంత బలమీయమన్నాడు
కుక్కలోని విశ్వాసమే తనదన్నాడు
సింహా
సనానికై వెంపర్లాడుతున్నాడు

గాడిదలా బరువులెన్నో మోస్తున్నాడు
జింకలోని చలాకీతనం కోరుకున్నాడు
గంగిరెద్దులా తలూపి సాగిపోతున్నాడు
చిలుక పలుకులెన్నో పలుకుతున్నాడు
నెమలి నాట్యాన్ని చూసి పరవశించాడు
కాకి రంగు ఒద్దని కోకిల గానం కోరాడు
సీతాకోకచిలుక
ను రంగులివ్వమన్నాడు
హంసలోని స్వచ్ఛత తనదనుకున్నాడు
తాబేలుని నెమ్మదితనం నేర్పమన్నాడు
క్రోధంవస్తే కోడెనాగై బుస్సుమంటున్నాడు

కార్యసాధనలో ఉడుములా పట్టుపట్టాడు
కోరికల్లో కళ్ళెంలేని గుర్రమై గెంతేస్తున్నాడు
పరజీవులను ఇన్నికోరిన మానవుడు
మన అర్హతలేవీ ఎందుకీయకున్నాడు

అవేవీ వాటికి అడగడం చేతకాకనా!!!

లేక మనలో అవి లేకపోవడమేనా???

అదేకామోసు!

అలోచనలు ఎందుకిలా నన్ను వెంటాడుతుంటాయో?
అవి అక్షర రూపాలై అందరినీ అలరించమనికామోసు.

భావాలు నాతో ఎందుకు అనుబంధం పెంచుకున్నాయో?
కష్ట సుఖాలని పంచుకునే బంధాల అన్వేషణిదికామోసు.

చిత్రాలు రంగులకుంచెతో చేతుల్నెందుకు వణికిస్తున్నాయో?
విచిత్రజీవితాన్ని రంగులతో అందంగా మలచమనికామోసు.

కొందరి మాటలు మనసుని ఎందుకు గాయపరుస్తున్నాయో?
గాయపువేదన తెలిసి వేరొకరిని భాధించరాదనికామోసు.

గెలుపోటముల చెలిమికై నవ్వులేల ప్రాకులాడుతున్నాయో?
జయాపజయాల్ని నవ్వుతోనే రాణించగలమనికామోసు.

సమస్యలతో సరదాలు సంప్రదింపులేల జరుపుతున్నాయో?
అన్నీమరచి హాయిగా గడపడమే అధికమించేశక్తికామోసు.

ఇలా మీతో పంచుకోనినాడు నాలో ఆకలి దప్పికలు ఏమైపోతున్నాయో???
ఈ-బంధం ఏర్పడ్డ ఇన్నాళ్ళకిదేం ప్రశ్నంటూ మీ ఛీవాట్లు తినమనికామోసు:-)

అచ్చుల్లో అగుపించని అతడు...


నంతపూర్ అబ్బాయి అందగాడనుకున్నా, అందనంత ఎత్తులో ఉన్నాడని కాదన్నా.
త్మకూరు కుర్రోడికి ఆత్మవిశ్వాసంకన్నా, ఆస్తిమీదే అతని కన్నుందని తెలుసుకున్నా.
బ్రహీంపట్నం పోరడు పట్నం పోరికి పొగరెక్కువని అంటే, నేను కూడా కాదు పొమ్మన్నా.
స్ట్ గోదావరివోడు ఈస్ట్ మన్ కలర్ లైఫ్ అనుకున్నా, ఈలేసి గోలచేస్తే ఈసడించుకున్నా.
య్యూరు చిన్నోడు ఉత్తముడనుకున్నా, ఉత్తుత్తిమాటల ఉలిపిరిగాడని ఉదాసీనంగున్నా.
త్నూర్(అదిలాబాద్) ఊరోడు అణిగిమణిగి ఉంటాడని ఊహలెన్నో ఊహించుకుంటున్నా.
షికేష్ నుండి వచ్చిన మహానుభావుడితో మనువెందుకులే వద్దనుకుని మానుకున్నా.
తో ఊరే లేనప్పుడు పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడుంటాయని, ఆ మాటే మాట్లాడనన్నా.
లమంచిలి ఎర్రోడు ఎదురు చెప్పడనుకున్నా, ఎకసెక్కాలు ఎక్కువైనాయని ఎడంగాఉన్నా.
లూరు దొర నాకేం తక్కువని ఎగిసిపడ్డా, ఏడువారాల నగలు తెమ్మని ఏడిపిస్తారని విన్నా.
లవరం మాన్ ఐరావతమంత మనసనుకున్నా, దానికన్నంత కూడా కానక కిమ్మనకున్నా.
ఒంగోలు బాబుతో ఒడిదుడుకులులేని కాపురం అని ఖుషీగున్నా, ఒట్టిమాటలే అని కాదన్నా.
డరేవు పక్కనున్న వాల్టేర్ వీరుడని ఓకే అన్నా, ఒట్టిచేపల కంపే తప్ప ఇంపు కానరాకున్నా.
రంగాబాద్ పిల్లోడి మదిలో అంజంతా శిల్పమవ్వాలని, వాడుకాదని అన్నా నేను అవునన్నా.
అంతర్వేది హీరో అతడు అందలమెక్కిస్తాడనుకున్నా, చెప్పకుండా అమెరికా చెక్కేస్తే సరికాదన్నా.
అః తో ఏ ఊరనడిగే మీతో.....ఆంధ్రప్రదేశ్ అచ్చుల్లో లేనివాడిని ఏ ఊళ్ళో వెదకనని అడుగుతున్నా.


(ఇది కేవలం సరదాగా నవ్వుకోడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తారని మనవి)

మౌనంవీడు!

ప్రియా...
రాతిరైతే ఒంటరవుతానన్న భయం...
నీ ఊసుల దారాలతో అల్లుకున్న దుప్పటి కప్పుకొని
కలల అలల నురగలపై తేలియాడుతూ
ఒక్కో ఆశనూ నీ ముందు కాగితప్పడవను చేసి
నీ కనుల కొలనులో విడిచి
కరుణకై ఎదురు చూస్తున్నా...

ఈ చీకటి కీచురాళ్ళ ధ్వని మదినావహించి
నిశ్శబ్ధపు ఆవరణలో ఇంకిపోతున్నా...

ఒక్కమారైనా ఆ శిలాహృదయ పంజరాన్ని బద్ధలుకొట్టి
నా ఈ కన్నీటి పుష్పాన్ని స్వాకరించ రావా???
ప్రియుని ప్రశ్నకు?

ప్రియతమా...
పగలంతా పనిలో ఉన్నానని మనసుని మాయచేసానని నన్ను
నీకు దూరమై మౌనంగా రోధిస్తూ
నన్నుశపిస్తుందది తెలుసును
పగలైతే నన్ను మభ్యపెడతావు రేయి భూతానికి బానిసవైనావని
అర్థరాత్రి గడియకొకమారు ఉలిక్కిపడేలా లేపి వెక్కిరిస్తుంది నన్ను!

నా ఊసుల దారాలదుప్పటి కప్పుకున్న నీ మోము కలనైనా కానక
నా ఒంటరితనపు కన్నీట నీవంపిన కాగితపు పడవని తడవనీయక
నా కన్నులలో ఎన్నాళ్ళని దాచగలనో ఎవరికంటా నిన్ను పడనీయక
నాకు తెలుసు నవ్వేస్తుంటావని నా ఈ మనోవేదన నీకు తెలియక!

చీకటి కీచురాళ్ళ నిశ్శబ్ధపు ధ్వనావరణలో ఇంకనీయరాదని నిన్ను
ఇలా సిగ్గువిడిచి నా మనసు విప్పి నగ్నంగా నీకు దాసోహమైనాను
నీవు చులకనగా చుస్తావో లేక పద్మాన్ని పరవశమై వికసింపచేస్తావో
నీ మాటల ఉలికి లొంగిన శిలను నేను శిల్పంగా మార్చేయి నన్ను!

చీకటిలో మనిరువురి ఆత్మల బంధాన్ని నీటగీసిన గీతలని భ్రమించక
సరససల్లాపాల సరస్సులో మునిగి కమలానికి కాంతినొసగు కాదనక
ప్రియతమా!! మాటల్లేవని రావని మౌనంగా ఉండిపోకు జవాబీయక
నీ మౌనం నన్ను కృంగదీసి దహించి వేస్తుంది ఏ పనీ చేయనీయక!

నా వయసెంత?!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)
కన్నవారి లాలింపులో నేను పసిపిల్లని
జ్ఞానసముపార్జనలో నేను 5దేళ్ళపాపని
అల్లరి ఆటల్లో నేను 10దేళ్ళ అమ్మాయిని!!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)
పరువాల ఉరవడితో పొంగే 16రేళ్ళ పడుచుని
అందంలో 21 ఏళ్ళ వయసొచ్చిన యువతిని
పరిణయానికి పరిణితి చెందిన 25దేళ్ళ పడతిని!!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)

మాతృత్వానికి మచ్చరానీయని 30ఏళ్ళ మహిళని
క్రమశిక్షణతో పెంచి పెద్దచేసేవేళ 35దేళ్ళ ముదితని
నలుగురితో ముచ్చటించ్చేప్పుడు నేను 40ఏళ్ళ ప్రౌఢని!!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)

ఆత్మవిశ్వాసంతో 50ఏళ్ళు అధికమించిన సబలని
బరువు-బాధ్యతలను మోయడంలో 55దేళ్ళ నారిని
జీవితపదవీవిరమణ హక్కుకై వేచియున్న 60ఏళ్ళ స్త్రీని!!