మొహమాటమోహం..

మదిని గిలక్కొట్టి వెన్నవంటి భావాలని వెలికితీయి..

కవ్వమే విరిపోయెనని కధలు చెప్పి కల్లోల పరచకు!

నుదుటిన ముద్దిడి ముంగురుల ముసుగులో చిక్కి..
మధువులొలికే పెదాలని ముద్దాడ మత్తు ఎక్కెననకు!

మోహపుదాహాన్ని మొహమాట పడక వెళ్ళగక్కేయి..
నీలోనే దాచుకుని ఏమెరుగని నన్ను లోభిని అనకు!

నిలువెత్తు నీ రూపాన్ని నా గుండెల నిండుగ కుక్కి..
అంటరానితనాన్ని అంటగట్టి ఆమడదూరంలో ఉండకు!

విరబూసిన మల్లెపూరేకుల సువాసన్ని ఎగపీల్చేయి..
ప్రణయపరుపుపై మెత్తదిండుల దిగంబరత్వాన్ని కోరకు!

తనువంతా తడిమేటి వ్యామోహపు తలపులలో నక్కి..
వేడెక్కిన దేహానికి దాహమెక్కువైతే వేశ్యను అనుకోకు!

విరహం పక్కనెట్టి వాంఛల్ని విచ్చలవిడిగా తిరగనీయి..
పురుడు పోసుకునే ప్రేమకు పురిటినొప్పేలని అడుగకు! 

ఊపిరి కాలం..

మనసంతా నింపి మనసులో దాగున్న నన్ను పైకి చూపలేక
అనురాగాన్ని చూపించే అనువైన రోజేదని ఆత్రుతగా అడిగితే
చెంతనలేని మనిషి మనసులో దాగి ఏమిచేయాలో తెలియక
తికమకపడి తీవ్రంగా ఆలోచించి మనసున ఉన్నది చెప్పాను!

మనసు నిండుగా నన్ను నిలుపుకున్న నా మనసైన వాడా
అనురాగానికి ఆదీ అంతమూ అంటూ ఏమున్నది చెప్పు!?
ప్రత్యేకించి చూపాలనుకుంటే నా ఊపిరి ఉండగా వచ్చి చూసి
మరణించే ముందు నాతో ముచ్చటించమని అంటున్నాను!

మనసులో దాచుకున్న మమతను దించి వేసుకునే దారిలేక
అడిగితే ఇచ్చేది ప్రేమా? మరణించేదెప్పుడో చెప్పమని అడిగితే
ప్రశ్నకు జవాబు అడుక్కుని మరీ ప్రేమను పొందటం చేతకాక
తెలివైన నీ ప్రశ్నకు తెలివిలేక ఇలా సమాధానం ఇస్తున్నాను!

మనసువిప్పి చెప్పలేని మమతలు బియ్యంలోని రాళ్ళు కదా
ఏ ప్రాణం ఎప్పుడెలా పోతుందో ఎవరు చెప్పగలరు చెప్పు!?
అందుకే నిర్దిష్టంగా సమయాన్ని నిర్దేశించి వలపు కురిపించక
ప్రాణంపోయే వరకు ప్రతీరోజూ చెంత ఉండాలని కోరుతున్నాను!

వారిజ వైరి...

మోహపు దారాలు వేళ్ళ మధ్య చిక్కుకునె
ముడి విప్పలేక రోమాలు నిక్కబొడుచుకునె!

నా పిచ్చి ప్రేమ ఎందుకో నిన్ను ఎంచుకునె
చెప్పని మాటలెన్నో చెప్పినట్లు ఊహించుకునె!

నీవు పగలైతే నేను నువ్వెళ్ళితే వచ్చే రాత్రినె
ఇద్దరి ఆశలూ సాయంత్రం కలవాలని కలగనె!

చెప్పే ఊసులు అబద్ధాలైనా నామది నిజమనె
సత్యాన్ని చూద్దామంటే దూరంగా తానుండెనె!

కలువకు సూర్యుడు మిత్రుడైనా దూరముండెనె
వెర్రి వ్యామోహం పుట్టి కువలయము కృంగెనె!

నీటిలోలేని కమలం కమలాప్తుని రశ్మికి వాడెనె
పంకమంటని పద్మ వీచే గాలికి కొట్టుకుపోయెనె!
 

పరిమళ మత్తు

చూసేటి కనులకు చుట్టూ అన్నీ
సుగంధ పరిమళపు పుష్పాలే..
అవి విచ్చి వెదజల్లటానికి జరిగే
విస్ఫోటకాలు ఎవ్వరికీ కనబడవుగా!

పెరిగే మొక్కల కౌగిట్లో మొగ్గలన్నీ
పువ్వు విచ్చితే జరుగు సంబరాలే..
ఆ పూతేనెను జుర్రుకోవాలని చేసే
కపట కల్మష ప్రయత్నం ఎందరిదోగా!

పూల అమాయకపు అవయవాలన్నీ
అందంగా విచ్చుకుని వేసే చిందులే..
మోహమాయ ముళ్ళలో ఇరుక్కునే
పుప్పడిరెక్కలకు పరిమళం అంటదుగా!

వనమంతా ఝుమ్మనే తేనెటీగలన్నీ
కనబడని మర్మప్రాంతపు దృశ్యాలే..
నిర్జీవ లోకం చూడాలన్న యోచనే
తెలియని ఇంద్రజాలపు ప్రతిబింబంగా!


బ్రతికేయ్..

కొన్నేళ్ళ తరువాత అనుకోకుండా
నువ్వు నేను అకస్మాత్తుగా కలిస్తే
పరిచయం ఉన్నట్లు అనిపించినా..
పరిచయంలేదని పలకరించక వెళ్ళిపో!
కూడబలుక్కుని కన్నకలల నిండా
నువ్వు నేను కలిసి ఉన్నామనిపిస్తే
పీడకలని పడుకో నిద్ర రాకపోయినా..
పుస్తకాల్లో చరిత్ర చదివి జ్ఞానంపెంచుకో!

పేరూ ఊరూ గుర్తు చేసుకోకుండా
రంగురూపం పనిపాట్లు జ్ఞాపకమొస్తే
తెలిసీ తెలియనట్లు గుర్తుకొచ్చినా..
మనసుకు మతిమరుపొచ్చెను అనుకో!

కలిసి మాట్లాడిన ముచ్చట్ల నిండా
ఆడిన ఆటల్లో చేసినబాసలు అనిపిస్తే
అలిగిన అలకలు తీరక బాధించినా..
కంటనీరు రానీయక నవ్వుతూ బ్రతికిపో!

ఆనందాంతం..

ఏ రాత్రో ప్రయాణం చేస్తూ నిద్రలో నక్షత్రంలా రాలి
ఎటువంటి మరణ ఆక్రందన చేయకుండా పోవాలి!

నమ్ముకున్న నమ్మకాలు మదిలో నలిగినా నేను
పలుసార్లు పిప్పి కాక అంతమైనా హాయిగుండాలి!

ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిసొలసిన నాకు
మొదలు ముగిసి నిద్రలో అంతా అంతమై పోవాలి!

ఎవ్వరూ లేని రాలేని చోట పోయిన ప్రాణంతో నేను
ప్రశాంతంగా తప్పులని ఆత్మపరిశీలన చేసుకోవాలి!

దేహదాహ ప్రలోభ కాంక్షలకు ఎంతో లొంగిన నేను
మంతనాలు జరిపే మనిషికి కనబడకుండా పోవాలి!

ఎన్నో ఉషోదయాలు నిద్రపోయి వ్యర్థం చేసిన నాకు
స్వగతాలు స్మశానం చూస్తానన్న కోరికను తీర్చాలి! 

చివరకు మిగిలేది...

ఎవరూ ఎవరితో చివరి వరకూ ఉండరు
ఎప్పటికీ ఎవరూ అన్నీ చెప్పి నడిపించరు
మనం చేసిన కర్మని ఎవరూ అనుభవించరు
ఎవరూ అడక్కముందే అన్నీ చెయ్యరు
నాటినవారు నీరు పోస్తారనుకుంటే పోయరు
నాటినవారు వారి చెట్టుఫలాన్ని వారు తినలేరు
మన కష్టనష్టాలకు ఇంకెవరో బాధ్యులుకారు
మన కన్నీటిని వేరెవర్నో త్రాగమన్నా త్రాగలేరు
ఆనందం పంచు అప్పుల్ని పంచితే అంగీకరించరు
కార్యాచరణకు కృషి చెయ్యాలని చెబుతారు
పనైయ్యిందంటే వారు చెప్పబట్టే అయ్యిందంటారు
లేకుంటే మనప్రయత్న లోపమని మనపై నెట్టేస్తారు
ఎవ్వరూ ఇంకొకరి కోసము ప్రాణాలు వీడరు
కడ వరకూ తోడని కల్లబొల్లి కబుర్లు చెబుతారు
మనమది స్థానంలో మరొక మనసుని అమర్చలేరు
ఊపిరున్న మనిషిని కలిసి ఊసులు చెప్పనివారు
చనిపోయిన తరువాత ఆత్మకెందుకు శాంతి చేస్తారు
ఏమైనా ఒంటరిగా వచ్చి ఒంటరిగానే పోతారు అందరూ!

జీవితపాఠం..

ఒక బంధం నుండి బయటపడి మరో బంధంలో చిక్కడమంటే
పేణం మీద నుండి ఎగిరి వెళ్ళి పొయ్యి లోపల పడ్డం వంటిదే

ఒకర్ని మనసులో ఉంచుకుని మరొకర్ని పెళ్ళి చేసుకోడమంటే
ఏ ఎండకు ఆ గొడుగుపట్టి సద్దుమణిగినాక సర్దుకు పోవడమే!

ఒకసారికి ఒకటి చెప్పి మరోసారికి మాట మార్చేయడం అంటే
రాజకీయాల్లోన రాణించే లక్షణాలను పుష్కలంగా లభించినట్లే

ఒకటికి పదిసార్లు చెప్పిందే చెప్పి చేసిందే చేస్తున్నారు అంటే
వయసు పెరిగిన కొద్దీ చాదస్తం ముదిరి తిక్క తలకెక్కడం!

ఒకసారి చేసిన తప్పును ఇంకొకమారు చేయటంలేదు అంటే
అనుభవాలలెన్నో ఆలింగన చేసుకుని బ్రతకడం నేర్చుకున్నట్లే

ఒకే తప్పు ఎన్నిసార్లు వద్దన్నా మళ్ళీ తప్పు చేయడం అంటే
నిండా ములిగిన వాడికి చలేంటని చలేంటని సరిపెట్టుకోవడం!

అలంకారం..

నీలిమబ్బుల వంటి కలల సామ్రాజ్యంలో
అరవిరిసిన విహంగాలు ఊహా సౌధాలు..
చంద్రుడు మబ్బుల మాటున నక్కెననో
తారలు షికారుకెళ్ళి ఇంకా తిరిగి రాలేదనో
వంకలు కొన్ని వెతికి రేయిని పొడిగించరాదా
ఊహలతో మరిన్ని ఊసులు చెప్పనీయరాదా!

మేఘమా! చంద్రుడ్ని మాయచేసి ఒడిసిపట్టి
వెన్నెలనే దోచి కలల కలువల్ని విప్పారనిచ్చి
అంబరాన్ని అవనితో సంధి చేసి సంబరపడరాదా!

ఎగసే సాగరకెరటాల వంటి భావ అలజడులలో
హత్తుకున్న కోర్కెల్లేవు, కొట్టుకుపోయినవీ లేవు
స్థిర సంకల్పానికి నిర్ధిష్టమైన రూపం ఒకటిచ్చి
పట్టుదలని పరిచయం చేసి ప్రణయంగా మార్చి
అంధకారానికి వెలుగుతో పరిణయం చేయరాదా
గమ్యాన్ని సరిగమల సరాగాలతో శింగారించరాదా!

రాయాలనే ఉంది…

ఏ భావం చెప్పి రాయాలన్నా భయంగా ఉంది

మనసు విప్పి చెబితే మతలబు మారిపోతుంది

ఉన్నదేదో ఉన్నట్లు రాస్తే భావం ఉసూరుమంది

వాక్యాల్లో వ్యధ గుమ్మరిస్తే వద్దు పొమ్మంటుంది
 
శృంగారం చిలుకరించబోవ స్త్రీగా సిగ్గుపడమంది

వలపు పులిసిన వాసనతో వెగటు పుట్టించింది
 
నిర్మొహమాటంగా నిజాలను వ్రాస్తే అర్థంకాకుంది

ప్రకృతిని పరవశింపజేసే పదమొక్కటైనా రాకుంది

రాజకీయాలు వ్రాసేకన్నా రచించడం మానేయంది

లోకం తీరు రచించబోవ నా జ్ఞానం సరిపోకున్నది!

వ్యర్థం..

మాట్లాడని మనస్సు ఎన్ని జాగ్రత్తలు తీసుకునేం ప్రయోజనం
కంటితో చూసి మనసు మాటవినకున్నా జారుతూ ఉంటుంది
కలలరెక్కలు కట్టుకుని ప్రతి మదికొమ్మపై వాలేం ప్రయోజనం
లోన ఇమడలేక గుట్టు అతిరహస్యం బట్టబయలు అవుతుంది
సమీక్ష సుగంధాలుగా వెదజల్లు సౌందర్యం ఉండేం ప్రయోజనం
చుంబన ఆలింగనాలతో అక్కడిక్కడ తాకితే మైల పడిపోతుంది
నియమ నిబంధనల్లేని బాహ్య సరస సయ్యాటలేం ప్రయోజనం
సహన స్వచ్ఛతలేని సల్లాపం బూడిదలో పోసిన పన్నీరౌతుంది
గుప్పిట్లో మేను దాచి నగ్నసొగసు దాచాననుకునేం ప్రయోజనం
తనువుపై తనువు హస్తాక్షరం తామరాకుపై నీటి బొట్టవుతుంది
భగ్గుమంటున్న వ్యధాగ్నిపై గుగ్గిలం చల్లి మాత్రమేం ప్రయోజనం
ఒకక్రుంగిన మనసే మరోమనసుని క్రుంగిపోనివ్వక కాపాడుతుంది 

సౌందర్యమంటే!?


అందం అంటే ఏమిటని కలిగె సందేహం
బహుశా అందమైన శరీర సౌష్టవమేమో
కాదు తెల్లని పాలరాతిలాంటి లావణ్యమా
అంతకు మించి అతిసౌందర్య రూపమా!?

చూసే దృష్టికోణాన్నిబట్టి మారును అందం
అంధుడు చూసే అందానికి కొలమానమేది
మనసుతో చూసి మాటల్లో చెప్పలేనివాడు
మూగసైగల సంకేతాలకు రూపం ఉందా!?

పేదవాడికి శ్రమపడిన ఆదాయమేగా అందం
చెవిటివాడు చూపే కంటి హావభావాల్లో లేదా
ఆలోచిస్తే చూడలేని మనసూ అందమే కదా
తాత్వికవాదంతో కంటికి నచ్చిందే అందమా!?

స్త్రీ సహనశీలతలో దాగుంది బోలెడు అందం
మగవాడి అందం మంచిమానవత్వంలో లేదా
పిల్లల అందం వారి బోసినవ్వుల్లో కనపడదా
జీవిత సౌందర్యం ప్రేమలోనే దాగిందందామా!?

అస్తిత్వంతో కూడి నిగ్రహించుకున్నదేగా అందం
శారీరక సౌందర్య ప్రమాణాలు కేవలం అహ్లాదం
సత్యసంఘర్షణాస్ఫూర్తిసృష్టే సౌందర్య నిర్వచనం
మరణం యొక్క అందం జీవించడమే కదా!?