బయోడెటా...:-)

బ్లాగమిత్రులకు పద్మార్పిత అందించు
వివరణాసూచికను తమరెల్లరూ కాంచు:-)
మిక్కిలి స్నేహశీలి
చిరునవ్వే ఆమె చెలి
పసిడి మేను ఛాయ
కంటినిండా కలదు దయ!

ఎత్తు ఐదడుగుల ఆరంగుళాలు
కురచైన నల్లనివి ఆమె కురులు
హృదయకవితలే ఆమె చిరునామ
మనసు మాత్రం పదిలమే సుమా!

ఆమెది ఒక చిరు ప్రభుత్వ ఉద్యోగం
జీవనానికి చేయక తప్పని పయనం
చిత్రలేఖనమే ఆమె చిన్ననాటి నేస్తం
కవితలు అందించినవి తమ ప్రియహస్తం!

ఆలుగడ్డగాడు...:-)

హాయ్!....మొన్న వనభోజనాల్లో నా పరువు కాపాడిన దగ్గరనుండి నాకు కూరగాయలతో అత్యంత సాంగత్యం ఏర్పడిందండోయ్!!!!
దాని పర్యవసానంగా వెజిటేబుల్స్ తో చాటింగ్స్ అండ్ డ్రీంస్ లో మీటింగ్స్!!!

వాటిల్లోని ఒక నజరానా ఇక్కడ పోస్టింగ్......జస్ట్ ఒక లుక్ వేయండి ప్లీజ్!!!


అలనాడు ఒకానొక చలికాలం ఒల్లంతా తిమ్మిరెక్కి.....
మిష్టర్.పోట్స్ గాడు (అదేనండి మన
ఆలుగడ్డ /బంగాళాదుంప/ Potatoes) లవ్లీగా ఒక లవ్ మెసేజ్ పంపాడంట మిస్.లేఫ్ కి (బెండకాయ/లేడీఫింగర్/Lady fingers) కి.....
మిస్.లేఫ్స్ గారు కాల్ చేసి మిష్టర్.పోట్స్ గాడిని..
నీకు నాకు సాంగత్యమా?
బండలా ఉండే నీవెక్కడ? నాజూకు నడుమున్న తెలివైన నేనెక్కడ?

పో!...పో! అని ఘోరంగా అవమానించేసరికి మన ఆలుగాడు ఆలోచన మీద ఆలోచనచేసి కనిపించినదాన్నల్లా (లేడీ కూరగాయల్నిలెండి!
అపార్థము వలదు ప్లీజ్ ) లవ్లీగా లౌక్యంతో లోబరచుకుని(పటాయించి).

ఇలా రోజుకొకరితో
మచ్చుకి.....

ఆలు-గోబీ, ఆలు-పాలక్, ఆలు-మటర్,
ఆలు-బైగన్ etc.....

అంటూ కంబైండ్ కాపురం వెలగబెడుతుంటే:-)

మిస్.లేఫ్ గారు మాత్రం ఒంటరినైనాను అంటూ అప్పుడప్పుడు......టమాటాని తోడు రమ్మని తన తోడుకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నదంట.:-)


ఆలుగడ్డగాడు చెప్పిన నీతి:-
నిన్ను నీ అందాన్ని నీవే చూసుకుని మురవకు!!
నలుగురిలో మసలేవేళ నీవు వారి ఆకారాన్ని చూడకు!!

(ఇది కేవలం ఆలుగడ్డ వెల్లబెట్టిన వేదాంతం అనుకుని చదవండి!
అంతేకానీ!..ఇందులో లాజిక్కులు మాజిక్కులు వెతకవద్దని మనవి!)

జీవించనీయకు!

పలకరింపుల పరిమళాలు...
నీ తలపులలో తడిసిన పరువాలు...
మనం తడిసి ముద్దైపోయే తరుణంలో,

ఎందుకో ఈ పెనుతుఫానుల గాలులు!!!


నిన్ను తలుస్తాను ప్రతిరోజూ పలుమారులు...
నీకు వచ్చే వెక్కిళ్ళే అందుకు నిదర్శనాలు...
నిన్ను చేరాలని చేసే శతవిధ ప్రయత్నాల్లో,

తీరం చేరని కెరటాల్లాంటి ఎన్నో అడ్డంకులు!!


కడదేరిన నన్ను చూసి కంటనీరిడకు...

చితిని చేర్చువేళ చింతిస్తూ చెంతచేరకు...

చింతతో కంటనీరిడిన నిన్ను చూసి నాలో,

జీవించాలన్న ఆశను మరల చిగురించనీయకు!

"వెజిటేబుల్ సలాడ్"

"అలోచనలతో బుర్రలో తిరుగుతున్నాయి సుడులు
ఏమి వండి వడ్డించాలని గుండె నిండా గుబులు
అంతగా వంటరాని నాపై నాకే చెప్పలేని దిగులు
ఎన్నో రుచులవంటలకై జిహ్వ ఎదురుచూపులు
వనభోజనాల నాడు మెప్పుకై చేయాలి జిమిక్కులు
లేకపోతే తప్పవు పాకప్రావీణ్యులతో మొట్టికాయలు"

ఏంటి పద్మా! నీకు చెప్పిందేమిటి నువ్వు చేస్తుందేమిటి? వంటావార్పుతో వనభోజనాలకి రమ్మంటే పదాలకూర్పుతో తవికలల్లి దిగులని గుబులని నేర్పుగా తప్పించుకోకు అంటారని నాకు తెలుసు అందుకే.......తెల్లవారుజామునే అయిదు గంటలకే తలంటుకుని చెంగావిరంగుపై ఎరుపు, ఆకుపచ్చ రంగంచున్న చీరకట్టి ( ఎందుకు డ్రెస్స్ కోడ్? అని అడక్కండి మీకే తెలుస్తుంది మున్ముందు ).......
భగవంతునికి దీపం, ధూపం వందనమాచరించి....అవిఘ్నమస్తు! అందరి మెప్పులు ప్రాప్తిరస్తు! అని నాకు నేనే ఆశీర్వదించుకుని వంటగదిలో వంద ప్రదక్షణాలు చేసినా ఒక్కవంటైనా నన్ను కనికరిస్తే కదా వండి వడ్డించడానికి......
ఏదో నాలుగు ప్రాస పదాలతో కవిత వ్రాసుకోక జ్యోతిగారి బ్లాగ్ లోకి వెళ్ళి మరీ ఈసారి చేసేస్తా పెట్టేస్తానని ప్రగల్భాల వ్యాఖ్యలు పెట్టనేల అని నన్ను నేను పరిపరి విధముల తిట్టుకొనుచుండగా......

పూర్వము నా బ్లాగ్ లో ఒకానొక పోస్ట్ "కాయగూరలతో కబుర్లు!!!" చెప్పితినని అవి నన్ను కనికరించి "కూరగాయోపదేశము" చేసి నా చేతికి కత్తిరించమని కత్తినిచ్చినవి.....
ఉపదేశమెట్టిదనగా.....
పిచ్చి పద్దూ.... "ఈ యాంత్రిక జీవనశైలిలో వంటావార్పెందులకు? కడుపుమంటా, షుగర్, బీపీలను పెంచేందులకు!
అంటూ మంతెన సత్యనారాయణగారి లాంటి నలుగురి ప్రముఖుల పేర్లను రెఫరెన్స్ గా చెబుతూ....
పద్దు! నీవు వంట జోలికి వెళ్ళవద్దు....
పచ్చి కూరగాయలతో నీవు చేసేయి "వెజిటెబుల్ సలాడ్"
అది అతిగా భుజించకుండా ఏర్పరుస్తుంది ఒక సరిహద్దు....
ఆ హద్దుతో ఆఖరున భుక్తాయసమంటూ ఎవరూ బాధపడరు....
అదే మనందరికీ ఎంతో ముద్దు"
అని అంటూ....

నీ హస్త కళానైపుణ్యముతో నన్ను అందంగా మలచు అంటే నన్ను అంటూ కారెట్, కీరదోసకాయ, బీట్ రూట్, కాప్సికం, ఉల్లిపొరక, టమాటాలు నేనంటే నేనంటూ నా ముందుకు నర్తించాయి....

పరువుని కాపాడిన కూరగాయలపై ప్రేమతో అలా ఆ చీర మాచింగ్ అన్నమాట...:)




మరింక ఆలస్యమెందుకు?
ఆరగించండి అందరూ.....
నేనందిస్తున్న "వెజిటేబుల్ సలాడ్"

ఏదో ఒట్టి చేతులతో కాకుండా నేను సైతం ఒక వంట(అమ్మో!వంట అంటే తంతారేమో!!:) తెచ్చాను అనుకుని
మీరంతా "సలాడ్స్" ని ఆరగిస్తే......
ఉపదేశించినందుకు కూరగాయలు,
మీ అందరితో వనభోజనం చేసినందుకు నేను ఎంతో ఆనందిస్తానండి!
(Serving With Love)

ఇట్లు,
ప్రేమతో
పద్మార్పిత!!!

వేళ కాని వేళ!


ఏ రాగం ఆలపించను, అనురాగం శృతి తప్పినవేళ!
ఎలుగెత్తి నేనేమి తెలుపను, నీవు మౌనం దాల్చినవేళ!

హృదయం అలిసేలా రోధించాను, లోకం నిదురించిన వేళ!
చందమామనే చూడనెంచాను, కారుమబ్బులు కమ్మినవేళ!

బీడుబారిన నేలలో మొక్కను నాటాను, మండు వేసవి వేళ!
బాధను దిగమ్రింగి నవ్వాను, నీవు వేరొకరి సొంతమైన వేళ!

కన్నీటితో దాహంతీర్చ తలచావెందుకు? కనులు మూతపడిన వేళ!
ఏడిపించిన నీవే కుమిలిపోతావు ఎందుకు? నేను కాటికి సాగిన వేళ!