జలమునై గళమువిప్పిన!

నేను జలమునై గళము విప్పితే!
శివుని శిరమున గంగనై, భగీరధుని తపస్సునై
పరవళ్ళు తొక్కుతూ సముద్రుడిలో ఏకమౌతా...

నేను జలమునై గళము విప్పితే!
వర్షించే మేఘమై, వరద కాని వాగునై
హరివిల్లుల జల్లులతో మీకు ప్రియమై మీలో ఒకరినౌతా...

నేను జలమునై గళము విప్పితే!
పంటల పచ్చదనానై, కర్షకుల ఆశాజ్యోతినై
సస్యశ్యామల జగతికి సోపాన మార్గమౌతా...

నేను జలమునై గళము విప్పితే!
జీవనాధారమై, సేదతీర్చ చల్లదనానై
ఆకలి దప్పికలు తీర్చి అందరి పెదవులపై చిరునవ్వునౌతా...

నేను జలమునై గళము విప్పితే!
ఒక వ్యధా గాధనై, కన్నీటిధారనై
చెంపన జలజలా జారి, ఎదను చేరి ఓదార్పునౌతా...

జలమేలే అని జారవిడిచి వృధాచేస్తే?
బీడువారిన నేలనై, స్వేదబిందువునై
గాయపడిన హృదయముతో ఆవిరై మీకు దూరమౌతా!!!

బహుమానం!!

వస్తువు రూపంలో బహుమతులు అందరూ ఇస్తారు....
ఈ విధమైన బహుమతులు ఇస్తే ఎలా వుంటుందంటారు??

మనకిమనం....స్వాభిమానం, ఆత్మపరిశీలన, వ్యాయామం, సంతృప్తి!
తల్లిదండ్రులకి....ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞతలు, ఆత్మీయత, ఓదార్పు!
జీవితభాగస్వామికి....ప్రేమ, ప్రశంస, నమ్మకం, తోడు, సమయం!
సోదరీసోదరులకు....అనురాగం, మనోధైర్యం, సహాయం, అర్థంచేసుకోవడం!
సంతానానికి....జ్ఞానం, సలహా, ప్రేమ, దయ, నీడ!
స్నేహితులకు....చేయూత, సద్భావం, సమయం!
సహాయపడినవారికి....మెచ్చుకోలు, కృతజ్ఞతలు, గుర్తుంచుకోవడం!
తోటి ఉద్యోగులకు....పలకరింపు, సహాయగుణం, హాస్యం!
అధికారికి....గౌరవం, నమ్మకం, నాణ్యత, సమయపాలనం!
శత్రువులకి....క్షమించడం, చిరునవ్వు, స్నేహభావం!
దేశానికి....గౌరవం, అభివృధ్ధికి మార్గం!
దేవునికి....నిర్మలమైన మనసుతో ప్రణామం!
మరింకెందుకు ఆలస్యం....పదండి బహూకరిద్దాం!!

సార్థకత!

గాయమైన వెదురు పలుకుతుంది రాగం...
ఎవరికొరకై చేస్తుంది కోయిల గానం...
రాగద్వేషాలతో రగలడమెందుకు...
ప్రేమానురాగాలతో పద ముందుకు...
వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
నలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు...
నలుగురికి ఆదర్శం కావాలి జీవనం...
అదే మానవ జన్మకు పరమార్థం...

పెళ్ళిపందిరిలో ప్రకటన!!

పెళ్ళిపందిరిలో వధువు కావలెను అనే ప్రకటనని ఎవరెవరు ఎలాఇచ్చారో ఒక్క లుక్ వేయండి:)...:)

డాక్టర్....కొద్దిరోజుల క్రితమే నాకు ప్రేమ అనే బాక్టీరియా సోకి పెళ్ళి అనే రోగానికి దారితీసింది. కావున అందమైన రోగిణులు మందు మాకు గురించి తెలిసిన వారు ముందుగా రిసెప్షన్ లో అపాయింట్మెంట్ తీసుకుని నన్ను సంప్రదించవలసిందిగా ప్రార్ధన. రోగనిర్ధారణ(అన్ని అభిప్రాయాలు కలిస్తే) జరిగిన పిమ్మట నేను ఒక మంచి వైద్యునిగా(భర్తగా) సేవలందిస్తానని వాగ్ధానం చేస్తున్నాను!!!

లాయరు(న్యాయవాది).... నేను భర్తగా ఆమోద యోగ్యతను పొంది, వివాహమాడ తలచినాను కావున అవివాహితల నుండి ధరఖాస్తులను కోరడమైనది. ఆమె తన పరిధిలో నాకు మనసావాచా అర్పితమవ్వాలి. ఎటువంటి అభ్యంతరమున్నా ఓవర్ రూల్డ్ కావించబడుతుంది, సస్టండ్ చేయబడదు!!!

బిక్షగాడు....అయ్యా దేవుని పేరుపై నాకు ఒక సహధర్మచారిణిని దానం చేయండి. వేరొకరి పత్ని కాకపోయినా మీపత్ని అయినా పర్వాలేదండి. మీరు ఒకళ్ళని దానం చేస్తే మీకు భగవంతుడు నలుగురిని ప్రసాదిస్తాడు. అ
య్యా ఆలోచించక దానం చేయండి బాబయ్యా!!!

బ్యాంకర్....వధువు కావలెను, ఎవరైతే వారి ఆస్తిని జమా చేసి చక్రవడ్డీ లాంటి సేవలతో లాభాలని అందించగలరో అటువంటి అమ్మాయిల నుండి నెలలోపు ధరకాస్తులను కోరడమైనది. గడువు తరువాత అయినచో ఆలస్య రుసుముతో స్వయముగా సంప్రదించ గలరని ప్రార్ధన!!!

కవి....బహుకాలానికి నాకొక కోరిక కలిగినది,
పెళ్ళికై నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది,
ఇన్నాళ్ళు పెళ్ళితో నాకేమీ పనిలేదన్నది,
ఇప్పుడిక ఇంటపని బయటపని నాతో కాకున్నది.
అందుకే సరి అయిన జోడీ కొరకు వెతుకుతున్నది!!!

కారు మెకానిక్....పాతదైనా కొత్తమోడల్ గా కనబడే వధువు కావలెను. మంచి కండిషన్ లో ఉండి తక్కువ సొమ్ముతో ఎక్కువ హంగూ ఆర్భాటాలు చేయగలిగి, సంవత్సరంలో రెండు సర్వీసులు( సినిమాలు) మాత్రమే కోరుకునే 362436 మోడల్ వధువునకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బ్రోకర్లను వదలి పార్టీ డైరెక్టుగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము!!!

తాగుబోతు....నాకు పెళ్ళాం కావాలి. పిల్ల తండ్రికి తప్పక సోడా ఫ్యాక్టరీఉండి తీరాలి. నేను ప్రతిరోజూ కాకుండా వారానికి ఏడు రోజులు మాత్రమే తాగుతాను. ఇంటి వద్ద కాదంటే బార్ లో సరిపెట్టుకుంటాను. బార్ నుండి నన్ను ఇంటికి మోసుకెళ్ళే అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సోడాని సాంపుల్ గా పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి!!!

గమనిక:- ఇప్పటి వరకు పై వ్యక్తుల ఆలోచనల మేరకు ప్రకటనలను ఇవ్వడం జరిగినది. ఎవరైనా ఆశక్తిగలగిన వారు తమకి తోచిన విధముగా ప్రకటనలు ఇవ్వదలచిన వ్యాఖ్యల రూపంలో ప్రకటించమని అభ్యర్ధన!!!

బ్లాగ్ మిత్రులారా! ఇది కేవలం హాయిగా నవ్వుకోవడానికి చేసిన చిరు చిలిపి ప్రయత్నమే కాని ఎవ్వరి మనసునీ నొప్పించాలని మాత్రం కాదని మనవి....జై భారత్ మాత!

దివిని భువికి బహుమతిగా ఇద్దాం
తారా చంద్రులతో అలంకరించుదాం....
ఇంటింటా విద్యాజ్యోతుల్ని వెలిగిద్దాం
దేశపురోగాభివృద్దికి పాటుపడదాం....
విధ్రోహశక్తుల వెన్ను విరిచేద్దాం
మన శక్తిసామర్ధ్యాలని నిరూపించుకుందాం....
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదిరిద్దాం
మనకి మనమేసాటి అని తెలియ చెబుదాం....
చెడుకి బానిసలం కామని ప్రమాణం చేద్దాం
దేశమాతకి ముద్దుబిడ్డలమని చాటిచెబుదాం....
భరతమాత ఒడిని సుఖఃసంతోషాలతో నింపేద్దాం
బాట కఠినమైనా, గమ్యాన్ని మనం చేరుకుందాం....
పైన వ్రాసిన వ్రాతల్ని చేతల్లో చేసి చూపిద్దాం
బ్రహ్మాండమైన సంబరాలు మరింకెన్నో జరుపుకుందాం....

ప్రేమ ఒక స్వప్నం

ప్రేమ ఎంత మధురం అని అనుకున్నా
ప్రేమించి ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నా

ప్రేమలో నేను ఇంతగా కూరుకు పోయివున్నా
అసత్యాలని కూడా సత్యమని నమ్ముతున్నా

ప్రేమలో నా కంటిని నేనే నమ్మకున్నా
మెరిసేదంతా పసిడి అనుకుంటున్నా

ప్రేమలో ఎవ్వరినీ లెక్కచేయనన్నా
స్నేహితులు చెప్పింది పరిహాసమనుకున్నా

ప్రేమ నన్ను ఎంతగా మార్చిందో చెప్పలేకున్నా
నా అన్నవారినందరినీ దూరం చేసుకున్నా

ప్రేమతో నా హృదయాన్ని నేనే గాయపరచుకున్నా
మరచిపోవాలని నన్ను నేనే మరచిపోతున్నా

ప్రేమ ఒక స్వప్నమైతేనే బాగుంటుంది అనుకున్నా
నా ప్రేమకి ఇంక అక్కడే స్థానం కల్పిస్తున్నా......

నీవు కావు..

ప్రణయానికి ప్రేరణ నీవు
విరహానికి వేదన కావు..

నా కంటి చూపునీవు
దాహాన్ని తీర్చలేని కన్నీరు కావు..

ఆలోచనల అలవి నీవు
అలజడికి కారణం కావు..

జీవించడానికి ఆశవి నీవు
మరణానికి ఎన్నడూ మూలం కావు..

ప్రేమని కొలచిచూడు!

ప్రేమకి కొలమానం నీవడిగిన వేళ
నా గుండె గొంతు విప్పి చెబుతున్నానీవేళ
నీపై నాకున్న ప్రేమను హృదయకవాటాలని తెరచిచూడు
నమ్మకపోతే నా హృదయంతో నీ హృదయాన్ని మార్చిచూడు.

నా ప్రతిశ్వాసపై నీపేరే లిఖించాను
నీకై నా అస్థిత్వాన్నే నేను మరిచాను
నీవుకూడా ప్రేమలో హద్దులు దాటి చూడు
నా నిద్రలేని రాత్రులతో నీ రాత్రుల్ని మార్చిచూడు.

నా ప్రేమ కన్నీరై ప్రవహించినవేళ
ఆనీరే నీ హౄదయాన్ని కడిగి వేస్తుందావేళ
ఆరోజు కుడా నా పెదవి నీపేరే పలుకుతుంది చూడు
ఆ పలుకులకి ప్రతిస్పందనగా నీవేమైనా పలికి చూడు.

నీకై నా జీవితాన్నే అర్పిస్తాను
నీప్రేమకై నేను ప్రపంచాన్నే వెలివేస్తాను
అప్పుడు నీ హృదయమెలా ఘోషిస్తుందో చూడు
నా ప్రేమని నీ ప్రేమతో కొలచివెల కట్టలేవు చూడు.

స్నేహమంటే!!!

చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంకాదు స్నేహమంటే
జీవితంలో పైకి ఎదగడానికి మెట్టది***
రోజూ ఒకరినొకరు చూసుకోవడంకాదు స్నేహమంటే
మనల్ని మనం అద్దంలో చూసుకుంటే గుర్తుకొచ్చేదది***
కాలక్షేపానికి రోజూ కబుర్లు చెప్పుకోవడంకాదు స్నేహమంటే
గుండెలపై చేయివేసుకుంటే గుర్తుకొచ్చే అనుభూతది***
పేరు పేరునా పిలచి పలకరించుకోవడంకాదు స్నేహమంటే
పదిమందిలో మనపేరుతో పాటు పలుకరించే పదమది***
ఎన్నటికీ ఎడబాటే ఎరుగనిది స్నేహమంటే
దూరమైనా దగ్గరగా ఉన్నామన్న భావమది***
కలసి ఉండాలని కలుకనడంకాదు స్నేహమంటే
భాధ ఇక్కడైతే అక్కడ కన్నీరు కార్చేదది***
ఆనందంగా జీవించడానికి ఔషదంలాంటిది స్నేహమంటే
అన్నింటినీ మరిపించి హాయిగా నవ్వించగలదది***
ఒక్కరోజు శుభాకాంక్షలతో సరిపుచ్చుకుంటే సరిపోదు స్నేహమంటే
చిన్ననాటి నుండి చివరివరకు ఉండే చక్కని బంధమది***
నేను ఒప్పుకోను మన బ్లాగ్ మిత్రులంతా దీన్ని కవిత్వమంటే
నన్ను తిట్టినా మొట్టినా మీకందరికీ అంకితమిది***