"అర్పితాభిప్రాయం"


సమాజ అద్దంలాంటి పుస్తకం ఎంత చదివినా ఏముంది
నలుపు తెలుపు అక్షరాలు తప్ప ఏం అర్థం కాకున్నది

రాజ్యాంగ చట్టాలు చదవినాక కన్నీరొచ్చి మసగబారింది
ఎందుకని యోచిస్తే ఎంత వంచనా మోసమనిపిస్తున్నది

వాదోపవాదాలతో నిజాన్ని తడికల్లో చుట్టేసేగా నడుస్తుంది
నీదినాదంటూ సూక్తులెన్నో చెప్పుకుంటూ బ్రతుకుతున్నది

క్షణక్షణానికి రంగులు మార్చే స్త్రీపురుషులేగా ఇక్కడుంది
ముందూ వెనుక మూర్ఖపువాదం తప్ప నీతి ఎక్కడున్నది

ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎత్తుకుపైఎత్తేగా వేస్తుంది
అది నమ్మించాలనే నటన నేర్చుకుని నాటకం ఆడేస్తున్నది

వలపుసెగ వాక్యాలకు రాజ్యాంగం ఆమడ దూరంలోనే ఉంది
రాజ్యాంగం రాసినవారిలో రసికత లోపించినట్లే గోచరిస్తున్నది

మనసుకి నవ్వు ముసుగేసుకుని బ్రతకడంలో అర్థమేముంది
పడిలేచి పళ్ళికిలించక జ్ఞానంతో ప్రశ్నించి మది సాగమన్నది
నువ్వు నేను రాజ్యాంగం చదివితే చేసిన తప్పులు తెలిసింది
తెలుసుకున్న సూత్రాలు కొన్నైనా అమలు చెయ్యాలనున్నది


(విష్వక్సేనుడు వినోద్ గారు వ్రాసిన "నువ్వు నేను రాజ్యాంగం" పుస్తకం చదివిన తరువాత నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపమే ఈ "అర్పితాభిప్రాయం" చూసి చదివి చెప్పండి ఎలా ఉందో)

లాభసాటి ఒప్పందం

అనుభూతులు ఆమ్లధారల్లా ఆవిరైపోతుంటే
మమతల మసిపూసి ఏం మాయ చేస్తాం..

ఆలోచనలకి అవసరాలే ఆనకట్టలు వేస్తుంటే
ఊహాసౌధాలకు అరచేతుల రక్షణ ఏమిస్తాం..

మనసులోని మాట గొంతు దాటి రాకుంటే
నమ్మకపు దస్తావేజులు చేతికి ఎలా ఇస్తాం..

బరువైన బాంధవ్యాలు ఊపిరి ఆడనివ్వనంటే
స్వతంత్ర స్వేచ్ఛారెక్కలు ఎలా విప్పారుస్తాం..

మలినమైన మమకారమే మిగిలి ఉందంటే
స్వఛ్చమైన సాంగత్యాన్ని ఎక్కడని చూస్తాం..

స్వార్ధప్రణాలికలే వలపు వ్యాపార పెట్టుబడంటే
అనురాగాన్ని అరువుపెట్టి ఏంలాభం ఆర్జిస్తాం..


చివరిమజిలీ..

పచ్చపసుపుని ఒంటికంతా రాసి నలుగు పెట్టి
పక్వానికొచ్చిన పరువాన్ని పవిటలో మెలిపెట్టి
పబ్లిక్ గా రా మావా పారిపోదామని అంటి...
అన్నదే తడువుగా అత్తాపత్తా లేకుండా పోతివి!
పిరుదుల వరకున్న వాలుజడను కొప్పు చుట్టి
పిక్కల పైదాకా చుక్కల చీరని బిగుతుగ చుట్టి
పిటిషన్ పెట్టేటోళ్ళు ఎవ్వరూ నాకు లేరంటి...
అయినా కిమ్మనకుండా ఎక్కడికో ఉడాయిస్తివి!
పుప్పొడితో పూలరెక్కలని వేరు చేస్తిని విడగొట్టి
పున్నమివెన్నెల్లో పక్కపై రమ్మన్నా కన్నుగొట్టి
ఫుల్ పల్లెటూరి బైతుననుకుని నన్ను గెంటి...
అహంకారమున్న అమీర్ ఆమెని మనువాడితివి!
పెద్ద పోటుగాడివని భంగపడితి మది బొప్పికట్టి
పెద్ద ఆసామికి అర్పించుకుంటి మానం లెక్కకట్టి
పెనాల్టీగా ఉంచుకుంటా అంటే అక్కడే ఉంటి...
అనురాగం తప్ప మస్తు పైసలు నాదగ్గర ఉన్నవి!
పొందులో పొర్లి పైసా గడించిన ఇద్దరం ఒకేమట్టి
పొగరుతగ్గి నువ్వు వడలినేను చివరికౌతాం మట్టి
పొల్యూట్ కాక ముందు ఎలాగో కలవకుంటి...
అయితే అయ్యింది ఛలో కలిసిచేద్దాం చావుమజిలీ!